గొప్ప ఆదేశాన్ని పాటించే సంఘం యొక్క 4 అభ్యాసాలు

గొప్ప ఆదేశాన్ని పాటించే సంఘం యొక్క 4 అభ్యాసాలు

షేర్ చెయ్యండి:

సంఘాలు కంపెనీల వలె పనిచేయాలని గొప్ప ఆదేశం (ది గ్రేట్‌ కమిషన్‌) వాటికి పిలుపునివ్వడం లేదు. అంతే కాదు, అవి సమాచార కేంద్రాలుగా పనిచేయాలని కూడ పిలుపునివ్వడం లేదు. అలాగే, సంఘాలు వృత్తిపరమైన క్రీడా జట్టులుగానైనా పనిచేయాలని వాటికి గొప్ప ఆదేశం పిలుపునివ్వడం లేదు.

నాకు ఈ ఆటల గూర్చి ఎక్కువగా తెలియదు కాబట్టి మా సంఘంలోని సభ్యులు నా గురించి తమాషా చేస్తుంటారు, వారికది న్యాయమే. కాని, ఫైనల్లో కూడా విజయం సాధించి, ప్రఖ్యాత విజేతలుగా నిలువాలనేది ఆటల పోటీల్లో పాల్గొనే ప్రతి జట్టు యొక్క లక్ష్యమనేది మాత్రం నాకు బాగా తెలుసు. గనుక ప్రతి జట్టు, ఉత్తమమైన, అనుభవజ్ఞులైన, నిపుణులైన ఆటగాళ్లను ఎంపికచేసుకోడానికి, వారి శిక్షణ కొరకు ఉత్తమమైన వసతులు కల్పించడానికి, వారికి శిక్షణ నిచ్చేవారు తమ జట్టు ఫైనల్ గెలిచి విజేతలగునట్లు వారిని తమ శాయశక్తులా తీర్చి దిద్దాలని ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా, పోటీ పడటానికి ఇతర జట్లున్నాయని ప్రతి జట్టు సంతోషిస్తుంది. పోటీపడే ఇతర జట్లు లేనట్లయితే, ఆటల సమాఖ్య ఉండదు. గాని ఇతర జట్లన్నిటిని ఓడించాలనేది ప్రతి జట్టు యొక్క ముఖ్య లక్ష్యమై ఉంటుంది.

ఇలా ఆటల పోటీల్లో పాల్గొనే జట్ల లాగానే, ‘‘మనం ఇతర సంఘాలను మించిపోవాల్సిందే!’’ అని తమ విషయమై ఆలోచించే సంఘాలు ఏవైనా ఉన్నాయా అని నేను ఆలోచిస్తున్నాను. ‘మా జట్టే (సంఘమే) ఉత్తమమైన జట్టు (సంఘం)’ అనే మనస్తత్వాన్ని నిర్ధారించడానికి సహాయపడు కొన్ని ప్రశ్నలడుగాలని ఆశిస్తున్నాను:

–  మీరు మీ సంఘంలోని నిపుణులైన ఆటగాళ్లను ఇతర సంఘాలకు సంతోషంతో ఇచ్చేస్తుంటారా? 

–  ఉజ్జీవం కొరకు ప్రార్థించిన తరువాత, మీ ప్రక్కన లేదా మీకు దగ్గర్లో ఉన్న సంఘంలో ఉజ్జీవం కలిగినప్పుడు మీరు సంతోషిస్తారా? 

–  మీ ప్రక్కన లేదా మీకు సమీపంలో ఉన్న సంఘం కొరకు, మీ పట్టణంలోని ఇతర సంఘాల కొరకు మీరు క్రమం తప్పక ప్రార్థిస్తున్నారా? 

–  మీ పట్టణం, దేశంలో లేదా విదేశాల్లోని పాత సంఘాలను బలపర్చడానికి లేదా క్రొత్త సంఘాలను కట్టడానికి మీ సంఘ రాబడిలో నుండి ఏమైనా ఇస్తున్నారా? 

చాలా సార్లు, సువార్త ప్రకటించే సంఘాల మధ్య వింతైన పోటీతత్వం ఉంటుంది. గాని, యేసు సెలవిచ్చిన గొప్ప ఆదేశాన్ని పాటించే సంఘం, సువార్త ప్రకటించే ఇతర సంఘాలతో పోటీ పడదు, ఎందుకంటె సువార్త ప్రకటించే ప్రతి సంఘం ఒకే జట్టు కొరకు ఆట ఆడుతున్నదని దానికి తెలుసు.  

