సంఘ క్రమశిక్షణ మార్గదర్శకాలు
ఆటగాళ్లు ఆటల పోటీల్లో ఎలా ఆడాలో నేర్పిస్తున్నాడు గాని వారిని ఎన్నడును ఆట ఆడించని కోచ్ గురించి నీవేమనుకుంటావు? లెక్కలు ఎలా చేయాలో చెప్పుతున్నాడు, గాని విద్యార్థుల పరీక్ష పత్రాలను దిద్దని టీచరు గూర్చి నీవేమనుకుంటావు? లేదా, ఆరోగ్యం గూర్చి చెప్పుతున్నాడు గాని క్యాన్సర్ వ్యాధి గూర్చి చెప్పని వైద్యుని మాటేంటి?
వీరంతా వారు చేయాల్సిన పనిని సగం మట్టుకే చేస్తున్నారని నీవనవచ్చు. ఆటల పోటీల శిక్షణలో, ఎలా ఆడాలో చెప్పాల్సి ఉంటుంది, మరియు వారిని ఒకటి రెండుసార్లు ఆడించడం కూడ అవసరమవుతుంది. లెక్కలు, వివరించాలి మరియు సరిదిద్దాలి. వైద్యుడు ఆరోగ్యాన్ని ప్రోత్సహించాలి మరియు వ్యాధులనెదుర్కొనడం కూడ తెలియజెప్పాలి. అంతే కదా?
ఇంత వరకు బాగుంది. ఇప్పుడు సంఘం సంగతి ఆలోచిద్దాం. సంఘంలో మంచి బోధలు బోధింపబడుతున్నాయి, విశ్వాసులు శిష్యులుగా తీర్చిదిద్దబడుతున్నారు గాని సంఘంలో సంఘ క్రమశిక్షణ లేదు. ఇలాంటి సంఘం గూర్చి మీరేమనుకుంటారు? ఇది మీకేమైనా అర్థమయ్యిందా?
ప్రతి సంఘం బోధిస్తుంది, శిష్యులనుగా చేస్తుంది, కాని సంఘ క్రమశిక్షణను కొన్ని సంఘాలు మాత్రమే అమలుచేస్తున్నాయి. సమస్యేమంటే, సంఘ క్రమశిక్షణలేకుండా శిష్యులను తీర్చిదిద్దే సంఘమునూ, కణితులను నిర్లక్ష్యంచేసే వైద్యుడునూ ఒక్క లాగే ఉన్నారు.
సంఘంలో సంఘ క్రమశిక్షణను అమలుచేయకపోవడం వెనుక నున్న అయిష్టత నాకర్థమవుతుంది. ఇది ఎన్నో కారణాలనుబట్టి కష్టమైన విషయంగా ఉంది. అయినప్పటికిని, సంఘ క్రమశిక్షణ అమలుచేయుటకు గల అయిష్టత, మనలో అనేకులలో ఈ అయిష్టత ఉండుట, దేవుని కంటె మనమే ఎక్కువ జ్ఞానవంతులమని ప్రేమగలవారమని మనల్ని గురించి మనమే నమ్ముతున్నామని సూచింపవచ్చు. ఎంతైనా, దేవుడు, ‘‘ఆయన తాను ప్రేమించువారిని శిక్షించును (క్రమశిక్షణలో పెట్టును)’’; మరియు ‘‘తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును’’ (హెబ్రీ 12:5-6) అని చెప్తున్నాడు కదా. మరి దేవుని కంటె మనకే ఎక్కువ తెలుసా?
దేవుడు తన పిల్లలను వారి జీవితం, ఎదుగుదల, మరియు ఆరోగ్యం కోసమని వారిని క్రమశిక్షణలో ఉంచుతాడు: ‘‘మనం తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు (క్రమశిక్షణలో పెట్టుచున్నాడు)’’ (హెబ్రీ 12:10). ఔను, సంఘ క్రమశిక్షణ బాధాకరమైనదే, గాని ఎంతో ప్రయోజనకరమైనది: ‘‘ప్రస్తుతమందు సమస్త శిక్షయు దు:ఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును’’ (హెబ్రీ 12:11). విస్తారమైన నీతి మరియు సమాధానం! ఎంత చక్కని ఫలితం, కదా.
