నరకం, సువార్తలో ఎందుకు అంతర్భాగమై యున్నది

నరకం, సువార్తలో ఎందుకు అంతర్భాగమై యున్నది

షేర్ చెయ్యండి:

కొందరి విషయంలో, నరకం గూర్చిన క్రైస్తవ సిద్ధాంతం కలిగించే భయం, వారు తమ దృష్టిని మనస్సును దాని నుండి మళ్లించడమేగాక, అసలు నరకమనేది లేదన్నట్లు చేస్తుంది. ఆ భయమెందుకంటే, అక్కడ దేవుని శత్రువులు వారికి తెలిసేట్టుగా హింసింపబడుతూ శాశ్వతంగా శిక్షించబడుతుంటారు. కొందరేమో ‘‘దేవుడు ప్రేమగలవాడు కాబట్టి నరకమనే స్థలమొకటి నిజంగా ఉండాలని ఎన్నడూ కోరడు. కాబట్టి అది భయంతో మనుష్యులను అణగద్రొక్కడానికి కల్పించి చెప్పబడుతున్న కథనే’’ అని అంటారు. ఖచ్చితంగా, ఈ వాదం వెనకాల భావోద్రేకంతో కూడిన బలమున్నది. ఏ ఒక్కరైనా, అందులోనూ ఖచ్చితంగా ఏ క్రైస్తవుడైనా, నరకం గూర్చిన ఆలోచననుగాని, అభిప్రాయాన్నిగాని ఇష్టపడడు.

అదే సమయంలో, ఈ సిద్ధాంతం క్రైస్తవ దృక్పథానికి ఒక అదనపు విషయంగా తగిలించింది కాదు. ఇది క్రైస్తవ విశ్వాసంలో ప్రాముఖ్యత కల్గిన సిద్దాంతం. ఇది నమ్మాలని మనకు నేర్పించబడింది కాబట్టి మనము నమ్ముతున్న ఇబ్బందికరమైన, అనవసరమైన విషయం అంతకన్నా కాదు.

నరకం గూర్చిన సిద్ధాంతం మరియు వాస్తవికత, సువార్త యొక్క మహిమ మరియు గొప్పతనం మనకు తెలియజేయడమే కాదు కానీ, తీవ్రమైన ఉపశమనం కూడా కలిగిస్తున్నాయి. దేవుడు నిజంగా ఎంత గొప్పవాడై యున్నాడో, మనం నిజముగా ఎంతటి దౌర్భాగ్యులమైన పాపులమైయున్నామో  తెలియజేస్తుంది. అంతే కాక, ఆయన మన పట్ల తన కృపను చూపించడమనేదే ఎంత ఆశ్చర్యకరమైనదై యున్నదో, మనము అర్థం చేసికోవడానికి అది మనకు సహాయపడుతుంది. ఇంతేగాక, నరకం గూర్చిన వాస్తవికతను మనము మన మనస్సుల్లో ఉంచుకుంటే, అది మన దృష్టిని, అన్నిటిని మించి, నరక యాతనను శాశ్వతంగా అనుభవించే ప్రమాదంలో ఉన్నవారికి సువార్త ప్రకటించుటపై నిలిపేలా చేస్తుంది.

ఈ వాస్తవాన్ని మనస్సులో పెట్టుకొని, నరకాన్ని గరించి బైబిలు చెప్పుతున్న ఐదు విషయాలు ఇక్కడ ఆలోచిద్దాం. వీటన్నిటిని సరిగ్గా అర్దం చేసుకున్నట్లయితే, నరకం సువార్తలో ఎందుకు అంతర్భాగమై యున్నదో అర్థమవుతుంది.

నరకం సువార్తలో ఎందుకు అంతర్భాగమై యున్నది?

1. నరకమనే నిజమైన స్థలం ఉన్నదని బైబిలు బోధిస్తుంది.

