సువార్త అంటే ఏమిటి?

సువార్త అంటే ఏమిటి?

షేర్ చెయ్యండి:

సువార్త అనే పదాన్ని క్రైస్తవులు ఏమని నిర్వచించాలనే విషయమై ఇటీవల అనేక చర్చలు జరిగాయి. పాపులు మారుమనస్సు పొంది, సిలువవేయబడిన క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా క్షమింపబడగలరనే సందేశమే సువార్త అని చెప్పాలా లేక అది అంతకు మించినదై యున్నదని చెప్పాలా?

అప్పుడప్పుడు ఈ చర్చ కొంచెం వాడివేడిగా సాగినప్పటికీ, ఒక నిర్దిష్ట విషయంపై దృష్టి నిలుపబడింది. ఎలాగంటే, ‘‘రెండవ గుంపువారు సువార్త విలువను, దాని అసలు విషయాన్ని మరి ఎక్కువగా కుదిస్తున్నారని” మొదటి గుంపువారన్నారు. దీనికి ప్రతినిందగా, ‘‘మమ్మల్ని నిందిస్తున్న మొదటి గుంపువారు వాస్తవంగా సువార్తను పలుచన చేస్తూ, సంఘానికి దేవుడిచ్చిన కార్యభారము నుండి దానిని ప్రక్కదోవ పట్టిస్తున్నారని’’ అన్నారు.

మనము ఈ విషయాలన్నిటిని జాగ్రత్తగా గమనిస్తూ, ఈ గందరగోళాన్ని పరిష్కరించవచ్చని నాకనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న ఈ ఇరుపక్షాలవారిని రెండు గ్రూపులుగా విభజిద్దాం.  యేసు క్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ మరణము ద్వారా దేవుడు పాపులను ఆయనతో సమాధానపర్చుకుంటున్నాడనే శుభవార్తయే సువార్త అని చెప్పువారు ఒక వర్గం (వీరిని ‘‘A’’ గ్రూపు అందాము). మరియు దేవుడు ఈ లోకమంతటిని క్రీస్తు ద్వారా పున:రుద్ధరించి దానిని నూతన సృష్టిగా చేయబోతున్నాడనే శుభ వర్తమానాన్ని, సువార్త అని చెప్పువారు రెండో వర్గం (వీరిని ‘‘B’’ గ్రూపు అని  అందాము). ఈ రెండు గ్రూపుల ప్రజలు, ఎక్కువగా వేర్వేరు విషయాలు మాట్లాడుతూ, ‘మేము కూడా అదే విషయం గూర్చి మాట్లాడుతున్నామని అనుకుంటూ’ ఒకరిని మించి మరొకరు మాట్లాడారని నేను నమ్ముతున్నాను.

అంటే, ఈ రెండు వర్గాలవారు ఒకే ప్రశ్నకు జవాబిస్తున్నట్టు నాకు తోచడంలేదు. ‘సువార్త అంటే ఏంటి?’ అనే అదే ప్రశ్నకు మేము జవాబిస్తున్నామని ఆ రెండు వర్గాల వారు చెబుతున్నందున ఈ రెండు జవాబుల మధ్య కాస్త ఉద్రిక్తత తలెత్తుతుంది. కానీ మనం  జాగ్రత్తగా  గమనించినట్లైతే, వీరు  లేఖనాలకు సంబంధించినవే కానీ, రెండు బొత్తిగా భిన్నమైన ప్రశ్నలకు జవాబిచ్చినట్టు మనకర్థమవుతుందని నేననుకుంటున్నాను.

ఈ రెండు ప్రశ్నలేమంటే:

1. సువార్త అంటే ఏంటి? మరోలా చెప్పాలంటే, ఒక వ్యక్తి రక్షింపబడాలంటే అతడు నమ్మాల్సిన విషయమేంటి?

2. సువార్త అంటే ఏంటి? మరోలా చెప్పాలంటే, క్రైస్తవ్యము యొక్క సంపూర్ణమైన శుభ వార్త ఏమిటి ?

‘‘సువార్త అంటే ఏంటి?’’ అనే ప్రశ్న A గ్రూపు వ్యక్తి విన్నప్పుడు, దానికి అర్థం ‘‘ఒకడు రక్షింపబడాలంటే అతడు నమ్మాల్సిన విషయమేంటి?’’ అని అనుకుని, పాపుల స్థానంలో క్రీస్తు మరణించాడనీ, మారుమనస్సు పొంది విశ్వసించుటకు పిలువబడడమనీ ఆ ప్రశ్నకు జవాబిస్తాడు.

ఇదే ప్రశ్నను అనగా, ‘‘సువార్త అంటే ఏంటి?’’ అనే ప్రశ్న B గ్రూపు వ్యక్తి విన్నప్పుడు, దానికి అర్థం ‘‘క్రైస్తవ్యము యొక్క సంపూర్ణమైన శుభ వార్త ఏమిటి అనుకోని, క్రీస్తు ద్వారా ఈ లోకాన్ని పున:రుద్ధరించుట దేవుని సంకల్పమై యున్నదని ఆ ప్రశ్నకు జవాబిస్తాడు.

