మనము దేని కోసం రక్షింపబడ్డాం?

షేర్ చెయ్యండి:

రక్షణ మనకందరికి అవసరం – ఇది మనకు తెలుసు. బాగుంది. గాని, మనమెందుకు రక్షింపబడినట్టు? ఈ ప్రశ్న అవసరమైనది మరియు ప్రాముఖ్యమైనది. ‘‘సంతోషం కోసం సృష్టించబడ్డాం’’ అనే శీర్షికతో, వాషింగ్టన్‌ డి.సి.లోని కేపిటల్‌ హిల్‌ బాప్టిస్ట్‌ సంఘంలో 2002లో చెప్పిన ప్రసంగంలో పాస్టర్‌ జాన్‌ పైపర్‌గారు ఈ ప్రశ్నకు పరిష్కారం ఇలా చెప్పారు.

సువార్త అనేది ఒక విషయం గూర్చిన శుభవార్త, గాని ఆ శుభవార్త ఏంటో ఇది చెప్పడం లేదు. కాబట్టి, ‘‘క్రైస్తవులు సువార్త నమ్ముతారని’’ మామూలుగా చెప్పడం చాలదు. ఈ మాటలు, అసలు విషయమేంటో వివరించడం లేవు. ఈ పదము నీకు ఏమీ చెప్పదు. ఇది కేవలము ఒక సున్న (0) లాంటిది. అసలు ఇది ఏ విషయం గూర్చిన మంచి వార్త? జవాబుగా, ఇది ఈ విశాల సృష్టిని సృజించిన దేవునికి విరోధంగా చేసిన పాపములు క్షమింపబడుటను (పాపక్షమాపణ) గూర్చిన మంచి వార్త అని నీవు చెప్పవచ్చు. ఆయన మనలను తన స్వరూపములో సృజించిన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా, ఆయన మనస్సును గాయపర్చాము గనుక మన పట్ల కోపంగా ఉన్న దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములు క్షమింపబడుట అని అర్థం. కావున, ఈ ప్రకారంగా, మనకు విరోధంగా ఒక నీతిమంతమైన ఉగ్రత ఉందని, ఐనప్పటికీ, మనం క్షమింపబడగలము అనేదే సువార్త.

ఏ విషయంలో క్షమాపణ?

అయితే, క్షమాపణ అనే పదాన్ని నీవు విశ్లేషిస్తే, ‘‘ఔను, క్షమాపణ ఉన్నది, అయితే ఏంటి? క్షమింపబడటం ఎవరిక్కావాలి?’’ అని ఎవరైనా అనవచ్చు. ‘క్షమాపణ’ అనేది దానంతట అదే ఏ అర్థాన్నివ్వదు. ఇద్దరి మధ్య ఏర్పడిన సన్నిహిత సంబంధం చెడిపోయినప్పుడు, ఈ సంబంధం పునరుద్ధరింపబడితే బాగుండని నీవు గాఢంగా మనస్ఫూర్తిగా ఆశించినప్పుడే, క్షమాపణ అనేది ఎంత విలువైనదో తెలుస్తుంది. గనుక, క్షమాపణ అనేది ప్రధానంగా సంబంధాల గూర్చినదై యున్నది.

