రక్షింపబడడానికి నేనేమి నమ్మాలి?
ఇది ఎవరైనా, ఎప్పుడైనా అడిగే అత్యంత ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటి: రక్షించబడడానికి నేనేమి నమ్మాలి? ఇదే ప్రశ్న కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటుచేయబడిన ఒక ప్రశ్నోత్తర కార్యక్రమంలో పాస్టర్ జాన్గారిని అడిగారు. ఆయన ఇలా జవాబిచ్చారు:
‘‘ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవు రక్షింపబడుదువని’’ అపొస్తలుడైన పౌలు చెప్పుతున్నాడు (అపొ 16:31). ఇంతేగాక, ‘‘యేసు, ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువని’’ కూడ చెప్పుతున్నాడు (రోమా 10:9).
ముఖ్యమైన సమస్య
నేను ఇలాంటి వాక్యభాగాలను ప్రస్తావిస్తాను, ప్రధానమైన ఈ విషయంతో – అంటే యేసు మరణంతో – మొదలుపెట్టాలంటాను. ఆయన మన పాపముల కోసం మరణించాడు, అనగా పాపినని నేను నమ్మాలి. నేను పాపినని నమ్మనివాడు రక్షింపబడలేడు. క్షమించడానికి అసలేమీ లేనట్లయితే, యేసు నా కొరకు ఏమీ చేయలేదన్నట్టేగా. ఆయన నా కొరకు ఏమీ చేయనట్లయితే, రక్షణ కోసం నేనాయనను నమ్మడం లేదు. రక్షణ కోసం నేనాయనను నమ్మనట్లయితే, నేను రక్షింపబడను. కాబట్టి, నీవొక పాపివని నమ్మాలి.
‘‘నేను పాపినని నమ్మనివాడు రక్షింపబడలేడు.” పాపమునకు అవకాశం కల్పించిన దేవుడున్నాడని కూడ నీవు నమ్మాలి. అనగా, నిన్ను సృష్టించిన దేవుని ఉద్దేశం మేరకు జీవించక, తప్పిపోయినప్పుడే పాపమునకు అర్థముంటుంది కాబట్టి, మానవులు ఆయనను నమ్మాలని, ప్రేమించాలని, ఆయన కొరకు బ్రతకాలనీ ఆశించే, కోరుకొనే సృష్టికర్తయైన దేవుడొకడు ఉండాలి. ఈ ప్రకారంగా చూస్తే, మనము ఆయన ఆశల ప్రకారం జీవించడంలేదు.
కాబట్టి, మనము ఆ సృష్టికర్తయైన దేవుని పరిశుద్ధ తీర్పు కింద లేదా ఉగ్రత క్రింద ఉన్నాము. ఈ విషయాన్ని నీవు నమ్మాలి. నీవొక పాపివైనట్లయితే, పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు, అందువల్ల ఆ దేవుని కోరికల ప్రకారం జీవించలేకపోవడమనేది పాపం. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, ఆయన మంచి న్యాయాధిపతి కాబట్టి పాపము పట్ల ఆయన ఉగ్రుడై యున్నాడని నీవు అర్థంచేసుకోవాలి. ఇదే ఇక్కడ సమస్య.
ముఖ్యమైన పరిష్కారము
పాపము చేసిన మనము ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయాము. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయన ఏంచేశాడు? ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. నీవు యేసు క్రీస్తు యొక్క దేవత్వములో నమ్మకముంచాలి. కీర్తన 49:7లో ఇలా వ్రాయబడి యున్నది: ‘‘ఎవడును ఏ విధముచేతనైను తన సహోదరుని విమోచింపలేడు.’’ ఇదే కీర్తనలో తరువాతి కొన్ని వచనాలను చూస్తే, ఈ విమోచన క్రయధనాన్ని దేవుడు చెల్లించును అనే వాక్యం కనబడుతుంది (కీర్తన 49:15). ఈ ప్రకారంగా, దేవుడు యోహానునుగాని, పేతురునుగాని లేదా పౌలునుగాని ఉపయోగించుకొనలేకపోయాడు. ఎందుకనగా మానవులమైన మన కొరకు, మానవుడు కాదుగానీ దైవమానవుడైనవాడు మరణించాల్సి వుండింది. కాబట్టి, యేసు యొక్క దేవత్వము ముఖ్యమైన విషయమవుతుంది.