ఈ రెండు ప్రశ్నల మధ్య ఎందుకు ఉద్రిక్తత తలెత్తుతుందో నీకర్థమవుతుంది. నీవు 1వ ప్రశ్నకు జవాబుగా, నూతన సృష్టి గూర్చి మాట్లాడినట్లైతే, సహజంగానే, నీ జవాబు చాలా పెద్దగా ఉందని  మరియు నీవు సిలువకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రజలంటారు. లేఖనాల్లో ‘‘రక్షణ పొందడానికి నేనేమి చేయవలెను?’’ అని కొందరు అడిగినప్పుడు, వారు తమ పాపము గూర్చి మారుమనస్సుపొంది, యేసునందు విశ్వాసముంచాలని జవాబియ్యబడింది. అంతేకానీ రాబోతున్న నూతన సృష్టి గురించిన వివరణ కాదు.

అయినప్పటికినీ, బైబిలు కొన్నిసార్లు (తరచుగా కూడ) ‘‘సువార్త’’ గురించి  చెప్పినప్పుడు, నూతన సృష్టి గురించి చెప్పిందనేది కూడా నిజమే. కావున, 2వ ప్రశ్నకు జవాబు , క్రీస్తు పాపులకు బదులుగా మరణించాడని మాత్రమే చెప్పుతూ, మిగతాదంతా నిర్వచనం ప్రకారం సువార్త కాదని (గాని కేవలం అంతరార్థమని) చెప్పడం, సత్యాన్ని  కుదించి చెప్పడమే అవుతుంది. అలా చెప్పడం, శరీర పున:రుత్థానం, యూదులు మరియు అన్యజనులు సమాధానపరచబడడం, నూతన ఆకాశాలు మరియు నూతన భూమి వంటి వాగ్దానాలు మరియు అనేక ఇతర సంగతులు కూడా, ఒక రకంగా క్రైస్తవ్యం యొక్క ‘‘శుభ వార్త’’ గురించి బైబిలు చెబుతున్నదానిలో భాగం కావని చెప్పినట్లవుతుంది.

ఈ రెండు ప్రశ్నల్లో ఏదీ తప్పు కాదని, ఒక ప్రశ్న రెండవ దాని కంటె ఎక్కువ వాక్యానుసారమైనది కాదని, మనం అర్థం చేసుకోవాలి. బైబిలు, ఈ రెండు ప్రశ్నలను  అడుగుతుంది, రెండింటికీ  జవాబు చెబుతుంది. నేను పేర్కొన్న ఈ రెండు ప్రశ్నలు న్యాయసమ్మతమైనవి మరియు లేఖనానుసారమైనవని నేనెందుకనుకుంటున్నానో, ఇప్పుడు నన్ను లేఖనాల్లో నుండి మీకు వివరించనీయండి.

‘‘సువార్త’’ అనే పదాన్ని నేను చదువుతున్నప్పుడు, బైబిలు ఈ పదాన్ని రెండు వేర్వేరైనవే గాని, చాలా దగ్గరి సంబంధంగల రీతుల్లో వాడుతున్నట్టు కనబడుతుంది. కొన్ని సార్లు ఈ పదాన్ని చాలా విశాలమైన భావంతో, అంటే , పాపక్షమాపణ మాత్రమే కాదుగానీ, దాని వల్ల కలిగే  సమస్తము కూడా అంటే దేవుని రాజ్యాన్ని స్థాపించుట, నూతన భూమ్యాకాశాలను సృజించుట, మరియు  దేవుడు క్రీస్తునందు నెరవేర్చ నుద్దేశించిన వాగ్దానాలన్నింటిని వర్ణించడానికి వాడబడింది. ఇంకొన్ని సందర్భాల్లో ఈ పదం  క్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ మరణం  మరియు పున:రుత్థానం  ద్వారా లభించే  పాపక్షమాపణను నిర్దిష్టంగా వర్ణించడానికి కూడా వాడబడింది. ఈ సందర్భాల్లో, పైన పేర్కొన్న వాగ్ధానాలు అంత ఎక్కువగా ప్రస్తావిస్తున్నట్టు కనబడటం లేదు.

‘‘సువార్త’’ అనే పదాన్ని బైబిలులో నిర్దిష్టమైన విధానంలో ఉపయోగించారని నేను అనుకుంటున్న, కొన్ని స్పష్టమైన సందర్భాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

1. అపొ. 10:36-43, ‘‘యేసు క్రీస్తు అందరికి ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. . . . ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామమూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు.’’

అతడు ప్రకటిస్తున్న సువార్త, ‘‘సమాధానకరమైన సువార్త’’యై ఉందని పేతురు చెప్పుతున్నాడు. అనగా, ‘‘ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామమూలముగా పాపక్షమాపణ పొందుతాడనే’’ నిర్దిష్టమైన సువర్తమానమనేది అతని భావం.

2. రోమా 1:16-17, ‘‘సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. ఎందుకనగా, ‘నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించునని’ వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది.’’