ఈ విషయాన్ని మరీ ఎక్కువ లోతుగా వివరించను. ఎందుకంటె, ఈ విషయాన్ని ఇంతకుముందే చాలామంది స్పష్టంగా చెప్పారు. మధ్యయుగం నాటి బిషప్పులు వారి పనివారిని లేదా నూతన విశ్వాసులను భయపెట్టడానికి నరకం గూర్చిన సిద్ధాంతాన్ని కొత్తగా కనిపెట్టలేదని మనం అర్ధం చేసుకోవాలి. ఈ విషయం వారు అపొస్తలుల నుండి నేర్చుకున్నారు. మరియు, అన్యమతస్థులను భయపెట్టాలని అపొస్తలులు దీన్ని కొత్తగా కనిపెట్టలేదు, ఈ విషయాన్ని వారికి యేసయ్య బోధించాడు. ఇది ఇలా ఉండగా, పరిసయ్యులను భయపెట్టాలని దీనిని యేసయ్య జొరాస్ట్రియన్ అనే ఒక మతం నుండి అరువుగా తెచ్చుకోలేదు; ఆయన దేవుడై ఉన్నాడు, కాబట్టి నరకం నిజమని ఆయనకు తెలుసు, అందుకే నరకమున్నదని బోధించాడు. ఇంతేగాక, నరకాన్ని గూర్చిన వాస్తవికత అప్పటికే పాత నిబంధనలో బయలుపరచబడింది.

కాబట్టి, మొదటిగా, మనం క్రైస్తవులమని చెప్పుకున్నట్లయితే, బైబిలు దేవుని వాక్యమని నమ్ముతున్నట్లయితే, నరకం యొక్క వాస్తవికతను బైబిలు బోధిస్తుందనే విషయాన్ని మనం గుర్తించాలి.

2. మన పాపం ఎంత ఘోరమైనదో నరకం మనకు చూపిస్తుంది.

మానవులు చేసిన ఏ పాపమైనప్పటికి శాశ్వతకాల నరక యాతనను అనుభవించడం సరియైనది కాదని ఎవరో ఒకరు వాదిస్తుంటే మీరెప్పుడైనా విన్నారా? ఇది ఆసక్తికరమైన వాదమే, కాని ఇది మానవుని హృదయం గురించి ఎన్నో విషయాలు బట్టబయలు చేస్తుంది. మనుష్యులు నరకం గురించి ఆలోచించేటప్పుడు, తప్పంతా వారిది కాదు గాని దేవునిదేనని వారు ఒక తుది నిర్ణయానికి వస్తుంటారు, ఎందుకని? మన హృదయాల పరిస్థితిని నరకం గూర్చిన సిద్ధాంతం బహిరంగం చేయడం మీరు గమనించగలరు. మనం మన పాపం గురించి ఆలోచించినప్పుడు, మొట్టమొదట మనమేంచేస్తామంటే, ‘ఆ, అదేమంత పెద్ద పాపం కాదు’ అనంటాం, అదంతా చెడ్డ పాపమేమీ కాదు, దానికి శిక్షపడాల్సిందేనని దేవుడు చెప్పడం, తప్పు’ అంటూ మన నిరసన తెలుపుతాము.

నరకం గూర్చిన వాస్తవికత, తమను తామే సమర్థించుకుంటున్న వారికి భారీ ఖండనగా నిలుస్తుంది. క్రైస్తవేతరులు నరక భయాలను దేవుడు చేస్తున్న ఒక దోషారోపణగా ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటారు. కాని దేవుడు సంపూర్ణంగా న్యాయవంతుడు సంపూర్ణంగా నీతిమంతుడునై యున్నాడని తెలిసిన క్రైస్తవులముగా, నరకపు భయాలు వాస్తవానికి మన పట్ల మనమే చేస్తున్న దోషారోపణయని మనం అర్థం చేసుకోవాలి. మనం మన పాపాన్ని స్వల్పమైనదిగా చూపించుకోవచ్చు, లేదా మనలను మనం ఏదో ఒక సాకు చెప్పి మన్నించుకోవచ్చు, లేదా మన మనస్సాక్షి నోరు మూయించాలని వాదించడానికి ప్రయత్నించవచ్చు. కాని ఆ పాపములనుబట్టి మనం శాశ్వత నరక యాతనకు యోగ్యులమని దేవుడు తీర్పు తీర్చాడనే వాస్తవం, ఆ పాపాలు ఏమాత్రమును చిన్నవికావని మనకు గుర్తుచేయాలి. ఎందుకంటే ఆ పాపాలు వివరించలేనంత చెడ్డవి కాబట్టి.

