‘నేను మిమ్మును ఎరుగను’ అని యేసు చెప్పిన మాటల అర్థమేంటి?
పదిమంది కన్యకల ఉపమానము గూర్చి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మత్తయి 25:11-12లో, ‘‘ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, ‘అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని’ అడుగగా అతడు, ‘మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని’ అనెను.’’
ఈ రెండు వచనాల్లో రక్షణకు సంబంధించిన ఏదైనా అంతర్భావమున్నదా? ప్రత్యేకంగా, ‘‘మిమ్ము నెరుగనని’’ పెండ్లి కుమారుడు చెప్పిన సందర్భంలో ఏదైనా అర్థముందా?
పది మంది కన్యకలు మరియు పెండ్లికుమారుడు
‘‘మిమ్మును ఎరుగను’’ అని పెండ్లి కుమారుడు చెప్పిన మాటల్లో రక్షణ గూర్చిన ఏదైనా అంతర్భావమున్నదా?’’ దానికి జవాబు – ఉన్నది. ఈ మాటల్లోనే ఉన్నది. అవి రక్షణ విషయం మినహాయింపుతో కూడిన భావముగలవై యున్నవి.
‘‘ప్రభువు పట్టించుకొనదగినంత ప్రాముఖ్యమైనవాడు కాడని నీవాయనతో వ్యవహరించినట్లయితే, నీవు విందులో పాల్గొనలేవు. రక్షణ పొందలేవు.’’
ఒక్క విషయం నీకు ఇక్కడ గుర్తుచేస్తాను. ఇదొక ఉపమానము, కదా? యేసు కల్పించిన ఈ కథలో పది మంది కన్యకలున్నారు. పెండ్లి కుమారుడు విందు శాలలోనికి ప్రవేశించి, విందులో పాల్గొని, ఆ మీదట పెండ్లి కుమార్తెతో సంతోషంగా సమయం గడుపడానికి వచ్చినప్పుడు, ఈ పది మంది కన్యకలు తమ దివిటీలతో వెళ్లి, అతనికి స్వాగతం పలుకవలసినవారై యున్నారు.
ఈ పది మంది కన్యకల్లో ఐదుగురు ఈ విషయాన్ని గంభీరంగా తీసుకున్నారు గనుక సిద్ధపడ్డారు. అజాగ్రత్తపరులైన ఐదుగురు కన్యకల దగ్గర సిద్ధంగా ఉండటానికి అవసరమైనదేది లేదు. ఇది గ్రహించిన వారు, చివరి నిమిషంలో, అటు ఇటు పరుగులు తీస్తూ సిద్ధపడటానికి ప్రయత్నించారు. కాని విఫలులయ్యారు. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది.
ఆధ్యాత్మిక మెలకువ
సంబంధిత వాక్యభాగంలో మనమిలా చదువుతాము:
‘‘వారు కొనబోవుచుండగా, పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను.’’ ‘‘ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, ‘అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని’ అడుగగా అతడు, ‘మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని’ అనెను. ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి’’ (మత్తయి 25:10-13).
ఇక్కడ, విషయమేమంటే, మెలకువగా ఉండుట. అంటే, ఆకాశంవైపు చుస్తూ రాత్రంతా మెలకువగా ఉండాలని కాదు, ఎందుకంటే వారందరు – పది మంది, బుద్ధిగలవారు, బుద్ధిలేనివారు కూడ – నిద్రపోయారు. విషయం అది కాదు. నీవు ప్రభువు విషయంలో మెలకువగా ఉండాలి, నీ పిలుపు విషయంలో మెలకువగా ఉండాలి. ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండాలి, నీ పిలుపు విషయంలో, యేసు విషయంలో, క్రీస్తునందలి జీవిత విధానం విషయంలో మెలకువగా ఉండాలి. వీటన్నిటి విషయంలో మెలకువగా ఉండాలి. ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా, సజీవంగా ఉండాలి. ఎందుకంటే, నీవు, ప్రభువు పెద్దగా పట్టించుకునే ప్రాముఖ్యమైనవాడు కాడని వ్యవహరించినట్లయితే, నీవు విందులో పాల్గొనలేవు. రక్షణ పొందలేవు.