పౌలు, దేవుని నీతి విశ్వాసము ద్వారా బయలుపరచబడుతున్నది అని సువార్తను ‘‘రక్షణ’’ దృష్ట్యా నిర్వచిస్తున్నాడు. ఇక మిగిలిన పత్రికంతా  చదివితే, క్రియలు కాదు, గాని విశ్వాసము ద్వారా లభించు పాపక్షమాపణ (నీతిమంతులముగా తీర్చబడుట) గూర్చి పౌలు ఇక్కడ చెబుతున్నాడని స్పష్టమవుతుంది. రోమీయులకు వ్రాయబడిన పత్రికలో, పౌలు దృష్టంతా రానున్న రాజ్యంపై లేదు, గాని ఒకడు ఆ రాజ్యంలో ఎలా భాగం కాగలడనే విషయంపై ఉన్నది. ఆ విషయాన్నే అతడు ‘‘సువార్త’’ అని పిలుస్తున్నాడు.

3.1 కొరింథీ 1:17-18, ‘‘బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్నవారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి.’’ అతడు ప్రకటించాలని పౌలు పంపబడిన సువార్త, ‘‘సిలువను గూర్చిన వార్తయైయున్నది”

4.1 కొరింథీ 15:1-5, ‘‘మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనేగాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను.’’

పౌలు వారికి ప్రకటించిన మరియు వారు అంగీకరించిన సువార్త ఏదంటే, ‘‘క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, . . . (మరియు) లేపబడెను అనేదే. యేసు తన పునరుత్థానము తర్వాత పేతురుకు, పన్నెండు మంది శిష్యులకు, మరియు యాకోబులతో మాట్లాడాడని ఎవరికైనా మనం తెలియజేయడం సువార్తలో భాగం కాదు, అలా చెప్పకపోవడం వల్ల సువార్త చెప్పడం లేదని మనం అనుకోకూడదు.

ఎందుకంటే, పున:రుత్థానుడైన క్రీస్తును గురించి వరుసగా చెప్పబడుతున్న ప్రస్తావనలు ‘‘సువార్త’’లో భాగమైయున్నవని ఎంచకూడదు. యేసు క్రీస్తు వాస్తవంగా మృతులలో నుండి లేచాడనడానికి, ఈ విషయం చారిత్రిక సత్యమని  నిర్ధారించడానికి ప్రస్తావించబడ్డాయి.

‘‘సువార్త’’ అనే పదాన్ని బైబిలు విశాల దృక్పథంతో వాడుతున్న సందర్భాలని నేననుకుంటున్న, స్పష్టమైన సందర్భాలు ఈ క్రింద ఇవ్వబడినవి:

1. మత్తయి 4:23, ‘‘యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.’’

‘‘సువార్త’’ అనే పదం, మత్తయి వ్రాసిన సువార్తలో పేర్కొనబడడం, ఇదే మొదటిసారి, కాబట్టి  ఈ పదానికి కొన్ని భిన్నమైన భావాలు చెప్పబడవచ్చునని మనమాశించొచ్చు. యేసు ప్రకటించిన, ‘‘దేవుని రాజ్యమును గూర్చిన సువార్త’’లోని విషయాల వివరాల కోసం, ‘‘రాజ్యము’’ అని మొట్టమొదట పేర్కొనబడిన 17వ వచనాన్ని చూద్దాం. ఈ వచనంలో, యేసు, ‘‘పరలోకరాజ్యము సమీపించి యున్నది గనుక మారుమనస్సు పొందుడి!’’ అని ప్రకటించినట్టు వ్రాయబడి ఉంది.

యేసు ప్రకటించిన పరలోక రాజ్యమును గూర్చిన సువార్త సందేశంలో, (ఎ) పరలోక రాజ్యము సమీపించియున్నది, మరియు (బి) మారుమనస్సు పొందువారు అందులో ప్రవేశిస్తారు అనే విషయాలున్నాయి.

2. మార్కు 1:14-15, ‘‘యోహాను చెరపట్టబడిన తరువాత, యేసు, ‘కాలము సంపూర్ణమై యున్నది, దేవుని రాజ్యము సమీపించి యున్నది మారుమనస్సు పొంది సువార్తను నమ్ముడని’ చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను’’.

మొట్ట మొదటి వచనాన్ని మినహాయిస్తే, మార్కు వ్రాసిన సువార్తలో ఈ పదము వాడబడుట ఇదే మొదటిసారి. యేసు ప్రకటించిన ‘‘దేవుని సువార్త ఏమిటంటే : ‘‘కాలము సంపూర్ణమై యున్నది, దేవుని రాజ్యము సమీపించి యున్నది; మారుమనస్సు పొంది సువార్తను నమ్ముడి’’.

దేవుని సువార్త సందేశంలో, (ఎ) దేవుని రాజ్యము సమీపించియున్నది, మరియు (బి) మారుమనస్సు పొంది నమ్మువారు అందులో ప్రవేశిస్తారు అనే విషయాలున్నాయి.

3. లూకా 4:18, ‘‘ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును, నలిగినవారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. . .’’

ఇది పాత నిబంధనలోని వాక్యభాగం, యేసు దీని ఆధారంగా తన బహిరంగ పరిచర్యను ప్రారంభించాడు. ‘‘సువార్త’’ అనే పదం, యెషయా 61లో వాడబడినట్టు, సర్వలోకంలో దేవుని రాజ్యాధిపత్యము స్థాపింపబడటాన్ని  ఇది సూచిస్తుందని నేననుకుంటున్నాను.