ఒక ఉదాహరణం చెప్తాను, వినండి. నేను పొద్దున్నే లేవగానే నా భార్యను ఉద్దేశించి ఏదో ఒక మూర్ఖపు మాట, అన్నాననుకోండి. అప్పుడేం జరుగుతుంది. సహజంగానే నా భార్య మనస్సు నొచ్చుకుంటుంది, బాధపడుతుంది, మా ఆయన ఎందుకిలా మాట్లాడుతున్నారని మనస్సులో అనుకుంటుంది. కోపంగా ఉన్న నేను మా గదిలో నుండి బయటికి వెళ్లి, కాస్సేపయ్యాక లోపలికి వచ్చి వంటగదిలోనికి వెళ్తాను. అదే సమయంలో నా భార్య కూడ వంటగదిలోనే ఉంది. నేను నా కాఫీ తయారు చేసుకుంటున్నాను. ఆమె మాటలాడటం లేదు, నేనూ మాటలాడటం లేదు. కానీ ఇప్పుడేం జరగాలో నాకు తెలుసు. నేను క్షమింపబడాలి, నేను నా భార్యను క్షమాపణ అడగాలి. ఎందుకని? ఎందుకంటే, నా భార్య నాకు కావాలి, అంతే కదా? కాబట్టి నేను నెమ్మదిగా తన దగ్గరకు వెళ్లి, భుజం మీద చెయ్యివేసి, తన చెక్కిలిని గిల్లి, చిన్న ముద్దిస్తాను, అందుకామె నిరాకరించి, అక్కడ నుండి వెళ్లిపోవాలని నేను కోరుకోను. నేను తన భుజం మీద చెయ్యివేసి, చిన్న ముద్దిచ్చినట్టే, ఆమె కూడ ప్రతిస్పందించాలని కోరుకుంటాను. ఈ విధంగా నా భార్యను తిరిగి పొందుకున్నప్పుడే, క్షమాపణకు విలువ ఉంటుంది.

కాబట్టి, సువార్త అనే పదం దానంతట అదే ఏమీ తెలియజెప్పదు. మళ్లీ ఎవరైనా, ‘‘సువార్త, దేని గూర్చిన శుభవార్త?’’ అని అడిగితే, అప్పుడు నీవు, ‘‘క్షమాపణ’’ గూర్చినది అంటావు. గాని, ఈ మాటకు, దానంతట దానికి అర్థమేమీ ఉండదు ఎందుకంటే అది క్షమాపణ ఒక విషయానికి ద్వారాలు తెరిచేదిగా ఉంది. కాబట్టి మనము ఒక అడుగు ముందుకేసి, ‘‘క్షమాపణ ఏ విషయానికి ద్వారాలు తెరుస్తున్నది? ‘క్షమాపణ’ అని క్రైస్తవులు చెబుతున్నది ఏ విషయానికి ద్వారాలు తెరుస్తుంది?’’ అని అడగాలి.

నీవు దేనికోసం రక్షింపబడ్డావు?

ఆ తరువాత, ‘‘రక్షణ’’ లేదా ‘‘రక్షింపబడుట’’ అనే మరొక చక్కని క్రైస్తవ పదాన్ని మీరు వాడొచ్చు. గాని ఈ మాట కూడ దానంతట అదే ఏమీ అర్థమీయదు. దేని నుండి రక్షింపబడినట్టు, దేని కోసం రక్షింపబడినట్టు? ఇవన్నీ వట్టి మాటలు. ఇవి ఎంతో అద్భుతకరమైన మాటలే, కానీ అవి ఎక్కువ వివరంగా లేవు. నీవు ఈ మాటల గూర్చి ఆలోచిస్తూ, లోతుగా విశ్లేషిస్తూ ఉండాలి, సరైన అర్థం వచ్చేంత వరకు ఇలా చేస్తూనే ఉండాలి. ఇంత చేసినా, యింకా అవి సరైన అర్థమిస్తున్నట్టు అనిపించవు. అంటే, రక్షింపబడుట అనేది మంచి పదములాగే ఉన్నది, కానీ, నీవు దేని నుండి రక్షించబడ్డావో, దేని కొరకు రక్షించబడ్డావో నీకు తెలియదు.