గొప్ప ఆదేశాన్ని పాటించే సంఘం = సంఘాలను స్థాపించే సంఘం 

గొప్ప ఆదేశాన్ని పాటించే సంఘం సువార్త ప్రకటిస్తుంది, శిష్యులనుగా చేస్తుంది, అదే సమయంలో అది సంఘాలను స్థాపిస్తుంది, సంఘాలను బలపరుస్తుంది. దేవుని రాజ్యం తన సొంత పరిచర్య ద్వారా విస్తరించాలని అది ఆశిస్తుంది, అదే సమయంలో దేవుని రాజ్యం ఇతర సంఘాల ద్వారా విస్తరించాలని కూడ కోరుకుంటుంది. 

కాబట్టి, గొప్ప ఆదేశాన్ని అనుసరించే సంఘం, బయట ఉన్న ప్రజలను చేర్చుకోడానికి సువార్త ప్రకటన ఎంతో ఎక్కువగా చేస్తూ ఆ విషయంలో ఆసక్తి చూపుతుంది. అదే సమయంలో, దాని ప్రయాసమంతా స్థానికంగా సంఘాలను స్థాపించుటలో లేదా స్థానికంగా నున్న ఇతర సంఘాలకు మద్దతిచ్చుటలో వెచ్చింపబడాలనే ఆసక్తిని చూపుతుంది. అది తన సొంత ఆరోగ్యంతో తృప్తిచెందక, ఇతర సంఘాలన్నీ కూడ ఎంతో ఆరోగ్యవంతంగా ఉండాలని, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నవిగాను, సువార్త ప్రకటించే సమాజాలుగాను ఉండాలని కోరుకుంటుంది.

ఇలాంటి సంఘం సువార్త ప్రకటించే ఇతర సంఘాలను ప్రోత్సహిస్తూ, అవి చాలా దూరంలో ఉన్నప్పటికిని వాటిని స్థాపిస్తుంది. వాటి గూర్చి పేరు పేరున ప్రార్థిస్తుంది. ఇతర సంఘాలకు సహాయపడగల వ్యక్తులను పంపడానికి కూడ ఇష్టపడుతుంది. ప్రపంచంలోని ఇతర చోట్ల కూడ సంఘాలు స్థాపించడానికి లేదా ఇతర సంఘాలను బలపర్చడానికి ప్రయాసపడుతుంది.

గొప్ప ఆదేశాన్ని పాటించే సంఘం, సంఘకాపరులుగా ఉండే అర్హత గల పురుషులని బలపరుస్తూ, ప్రార్థిస్తూ, వారికి శిక్షణనిస్తూ, నిస్వార్థంగా అవసరమున్న ఇతర చోట్లకు పంపుతుంది.

ఈ సంఘం తన ఆదాయాన్ని గొప్ప ఆదేశాన్ని అమలు చేసే విషయాలపై ఖర్చు చేయడానికి ప్రాధాన్యతనిస్తుంది. కొంత డబ్బును తన సొంత సంఘం కొరకు ఉంచుకున్నప్పటికిని, దగ్గర్లోనైతేనేమి దూరంలోనైతేనేమి చేయబడుతున్న ఇతర పనుల కొరకు కేటాయిస్తుంది. 

ఈ సంఘం, అంతరించిపోతున్న సంఘాలను, వీలైన చోటెల్లా, పున:స్థాపించడానికి సకల ప్రయత్నాలు చేస్తుంది.

ఈ సంఘం దాని సొంత సభ్యులకు సంబంధించిన సువార్త కేంద్రీకృతమైయున్న సంఘాలతో కలిసి, ‘సమిష్టి కృషి’ మనస్తత్వమును పెంపొందించడానికి అన్ని రకాలైన బహిరంగ మరియు సొంతమైన లేదా వ్యక్తిగతమైన విధానాల్లో పనిచేస్తుంటుంది. సువార్త ప్రకటించే ఒక క్రొత్త సంఘం విషయంలో ఈ సంఘ సభ్యులు & నాయకులు, కరవు ప్రాంతంలో ఒక అల్పాహార శాల క్రొత్తగా తెరువబడినంతగా సంతోషిస్తారు.