4. అపొ 13:32, ‘‘దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము’’.

‘‘ఈయన’’ ద్వారానే పాపక్షమాపణ దొరుకుననేది పౌలు తెలిపిన సువార్త అని  38వ వచనం స్పష్టంగా తెలుపుతుంది.  కాని 32వ వచనంలోని, ‘‘దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడనేది’’ కూడ ‘‘సువార్త’’ అని చెప్పబడుతుంది. ఖచ్చితంగా దేవుడు మన పితరులకిచ్చిన వాగ్దానాలు, ఇప్పుడు యేసులో నెరవేరినవి, కలిసియున్నవి కాని, అవి కేవలం పాపక్షమాపణకు పరిమితమై యుండలేదు.

గనుక క్రొత్త నిబంధనలో జాగ్రత్తగా గమనించినప్పుడు, ‘‘సువార్త’’ అనే పదం విశాలమైన మరియు నిర్ధిష్టమైన రెండు భావాల్లో వాడబడిందని నాకనిపిస్తుంది. విశాల భావం ప్రకారం, మత్తయి 4, మార్కు 1, లూకా 4, మరియు అపొ. 13లో వలె, అది యేసు చేసిన కార్యము ద్వారా మనకు చేయబడిన వాగ్దానములన్నిటిని సూచిస్తుంది. అనగా, పాపక్షమాణను మాత్రమే కాదు, గాని పున:రుత్థానము, దేవునితోను మరియు ఇతరులతోను సమాధానపరచబడడం, పరిశుద్ధులముగా చేయబడడం, మహిమపరచబడడం, రానైయున్న రాజ్యము, క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి, మొదలగువాటిని కూడ సూచిస్తుంది.

ఆ సందర్భాల్లో, ‘‘సువార్త’’ అనే పదం క్రీస్తు జీవితం మరియు ఆయన చేసిన కార్యం ద్వారా పదిలపర్చబడిన దేవుని వాగ్దానాల మొత్తం సముదాయాన్ని సూచిస్తుందని మీరనవచ్చు. ఈ విశాల అవగాహనను మనము దేవుని రాజ్య సువార్త అని పిలువచ్చు. సంకుచితమైన నిర్దిష్ట భావంలో, మనం అపొ. 10లో, రోమా పత్రికంతటిలో, 1కొరింథీ 1 మరియు 1కొరింథీ 15లో చూసినట్లు, ‘‘సువార్త’’ అనే పదం, యేసు యొక్క పాపప్రాయశ్చిత్తార్థమైన మరణ పున:రుత్థానాలను ప్రజలందరూ మారుమనస్సు పొంది ఆయనయందు విశ్వసించాలని సెలవిస్తున్న పిలుపును సూచిస్తుంది. ఈ అవగాహనను మనం  సిలువ సువార్త అని పిలవొచ్చు.

ఇప్పుడు ఇంకో  రెండు ఇతర విషయాలను స్పష్టంచేస్తాను. ఒకటి, విశాల భావంతో చెప్పబడుతున్న ‘‘సువార్త’’ అనే పదంలో సంకుచితమైన నిర్దిష్ట భావం తప్పనిసరిగా కలిసియుంటుంది. మత్తయి మరియు మార్కు సువార్తల్లో ఉదాహరణలను  చూడండి. అనేకులు చెప్పినట్టు యేసు, కేవలం  రాజ్యము యొక్క ఆరంభాన్ని ప్రచురంచేయలేదు. ఆయన దేవుని రాజ్య ఆరంభాన్ని మరియు అందులో ప్రవేశించే  విధానాన్ని కూడ ప్రకటిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి: యేసు, ‘‘పరలోక రాజ్యము వచ్చియున్నది!’’ అని ప్రకటించలేదు. ఆయన, ‘‘పరలోక రాజ్యము వచ్చియున్నది. కాబట్టి మారుమనస్సు పొంది విశ్వసించుడి!’’ అని సువార్త ప్రకటించాడు.

ఏది సువార్తనో, ఏది సువార్త కాదో, రెండింటి మధ్యగల కీలకమైన తేడా ఇదే :

మనుష్యులు దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలో అనగా, మారుమనస్సు పొంది, పాపప్రాయశ్చిత్తార్థమైన క్రీస్తు మరణంలో విశ్వసించడం ద్వారా తమ పాపములు క్షమింపబడి ప్రవేశించవచ్చనే విషయాన్ని ప్రకటించకుండా, కేవలం దేవుని రాజ్య నూతన సృష్టిని, ఇంకా అనేక ఇతర విషయాలన్ని ప్రకటించుట, సువార్త కాని దానిని ప్రకటించినట్టే అవుతుంది.

వాస్తవానికి, ఇది చెడ్డ వార్తను ప్రకటించడమవుతుంది, ఎందుకంటే, ప్రజలు నూతన సృష్టిలో  ఉండబోతున్నారనే నిరీక్షణను నీవు వారిలో కలిగించడం లేదు కాబట్టి. దేవుని రాజ్య సువార్త కేవలం రాజ్యమును గూర్చి ప్రకటించడం కాదు. రాజ్యమును గూర్చి ప్రకటించడంతో పాటుగా మనుష్యులు మారుమనస్సు పొంది క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా ఆ రాజ్యములో ప్రవేశించవచ్చునని ప్రకటించుట, దేవుని రాజ్య సువార్తయై యున్నది.