సరే, మనం ఉగ్రత, తీర్పు, నరకం, శిక్షావిధి నుండి రక్షించబడ్డామని అనుకుందాం. ఇదంతా బానే ఉంది. ఎవరూ కూడా శిక్ష గుండా వెళ్లాలని అనుకోరు. గాని, దేని కొరకు రక్షించబడడం ? బహుశా, ‘నిత్యజీవము’ అని నీవనవచ్చు. యోహాను 3:16 లో ఇలా వ్రాయబడి యున్నది, ‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.’’ అప్పుడు నీవు, ‘‘చూశారా, మీరు క్షమింపబడితే, జీవముగలవారవుతారని’’ అనవచ్చు. అలాగే, ‘నాకు జీవం వద్దు, ఎందుకంటే అది బోరింగ్‌గా ఉంటుంది. అంతులేని బోరింగ్‌లో నాకు ఆసక్తిలేదనవచ్చు.’’ కాబట్టి, జీవము అనే పదంతో కూడ మనము ఏ నిర్ణయానికీ రాలేము.

ఎవరికైనా అర్థవంతమైనదనిపించు విషయం ఏమీ చెప్పకుండానే, క్రైస్తవ్యాన్ని వర్ణించడానికి మనం ఎన్ని పదాలు వాడగలము కదా, ఇది ఆశ్చర్యంగా లేదా? గనుక నేను, ‘‘దేని కొరకు రక్షింపబడ్డాను?’’ అని అడగాలి. అప్పుడు మనము, ‘‘జీవము’’ కొరకు అని చెప్పగలము. అందుకు నేను, ‘‘అది ఏ విధమైన జీవము? ఎక్కడ? ఎవరితో? నాకు ఈ జీవం కావాలా? నేను జీవించగోరని జీవితాలున్నాయా’’ అని అడుగుతాను. నీవిప్పుడు జీవిస్తున్న జీవితం నీవు జీవించాలని కోరుకున్న జీవితం కాకపోవచ్చు. అలాగైతే నీవు అలా ఉండటం ఈ రాత్రికి కూడా నీకు చాలా అపాయకరమైన స్థితి వంటిదే. నీవిక్కడ ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఆ స్థితిని నేను మార్చివేయాలని ఆశిస్తున్నాను.

నిండు మరియు నిరంతరము నిలిచియుండు సంతోషం

నేను జవాబు చెప్పడానికి పాత నిబంధనలోని కీర్తనలలో ఒక వాక్యభాగాన్ని ఆధారం చేసుకోవాలని ఆశిస్తున్నాను:

‘‘జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు‘‘ అని వ్రాయబడి యున్నది (కీర్తన 16:11).

ఇప్పుడు నీవు మాట్లాడుతుంది మంచి వార్తలా వినిపిస్తున్నది: సంపూర్ణ సంతోషము మరియు నిరంతరము నిలిచియుండు సుఖములు అనే పదాలు శుభవార్తలా వినిపిస్తున్నాయి.

సువార్త నీకు అంతగా అర్థవంతమైనది కాకపోవచ్చు.

క్షమాపణ నీకు అంతగా అర్థవంతమైనది కాకపోవచ్చు.

రక్షింపబడుట నీకు అంతగా అర్థవంతమైనది కాకపోవచ్చు.

జీవము/జీవితం నీకు అంతగా అర్థవంతమైనది కాకపోవచ్చు.

గాని, నిత్య సుఖములు? సుఖములా? ఔను, నాకదే కావాలి: సంపూర్ణ సంతోషం మరియు నిరంతరము నిలిచియుండు సుఖములు. ఈ రెండు విషయాలను నీవు గమనిస్తున్నావా? సంపూర్ణమైన అనంటే 99% కాదు, అది నూటికి నూరు శాతం సంతోషము, సుఖములు అని అర్థం. నిత్యము, నిరంతరము అనంటే, ఎన్నటికిని అంతముకానివని అర్థం. 800 సంవత్సరముల వరకు మాత్రమే ఉండగల సుఖముల కొరకు నేను చూడటం లేదు, అవి నాకు వద్దు. థాంక్యు వెరీ మచ్‌. నాకు శాశ్వతంగా, నిరంతరము నిలిచియుండే సుఖములు కావాలి.