3. దేవుడు నిజంగా ఎంత స్థిరమైనవాడో మరియు విమర్శించుటకు వీలులేనంతటి న్యాయవంతుడై యున్నాడో నరకం మనకు చెప్తుంది.

దేవుడొక అవినీతిపరుడైనా న్యాయాధిపతియనీ, ఆయన తప్పులు ఎత్తి చూపే ప్రతివాదిని ఇష్టపడుతాడు కాబట్టే న్యాయాన్ని పక్కనబెడతాడని ప్రజలు అనుకోవాలని చరిత్ర అంతట శోధింపబడుతూనే ఉన్నారు. ఈ వాదన, ‘‘మనమందరము దేవుని పిల్లలమే కదా, అలాంటప్పుడు ఆయన ఇంత భయంకరమైన తీర్పు తన పిల్లల్లో కొందరి విషయంలో ఎలా తీరుస్తాడు?’’ అంటూ  కొనసాగుతుంది. ఈ ప్రశ్నకున్న జవాబు సులభమైనది. అదేంటంటే, దేవుడు అవినీతిపరుడైన న్యాయాధిపతి కాదు. ఆయన పూర్తిగా న్యాయవంతుడు మరియు నీతిమంతుడై యున్నాడు.

ఈ విషయాన్ని బైబిల్ మళ్లీ మళ్లీ చెప్పుతుంది. దేవుడు మోషేకు తననుతాను ప్రత్యక్షపర్చుకున్నప్పుడు, ఆయన కనికరముగలవాడనీ ప్రేమగలవాడనీ వెల్లడిపరచుకున్నాడు. కాని, ‘‘ఆయన దోషులను నిర్దోషులనుగా ఎంచక తప్పక శిక్షిస్తాడని’’ కూడా ఆయన చెప్పాడు. ‘‘నీతిన్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములని’’ కీర్తనకారుడు చెప్పుతున్నాడు. ఆహా, ఎంత ఆశ్చర్యకరమైన సత్యం! దేవుడు, దేవుడైనట్లయితే, ఆయన న్యాయమును పట్టించుకొనక పక్కనబెట్టి, పాపమును దాచిపెట్టడు. ఆయన దానితో నిర్ణయాత్మకంగాను అంటే ఖచ్చితమైన న్యాయంతోను వ్యవహరించాల్సిందే. చివరకు, దేవుడు తీర్పు తీర్చేటప్పుడు, ఏ ఒక్క పాపమైనను దానికి విధించాల్సిన దాని కంటె ఎక్కువ శిక్ష విధింపబడదు. అలాగే, తక్కువ కూడా విధింపబడదు.

ఆ దినాన, దేవుడు తన శత్రువులకు నరక శిక్ష విధించినప్పుడు, ఆయన తీర్పు విమర్శించడానికి వీలులేని విధంగా న్యాయమైనదిగానూ సరైనదిగానూ ఉన్నదని ఈ విశాల విశ్వమంతా గుర్తించి, అంగీకరిస్తుందని బైబిలు బోధిస్తుంది. ‘‘పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నదని’’, యెషయా 5వ అధ్యాయం చాలా స్పష్టంగా చెప్పుతుంది. పాతాళం యెరూషలేము నివాసులను మ్రింగివేయడానికి దాని నోరు తెరవడమనేది ఒక భయంకరమైన దృశ్యం. అయినప్పటికినీ, ‘‘సైన్యములకధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు తన్ను పరిశుద్ధపరచుకొనునని’’ యెషయా ప్రకటిస్తున్నాడు. అదే విధంగా, నరకంలోని యాతనల ద్వారా దేవుడు, ‘‘మహిమపొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల యెడల తన మహిమైశ్వర్యమును చూపుటకు’’ ‘‘తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపించునని’’ రోమా 9:22-24 మనకు తెలియజేస్తున్నాయి.

ఇప్పుడు మనకిది పూర్తిగా అర్థంకాకపోవచ్చు, కాని ఒకానొక దినాన నరకం దానంతట అదే దేవుని మహిమను ప్రకటిస్తుంది. అది, దాని భయంకరమైన స్థితిలో సైతం, కీర్తనకారునితో కూడ చేరి, ‘‘నీతిన్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములని’’ సాక్ష్యమిస్తుంది.

