మీరు సంఘ క్రమశిక్షణను ఎప్పుడు అమలు చేస్తారు? సంఘంలో పాపమును ఎలా గద్దిస్తారు?
సంఘంలో చాలా ఎక్కువ శాతం క్రమశిక్షణ సోమవారం మొదలుకొని శనివారం వరకు ఒకరినొకరు మామూలుగా కలిసినప్పుడు జరుగుతుండాలి. అలాగని, ఎప్పుడు చూచినా సంఘ సభ్యులు ఒకరినొకరు సరిదిద్దుకొంటూనే ఉండాలనేది దీని అర్థం కాదు. ఇదే జరిగితే అది చాలా భయంకరంగా ఉంటుంది. వాక్య ప్రకారం సంఘ సభ్యులందరు దైవభక్తి కొరకైన ఆకలి చేత నింపబడి గుర్తింపబడే సంఘమై యుండాలని కోరుతుంది. సాధారణంగా, ఇలాంటి సంఘంలోని సభ్యులు దిద్దుబాటును అసహ్యించుకొనకుండా దాని కొరకైన సహాయం అడుగుతుంటారు, ఎందుకంటె, వారు ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశిస్తారు.
హలో, రాజేశ్, నేను నిన్నటి దినాన కూడిక నడిపించిన తీరు గూర్చి నీ అభిప్రాయమేంటి? నేనింకా చక్కగా చేయాల్సిందేమైనా ఉందా?’’
‘‘సోమేశ్, నీవు మా కుటుంబం గూర్చి, నేను నా భార్యను ప్రేమిస్తున్న విధానం గూర్చి నాతో ఏమైనా చెప్పాలనుకుంటే ఎప్పుడైనా నువ్వు చెప్పవచ్చు అని నీవు తెలిసికోవాలని ఆశిస్తున్నాను. దీని గూర్చి నిన్నడగాలని నా శరీరానికి ఇష్టం లేదు గాని… నేను మా పిల్లల పట్ల వ్యవహరించడం గూర్చి నీవేమైనా గమనించావా?’’
బైబిల్ పండితులు కొన్నిసార్లు నిర్మాణాత్మక క్రమశిక్షణ మరియు సంస్కరించే క్రమశిక్షణ మధ్యగల తేడాను తెలుపుతారు. నిర్మాణాత్మక క్రమశిక్షణ (formative discipline) అంటే, నేర్పించడం. సంస్కరించే క్రమశిక్షణ (corrective discipline) అంటే, తప్పులను దిద్దడం. కానీ సహజంగా ఈ రెండు క్రమశిక్షణలు జంటగా జరుగుతుంటాయి. ఒక క్రమశిక్షణ లేకుండా రెండోది ఉండదు. సంఘ జీవితంలో, నిర్మాణాత్మక క్రమశిక్షణ మరియు సంస్కరించే క్రమశిక్షణ ఆదివారంనాడు మాత్రమే కాదు గాని సోమవారం నుండి శనివారం వరకు కూడ జరుగుతుండాలి. క్రమశిక్షణ అనేది, శిష్యత్వపు పద్ధతే అని మరొక విధంగా వివరించవచ్చు. శిష్యులనుగా చేయడమైనా, క్రమశిక్షణయైనా ఎప్పుడు జరుగుతుండాలి? వారమంతా జరుగుతుండాలి. అప్పుడే ఈ కష్టతరమైన ప్రశ్న తలెత్తుతుంది.
కష్టతరమైన ప్రశ్న
క్రమశిక్షణ పద్ధతి తరువాతి స్థాయికి, దశకు, ఎప్పుడు తీసుకెళ్లాలి – మొదటి దాని నుండి రెండోది లేదా మూడోది, లేదా రెండో దాని నుండి మూడోది, ఇలా సంఘమంతటి యెదుటకి ఎప్పుడు తీసుకెళ్లాలి?
దీనికి సులభమైన సూత్రం ఏదీ లేదు. ఒక్కొక్క విషయాన్ని, దాని మంచి చెడుల ఆధారంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఉదా॥ మా సంఘ పెద్దలు ఎంతో ఎక్కువ కాలం శ్రమపడాల్సిన అవసరం లేని కొన్ని పరిస్థితులు మేమెదుర్కొన్నాం మరియు ఎంతో ఎక్కువ కాలం, నెలల వరకు లేదా సంవత్సరాల వరకు కూడ శ్రమపడినప్పటికీ, విషయాన్ని లేదా సమస్యను తరువాతి దశకు తీసికెళ్లాలనే నిర్ణయానికి రాలేకపోయిన కొన్ని పరిస్థితులున్నాయి.