ఇస్కరియోతు యూదాను మినహాయించుట
పైన చెప్పుకున్న విషయానికి చాల దగ్గరగా ఉన్న సాదృశ్యం ఇప్పుడు చూద్దాం :
‘‘ప్రభువా, ప్రభువా,’’ అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు (ఈ కారణాన్నిబట్టే నేను మినహాయింపు గూర్చి మాటలాడుతున్నాను), గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ‘‘ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?’’ అని చెప్పుదురు. అప్పుడు, ‘‘నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని’’ వారితో చెప్పుదును (మత్తయి 7:21-23).
‘‘నేను మిమ్మును ఎన్నడును ఎరుగను’’ అనంటే, ‘‘మిమ్మల్ని నా శిష్యులుగా గుర్తించడం లేదు. నేను మిమ్మల్ని నన్ను వెంబడిస్తున్న వారిగా అంగీకరించడం లేదు. ఆధ్యాత్మికంగా మీరు నాకు పరదేశులై యున్నారని’’ అర్థం. యేసు జీవితం దృష్ట్యా, ఈ సందర్భంలో ఇస్కరియోతు యూదా ఉత్తమమైన ఉదాహరణమవుతాడు. మూడు సంవత్సరాలు, అతడు యేసుతో కూడా ఉంటూ దయ్యాలను వెళ్లగొట్టాడు, అనేక అద్భుతకార్యాలు చేశాడు. చివరకు, అతడు డబ్బుకు ఆశపడి దానికి బానిసైపోయాడు, యేసు మీద ప్రేమ ఉండి కాదు. ఈ విషయాన్ని మనము యోహాను 12:6 ద్వారా గ్రహించవచ్చు. వాడు దొంగ అని పిలువబడుతున్నాడు. అతడు యేసుతో కూడ అంత కాలం గడిపినప్పటికీ, చివర్లో అతడు మినహాయింపబడ్డాడు.
ఏర్పరచుకొనబడినారు మరియు ఎరిగినవారు
ఎరుగుట అనే ఈ పదం ఎందుకింత ఎబ్బెట్టుగా, అసాధారణంగా ఉపయోగింపబడుతున్నది? ‘‘నేను మిమ్మునుఎరుగను.’’ ‘‘నేను మిమ్మును ఎన్నడును ఎరుగను.’’ దీని వెనుక ఒక కథ ఉన్నది. ఉదా॥ ఎరుగుట అనే పదం, పాత నిబంధనలో, ఏర్పరచుకొనుట అనే పదముతో దాదాపు పరస్పర మార్పుగా ఉపయోగింపబడింది. ‘‘నేను మిమ్మును ఎరుగను’’ అనంటే, ‘‘నేను మిమ్మును ఏర్పరచుకొనలేదని అర్థం.
ఉదా॥ ఆమోసు 3:2 చూడండి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులతో ఇలా సెలవిస్తున్నాడు, ‘‘భూమి మీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను.’’ అలాగని, యేసునకు ఇతర వంశాలు తెలియవని కాదు. ఆయన వారిని ఏర్పరచుకొన లేదని అర్థం, అంత వరకే. వారు తన ప్రజలుగా అంగీకరింపబడలేదు. తన వారుగా గుర్తింపబడలేదు. ఆయన వారిని ఏర్పరచుకొనలేదు.
ఆది 18:18-19 గమనించండి: ‘‘అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికాజ్ఞాపించినట్లు నేనతని ఎరిగియున్నాననెను.’’ ఎరిగియున్నాను అనే ఇచ్చటి మాట సాధారణంగా ఏర్పరచుకొనియున్నాను అని అనువదింపబడింది. ఇది కేవలము ఎరిగియున్నాను అనే పాత, సామాన్య పదం. ‘‘తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికాజ్ఞాపించినట్లు నేనతని ఎరిగియున్నాను’’ అని రాయబడింది.
