చెడ్డ యజమానికి సేవ చేయడం ఎలా?
“మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు, మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యముచేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు”. (ఎఫెసీ 6:7-8)
మీ ఉద్యోగానికి సంబంధించి ఎఫెసీ 6:7-8 వచనాల నుండి ఈ క్రింద చెప్పబడిన ఐదు విషయాలను గమనించండి.
1. ప్రభువు కేంద్రీతమైన జీవితాన్ని జీవించుటకు పిలుపు
మనం సాధారణంగా జీవించే జీవితానికి పోల్చుకుంటే ఇది ఆశ్చర్యకరమైన విషయమే. మనం చేసే పని ఏదైనా అది క్రీస్తు కోసం పని చేస్తున్నట్లుగా చేయాలని, మనపైన గల అధికారుల కోసం పని చేయకూడదని పౌలు చెప్తున్నాడు. “మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా” పని చేయాలి.
ఈ మాటకు అర్థం ఏంటంటే, మనం పని చేస్తున్న సమయంలో ప్రభువును గురించి ఆలోచించాలి. ప్రభువు ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నాడు? ప్రభువు దీన్ని ఎలా చేయాలనుకుంటున్నాడు? ప్రభువు దీన్ని ఎప్పుడు చేయాలనుకుంటున్నాడు? దీన్ని చేయడానికి ప్రభువు నాకు సహాయం చేస్తాడా? ఇది దేవుని ఘనత కోసం ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది? మరొక విధంగా చెప్పాలంటే, క్రైస్తవునిగా ఉండడమంటే ప్రభువును కేంద్రంగా పెట్టుకుని జీవించడం మరియు ప్రభువును కేంద్రంగా పెట్టుకొని పని చేయడం.
2. మంచి మనిషిగా ఉండటానికి పిలుపు
ప్రభువుని కేంద్రంగా పెట్టుకొని జీవించడమంటే, మంచి మనిషిగా ఉండడం మరియు మంచి పనులు చేయడం. “మీలో ప్రతివాడు ఏ సత్కార్యం చేయునో… వారు ఇష్ట పూర్వకంగా చేయాలి…” అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మనుష్యులు మీ “సత్క్రియలను” (మంచి క్రియలు) చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి (మత్తయి. 5:16) అని యేసు చెప్తున్నాడు.
3. నిర్దయులైన భూసంబంధమైన యజమానుల కోసం మంచి పని చేయుటకుగల శక్తి
దేవుని కేంద్రికృతమైన ఆలోచనలతో, నిర్దయులైన యజమానులకు మంచి చేసేందుకు క్రైస్తవులను బలపరచడమే పౌలు లక్ష్యంగా ఉన్నది. మీపైని యజమాని మిమ్మల్ని విమర్శిస్తూ, లేక మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగంలో మంచిని ఎలా చేయగలరు? ఈ ప్రశ్నకు పౌలు జవాబు ఇలా ఉంది: మీ ముఖ్య యజమానిగా మీ బాస్ గురించి ఆలోచించడం ఆపేయండి, ప్రభువు కోసం పని చేయడం మొదలు పెట్టండి. భూ సంబంధమైన మీ అధికారి ద్వారామీకివ్వబడిన బాధ్యతలన్నిటిలో ఈ విధంగానే పని చేయండి.
4. చేసిన మంచి పని వ్యర్థంగా పోదనే ప్రోత్సాహం
“మీలో ప్రతివాడును ఏ సత్కార్యముచేయునో దాని ఫలము ప్రభువువలన పొందునని మీరెరుగుదురు” అనే ఈ మాట బహుశా అన్నిటికంటే అద్భుతమైన వాక్యమని చెప్పవచ్చు. “మీలో ప్రతివాడు ప్రతి మంచి పనికి” ఫలము పొందుకుంటాడు అనే మాట మహాద్భుతం! మీరు చేసిన ప్రతి చిన్న మంచి పనిని ప్రభువు చూసి, విలువైనదిగా ఎంచి, దానికి తగిన ఫలాన్నిస్తాడు.
ఆ మంచి పని కోసం మీకు ప్రతిఫలమిస్తాడు. దేవుడు మీకు రుణపడి ఉన్నట్లుగా, దాన్నిబట్టి మీరేదో సంపాదించుకున్నట్లుగా కాదు. ఆయన నిన్ను, మరియు విశ్వములోని సమస్తమును కలిగియున్నాడు. ఆయన మనకు ఋణపడిలేడు. అయితే, విశ్వాసముతో జరిగించబడుతున్న ప్రతి మంచి కార్యానికి ఆయన మనకు ఉచితంగా, కృపా సహితంగా ప్రతిఫలాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు.
5. భూమి మీద గుర్తింపులేని స్థితి పరలోకంలో ఇవ్వబడే గొప్ప ఫలానికి ఆటంకం కాదనే ప్రోత్సాహం
“దాసుడైనను స్వతంత్రుడైనను” జరిగించే ప్రతి మంచి కార్యానికి ప్రభువు ప్రతిఫలాన్నిస్తాడు. మీరు ఒక దాసుడని బహుశా మీ యజమాని మీ గురించి ఆలోచిస్తుండవచ్చు, లేక మీరు ఉనికిలో ఉన్నారనే విషయాన్ని గుర్తిస్తుండకపోవచ్చు. అది అసలు విషయమే కాదు. మీరు ఉనికిలో ఉన్నారని ప్రభువుకు తెలుసు. అంతిమంగా, నమ్మకమైన సేవ వ్యర్థమై పోదు.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web