ఇలాంటి పరిస్థితి చాలా సార్లు, క్రమశిక్షణ సమస్యల్లో చిక్కుకొని తమ పాపముతో పోరాడుతున్నవారు మాకు సహకరిస్తూ ఆ పాపముపై పోరాటం చేసిన వారు ఉన్నారు. మా సంఘ కాపరిల్లో ఒకరు ఒక భార్యాభర్తల జంటతో దాదాపు నాలుగైదు సంవత్సరాల వరకు వారి పోరాటం గూర్చి చర్చిస్తూ, సలహాలను ఇచ్చారని నాకు జ్ఞాపకముంది. ఇక్కడ ఎదురైన సమస్యేమంటే, అప్పుడప్పుడూ కథ మళ్లీ మొదటికి వచ్చేది. కొన్నిసార్లు వారికి సహాయం చేస్తున్న వారు వేరే ప్రాంతాలకి వెళ్లిపోవడం ద్వారా వారికి సహాయం చేయడానికి క్రొత్త వారికి మొత్తం చరిత్రను క్లుప్తంగానైనా, పురోగతిని వివరించాల్సి వచ్చింది. ఇలా రెండుసార్లు మారిపోయారని నాకు గుర్తు. అలా జరిగినప్పటికీ వారిలో ఏ ఒక్కరూ సంఘంలో నుండి బహిరంగముగా బహిష్కరించబడలేదు.
కొంత వరకు సులభమైన ప్రశ్న
ఆచరణాత్మకంగా కాకపోయినా కనీసం సిద్ధాంతపరంగానైనా కొంతవరకు సులభమైన ప్రశ్నను మీముందుంచుతున్నాను: సంఘం యెదుట అందరికి చెప్పడానికి మరియు సంఘంలో నుండి బహిష్కరించడానికి ఏ పాపములు అధికార అనుమతిని ఇస్తున్నాయి? దీని జవాబు కోసం, పాతకాలపు రచయితలైతే తరచుగా బైబిలులోని 1 కొరింథీ 5 మరియు 6 అధ్యాయాల్లో నుండి జాబితాలను సేకరిస్తారు: ‘‘ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధికుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయ్యున్నయెడల, అటివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను’’ (1 కొరింథీ. 5:11). అయితే, ఒక విషయం: మనం ఈ జాబితాలకే పరిమితమైతే, లోభియైనవానిని వెలివేయాలి గాని అప్పగించిన ధనాన్ని తినివేసినవానిని బహిష్కరించకూడదని అర్థమా? డబ్బు విషయంలో పెద్ద యెత్తున దగాచేసేవారిని వెలివేయాలి గాని హంతకులను లేదా చిన్నపిల్లలను లైంగికంగా వేధించేవారిని కాదని అర్థమా? ఈ జాబితాల్లో, అప్పగించిన సొత్తును తినివేసేవారు, హంతకులు, చిన్నపిల్లలను లైంగికంగా వేధించేవారు ఎన్నడూ పేర్కొనబడలేదు.
నామట్టుకైతే, ఈ జాబితాలో అన్ని విషయాలు ఉన్నాయని నేను అనుకొనడం లేదు. పౌలు, అవిశ్వాసులుగానే ఉండిపోయేవారిని లేదా ఎప్పటికీ మారుమనస్సుపొందనివారిని గుర్తించు పాపములను ఇక్కడ వివరిస్తున్నాడు (1 కొరింథీ. 6:9-10 చూడుము).
గనుక, పై ప్రశ్నకు క్లుప్తమైన జవాబేమంటే, బాహ్యమైన, ముఖ్యమైన, మరియు మారుమనస్సు పొందని పాపములు మాత్రమే అధికారపూర్వకంగా సంఘం యెదుట అందరికి చెప్పడము మరియు బహిష్కరించడాన్ని సమర్థిస్తాయి. ఏ పాపమైనాగాని, ఈ క్రింది మూడు లక్షణాలుగలదై యుండాలి, ఏ ఒక్కటిగాని లేదా రెండుగాని కాదు.
(1) పాపం బాహ్యమైనదై యుండాలి.