అలాగైతే, గొప్ప ఆదేశాన్ని పాటించే సంఘం ఏంచేస్తుంది? వ్యూహాత్మకమైన నాలుగు అభివృద్ధి చర్యలను ప్రతిపాదించాలని ఆశిస్తున్నాను.

శిష్యులనుగా చేసే సంస్కృతిని పెంపొందిస్తుంది 

మొదటిది, గొప్ప ఆదేశాన్ని పాటించే సంఘం తన సభ్యులను శిష్యులనుగా చేసే సంస్కృతిని పెంపొందిస్తుంది. ఇతర విశ్వాసులు విశ్వాసములో ఎదుగునట్లు సహాయపడే బాధ్యతను ప్రతి సభ్యుడు వహించునట్లు సహాయం చేస్తుంది. పాస్టర్లు పరిశుద్ధులను పరిచర్య కోసం సన్నద్ధం చేస్తుంటారని పౌలు చెప్పుతున్నాడు (ఎఫెసీ 4:11-12), అనగా పరిచర్య పనులు పరిశుద్ధులందరు చేయాల్సిందేనని చెప్తున్నాడు. సంఘమంతా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ప్రతి అవయవము తన పని తాను చేయుచుండగా, తనను తాను బలపర్చుకుంటూ ఎదుగుతుంది (ఎఫెసీ 4:15-16; చూడుము, 1 కొరింథీ 12,14).

నేను యేసును వెంబడించుట – శిష్యత్వం. మరొకరు యేసును వెంబడించునట్లు నేను సహాయం చేయడం – శిష్యులనుగా చేయుట (ఉదా॥ 2 తిమోతి 2:2). గొప్ప ఆదేశాన్ని పాటించే సంఘంలో, విశ్వాసంలో పెద్దవారైన పురుషులు యౌవనస్థులను శిష్యులనుగా చేస్తుంటారు, యౌవనస్థురాండ్రు పెద్దవారైన స్త్రీలచే శిష్యులనుగా చేయబడుతుంటారు. ఉదా॥ నీవు వివాహంకాని స్త్రీవైనట్లయితే, మీ సంఘంలో ఇంట్లోనే ఉంటూ పనులు చేసుకొనే ఒక గృహిణికి ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నప్పుడు, ఆమెను ఎన్ని ప్రశ్నలైనా అడుగడానికి నీకు సమయం దొరుకునట్లు నీవు ప్లాన్ చేసుకోవచ్చు. నీవు ఉద్యోగం చేస్తూ కాపరత్వం చేస్తున్న పాస్టర్వయితే, బైబిల్ స్టడీని జరిపించడానికి ఒక జూనియర్‌ టీచర్‌ సహాయాన్ని నీవు తీసికోవచ్చు. ఎందుకంటే అతనికి శిక్షణ నిచ్చి, బైబిల్ స్టడీని జరిపించే పని అతనికి అప్పగించాలనేది నీ గురి. అప్పుడు నీవు మరొక చోటికి వెళ్లి, బైబిల్ స్టడీని ఆరంభించి మరొక జూనియర్‌ టీచర్‌కు శిక్షణ నివ్వవచ్చు.

గొప్ప ఆదేశాన్ని పాటించే సంఘం, యేసు ‘‘వెళ్లుడి’’ అని సెలవిచ్చిన ఆజ్ఞానుసారంగా ఉంటుంది. ఈ ఆజ్ఞ మన భౌగోళిక పరిస్థితుల్ని మార్చేదిగా చెప్పవచ్చు. కాబట్టి, ఇంట్లోనే ఉండేవారి విషయంలో, ‘‘వెళ్లడం” అంటే, సంఘానికి లేదా సంఘ సభ్యుల దగ్గరకు వెళ్లడమని అర్థం. ఈ విధంగా, వెళ్లడం ద్వారా వారమంతా ఇతరులకు పరిచర్య చేయడం సులభమవుతుంది. నీవు ఎక్కడ నివసిస్తున్నావు? నీవుంటున్న ఇంటికి సమీపంలో ఉన్నవారిని శిష్యులనుగా చేసే సంస్కృతిని మీ సంఘంలో పెంపొందించుకొనునట్లు నీవు మీ సంఘానికి దగ్గర్లో ఇంటిని కొనుగోలు చేయడానికి (రెంట్ తీసుకోవడానికి) ఇష్టపడుతున్నావా?  

