దేవుణ్ణి ఎలా ఘనపరచాలి?

దేవుణ్ణి ఎలా ఘనపరచాలి?

షేర్ చెయ్యండి:

“కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను”. (కీర్తన 69:30)

పెద్దవిగా చేసి చూడటంలో రెండు విధాలున్నాయి, వాటిలో ఒకటి, మైక్రోస్కోపులో చూడటం, రెండవది టెలిస్కోపులో చూడటం. అందులో మొదటిది చిన్నవాటిని పెద్దవిగా చూడటం, అంటే అవి కలిగియున్న దానికంటే పెద్దవిగా చూడటం. రెండవదేమో, పెద్దవైన వాటిని అనగా అవి వాస్తవానికి ఎంత పెద్దవో అంతే పరిమాణంలో కనబడేలా చూడటం.

“కృతజ్ఞతా స్తుతులతో నేనాయనను ఘనపరచెదను” అని దావీదు చెప్పినప్పుడు, “చిన్న దేవుణ్ణి ఆయన ఉండేదానికంటే పెద్దవాడిగా చూపిస్తాను” అని చెప్పడం లేదు గాని “దేవుడు ఎంత పెద్దవాడిగా ఉన్నాడో అంతే పెద్ద వాడిగా ఆయనను చూపిస్తాను” అని ఆయన చెప్తున్నాడు.

మనం మైక్రోస్కోపులుగా (సూక్ష్మదర్శినిలుగా) పిలువబడలేదు గాని మనం టెలిస్కోపులుగా (దూరదర్శినిలుగా) పిలువబడ్డాం. మంచి వస్తువుకు పోటీగా తక్కువ క్వాలిటి ఉన్నటువంటి వస్తువును అమ్మేవారిలాగ క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ఎక్కువ చేసి చెప్పకూడదు, లేదా తప్పుగా అభివర్ణించకూడదు. దేవునికంటే గొప్పవారు ఎవరూ లేరు, ఏదీ ఉండదు. ఆయన నిజంగా ఎంత గొప్పవాడో ఇతరులకు అర్థమయ్యేలా చేయడమే మన పిలుపు.

ఇందుకోసమే మనం ఉనికిలో ఉన్నాం, ఇందుచేతనే మనం రక్షించబడ్డాం, అందుకే 1 పేతురు 2:9లో, “అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు” అని పేతురు చెప్తున్నాడు.

క్రైస్తవునికున్న పూర్తి కర్తవ్యాన్ని సారాంశంగా ఈ విధంగా చెప్పవచ్చు: దేవుడు నిజంగా ఎంత గొప్పవాడిగా ఉన్నాడో ఆయనను అంత గొప్పగా అనుభవించండి, ఆయనను గురించి అంత గొప్పగా ఆలోచించండి మరియు ఆయననుబట్టి అంత గొప్పగా వ్యవహరించండి. దేవుని మహిమతో కూడిన అనంత నక్షత్ర సంపదతో కూడిన ప్రపంచం కోసం టెలిస్కోప్ గా (దూరదర్శినిగా) ఉండండి.

ఒక క్రైస్తవుడు దేవుణ్ణి ఘనపరచడమంటే ఇదే. అయితే, మీరు చూడనిదాన్ని లేదా మీరు త్వరగా మర్చిపోయేదాన్ని మీరు పెద్దదిగా చూపించలేరు. 

కాబట్టి, దేవుణ్ణి చూడడం, ఆయన గొప్పతనాన్ని మరియు మంచితనాన్ని గుర్తుపెట్టుకోవడం అన్నది మన ప్రథమ కర్తవ్యం. అందుకని, “నా హృదయపు కన్నులను తెరువుము!” (ఎఫెసీ 1:18) అని దేవునికి ప్రార్థించాలి మరియు “ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము” (కీర్తన.103:2) అని మన ఆత్మలకు బోధించుకోవాలి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...