గులాబీ మొక్కల్లోని పనికిరాని రెమ్మలు, కొమ్మలు తొలగించడం ద్వారా గులాబీ పూగుత్తులు ఎలా ఎక్కువవుతాయో అలాగే, సంఘ క్రమశిక్షణ చివరకు సంఘ ఎదుగుదలకు దారితీస్తుంది. దీనినే, సంఘ క్రమశిక్షణ క్రైస్తవ శిష్యత్వంలో ఒక భాగమై ఉందని మరొక విధంగా చెప్పుకొనవచ్చు. ‘‘శిష్యుడు’’ మరియు ‘‘శిక్ష” లేదా “క్రమశిక్షణ” ఇవన్నీ చాలా దగ్గరి బంధువులు. ఈ పదాలు కూడ విద్యా వ్యవస్థలో నుండి తీసికొనబడినవి, విద్యాప్రపంచంలో నేర్పించడముంటుంది మరియు సరిదిద్దడము ఉంటుంది. సంఘంలో ‘‘నిర్మాణాత్మక క్రమశిక్షణ’’ (Formative Discipline) మరియు ‘‘సంస్కరించే క్రమశిక్షణ’’ (Corrective Discipline) ఉంటుందని ప్రస్తావించుకొనబడటం శతాబ్దాలుగా వస్తూనే ఉంది!
ఈ మార్గదర్శకాల్లో, సంఘ క్రమశిక్షణకు సంబంధించిన ప్రాథమిక విషయాలు దీనిని చదివేవారికి పరిచయం చేయాలనేదే నా గురి. ఇందులో ‘‘ఏమిటి,’’ ‘‘ఎప్పుడు,’’ ‘‘ఎలా,’’ మరియు ‘‘ఎందుకు’’ అనే పదాలు ఉపయోగించి సంఘ క్రమశిక్షణను వివరించాను.
సంఘ క్రమశిక్షణ అంటే ఏంటి?
సంఘాన్ని సంస్కరించే సంఘ క్రమశిక్షణ అంటే ఏంటి? సంఘ క్రమశిక్షణ అనేది సంఘ సమాజం మరియు దాని సభ్యుల జీవితంలోని పాపమును సరిదిద్దే ప్రక్రియ లేదా పద్ధతై ఉంది. అనగా, ఒకరిని ఏకాంతమందు మందలించడం ద్వారా పాపాన్ని సరిదిద్దడమని చెప్పుకొనవచ్చు. ఒకరి సంఘసభ్యత్వాన్ని అధికారికంగా తీసివేయడం ద్వారా అతని పాపాన్ని సరిదిద్దడమని చెప్పవచ్చు. సంఘ క్రమశిక్షణను ఎన్నో విధాలుగా అమలుచేయవచ్చు, గాని గురి మాత్రం ఎల్లప్పుడు, దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించడం ద్వారా దేవుని ప్రజలు చేసిన అతిక్రమాలను సరిదిద్దడమే.
ప్రతీకారం కాదు గాని నివారణాత్మకము, ముందుగానే సూచించేది, మరియు అభ్యంతరాలను ఊహించి సమాధానమివ్వడం
పాపమును గురించిన ఈ దిద్దుబాటు ప్రతీకార చర్య కాదు; అదే దేవుని న్యాయమైయున్నట్టు శాసించడము కాదు. గాని, విశేషంగా, అది నివారణాత్మకమైనదై, ముందుగా సూచించేదై, అభ్యంతరాలను ఊహించుకుంటూ సమాధానమివ్వడమై ఉంది. నివారణాత్మకము అనంటే, అది ఆ వ్యక్తి మరియు సంఘ సమాజం కూడ పవిత్రతలో అనగా దేవుని పోలికలో ఎదిగేట్టు సహాయం చేయడానికి ఉద్దేశింపబడిందని నా భావం. సంఘ సభ్యుడొకరు కొండెములు చెప్తున్నారు (గాసిప్ చేస్తున్నారు) లేదా ఇతరులెవరికైనా అపకీర్తి కలిగే మాటలు మాట్లాడుతుంటే, కొండెములు చెప్పే వారు వాటిని మానేసి, ఆ వ్యక్తి గూర్చి ప్రేమపూర్వకంగా మాట్లాడేట్టుగా, మరొక సభ్యుడు ఆ పాపాన్ని సరిదిద్దాలి. దేవుడు అన్యాయంగా హాని కలిగించేట్టు మాట్లాడడు అలాగైతే, ఆయన ప్రజలు కూడా అన్యాయంగా హానికలిగించేట్టు మాట్లాడకూడదు.