గొప్ప ఆదేశాన్ని పాటించే సంఘం, నామకార్థ క్రైస్తవునికి అసౌకర్యమును కలిగించేదిగా ఉండాలి, యింకా చెప్పాలంటే, రెచ్చగొట్టేలా ఉండాలి. ఆదివారంనాటి సంఘారాధనకు, ఏదో మతపరమైన విధిలా వెళ్లొద్దామన్నట్టుగా ఒక అతిథి వచ్చినట్లు వచ్చి వెళ్లిపోతున్నట్లయితే, దీనిని నీవు ఎక్కువగా ఇష్టపడకపోవచ్చు. నీ సంఘసభ్యులు నీవు చెప్పేది జరగాలనుకునేది చేయడానికి వారు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే వారు యేసును వెంబడించడానికి తమ జీవితమంతటిని అప్పగించుకొనగోరుతున్నవారై యున్నారు, గనుక వారందరు యేసును వెంబడించునట్లు ఇతరులకు సహాయం చేయడానికి సమర్పించుకున్నారు. ప్రశ్నలు, అర్థవంతమైన సంభాషణలు, ప్రార్థన మరియు సువార్త గూర్చి ఎడతెగకుండా జ్ఞాపకం చేయుట మొ॥ వారి సంఘ సంస్కృతిలో భాగమై యున్నవి. 

సువార్త ప్రకటించే  సంస్కృతిని పెంపొందిస్తుంది 

రెండవదిగా, గొప్ప ఆదేశాన్ని పాటించే సంఘం సువార్త ప్రకటించే సంస్కృతిని పెంపొందిస్తుంది. ఒక ప్రక్క, ప్రతి వారం కూడికలో సువార్త బోధింపబడుతుందనే విషయం సభ్యులందరికీ తెలుసు. కాబట్టి వారు తమ క్రైస్తవేతర స్నేహితులను ఆహ్వానించడానికి ఉత్సాహవంతులవుతారు. ఈ కూడిక సమయంలో పాడబడే పాటల ద్వారా, చేయబడే ప్రార్థనల ద్వారా, మరియు బోధింపబడే ప్రతి సందేశం ద్వారా సువార్త అర్థమవుతుంది.

నీవు మీ సంఘానికి ఆహ్వానించే లేదా తీసికొనివచ్చే ఏ క్రైస్తవేతరుడైనా సువార్త వింటాడనే నమ్మకం నీకున్నదా? లేనట్లయితే, దీని గూర్చి నీవేం చేయగలవు?

మరొక ప్రక్క, గొప్ప ఆదేశాన్ని పాటించే సంఘం దాని సభ్యులకు సువార్త ప్రకటించడంలో శిక్షణనిస్తుంది, ఎందుకంటే వారు వారమంతటిలో చాలా మంది క్రైస్తవేతరులని చూస్తారు. గనుక సువార్త ప్రకటనలో ‘‘విజయం’’ అనేది మామూలుగా మీ క్రైస్తవేతర స్నేహితులు సువార్త వినునట్లు వారిని చర్చ్ హాల్ కి తీసుకరావడం కాదు. విజయమనేది మీ క్రైస్తవేతర పొరుగువారితోను స్నేహితులతోను మీరు సువార్తను పంచుకొనుటయే.

కాబట్టి తన సభ్యులు సువార్తను ఇతరులతో ఎలా పంచుకోవాలో వారికి తెలియునట్లు ఈ సంఘం తన సభ్యులను సువార్త ప్రకటించే పనిలో వారిని సన్నద్ధం చేయడానికి ప్రయాసపడుతుంది. నా సొంత సంఘం సువార్త ప్రకటనకు అంకితమైయున్న బైబిల్ స్టడీలు జరిపించుట ద్వారా ఈ పని చేస్తుంది. క్రైస్తవేతరులతో సువార్త పంచుకొనే మాదిరిని, పద్ధతిని, నమూనాను నేను బోధించేటప్పుడు (విడమర్చి బోధించడానికి, అలాగే ఆచరణాత్మకంగా చూపించడానికి) నేను ప్రయత్నిస్తుంటాను. వివిధ సువార్త ప్రకటన పరికరాలను లేదా దృశ్య సాధనములను మా సంఘ సభ్యులకు ఇవ్వడం ద్వారా వారిని సన్నద్ధం చేయడానికి మేము ప్రయత్నిస్తుంటాము. మా సభ్యులు వారి క్రైస్తవేతర స్నేహితులకివ్వగలుగునట్లు సువార్త కరపత్రాలను వారికి ఇస్తాము. సువార్త ప్రకటించుటకుగల అవకాశాల గూర్చి మేము ఆదివారం సాయంకాలం జరిపించే కూడికలో తెలియజేస్తుంటాము. ఇతర సభ్యులకు లభిస్తున్న సువార్త ప్రకటన అవకాశాల గూర్చి వినడము మరియు వారి కొరకు ప్రార్థించడము వలన ప్రతి ఒక్కరు ఈ సువర్తమానమును సొంతగా ప్రకటించుటకు కూడ వారు ప్రోత్సహింపబడుతున్నారు. 