ఆ తరువాత, ఆయన ఏంచేశాడు? ఆయన సంపూర్ణంగా పరిపూర్ణమైన జీవితం జీవించాడు. యేసు పాపము చేశాడని నమ్మినట్లయితే, నీవు రక్షింపబడలేవు. ఎందుకనగా, అప్పుడు ఆయన నీ కోసం బలియాగం అవ్వాల్సిన అవసరం లేదు. క్రీస్తు పాపం చేశాడని నమ్మినట్లయితే, దేవుడు నీ కొరకు క్రీస్తు బలియాగం ద్వారా చేసిన కార్యములో నీవు నమ్మకం ఉంచవు. అందువల్ల, ఆయన ఏ పాపములేని దేవుని కుమారుడై యున్నాడు. నాకు బదులుగా, నా స్థానంలో మరణించడానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు : ఇది నా పాపముల కొరకు క్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ మరణం. దీని గూర్చి బైబిలులో అనేక విధాలుగా చెప్పబడింది. అన్నింటినీ వివరంగా చూస్తే నీవు తికమకపడతావు, రక్షణ గూర్చిన తికమక కూడా ఏర్పడుతుంది.
దీని గూర్చి బైబిలు వివరిస్తున్న విషయాలన్నిటినీ మీ ముందుంచడానికి మొదలుపెట్టి, మిమ్ములను తికమకపెట్టాలని, రక్షణ గూర్చి గలిబిలిని కలుగజేయాలని నేనాశించడము లేదు. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు, ఎన్నడునూ పాపముచేయనివాడు, నా స్థానంలో నా కొరకు దేవుని ఉగ్రతను భరించి, నా స్థానంలో మరణించాడనేది సువార్తలోని ప్రధాన పరిష్కారాంశమని తెలుసుకుంటే, అంతమట్టుకు చాలు. మరణించిన యేసు మరణించినవాడుగానే ఉండినట్లయితే, మనమింకను మన పాపములలోనే నిలిచియుందుము. గనుక, ఆయన మృతులలో నుండి లేచాడని మనము నమ్మాలి.
నీవు నమ్మగలవా?
ఇది చాలా విషయాల సముదాయం. నేను చెప్పదలచుచున్న విషయాలకు వేదాంతపరంగా చాల దగ్గరి సంబంధంగల విషయాలున్నాయని మీరు నాకు గుర్తుచేయవచ్చు. ఔను, అవన్నీ కూడ ఇందులో చేర్చబడవలసి యున్నది. అయితే, ‘‘ఇంతకూ నేను నమ్మాల్సిందేమిటి?’’ అని ఎవరైనా నన్ను అడిగినట్లయితే, ‘‘నీవు, నిన్ను గూర్చి, దేవుని గూర్చి, మరియు సిలువను గూర్చి తప్పనిసరిగా తెలిసికొనవలసిన విషయాలతో కూడిన సత్యాల సముదాయం ఉన్నదని’’ నేను జవాబు చెప్తాను.
‘‘నీవు నిన్ను గూర్చిన, దేవుని గూర్చిన, మరియు సిలువను గూర్చిన
సత్యమును తప్పనిసరిగా తెలిసికొనవలసి యున్నది.’’
ఇంకొక్క విషయం: విశ్వాసమును గూర్చిన విషయమిక్కడున్నదని నేను భావిస్తున్నాను, ఎందుకంటే, ‘‘నేను నమ్మవలసినది ఏమిటి?’’ అని వారడుగుతున్నారు. గాని, నమ్మకము గూర్చి కూడా నీవు నమ్మాల్సిన విషయముంది. అది కూడా అవసరం. ‘‘ఓ, అదంతా నాకు తెలుసు. దేవుడు నా కొరకు దానంతటిని లెక్కించునట్లు నేనిప్పుడు పని చేస్తాను. నా విషయంలో విమోచన కార్యం జరుగునట్లు నేను ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను 85% మేరకు పాటిస్తాను ’’ అని నీవు అన్నట్లయితే, నీవు అసలు విషయాన్ని అర్థం చేసుకోలేదు. నీవు రక్షింపబడలేదు అని అర్థం.