రెండవదిగా, నిర్దిష్టమైన, అనగా క్రీస్తు ద్వారా లభించు పాపక్షమాపణ గూర్చిన సంకుచిత సందేశాన్ని క్రొత్త నిబంధన, ‘‘సువార్త’’ అని పిలుస్తున్నదనే వాస్తవం మరొకసారి  స్పష్టంగా గమనించదగిన విషయమై యున్నది. కాబట్టి, ‘‘దేవుడు లోకాన్ని నూతన సృష్టిగా పున:సృష్టించ గోరుతున్నాడని చెప్పకుండా, నీవు క్రీస్తు ద్వారా లభించు పాపక్షమాపణను మాత్రమే ప్రకటిస్తున్నట్లయితే, నీవు సువార్త ప్రకటించడం లేదంటూ’’ తర్కించేవారు కూడా తప్పే. పౌలు మరియు పేతురు కూడ, యేసు (ఇతర విషయమేమీగాక) ప్రత్యామ్నాయ మరణం ద్వారా లభించే  పాపక్షమాపణ గూర్చి వారు ప్రజలకు తెలియజెప్పినట్లయితే, వారు ‘‘సువార్త’’ ప్రకటించినట్టేనని సంతోషించారని అనిపిస్తుంది.

‘‘సువార్త’’ అనే పదాన్ని క్రొత్త నిబంధన విశాలమైన మరియు సంకుచితమైన అవగాహనలతో వాడుతున్నదనేదే నిజమైనట్లైతే, ఈ రెండు అవగాహనల మధ్యగల సంబంధాన్ని, రాజ్య సువార్త మరియు సిలువ సువార్త మధ్యగల సంబంధాన్ని మనమెలా అర్థంచేసుకోవాలి? తరువాతి ప్రశ్న ఇదే. ఈ ప్రశ్నకు మనం జవాబు చెప్పామంటే, నిజంగా ముఖ్యమైన కొన్ని ప్రశ్నల గురించి మనకు స్పష్టమైన గ్రహింపు కలగడానికి సహాయకరంగా ఉంటుందని నేననుకుంటున్నాను.

గనుక రాజ్య సువార్తకు మరియు సిలువ సువార్తకు గల సంబంధమేంటి? రాజ్య సువార్తలో తప్పకుండా సిలువ సువార్త కలిసియున్నదని నేనిదివరకే వాదించాను. కాని మరి ఎక్కువ నిర్దిష్టంగా చెప్పుకొంటే, సిలువ సువార్త, దేవుని రాజ్య సువార్తలో కేవలం ఒక భాగమేనా, లేక అంతకు మించిందా? అది దాని అత్యంత ప్రధానాంశమా, పట్టింపు లేనిదా?, అది దాని ప్రధాన భాగమా, లేక ఇంకేదైనానా?
అంతేగాక క్రొత్త నిబంధన రచయితలు ‘‘సువార్త’’ అనే పదాన్ని విశాల భావంగల సువార్తలో గల ఇతర నిర్దిష్టమైన వాగ్దానాలకు కాకుండా , క్రీస్తునందు విశ్వాసముంచడం  ద్వారా లభించే పాపక్షమాపణ అనే నిర్దిష్టమైన వాగ్దానానికి అన్వయించడానికి ఎందుకు ఇష్టపడుతున్నట్టు? మనుష్యులు ఒకరితో నొకరు సమాధానపరచబడగలరు! ఇదే నా సువార్త’’ అని పౌలు చెప్పుతున్న విషయాన్ని మనమెందుకు గమనించడం లేదు?

సిలువ వార్త, రాజ్య సువార్తలో కేవలం ఏదో ఒక భాగం కాదని తెలుసుకోవడం ద్వారా ఈ ప్రశ్నలన్నింటికి మనకు సమాధానం దొరుకుతుందని నేననుకుంటున్నాను. విశేషంగా, సిలువ సువార్త, రాజ్య సువార్త యొక్క ప్రవేశ ద్వారం మరియు మూలం. ఇంకా చెప్పాలంటే, అది దాని విత్తనం కూడా. క్రొత్త నిబంధన అంతా చదివి చూడండి, ఒకడు క్రీస్తు మరణం ద్వారా పాపక్షమాపణ పొందితేనే తప్ప అతడు దేవుని  రాజ్యంలోని విస్తృత దీవెనలు పొందలేడనేది నిస్సందేహమైన సందేశమై ఉందని  మీరు వెంటనే గ్రహిస్తారు. ఊటల వంటి మిగిలిన అన్ని విషయాలు పుట్టుకొచ్చే అసలు మూలం (అసలు ఊట) అదే.