గొప్ప ఆదేశం మీకేమి భోదిస్తుంది? మీరు శిష్యులనుగా చేసేవారిగా యుండాలని అది నీకు పిలుపునిస్తున్నది. నీవు అవిశ్వాసులకు సువార్త ప్రకటిస్తూ, విశ్వాసులను శిష్యులనుగా చేయాలన్న ఈ రెండు పనులకై  నీకు పిలుపునిస్తున్నది. ఈ రెండు పనులను నీవు వ్యక్తిగతంగా చేస్తూ ఉండాలి – ఇంట్లో, పొరుగువారు, పని చేసే చోట, స్నేహితుల మధ్య చేస్తుండాలి. నీవు ఈ పనిని మీ సంఘంలోను, సంఘం ద్వారాను చేస్తుండాలి.

కాబట్టి, మీ సంఘ సభ్యుల సహాయాన్ని తీసుకో. సంఘ పెద్దలలో ఒకరిని మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించి, సలహా తీసుకో. మీ చిన్న గుంపుతో ఈ భారాన్ని పంచుకొని దాని గూర్చి ప్రార్థించు. నీ స్నేహితులతో కలిసి, వెళ్లి సువార్త ప్రకటించు.

మిషన్స్‌ (పరిచర్య సంస్థలు) ద్వారా సువార్త అందనివారికి అందించుము 

మూడవదిగా, గొప్ప ఆదేశాన్ని పాటించే సంఘం, సువార్త అందని వారికి సువార్తనందించుటకు మిషన్స్‌ ద్వారా పనిచేస్తుంది. మిషన్స్‌, సువార్త ప్రకటన మరియు సంఘ స్థాపన – వీటి మధ్య తేడా ఏంటి? మిషన్స్‌ అంటే, జాతిపరమైన, సంస్కృతిపరమైన, మరియు సాధారణంగా జాతీయపరమైన సరిహద్దుల్లోనికి వెళ్లి సువార్త ప్రకటిస్తూ, సంఘాలను స్థాపించు సంస్థలని చెప్పుకొనవచ్చు.

‘‘మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడని’’ యేసు మనకు ఆజ్ఞాపించాడు. ఈ అంశం గూర్చి నేను ఎక్కువగా చెప్పట్లేదు ఎందుకంటె ఈ అంశం అనేక పుస్తకాల్లో చక్కగా వ్రాయబడి యున్నది. కాని ప్రతి సంఘం ఈ ఆదేశాన్ని ఎంత వరకు పాటిస్తుందో, ఇంతవరకును సువార్త వినని వారికి – ప్రజలు, దేశాలు మొ॥ వారికి – సువార్త ప్రకటించాలని తనను తాను ఎందుకు సమర్పించుకోవడం లేదో తెలిసికొనడం కష్టంగా ఉన్నది.

ఏ ఒక్క సంఘ సమాజమైనా ప్రపంచమంతా సువార్త ప్రకటించాలని గురిపెట్టుకొనలేదు. కాబట్టి ప్రతి సంఘం తన సొంతగా, కొన్ని స్థలాల్లో మిషన్స్‌ చేస్తూ, సువార్త ప్రకటిస్తూ, సంఘాలను స్థాపించడం వివేకవంతమైనదని నేను భావిస్తున్నాను. ఉదా॥ నా సొంత సంఘం, ‘10/40 విండో’ (ఉత్తర భూమధ్య రేఖకు 10 మరియు తూర్పు అర్ధగోళంలోని 40 డిగ్రీల మధ్యగల ప్రాంతం) అని పిలువబడుతున్న అనేక దేశాలపై తన దృష్టిని కేంద్రీకరించుచున్నది. ఇది ప్రపంచంలో చాలా కొద్ది మంది క్రైస్తవులున్న ప్రదేశం.