రక్షించబడడానికి, నీ రక్షణ కొరకు నువ్వు పనిచేయడానికి బదులుగా, ఆయనే చేయాల్సిన కార్యాన్ని చేశాడని నమ్మాలి. మనము రక్షణను పొందుకొంటామే గాని దాని కొరకు ఏ క్రియలు చేయము. ‘‘తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన తనామమునందు విశ్వాసముంచిన వారికందరికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమిచ్చెను’’ అని వ్రాయబడి యున్నది (యోహాను 1:12). కాబట్టి, పాపము, దేవుడు, సిలువ, విశ్వాసము – ఇవి ప్రధానాంశములు. నేను ‘సత్యములు’ అని చెప్పుతున్నది ముఖ్యంగా ఈ నాలుగు విషయాలకు సంబంధించింది.
త్రిత్వము సంగతేమిటి?
ఆ తరువాత, పాస్టర్ జాన్గారిని ఒకరు తదుపరి-ప్రశ్న అడిగారు: రక్షింపబడగోరువాడు త్రిత్వమును, లేదా త్రిత్వసిద్ధాంతాన్ని అర్థంచేసుకోవాల్సిన అవసరమున్నదా? దానికి పాస్టర్ జాన్గారు ఇలా జవాబిచ్చారు:
రక్షింపబడడానికి, అతడు / ఆమె త్రిత్వం అనే పదం తెలిసికోవలసిన అవసరం లేదు. త్రిత్వము గూర్చిన పూర్తి అవగాహన వారికుండాల్సిన పని లేదు. గాని, త్రిత్వమునకు సంబంధించిన విషయాలను నమ్మాలి, కాదనకూడదు, లేదనకూడదు. ఎందుకంటే, త్రిత్వము అనే పదం ఎన్నడూ వినకపోయుండి కూడా రక్షించబడటం సాధ్యమే. గాని, ‘నీవు నమ్ముతున్న యేసు, దేవుడా లేక కేవలము ఒక మానవుడా?’ అని నీవడిగినప్పుడు, ‘ఆయన దేవుడు కాడని’ జవాబిచ్చినట్లయితే, అదొక ముఖ్య సమస్య అవుతుందని నేననుకుంటున్నాను. కాబట్టి, నేను త్రిత్వము యొక్క అంతరార్థాలను మరియు కొన్ని విషయాలను చెప్పుతున్నాను.
ఒకడు రక్షింపబడటానికి పరిశుద్ధాత్మ గూర్చి వినాల్సిన అవసరమున్నదని నేననుకోను. ఇది సమగ్రమైనదా? కాదని నేను భావిస్తాను. పరిశుద్ధాత్మ గూర్చి, ఆయన చేసిన కార్యాల గూర్చి బోధించబడ్డప్పుడు, ‘‘ఓ, లేదు, లేదు. నేను దీనిలోని ఏ విషయాన్నైనా నమ్మడం లేదు. పరిశుద్ధాత్ముడు నన్ను రక్షించాడని నేను నమ్మడం లేదని’’ నీవు చెప్పినట్లయితే, నేను నీ రక్షణను గూర్చి ప్రశ్నించాల్సి వస్తుంది. ఒక విషయం! సువార్త గూర్చి నేను ఇంత సేపు చెప్పినప్పటికిని, నేను పరిశుద్ధాత్మ గూర్చిన మాటే ఎత్తనేలేదు. అలాగని, ఆయన అవసరంలేదని కాదు. ఆయన లేకుండా మనమెన్నడును విశ్వసించలేము. గాని నీవు నమ్మునట్లు దేవుడు ఎలా పని చేశాడో అనే వివరాలు తెలిసికొనడం ముఖ్యం కాదని నేననుకుంటున్నాను. గాని, తెలిసికొన్న తరువాత, కాదనడం, ముఖ్య విషయాలను కొట్టివేసినట్టే అవుతుంది.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web