మొదటిదిగా, ఆ పాపము కంటికి కనబడేది లేదా చెవులకు వినబడేదై యుండాలి. అంతే గాని అది ఒకని హృదయం లోపల ఉందని నీవు అనుమానించేదై యుండకూడదు. ‘లోభియైనవానిని’ అని పౌలు పేర్కొంటున్నాడు. గాని ఇందుకు సంబంధించిన బాహ్య రుజువులు ఏమీ లేనప్పుడు, అతడు సంఘంచే బహిష్కరించబడడు. ఈ లోక న్యాయస్థాన వ్యవస్థ రుజువులను జాగ్రత్తగా పరిశీలిస్తుంది. అలాంటప్పుడు, సంఘం అంత కంటె తక్కువ జాగ్రత్తగా ఉండవచ్చునా? యేసునకు రుజువులు లేకుండా జనాలు న్యాయం అని దేన్ని అనుకుంటున్నారో అనే దాని గురించి ఆసక్తి లేదు.
నేను, ‘‘బాహ్యమైనది’’ అని అన్నానే గాని, ‘‘బహిరంగమైనది’’ అని అనలేదు. ఉదా॥ జారత్వం, బహిరంగమైనది కాదు. అది రహస్యమైనది. అందుకే నేను, ‘‘బాహ్యమైనది’’ అని అన్నాను.
(2) పాపం ముఖ్యమైనదై యుండాలి.
ఆందోళన లేదా ఆత్రుత, భయం మరియు ఒత్తిడి ఇవన్నీ పాపమై యుండవచ్చు. గాని వీటిని అధికార పూర్వకంగా బట్టబయలు చేయాలనిగాని లేదా అటువంటివారిని వెలివేయాలనిగాని ఇవి సమర్థించవు.
ఉదా॥ ఒక సహోదరుడు ఒక విషయాన్ని ఉన్నదాని కన్నా పెద్దదిగా చేసి చెప్పుతుంటే నేనతన్ని పట్టుకున్నాను. అతడేమో, దీనిని అంగీకరించడం లేదు. గనుక అతడు పాపం చేయుచుండవచ్చు. కాని ఈ విషయాన్ని నేను అందరికీ చెప్పను. ‘‘ప్రేమ అనేక పాపములను కప్పునని’’ పేతురు చెప్పుతున్నాడు (1 పేతురు 4:8). మనం మన తోటి సభ్యుల వలన అనుభవించే అనేక ముఖ్యం కాని పాపాలను పట్టించుకొనకుండ ఉండటానికి ఇష్టపడుట ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన సంఘం యొక్క ఒక ముఖ్యమైన లక్షణమై యుంటుంది.
గనుక ముఖ్యమైన పాపమని దేనినంటారు? ఒకడు పశ్చాత్తాపపడడానికి కూడ నిరాకరించినట్లయితే అతడు దేవుని ఆత్మగలవాడైన క్రైస్తవుడని నమ్మడానికి కష్టం కలిగించే పాపమును ముఖ్యమైన పాపమంటారు. ఒకరి విశ్వాసమును సంఘం ధృవీకరించడం సంఘ సభ్యత్వమై యున్నది. మనలను ఎల్లప్పుడూ గమనిస్తున్న లోకం యెదుట మన విశ్వాసం నమ్మదగినదై యున్నదనటానికి కష్టం కలిగించేదే ముఖ్య పాపమై యున్నది. జరిగిన విషయాన్ని పెద్దదిగా చేసి చెప్పాడని ఒప్పుకొననివాని విశ్వాసమును నేను నిర్మలమైన మనస్సాక్షితో ధృవీకరించగలను; గాని లైంగిక అనైతికములో, దుర్భాషలాడుటలో, త్రాగుబోతుతనములో, మొ॥ విషయాల్లో కొనసాగుచుండువాని విశ్వాసమును నేను నిర్మలమైన మనస్సాక్షితో ధృవీకరించలేను.