అందుకే, బైబిల్ రచయితలు ఆ నీటియూట మూలాన్ని “సువార్త” అని పిలవడం సరైనదే. ఎందుకంటే  పాపక్షమాపణ, నీతిమంతులుగా తీర్చబడుట, పున:రుత్థానము, నూతన సృష్టి మొదలగు వీటన్నిటిని కలిపి ‘‘సువార్త’’ అని కూడ బైబిలు పిలుస్తుంది కాబట్టి. సువార్త యొక్క విస్తారమైన దీవెనలు, ప్రాయశ్చిత్తము, క్షమాపణ, విశ్వాసం మరియు పశ్చాత్తాపం యొక్క నిర్దిష్ట లేదా సంకుచిత దశల ద్వారా మాత్రమే వస్తాయి. ఈ ఆశీర్వాదములు సంకుచిత అవగాహన ద్వారానే ఇవ్వబడతాయి కాబట్టి, క్రొత్త నిబంధనరచయితలు ప్రవేశద్వారము/విత్తనము/అసలు ఊట వాగ్దానాన్ని “సువార్త” గా ముద్రించుట సముచితము.

క్రొత్త నిబంధన రచయితలు ఈ నీటిఊటను ‘‘సువార్త’’ యని పిలువడం మరియు అదే సమయంలో అన్నీ కలిసియున్న విశాల అవగాహనలోని ఇతర ఏ నిర్దిష్టమైన దీవెననైనను ‘‘సువార్త’’ యని పిలువకపోడం కూడ సంపూర్ణంగా సముచితమై యున్నది. గనుక మనుష్యులు ఒకరితో నొకరు సమాధానపరచబడటాన్ని మనము ‘‘సువార్త’’ అని పిలువము. నూతన ఆకాశాలను మరియు నూతన భూమినైననూ ‘‘సువార్త’’ యని పిలువము. కాని, ప్రాయశ్చిత్తము ద్వారా లభించు క్షమాపణను మనం  ‘‘సువార్త’’ అని పిలుస్తాము, ఎందుకంటె అది మిగిలిన వాటన్నిటి యొక్క అసలు ఊట మరియు వాటికి ప్రవేశ ద్వారమునైయున్నది.

దీని నుండి కొన్ని ముఖ్యమైన నిగూఢమైన భావాలు తలెత్తుతున్నాయి.

మొదటిదిగా, ‘‘సువార్త’’ అనేది రాజ్యమును గురించిన ప్రకటనై ఉందని వాదించేవారు కేవలము తప్పు అని మళ్లీ చెప్పడం గమనించాలి. సువార్త అనేది రాజ్యమును గురించిన ప్రకటన కాదు; అది (విశాల అవగాహన చొప్పున) రాజ్యములో ప్రవేశించడానికి  గల మార్గముతోపాటు రాజ్యమును గూర్చిన ప్రకటనయైయున్నది.

రెండవది. సిలువ సువార్త ఏదో ఒకవిధంగా సువార్త కాదు, లేదా సువార్త కంటే ఇది తక్కువ అని చెప్పడం తప్పు. రక్షించబడడానికి నమ్మవలసిన సందేశమేంటి?’’ అనేది మనమడగాల్సిన  ప్రశ్నయై యున్నంత వరకు, సిలువ సువార్త, సువార్తయై యున్నది. యేసయ్య, పౌలు, మరియు పేతురు కూడ ఈ విషయాన్నే చెబుతున్నారు.

మూడవదిగా, రాజ్య సువార్త ఏదో ఒకవిధంగా సువార్త-ప్లస్ లేదా నిజమైన సువార్త నుండి పక్కకి తొలగిపోవడం అని చెప్పడం కూడా తప్పు. ‘‘క్రైస్తవ్యము యొక్క సంపూర్ణ శుభవార్త ఏమిటి? అనే ప్రశ్న ఉన్నంత వరకు, రాజ్య సువార్త, సువార్తకంటె ఎక్కువైనది కాదు; అదే సువార్తయై యున్నది. యేసు, పౌలు, మరియు పేతురు కూడ ఈ విషయాన్నే చెప్పుతున్నారు.1

నాలుగవదిగా, ఒకడు మంచి పనులు చేస్తున్నంత మాత్రాన, ‘‘యేసు మాదిరిని అనుసరిస్తున్నంత’’ మాత్రాన, అతనిని క్రైస్తవుడని పిలవడం తప్పు. ఒకడు క్రైస్తవునిగా ఉండడానికి , రాజ్య దీవెనలలో పాలిభాగస్థుడై ఉండడానికి, అతడు మొదట ప్రవేశ ద్వారము గుండా వెళ్లాల్సి ఉంటుంది. అనగా, అతడు విశ్వాసముతో క్రీస్తు నొద్దకు రావాలి, పాపక్షమాపణ పొందాలి, అతని పాపం ప్రాయశ్చిత్తము చేయబడాలి.