దేవుని ప్రేమించుటకు పిలువబడియున్నాము
మనము క్రొత్త నిబంధనకి వచ్చినప్పుడు, ఈ క్రింది విధముగా వ్రాయబడియున్నట్టు చదువుతుంటాము: ‘‘ఇప్పుడు మీరు దేవుని ఎరిగినవారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడినవారునై యున్నారు’’ (గలతీ 4:9). కాబట్టి దేవుని చేత ఎరుగబడినవారమై యుండుట, మీరు (మనము) ఆయనను ఎరుగునట్లు చేయడానికి ఆయన తీసికొనిన చొరవను (ప్రారంభ ప్రేరణను) వ్యక్తము చేస్తున్నది: ‘‘యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరల తిరుగునేల? మునుపటివలె మరల వాటికి దాసులై యుండగోరనేల?’’ (గలతీ 4:9).
ఇదే అభిప్రాయాన్ని 1 కొరింథీ 8:3లోనూ చూడవచ్చు: ‘‘ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.’’ అనగా, దేవుని చేత ఎరుగబడియుండుట అనేది ముందుగా జరిగే ప్రక్రియ. అదే ఆ తర్వాత నీవు దేవుని ప్రేమించేట్లు చేస్తున్నది. ఈ ప్రకారంగా, దేవుని ప్రేమించడమనేది మనము దేవుని చేత ఎరుగబడినవారమై అనగా, దేవుని చేత ఏర్పరచుకొనబడినవారమై యున్నామనుటకు రుజువై యున్నది.
మెలకువగా ఉండుము
మళ్లీ మనము చెప్పుకుంటున్న ఉపమానానికి వద్దాము. పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె యొక్క విందుకు బుద్ధిలేని కన్యకలు చాల ఆలస్యంగా వచ్చారు. వారు, ‘‘అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని’’ కేకలు వేశారు. అప్పుడు పెండ్లికుమారుడు, ‘‘నేను మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నాకు తెలియదు’’ అన్నాడు. అనగా, ‘‘మీరు నన్ను నమ్ముకున్నట్లుగా మీలో గురుతులు నాకేమీ కనబడటం లేదు. నేను ఎన్నుకున్న ప్రజలు, నా పట్ల వారికున్న అనుబంధం మరియు వారి విధేయతగల విశ్వాసము ఎల్లప్పుడూ పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి” అని చెబుతాడు.
ఈ విషయాన్ని మనము 2 తిమోతి 2:19లో చూస్తాము: ‘‘అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ‘ప్రభువు తనవారిని ఎరుగును’ అనేది, ‘ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను’ అనేది దానికి ముద్రగా ఉన్నవి.’’ ఈ రెండును, ముద్రలుగా యున్నవి. ‘‘నేను వారిని ఎరుగుదును – నేను వారిని ఏర్పచుకొని యున్నాను – వారు దుర్నీతి నుండి తొలగిపోయియున్నారు.’’
యేసు ఈ ఐదుగురు బుద్ధిలేని కన్యకలకు ఇలా సెలవిస్తున్నాడు, ‘‘మీరు నా నామమును ప్రేమిస్తూ దుర్నీతి నుండి తొలగిపోయినవారై యున్నారనుటకు మీ జీవితంలో రుజువు నాకు కనబడటం లేదు. మీరు నావారు కారు. నేను మిమ్మును ఎరుగను.’’ ఇలా చెప్తూ, ‘‘కాబట్టి, ఆధ్యాత్మికంగా అప్రమత్తముగా ఉండుడి. నా గొప్పతనాన్ని, నా యోగ్యతను ఎల్లప్పుడు మీముందుంచుకొనండి. నా కంటె ఎక్కువ లోకమును ప్రేమించవద్దు. ప్రేమించినట్లయితే, మిమ్మును నేను ఎరుగను’’ అని చెప్పుతూ యేసు ముగిస్తున్నాడు.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web