‘‘ముఖ్యమైన’’ పాపమునకు సంబంధించిన ఆధారాలు కొంత వరకు వ్యక్తిగతమైనవై ఉన్నాయా? ఔను, అందువలననే, కొన్ని విషయాలనుబట్టి ఒకే పాపంవిషయంలో, ఒక పరిస్థితిలో బహిష్కరించడాన్ని సమర్థించవచ్చు, మరొక పరిస్థితిలో కాదనవచ్చు. ప్రతి పరిస్థితితో వ్యవహరించడానికి మనకు ఖచ్చితమైన కేసుకు సంబంధించిన చట్టాన్ని ఇవ్వడము బైబిలులో ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇప్పుడున్నట్లే, మనం విశ్వాసముతో నడుచుకోడానికి మనకు అవసరమైయున్న జ్ఞానం కొరకు మనం ప్రభువును వేడుకోవాలని ఆయన కోరుతున్నాడు. అన్నట్టు, సంఘాలు ఎంత వీలైతే అంత ఎక్కువ మంది సంఘ కాపరులను కలిగి ఉండాలని ఆశపడాలనుటకు ఇది మరొక కారణమై యున్నది. ఇలా కష్టమైన విషయాల గూర్చి సబబైన నిర్ణయంతో సంఘం ముందుకు రాడానికి ఒకరిద్దరు పెద్దలు చాలరు.
(3) పాపం మారుమనస్సు పొందనిదై యుండాలి.
పాపం చేసిన వ్యక్తి దాని గూర్చి మందలింపబడ్డాడు. అయితే అతడు ఆ పాపమును అంగీకరించినా లేదా అంగీకరించకపోయినా, అతడు దానిని మానివేసినా లేదా మానివేయకపోయినా, చివరకు ఆ పాపములో నుండి బయటపడటానికి అతడు నిరాకరిస్తాడు; అదే పాపాన్ని మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. అతడు ఒక మూర్ఖుని వలె తన మూర్ఖత్వమునుబట్టి, ఆ పాపము నుండి వేరుకాలేడు (వేరుకాడు).
అలా అయితే, మనం పాపాన్ని ఎలా గద్దించాలి?
ఆయనకు కోపం వచ్చినప్పుడు యేసు బల్లలను పడద్రోసిన సందర్భమున్నది. కొందరు వ్యక్తుల గూర్చి అపొస్తలులు బహిరంగంగా తీవ్రమైన విమర్శనాత్మకంగా మాటలాడిన సందర్భాలున్నాయి (పేతురు మరియు గారడీవాడైన సీమోనును గుర్తుకు తెచ్చుకొనండి; అపొ. కార్య. 8వ అధ్యాయం లేదా 1 కొరింథీ 5వ అధ్యాయంలో పౌలు పలుకుతున్న మాటలను గమనించండి). మీరు ఒక తోటి సభ్యున్ని సరిదిద్దినప్పుడు, మీ దిద్దుబాటు తీవ్రత స్థాయి 9 లేదా 10గా ఉండే కొన్ని అరుదైన సందర్భాలుండవచ్చు. గాని దాదాపుగా అన్ని పరిస్థితులలోను, మీరు ఒకరిని ఎదుర్కొనే లేదా ప్రశ్నించే పద్ధతి ఈ క్రింది లక్షణాలు కలిగియుండాలి:
– వివేచన: స్నేహితుల సంఖ్య ఎంత చిన్నదిగా ఉంటే అంత మంచిదని మత్తయి 18లో తెలుపబడిన మాటలు మనకు సూచిస్తాయి.
– సున్నితత్వం: మనం వారిని ‘‘సాత్వికమైన మనస్సుతో’’ పున:రుద్ధరించాలని పౌలు చెప్పుతున్నాడు (గలతీ 6:1).
– అప్రమత్తత: ఇదే వచనంలో, ‘‘మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు’’ అని చేర్చుతున్నాడు. ‘‘శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకొనక, అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడని’’ అంటూ, యూదా ఏకీభవిస్తున్నాడు (యూదా వ23). పాపము మోసపూరితమైనది. నీవు ఇతరులకు సహాయం చేయాలని చేసే ప్రయత్నంలో సయితం నీవు సులభంగా చిక్కుకొనిపోగలవు.
– కనికరం: ‘‘కనికరము చూపుడి’’ అనీ, ‘‘కరుణించుడి’’ అనీ యూదా రెండుసార్లు చెప్పుతున్నాడు (వ22,23). నీవు మాటలాడే తీరు కనికరముతో కూడినదై యుండాలి, విషయాన్ని అర్థంచేసుకోవాలి. నీవు ఎన్నటికినీ ఆ విధంగా తొట్రిల్లవన్నట్టు, లేదా తొట్రిల్లడానికి ఆస్కారమే లేదన్నట్లు స్వనీతిని కనుపరచవద్దు.