యాత్రికుని ప్రయాణము అనే పుస్తకం  రచించిన జాన్‌ బన్యన్‌, దానిలో పరలోక పట్టణానికి వెళుతున్న క్రైస్తవుడు కలుసుకున్న  ఆచారవాది మరియు వేషధారణ అనే ఇద్దరు పాత్రల గురించిన  కథ చెప్పుతున్నాడు. కొంత సేపు వారు సంభాషించుకున్న తరువాత, వారిద్దరు పెద్ద ప్రవేశ ద్వారములోపల ఏర్పాటుచేయబడిన చిన్న ద్వారము గుండా కాకుండా, గోడ మీది నుండి దూకి మార్గంలోనికి వచ్చారని క్రైస్తవుడు తెలుసుకుంటాడు. పాయింట్ ఏంటంటే : వీరిద్దరు తమ త్రోవను ఎంత చక్కగా కనుగొన్నప్పటికినీ, వారు క్రైస్తవులు కారు.

మనము చెప్పుకుంటున్న పాత్రలను కొంచెం మార్చి చెప్పుకుందాం. యేసు అనుచరుడుగా ఉన్న వ్యక్తి మరియు దేవుని రాజ్య సంబంధ జీవితం జీవిస్తున్న ఒకావిడ, వీరిద్దరూ  వారి  పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సుతోను మరియు విశ్వాసముతోను సిలువవేయబడిన యేసు నొద్దకు వస్తే తప్ప, వారు క్రైస్తవులు కారని తెలుసుకొనాల్సినవారు ఎంతో మంది ఉన్నారు. ఒకడు కొంతవరకు ‘‘యేసు జీవించినట్టు జీవించవచ్చు,’’ కాని ప్రాయశ్చిత్తము, విశ్వాసము మరియు మారుమనస్సు అనే చిన్న ద్వారము గుండా వెళ్తే తప్ప, అతడు నిజముగా క్రీస్తు నొద్దకు రానట్టే. అతడు కూడా గోడ మీది నుంచి దూకినట్టే.

ఐదవదిగా, క్రైస్తవేతరులు ‘‘దేవుని రాజ్య పని’’ చేస్తున్నారని ఎప్పుడైనా చెప్పడం తప్పే అని నేను నమ్ముతాను. మనుష్యులను సమాధానపరిచే  లేదా వారికి న్యాయం చేకూర్చే  క్రైసవేతరుడు మంచి పనులు చేయొచ్చు , కాని అవి దేవుని రాజ్య పనులు కావు ఎందుకంటే అవి రాజులకు రాజైనవాని నామములో చేయబడలేదు.

ఆరవదిగా, ఒక క్రైస్తవుడు లేదా సంఘము చేసే కనికరమును చూపే (పేదలకు, అనాధవృద్ధాశ్రమాలకి సాయం చేయడం) ఏ పరిచర్య ఐనా దాని అంతిమ లక్ష్యం, లోకానికి, ప్రవేశ ద్వారము వద్దకు  దారి చూపించేదిగా ఉండాల్సిందే. దీని గురించి చాలా సంగతులు చెప్పవచ్చు, కాని ఈ విషయమంతటిని సరిగ్గా అర్థం చేసుకోవడం వలన శక్తివంతమైన పరిచర్య చేయడానికి మనకు ప్రేరణను లభిస్తుందని, సర్వలోకంలో సాక్షిగా ఉండడానికి మనల్ని పురికొల్పుతుందని నేననుకుంటున్నాను.

సమయంలో, (క్లుప్తంగా వ్రాయడానికి సూటిగా చెప్తున్నాను), ‘‘చూడు బాబూ, నేను అందము, క్రమము మరియు సమాధానం గూర్చి శ్రద్ధ వహించు దేవున్ని సేవిస్తున్నందుకు నేనీపని చేస్తున్నాను. వాస్తవం చెప్పాలంటే, ఒక దినాన దేవుడు ఈ లోకమంతటిని మళ్లీ సృష్టించి, పెయింట్‌ ఊడిపోని, చెట్లు ఎండిపోని రాజ్యాన్ని ప్రారంభించబోతున్నాడని బైబిలు చెప్తున్నది, నేను నమ్ముతున్నాను కూడ. కాని (ఇప్పుడు అసలు విషయం) నీ పాపమునుబట్టి, నీవు మారుమనస్సు పొంది, క్రీస్తును నమ్మితే తప్ప, నీవు అందులో భాగమై యుంటావని నేననుకోను’’ అని నీవు ఆ దుకాణం యజమానికి చెప్పాల్సి వుంటుంది. ఆ తర్వాత  నీవతనికి సిలువను గూర్చిన శుభవార్త చెప్పాలి. నీవు ఆ దుకాణాన్ని మరమ్మత్తు చేయించి, రానైయున్న రాజ్యం గూర్చి చెప్పినట్లయితే, నీవు అసలు సువార్త చెప్పలేదనట్టే. రాజ్యము మరియు రాజ్యములో ప్రవేశించుటకు మార్గముతో కూడిన ప్రకటన  కలిసియున్న సువార్త, దేవుని  రాజ్య సువార్తయై యున్నది.

ఏడవదిగా, నేనింతకు ముందు వాదించినట్టు, పుట్టగొడుగుల్లా క్రొత్తగా పుట్టుకొస్తున్న సంఘాలలోని అనేకులు – వారి సువార్త ఎంతో అద్భుతమైనదనీ, ఎంతో విస్మయం  కలిగించేదని చెప్పుకునే సంఘాలలోని అనేకులు – సువార్త విషయంలో నిజముగా అద్భుతమైన అసలు విషయం నుండి పూర్తిగా తప్పిపోయారని నేను నమ్ముతున్నాను.