4. సిలువ నిజంగా ఎంత భయంకరంగా ఉండిందో అలాగే దేవుని కృప నిజంగా ఎంత గొప్పదైయున్నదో నరకం మనకు తెలియజేస్తుంది.

దేవుడు ‘‘తన నీతిని కనుపరచవలెనని’’ యేసును ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించాడని రోమా 3వ అధ్యాయం మనకు చెప్తుంది. ఆయన ‘‘పూర్వము చేయబడిన పాపములను తన ఓరిమి వలన ఉపేక్షించినందున’’ ఇలా చేశాడు.

యేసు ఎందుకు సిలువలో మరణించాల్సి వచ్చింది? మనలో ఏ ఒక్కరినైనను నరకానికి పంపకుండా ఉండడానికి నీతిమంతుడైన దేవునికి ఇదొక్కటే మార్గమై యుండింది. మనం భరించాల్సిన శిక్షను ఆయన భరించాల్సి వచ్చింది, అనగా మనం నరకంలో అనుభవించాల్సిన వేదనంతటిని ఆయన సిలువలో వ్రేలాడుతూ అనుభవించాడు. అలాగని, యేసు వాస్తవంగా నరకానికి వెళ్లాడని కాదు. కానీ ఆయన చేతుల్లో, కాళ్లలో దిగగొట్టిన మేకులు, తల మీద ఉంచిన ముళ్ల కిరీటం యేసు శ్రమలకు ఆరంభం మాత్రమే! యేసు శ్రమల అసలైన స్థాయి, దేవుడు తన ఉగ్రతను యేసు మీద కుమ్మరించినప్పుడు పరాకాష్ఠకు చేరుకొంది. దేశమంతయు చీకటి కమ్మినప్పుడు, కొందరు చెప్తునట్టు, దేవుడు తన కుమారుని శ్రమను చాటుచేయలేదు. ఆ చీకటి, దేవుని ఉగ్రత యొక్క శాపముతో కూడిన చీకటి. అది నరకపు చీకటి. ఆ క్షణంలో యేసు దానిని, అనగా సర్వశక్తిమంతుడైన దేవుని ఉగ్రత యొక్క పూర్తి కోపాన్ని సహించుచుండెను.

ఈ విషయాలన్నీటిని గ్రహిస్తూ నీవు సిలువను అర్థంచేసుకున్నప్పుడు, నీవు క్రీస్తునంగీకరించిన క్రైస్తవుడవైనట్లయితే, దేవుడు నీ యెడల చూపిన కృప ఎంత అద్భుతమైనదో బాగా అర్థంచేసుకోవడం ప్రారంభిస్తావు. యేసు క్రీస్తు చేపట్టిన పాపవిమోచనా కార్యభారం, నీ స్థానంలో ఆయన దేవుని ఉగ్రతను సహించాలనే నిబద్ధతతో, అనగా నీవు అనుభవించాల్సిన నరక యాతనను ఆయన అనుభవించాలనే నిబద్ధతతో కూడినదై యుండింది.

ఆహా, ఆయన ప్రేమ మరియు కనికరము ఎంత అద్భుతంగా ప్రదర్శింపబడింది కదా! అయిననూ, నీవు నరక యాతన ఎంత భయంకరమైనదో అర్థంచేసుకొని, అంగీకరించి, వణికిపోయినప్పుడే నీవు ప్రేమామయమైన ఈ ప్రదర్శనను స్పష్టంగా చూస్తావు, అర్థంచేసుకుంటావు.

5. నరకం మన మనస్సులను సువార్తను ప్రకటించుటపై కేంద్రీకరింపజేస్తుంది.

నరకం నిజమైనట్లయితే, మనుష్యులు నిజముగా తమ నిత్యత్వమును అక్కడ గడిపే ప్రమాదమున్నట్లయితే, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు పరలోకమునకు ఆరోహణుడు కాకమునుపు వారు అత్యవసరంగా చేయాల్సిన పని గురించి  ఆయన తన అపొస్తలులకు చెప్పాడు. దాని  కంటె చేయాల్సిన ఎక్కువ ముఖ్యమైన పని మరొకటి లేదు. అదేంటంటే యేసు క్రీస్తు ద్వారా పాపక్షమాపణ దొరుకుతుందనే సువర్తమానమును సర్వలోకానికి వెళ్లి మనుష్యులందరికి ప్రకటించడం!