– నిష్పక్షపాతం: విషయం తెలియగానే, వివరాల్లోకి వెళ్లక ముందే తీర్పు తీర్చకూడదు గాని ఇరుపక్షాలవారు చెప్పే వివరాలు పూర్తిగా వినాలి (1 తిమోతి 5:21 చూడుము).
– స్పష్టత: ఇష్టంలేని దూకుడుతనంతో కూడిన లేదా వ్యంగ్యంగా ఎదుర్కొనడం ఖచ్చితంగా సరైన పద్ధతి కాదు ఎందుకంటె అది నిన్ను నీవు కాపాడుకోవడానికి మాత్రమే ప్రయోజనపడుతుంది. అలా కాకుండా, ముఖ్యంగా నీవు పాపంలో పట్టబడిన వ్యక్తి ఒప్పుకొనడం ఒప్పుకోడానికి ప్రశ్నించబోతున్నట్లయితే, చాలా స్పష్టంగా నిన్ను నీవు బలహీనుడిగా చూపించడానికి ఇష్టపడాలి. తద్వారా సంభాషణ సున్నితంగా కనిపించి ఆ వ్యక్తి తనకు తానే తన పాపాన్ని ఒప్పుకోవచ్చు. అయితే ఇది స్పష్టతలోని ఉద్దేశాలతో రాజీపడజాలదు. వివరాలు, లేదా ప్రమేయమున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, నీవు యింకా ఎక్కువ స్పష్టంగా ఉండాలి. ఎంతైనా, పులిసిన పిండి కొంచెమైనను, అది ముద్ద అంతటిని పులియజేస్తుంది కదా (1 కొరింథీ. 5:6). అందుకే వారిని తప్పనిసరిగా హెచ్చరించాలి.
– నిర్ణయాత్మకము: దీనికి సంబంధించినంత వరకు, క్రమశిక్షణలోని చివరి దశ అయిన బహిష్కరించడమునకు వచ్చినప్పుడు, సంఘమంతటి చర్య ఒకే నిర్ణయంతో కూడినదై యుండాలి: ‘‘క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి’’ (1 కొరింథీ. 5:7); ‘‘మతభేదములు కలిగించు మనుష్యుని విసర్జించుము’’ (తీతు 3:10). బహిష్కరించబడిన సభ్యుడు యిక మీద సంఘ సభ్యుడు కాదనీ, ప్రభు రాత్రి భోజన సంస్కారంలో పాల్గొన వీలులేదనే విషయం చాలా స్పష్టంగా చెప్పాలి.
దిద్దుబాటు అవసరమైయున్న ఏ రెండు పరిస్థితులూ ఒకే విధంగా ఉండవు గనుక జ్ఞానం ఎల్లప్పుడూ అవసరమవుతుంది. ‘‘ఔను, గతంలో మనం ఫలానా వ్యక్తి విషయంలో, ఇలా చేశామని’’ చెప్పడం సులభం. నిజమే, అయితే జరిగిపోయిన దాని నుండి నేర్చుకోడానికి ఎన్నో విషయాలుంటాయి గనుక, చివరకు మనం దేవుని వాక్యంలోని సూత్రాలు, పరిశుద్ధాత్ముని నడిపింపు, మరియు ప్రతి క్రొత్త పరిస్థితి యొక్క వివరాలు మరియు విలక్షణతలను జాగ్రత్తగా పరీక్షించడంపై ఆధారపడవలసి ఉంటుంది.
సంపాదకుని గమనిక: ఈ వ్యాసము జోనాతన్ లీమన్ రచించిన అండర్స్టాండింగ్ చర్చ్ డిసిప్లిన్ (B&H, 2016). అనే క్రొత్త పుస్తకములో నుండి సారాంశముగా తీసికొనబడినది.
జోనాతన్ లీమన్
జోనాతన్ 9మార్క్స్ పుస్తకాలని అలాగే 9మార్క్స్ జర్నల్స్ ను ఎడిట్ చేస్తారు. అతను సంఘానికి సంబంధించిన అనేక విషయాలపై పుస్తకాల రచయిత కూడా. జోనాతన్ సదరన్ సెమినరీ నుండి MDiv మరియు యూనివర్శిటీ ఆఫ్ వేల్స్ నుండి ఎక్లెసియాలజీలో Ph.D ని సంపాదించారు. అతను మేరీల్యాండ్‌లోని షెవర్లీలో తన భార్య మరియు నలుగురు కుమార్తెలతో నివసిస్తున్నాడు, అక్కడ అతను షెవర్లీ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ గా ఉన్నాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web