నీవు మా సంఘ సభ్యుడవైతే, ఇలాంటి మిషన్స్‌లో పరిచర్య చేయాలని ఆసక్తిగలవారైతే, మేమిదివరకే పరిచర్య చేపట్టిన ఏదైన ఒక చోటికి నీవు వెళ్లినట్లయితే, మేము నీకు మా శాయశక్తులా సహాయం చేస్తాము. వంద మంది మిషనరీలను వంద స్థలాలకు మేము పంపలేకపోతున్నాము. ఈ కారణాన్నిబట్టి, అనేక మంది మిషనరీలను కొంచెం డబ్బుతో పోషించడము కంటె కొంత మంది మిషనరీలను ఎక్కువ డబ్బుతో పోషించుటకు మేము ఇష్టపడుతున్నాము. ఇలా చేసినప్పుడు, ఈ మిషనరీలు సంఘ స్థాపన పనుల్లో ఎక్కువ సమయాన్ని, నిధుల సేకరణలో తక్కువ సమయాన్ని గడుపుటకు వీలవుతుంది. ఇంతేగాక, మేము వారితో సత్సంబంధము కలిగి వారిని జవాబుదారులనుగా చేయగలుగుతున్నాము.

మా సంఘం మిషనరీలతో నేరుగా పనిచేస్తుంటుంది. సదర్న్‌ బాప్టిస్ట్‌ కన్వెన్షన్‌ ఇంటర్‌నేషనల్‌ బోర్డ్‌, యాక్సెస్‌ పార్ట్నర్స్‌ వంటి అద్భుతకరమైన మిషన్ ఆర్గనైజేషన్లతో కూడ మేము కలిసి పనిచేస్తున్నాము. ఈ సంస్థవారు వ్యాపారస్తులకు ప్రపంచంలోని వ్యూహాత్మకమైన స్థలాల్లో వారి వ్యాపారాలను సాగించడానికి సహాయపడుతుంది. అప్పుడు, ఈ వ్యాపారస్తులు అక్కడ పనిచేసే మిషనరీలకు చాలా కాలం వరకు ఆర్దిక సహాయాన్ని అందించగలరు.

సువార్త అందనివారికి సువార్తనందించడానికి మీ సంఘం చేస్తున్న ప్రయత్నంలో, క్రైస్తవుడవైన నీవు వ్యక్తిగతంగా సహాయం చేయడానికి వహించాల్సిన నీ పాత్ర ఏంటి? సంబంధిత మిషనరీల కొరకు ప్రార్థించడమనేది, తప్పనిసరిగా చేయాలి, చేస్తుంటావు. వీలైనప్పుడు వారిని కలిసికొని వారితో పరిచయం ఏర్పరచుకొవాలి. వారు పరిచర్యచేస్తున్న మిషన్ ఫీల్డులని సందర్శించి చేతనైనంత సహాయం చేయవచ్చు. మిషనరీల జీవిత చరిత్రలు చదవండి. మిషనరీగా వెళ్లడం గూర్చి కూడ ఆలోచించండి.

సువార్త అందని వారికి అందించబడునట్లు నీవు మరియు మీ సంఘం చేయగల యింకొక్క చివరి విషయమున్నది: మీరున్నచోటనే ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి వచ్చినవారున్నారేమో చూడండి. మీరు వీరికి సువార్తనందించినట్లయితే, వీరు మరలా తమ స్వస్థలాలకు వెళ్లినప్పుడు వీరు అక్కడ సువార్త చెప్పడానికి సులభమవుతుంది, ఈ విధంగా సువార్త వ్యాపిస్తుంది. 

ఇతర సంఘాలను బలపర్చుము 

మిషన్స్‌ విషయంలో సంఘాలు సామాన్యంగా బడ్జెట్‌ను ఏర్పాటు చేసికొని ఉంటాయి. అనగా, మిషన్స్‌ కొరకు కేటాయించిన మొత్తములోనే, ‘‘ఆరోగ్యవంతమైన సంఘములను పోషించే’’ బడ్జెట్‌ కూడ కలిగియుండుట మంచిదే. ఇతర సంఘాలను బలపర్చే పనులు చేయడమనేది గొప్ప ఆదేశాన్ని అనుసరించే సంఘాల నాలుగవ అభ్యాసమై యున్నది.

