స్థానిక సంఘం అంటే ఏమిటి?

స్థానిక సంఘం అంటే ఏమిటి?

షేర్ చెయ్యండి:

స్థానిక సంఘం అంటే సువార్త ప్రకటన ద్వారా, సువార్త నియమాల (లేదా, సంస్కారాల) ద్వారా, క్రీస్తు రాజ్యంలో ఒకరి సభ్యత్వాన్ని అధికారికంగా ధృవీకరించడానికి (ఆమోదం తెలపడానికి), ఒకరి క్షేమాన్ని మరొకరు పర్యవేక్షించడానికి, క్రీస్తు నామంలో క్రమం తప్పకుండా సమకూడి వచ్చే క్రైస్తవుల సమాజం. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందని నాకు తెలుసు, అయితే ఈ నిర్వచనములో చెప్పబడిన ఐదు విషయాలను గమనించండి:

i. క్రైస్తవుల సమాజం;
ii. క్రమం తప్పకుండా సమకూడి రావడం;
iii. సమూహమంతా ఆమోదం తెలపడాన్నీ, క్షేమం కోసం పర్యవేక్షించడాన్నీ పాటించడం;
iv. క్రీస్తు నామంలో సమకూడే క్రైస్తవుల సమాజం – ఈ భూమి మీద క్రీస్తును, ఆయన పాలననూ అధికారికంగా తెలియజేసే ఉద్దేశం;
v. ఈ ఉద్దేశాల కోసం వాక్య బోధను మరియు సంఘ నియమాలను (లేదా సంస్కారాలను) ఉపయోగించడం.

ఒక పాస్టర్ చేసే ప్రకటన ద్వారా స్త్రీ పురుషులను వివాహ బంధంలో భార్య భర్తలనుగా మార్చినట్లు, పైన చెప్పబడిన మొదటి నాలుగు విషయాలు పార్కులో కలిసియున్న ఒక సాధారణ గుంపును కూడా అద్భుతమైన రీతిలో స్థానిక సంఘముగా మార్చివేస్తాయి!

అనేక కారణాలనుబట్టి, ఒక సమాజంగా సమకూడి రావడం అనేది చాలా ప్రాముఖ్యము. దీని ద్వారా మేము క్రీస్తుకి విధేయులం అని ఈ లోకమునకు ప్రకటించగలం. సంఘం భావి తరాలకు ప్రతినిధిగా నిలిచే ఒక స్థావరంగా (ఔట్ పోస్ట్) లేక రాయబారిగా ఉంటుంది. ఇక్కడే మన రాజు ఎదుట మనం తలవంచుతాం, దీనినే మనం ఆరాధన అంటాం. ఈ లోక అధిపతులు మనల్ని ఎదిరించవచ్చు, అయితే, దేవుడు తనను ఆరాధించడానికి దేశాలన్నిటినుండి తన ప్రజలను బయటకి తీసుకువస్తాడు. ఆయన తన బలమైన సమాజాన్ని నిర్మించుకుంటాడు.

సంఘము సమాజముగా కూడి వచ్చినప్పుడు ప్రసంగించుట ద్వారా, సంఘ నియమాలను (లేదా సంస్కారాలను) పాటించుట ద్వారా, మరియు సంఘ క్రమశిక్షణ ద్వారా మన రాజు తన పాలనను జరిగిస్తాడు. క్రీస్తు సువార్త మన దేశపు “చట్టాన్ని” వివరిస్తుంది. ఇది మన రాజు పేరును ప్రకటిస్తుంది, ఆయన మన రాజుగా మారడానికి ఆయన చేసిన త్యాగాన్ని వివరిస్తుంది; ఆయన మార్గాలు గురించి మనకు బోధిస్తుంది, మన అవిధేయతను గద్దిస్తుంది. అంతే కాకుండా, ఇది అతి సమీపముగా ఉన్న ఆయన రాకడ విషయమై మనకు దృఢ నిశ్చయతను కలుగజేస్తుంది.

బాప్తిస్మం మరియు ప్రభు భోజనము (రొట్టె విరుచుట) అను సంఘ నియమాలను (సంస్కారాలను) పాటించుట ద్వారా సంఘము తన జెండాను ఎగురవేసి, తన సైన్యపు యూనిఫాంను ధరించుకుంటుంది. ఇవి మనం క్రైస్తవులమని బయట లోకానికి చాటిచెప్తాయి. బాప్తిస్మం పొందడం ద్వారా తండ్రి కుమార పరిశుద్దాత్మ నామానికి చెందినవారమని గుర్తించడంతోపాటూ క్రీస్తు మరణ పునరుత్థానములతో మనం ఏకమై ఉన్నామనే విషయాన్ని గుర్తిస్తున్నామని అర్థం (మత్తయి 28:19; రోమా 6:3-5). ప్రభు భోజనములో పాల్గొంటున్నామంటే ఆయన మరణమును ప్రకటించాలని, ఆయన సంఘములో పాలిభాగస్థులమైయున్నామని అర్థం చేసుకోవడమే! (1 కొరింథీ 11:26-29; మత్తయి 26:26-29). దేవుడు తన ప్రజలందరు బహిరంగంగా తెలియపరచబడాలనీ, తన సంఘం ఈ లోకానికి వేరుగా (బహు ప్రత్యేకంగా) ఉండాలని కోరుకుంటున్నాడు.

స్థానిక సంఘము అంటే ఏమిటి? స్థానిక సంఘము అంటే దేవుని రాజ్య సువార్తను అధికారికంగా ప్రకటించడానికి, సువార్తను ప్రకటించు సువార్తికులను ఆమోదించడానికి, శిష్యత్వమును పర్యవేక్షించడానికి మరియు తప్పుడు బోధకులను ఎత్తి చూపడానికి క్రీస్తు సృష్టించిన గొప్ప సంస్థ అని అర్థం. దీని ద్వారా క్లబ్బుల్లో చేరినట్టుగా సంఘాలలో “చేరకూడదు” అనే విషయం మనకి అర్ధమవుతుంది. ఎందుకంటే, సంఘాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడానికి సంఘంలో చేరకూడదు గాని సంఘ క్షేమం కోసం కృషి చేయడానికి సంఘంలో చేరి, సంఘానికి లోబడి ఉండాలి.

జోనాతన్‌ లీమన్‌

జోనాతన్‌ లీమన్‌

జోనాతన్ 9మార్క్స్ పుస్తకాలని అలాగే 9మార్క్స్ జర్నల్స్ ను ఎడిట్ చేస్తారు. అతను సంఘానికి సంబంధించిన అనేక విషయాలపై పుస్తకాల రచయిత కూడా. జోనాతన్ సదరన్ సెమినరీ నుండి MDiv మరియు యూనివర్శిటీ ఆఫ్ వేల్స్ నుండి ఎక్లెసియాలజీలో Ph.D ని సంపాదించారు. అతను మేరీల్యాండ్‌లోని షెవర్లీలో తన భార్య మరియు నలుగురు కుమార్తెలతో నివసిస్తున్నాడు, అక్కడ అతను షెవర్లీ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ గా ఉన్నాడు.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...