ఈ వచనభాగం, నిజమైనట్లయితే, కీర్తన 16:11 నిజమైనట్లయితే, ఈ సంతోషము మరియు సుఖము దేవునిలో దొరుకుతాయి.

సువార్త గూర్చి క్రైస్తవ్యము ఏమని చెప్పుతున్నదంటే: మనము మన పాపముల విషయంలో క్షమింపబడునట్లు, మనము ఆయన సన్నిధిలో నిత్యము నిలిచియుండు జీవం కోసం, అంతకంతకు ఎక్కువగుచుండు సుఖము కోసం దేవుని ఉగ్రత నుండి రక్షింపబడునట్లు, పాపుల స్థానంలో చావడానికి యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు.

సంతోషం కోసం సృష్టింపబడితిమి 

నేను, విశ్వాసియైన ప్రతి రాత్రి ప్రార్థించే నాన్నగారుండిన కుటుంబములో పెరిగి పెద్దవాడనయ్యాను. అన్ని విషయాల్లోను దేవుడు మహిమపరచబడేలా ప్రార్థించాలని నేను మా నాన్నగారిని చూసి నేర్చుకున్నాను. ఇది ఇప్పుడు నాకున్న ఈ తలంపుల విషయంలో ఒక సమస్య తెచ్చిపెడుతుంది. ఎందుకంటే, సువార్త అనేదంతా కూడ నా సంతోషానికి సంబంధించింది, దాని గూర్చి చెప్పాలనే దశకు చేరుకున్నాను. అయితే మా నాన్నగారేమో, సువార్త అనేదంతా దేవుని మహిమ గూర్చి అని నేర్చుకునేలా ప్రార్థించాడు. సువార్త అనగా దేవుని గొప్పతనం, ఆయన శక్తి, అధికారము, న్యాయము, సత్యము, మంచితనము మరియు ఆయన కనికరము, కృప గూర్చినది. ఇదంతా ఆయన గూర్చే, ఆయన గొప్పతనము గూర్చే, ఆయనను హెచ్చించడం, ఘనపరచడం మరియు ఆరాధించడం గూర్చినదై యున్నది.  

కాబట్టి, ఇప్పుడు నా హృదయం ఇక్కడ లభించే ఈ సంతోషం కొరకు ఉంది. మరియు నా హృదయం బైబిలు చెప్పుతున్న సువార్త, రక్షణ, క్షమాపణ మరియు జీవము యొక్క కడపటి ఉద్దేశమైయున్న దేవుని కుడి చేతిలోని నిత్య సుఖముల కొరకు వాంఛిస్తున్నది. ఇంతేగాక, ‘‘నీవు దేవుని మహిమ కొరకు సృష్టింపబడినావని, సమస్తము ఆయన మహిమ కొరకే ఉద్దేశింపబడినదై యున్నదని’’ తెలియజెప్పుతున్న లేఖన భాగాలు నా దగ్గర ఉన్నాయి. అనగా, దేవుడు ఎంత గొప్పవాడైయున్నాడో నీవు ప్రదర్శిస్తూ ఆయనను హెచ్చించాలని మరొక మాటలో చెప్పుకొనవచ్చు.  

నేను కనుగొనిన విషయం ఏమిటంటే, నేను దీనిని 250 సంవత్సరాల క్రితం జీవించిన జోనాతాన్‌ ఎడ్వర్డ్స్‌ ద్వారా బైబిలులో నుండి పరోక్షంగా నేర్చుకొనిన విషయం. ఈ రెండింటినీ ఒక్కచోటికి తెచ్చునట్లు దానిని నేనిలా చెప్పగలను: నేను దేవునిలో అత్యంత సంతృప్తిచెందినప్పుడు దేవుడు నాలో అత్యధికంగా మహిమపరచబడుతున్నాడు – ఘనపరచబడుతున్నాడు, స్తుతింపబడుతున్నాడు, ప్రదర్శింపబడుతున్నాడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...