నా సొంత సంఘం మా ‘కాపరత్వ శిక్షణ కార్యక్రమము’ వంటి అనేక విషయాలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ ‘ప్రత్యేక బడ్జెట్‌’ విధానాన్ని ఉపయోగిస్తుంది. మా వద్ద ఈ శిక్షణను ఒక సంవత్సరంపాటు పొందే పన్నెండుగురికి మేము ఖర్చుచేస్తాము. వీరిలో అనేకులు మానేస్తారు లేదా ఇతర సంఘాల్లో కాపరులుగా పరిచర్య చేస్తారు. 

ఇదే విధానం ప్రకారం మేము 9మార్క్స్‌ పరిచర్యను కూడ పోషిస్తాము, ఈ పరిచర్య ఆరోగ్యవంతమైన సంఘాలను కట్టు పరిచర్యగా అంకితమై యున్నది.

మా దగ్గర పనిచేసేవారు శిక్షణ పొంది ఆ తరువాత ఇతర చోట్లకు పంపబడే రీతిగా ఆ శిక్షణను డిజైన్ చేస్తాము. పాస్టర్ అసిస్టెంట్ గా పనిచేసేవారు 2 లేదా 3 సంవత్సరాలు తరువాత, వారు ఇతర స్థలాలకు వెళ్లిపోవలసిందే. అసోసియేట్ పాస్టర్ గా పనిచేసేవారు 3 లేదా 5 సంవత్సరాలు చేసిన తరువాత వెళ్లిపోతారు. నేను మరియు నా సహకాపరులు మాత్రమే ఎక్కువ కాలం నిలిచియుంటాము. మిగిలిన వారందరినీ మేము ‘ఇతర స్థలాలకు వెళ్లునట్లు’ సిద్ధపరుస్తాము.

మా సంఘం కాన్ఫరెన్స్లకి అయ్యే ఖర్చులు భరిస్తుంది. ఈ సమావేశాల్లో ముందుగానే ఏర్పాటుచేయబడిన కూడికలకు మరియు వేర్వేరు ప్రత్యేక ఉపన్యాసాల సమయాలు మరియు ప్రశ్నోత్తర సమయాల కూడికలకు ప్రపంచ నలుమూలల నుండి వచ్చే కాపరులు మాతో క్రమం తప్పక కలుసుకుంటారు. ఇవే ఉద్దేశాలతో వారానికొకసారి ప్రపంచ నలుమూలల్లోని కాపరులతో సంభాషణల్లో కూడ నేను పాల్గొంటుంటాను. ఈ సంభాషణలు, ప్రతి ఒక్కటి, నేను వారితో కలిసి ప్రార్థించుటకు ప్రపంచమందంతట ఆరోగ్యవంతమైన సంఘాలుండునట్లు పనిచేయడానికి నాకొక తరుణం దొరకుతుంది.

సంఘాలను స్థాపించుట మరియు సంఘాలను పునరుద్ధరించుట ద్వారా ఇతర సంఘాలను బలపర్చునట్లు మేము చేసే అధిక శాతం పనులు మా సొంత ప్రాంతంలో చేయబడుతున్నాయి. గాని సంఘాలను స్థాపిస్తూ మరియు సంఘాలను పునరుద్ధరించే పనులు ప్రపంచమందంతట కూడ కొంత మేరకు చేస్తుంటాము. ఉదా॥ మేము దుబాయ్‌లోని సంఘానికి జాన్‌ అనే సహోదరున్ని పది సంవత్సరాల క్రితం పంపించాము. ఆ అంతర్జాతీయ సంఘాన్ని పునరుద్ధరించడానికి జాన్‌ను దేవుడు శక్తిమంతమైన రీతుల్లో వాడుకున్నాడు. జాన్‌ అక్కడికి రాడానికి సహాయపడిన సంఘ కాపరులలో కీలకమైన వ్యక్తి ఒకరు, నా పాత స్నేహితుడు మ్యాక్‌. వీరిద్దరు కలిసి ఆ సంఘాన్ని ఆరోగ్యవంతమైన స్థాయికి నడిపించిన తరువాత, మ్యాక్‌, మరొక సహోదరుడు డేవ్‌, ఆ సంఘాన్ని వదిలిపెట్టి 30 నిమిషాల ప్రయాణమంత దూరంలో మరొక సంఘాన్ని స్థాపించడానికి వెళ్లారు. క్రొత్తగా చేపట్టబడిన ఈ పరిచర్యలో మ్యాక్‌ మరియు డేవ్‌కు సహాయకరంగా ఉండుటకు మేము మాజీ కాపరత్వ సహాయకున్ని మరియు ఇదివరకు మా దగ్గర శిక్షణ పొందిన మరొకరిని పంపించాము. అప్పుడే, యుఎఈలోని మరొక చోట సంఘ స్థాపన నిమిత్తము మా దగ్గర శిక్షణ పొందిన మరొకరిని పంపించాము.