యేసే రాజైయున్నాడు, ఆయన ప్రేమ మరియు కనికరముగల రాజ్యాన్ని ప్రారంభించాడనే విషయం నిజముగా ఏమాత్రమును విస్మయాన్ని కలిగించేది కాదు. ఇది ఏదో ఒక దినాన జరుగుతుందని ప్రతి యూదునికి తెలుసు. సువార్తను గూర్చి నిజంగా  విస్మయాన్ని కలిగించు విషయమేమంటే, మెస్సీయ ఐన రాజు తన ప్రజలను రక్షించుటకు మరణించాడు. దానియేలు గ్రంథంలోని మనుష్యకుమారుడు, దావీదు వంశస్థుడైన మెస్సీయ, మరియు యెషయా గ్రంథంలోని శ్రమనొందు సేవకుడు, ఈయనే, చివరికి, రాజ్య సువార్తను మరియు సిలువ సువార్తను మనము జోడించే తీరు కూడా ఇదే. యేసు కేవలము రాజే కాదు, ఆయన సిలువవేయబడిన రాజై యున్నాడు. ఈ విషయంతో పోలిస్తే, నూతనంగా పుట్టుకొస్తున్న సంఘ సభ్యులు, ఆశ్చర్యం కలిగించు సువార్త అని చెప్పుకొనేది, ఏమాత్రమును ఆశ్చర్యమైనది కాదు. అది కేవలము విసుగు పుట్టించే విషయమై యున్నది.

ఎనిమిదవదిగా, మనమింత వరకు చెప్పుకున్నదంతా ఈ యుగంలో, సువార్తీకరణ, సంఘ ప్రేషిత పరిచర్య, మరియు కాపరత్వానికి  సంబంధించి నొక్కిచెప్పడము, ఇవన్నీ సిలువ సువార్తకు అనగా, విశాల అవగాహనగల రాజ్య సువార్త యొక్క అసలు మూలము మరియు ప్రవేశ ద్వారమునకు చెందినదనే తుది అభిప్రాయానికి నడిపిస్తుంది. ఎందుకంటే మిగిలినదంతా పొందబడజాలనిదై యున్నది. మరియు మనము వారిని ఆ అసలు మూలము దగ్గరికి, ప్రవేశ ద్వారము దగ్గరికి నడిపిస్తే తప్ప, అది సువార్త కాదు. అది చెడ్డ వార్త అవుతుంది. అంతమాత్రమేగాక, ‘‘మారుమనస్సు పొంది విశ్వసించుడి’’ అనేది లోకంలోని ప్రతి మానవునికి దేవుడు సెలవిచ్చిన సమగ్రమైన ఆజ్ఞయై యున్నది.

వాస్తవానికి (అది విశాల అవగాహనతో కూడినదైనా, సంకుచిత అవగాహనతో కూడినదైనా) సువార్తలోనే కలిసియున్న ఒకే ఒక్క ఆజ్ఞ ఉన్నది: మారుమనస్సుపొంది విశ్వసించుడి. నేటి  యుగంలో మానవులందరి ప్రాథమిక కర్తవ్యం ఇదే. కాబట్టి మన బోధలలో లేదా సువార్త ప్రకటనలలో కూడా ఈ విషయమే ప్రాథమికంగా నొక్కిచెప్పబడాల్సి ఉంది.

——————
1 యేసు (ఉదాహరణకు, మార్కు 10:45లో), ‘‘సువార్త’’ అనే పదాన్ని వ్రాయబడిన మాటలకు సుస్పష్టంగా జోడిరచనప్పటికిని, సిలువ సువార్తను చాలా స్పష్టంగా బోధించాడు. మొత్తంమీద సాధారణ గమనికగా, పదములను ఒక్కొక్కటిగా అధ్యయనం చేయుటలోగల ప్రయోజనాన్ని మనము గుర్తించినప్పటికిని, సువార్త అనగా ఏమిటో మనము చెప్పే నిర్వచనాన్ని మరియు వాక్యభాగంలోని దాని గూర్చిన మన గుర్తింపును ‘‘సువార్త’’ అనే  పదం కనబడే ప్రతి చోట మరీ దగ్గరి సంబంధంతో మనము ముడిపెట్టకూడదు. లేదంటే, సువార్త రచయితలలో ఒకడైన యోహాను, ‘‘సువార్త’’ అనే పదాన్ని క్రొత్త నిబంధన తన రచనలన్నిటిలో దేనిలోనూ వాడలేదు గనుక మనము యోహాను దాని గూర్చి ఎన్నడూ చెప్పలేదని చెప్పాల్సి వస్తుంది.

గ్రెగ్ గిల్బర్ట్

గ్రెగ్ గిల్బర్ట్

గ్రెగ్ గిల్బర్ట్ గారు కెంటకీ లోని లూయివిల్ లోని థర్డ్ అవెన్యూ బాప్టిస్ట్ చర్చి యొక్క సీనియర్ పాస్టర్. ఆయన తన B.A. యేల్ విశ్వవిద్యాలయంలో మరియు M.Div సదరన్ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీలో పూర్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...