పాస్టర్ జాన్‌ పైపర్‌ గారు నరకం గురించి ఇలా చెప్పారు, ‘‘నరకమున్నదని, ఈ ఊపిరి ఆగిపోయిన తరువాత, సువార్తను నమ్మనివారి కోసం, ఎన్నటికినీ అంతంకాని శ్రమ కాచుకొని ఉన్నదని నీవు నమ్మినట్లయితే, నీవు సువార్తను అంగీకరించకుండా, నమ్మకుండా ఉండలేవు.’’ జాన్ పైపర్ గారు నరకం గురించి సరిగ్గా అర్థంచేసుకున్నారని నేననుకుంటున్నాను. ఒకవేళ నరకం నిజమైనట్లయితే, ఆ విషయం మన మనస్సుల్లో ఉండాలి, ఇది క్రైస్తవులకు ఒక ఆజ్ఞయై ఉంది. క్రైస్తవులు చేయగల మంచి పనులు ఎన్నో ఉన్నాయి. కానీ లోకంలో క్రైస్తవులు తప్ప యింకెవరైనను, ఎప్పుడైనను చేయలేని పని ఒకటుంది. అదేంటంటే ప్రజల పాపములు ఎలా క్షమింపబడగలవో, వారి నిత్యత్వమంతా నరకంలో గడపకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ప్రజలందరికి ప్రకటించడమే!

ముగింపు

నరకాన్ని గూర్చిన సిద్ధాంతం భయంకరమైనదనుటలో సందేహమేమీ లేదు. దాని వాస్తవము భయంకరమైనదై యున్నది, గనుక దాని సిద్ధాంతం కూడ భయంకరమైనదే. అలాగని, మనం దాని గురించి ఆలోచించకుండా మన ధ్యాసను మరొక విషయం మీదికి మళ్లిస్తూ దానిని నిర్లక్ష్యం చేయడానికి లేదా తిరస్కరించడానికి ఇదొక కారణం కాకూడదు.

సువార్త ప్రకటించేటప్పుడు ఈ సిద్ధాంతాన్ని నిరాకరించడం వలన లేదా నిర్లక్ష్యం చేయడం వలన, వారు దేవుని మరి ఎక్కువ మహిమగలవానిగా, మరి ఎక్కువ ప్రేమగలవానిగా చేస్తున్నారని అనుకొనేవారు కూడా ఉన్నారు. వారు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు! ఆయన మనలను దేని నుండి రక్షించాడో, అదేం పెద్ద పట్టించుకోదగ్గ విషయం కాదన్నట్టు, వాళ్లు తెలియకుండానే రక్షకుడైన యేసు క్రీస్తు మహిమను దొంగిలిస్తున్నారు.

నిజానికి, మనం దేని నుండైతే రక్షించబడ్డామో దాని భయంకరమైన స్వభావం, మనం దేని నిమిత్తము రక్షించబడ్డామో దాని మహిమను ఇంకా ఎక్కువ చేస్తుంది. ఇదే కాదు, గాని మనం నరకం యొక్క భయంకరత్వాన్ని స్పష్టంగా గ్రహించినప్పుడు, మన కోసం నరకాన్ని సహించి మనలను రక్షించిన ఆయనను మనం మరి ఎక్కువ ప్రేమతో, మరి ఎక్కువ కృతజ్ఞతతో చూస్తూ, మరి గొప్పగా ఆరాధిస్తాం.

గ్రెగ్ గిల్బర్ట్

గ్రెగ్ గిల్బర్ట్

గ్రెగ్ గిల్బర్ట్ గారు కెంటకీ లోని లూయివిల్ లోని థర్డ్ అవెన్యూ బాప్టిస్ట్ చర్చి యొక్క సీనియర్ పాస్టర్. ఆయన తన B.A. యేల్ విశ్వవిద్యాలయంలో మరియు M.Div సదరన్ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీలో పూర్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...