ఇప్పుడక్కడ ఆరోగ్యవంతమైన మూడు సంఘాలు స్థాపింపబడి, తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వీటిలో ఏ ఒక్కదాని విషయమైనను మేము పెద్ద ప్రణాళికలేవీ ఏర్పాటుచేసుకోలేదు. వాస్తవానికి, పునరుద్ధరించాలనే ప్రణాళికలు మా చేత మొదలుపెట్టబడలేదు. మేము కేవలము ప్రార్థించడానికి, సహాయం చేయడానికి, చేయగలిగిన ఆర్ధిక మరియు మానవ మద్ధతునివ్వడానికి మాత్రమే అందుబాటులో ఉంటిమి. అన్నట్టు, మా సభ్యుల్లో అనేకులు యుఎఈలోనే ఉద్యోగాలు సంపాదించుకున్నారు, ఈ సంఘాలు చక్కగా పనిచేయుచుండునట్లు సహాయపడుతున్నారు. దీని వలన దేవుని రాజ్యం విదేశంలో విస్తరిస్తుందని సంతోషించడం తప్ప, మా సంఘానికి కలిగే ప్రయోజనం మరొకటేమీ లేదు.

ఈ ఉదాహరణలలో ఎక్కువగా ఒక కాపరిగా నేను నా దృష్టిని నిమగ్నం చేసిన పనులు తెలుపుతున్నాయి. గాని ఇతర సంఘాలను బలపర్చడానికి, అది నీవుంటున్న స్థలంలో కావచ్చు లేదా ప్రపంచమందంతట కావచ్చు, మామూలుగా సంఘంలో ఒక సభ్యుడవైయున్న నీవు ఏంచేయగలవు? స్పష్టంగా తెలుస్తున్నదేమంటే, ఇతర పనుల కోసం నీవు వ్యక్తిగతంగా ప్రార్థించవచ్చు. ఇదే విషయం గూర్చి మీ కుటుంబంతో కలిసి భోజన సమయంలో లేదా ఇతర సమయంలో కూడ ప్రార్థించవచ్చు. నీ వంతుకు నీవు ఇతర పనుల కొరకు ఆర్ధిక సహాయాన్ని కూడ అందించవచ్చు.

ఖచ్చితంగా, ఇతర సంఘాలను విమర్శించే విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. ఔను, మీ సంఘ పద్ధతులు లేదా సిద్ధాంతాలు ఇతర సంఘాల పద్ధతులు మరియు సిద్ధాంతాలకు భిన్నంగా ఉండొచ్చు. ఈ విషయాల్లో మనం ఏకీభవించకపోడానికి ఎన్నో కారణాలుంటాయి. ఈ భేదాభిప్రాయాలను నీవు ఎంత మాత్రమును పట్టించుకొనవద్దని నేను చెప్పడం లేదు. గాని ఒక విషయం మాత్రం మనస్సులో ఉంచుకో. ఏంటంటే, ఇతర సంఘాలతో మీరు ఏకీభవించని విషయాలు, ఎన్నటికినీ, మనమందరము సువార్తను పంచుకొనవలసిన దానంత ముఖ్యమేమీ కావు. సువార్త ప్రకటింపబడుట ప్రాముఖ్యమైనది. కాబట్టి విమర్శనకు తావిచ్చే మనస్సుకి చోటివ్వకుండా, ఇతరులతో భాగస్వాములముగా సువార్తను పంచుకొంటూ సంతోషించగల మార్గాల కొరకు వెదకాలి.

మార్క్‌ డెవర్‌

మార్క్‌ డెవర్‌

మార్క్‌ డెవర్‌ వాషింగ్టన్ D. C.లోని కాపిటల్ హిల్ బాప్టిస్ట్ చర్చి యొక్క సీనియర్ పాస్టర్ మరియు 9మార్క్స్ అధ్యక్షుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...