సంఘ క్రమశిక్షణ ప్రవచనాత్మకమైనది, అది ముందుగానే సూచించేదై ఉంది. అనగా అది తప్పును లేదా పాపమును దేవుని సత్యపు వెలుగులో స్పష్టంగా చూపిస్తుందనేది నా అర్థం. అది ఒక వ్యక్తి జీవితంలోగాని లేదా సంఘ జీవితంలోగాని ఉన్న కేన్సర్‌లాంటి పాపమును, అది పూర్తిగా తొలగింపబడునట్లు బట్టబయలు చేస్తుంది. మారు వేషాలు వేయడంలో పాపం ఆరితేరిందే. ఉదా॥ కొండెములు చెప్పడం. ‘‘భక్తిగల ఆందోళన’’ అనే ముసుకు ధరించడానికి గాసిప్ ఇష్టపడుతుంది. ఆ వ్యక్తి గాసిప్ చెయ్యడానికి సరైన కారణమున్నదని, శ్రద్ధతో కూడినవని కూడా అనుకోవచ్చు. అయినను శిష్యుడైన సంఘసభ్యుడు పాపమును, అది పాపమైయున్నందుకు దానిని బయటపెడతాడు. ప్రతి సభ్యుడు తెలిసికొని ప్రయోజనం పొందునట్లు అతడు పాపమును, పాపం చేసినవానికి మరియు దానికి సంబంధించిన ప్రతి ఒక్కరి ముందు దానిని బయటపెడతాడు.
సంఘ క్రమశిక్షణ అభ్యంతరాలను ఊహించి సమాధానమివ్వడమై ఉంది అని అంటే, అది రానున్న మరింత గొప్ప తీర్పు గురించి హెచ్చరిస్తున్న చిన్న చిత్రం లేదా వివరమైయున్నదనేది నా అర్థం (ఉదా॥ 1 కొరింథీ 5:4-5). ఈ హెచ్చరిక కృపతో కూడినదై ఉంది, అది లేకపోతే ఈ హెచ్చరికకు అర్థమే లేదు. ఒక విద్యార్థి నెల నెలా పెడుతున్న పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నాడు గాని ఆ విద్యార్థిని నిరుత్సాహపర్చకూడదనే ఉద్దేశంతో ఆ టీచర్ పాస్ మార్కులిస్తున్నాడు. అయితే, సంవత్సరాంతపు పరీక్షల్లో ఫెయిల్ చేయబడ్డాడని అనుకుందాము. అపుడు ఏం ప్రయోజనం? ఇది కృపతో కూడిన కార్యం కాదు కదా! అదే విధంగా, పాపములో పట్టబడిన వ్యక్తితో, ‘‘జాగ్రత్త సుమా, నీవు ఇదే ప్రకారంగా చేస్తూవుంటే, రాబోవు దినాల్లో యింత కంటె పెద్ద శిక్షపడుతుంది. గనుక దయచేసి మానెయ్యి” అని సంఘ క్రమశిక్షణ ఆ వ్యక్తికి ప్రేమతో చెప్తుంది.
మనుష్యులు క్రమశిక్షణను ఇష్టపడకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. అది కష్టమనిపిస్తుంది. గాని ప్రస్తుతకాల చిన్న చిన్న హెచ్చరికలతో పోలిస్తే, రానున్న గొప్ప తీర్పు గూర్చి దేవుడు తన ప్రజలను ముందుగానే హెచ్చరిస్తున్నాడంటే, దేవుడు ఎంత గొప్ప కనికరముగల దేవుడై యున్నాడు, కదా!
సంఘ క్రమశిక్షణ గురించి బైబిలు వేదాంత పునాదులు
సంఘ క్రమశిక్షణ వెనుక విమోచన చరిత్రకు సంబంధించిన గంభీరమైన ఆలోచనలలో ఒక ప్రణాళిక ఉన్నది. అదేంటంటే, పతనమైన దేవుని ప్రజలు ఆయన దయగల మరియు జీవమునిచ్చే పాలనను సృష్టియందంతటను విస్తరిస్తూ మరొక సారి దేవుని స్వరూపం యొక్క ప్రతినిధులుగా వారిని పున:రుద్ధరించుటయే (ఆది 1:26-28; 3:1-6).
ఆదాము హవ్వ దేవుని ప్రతినిధులై యుండిరి. అలాగే ఇశ్రాయేలు రాజ్యం కూడ. అయినను ఆదాము హవ్వలు తమ సొంత నియమనిబంధనల ప్రకారం పాలించాలనే కోరిక చేత ప్రేరేపింపబడినందున, దేవుని పాలనకు లోబడటంలో విఫలులయ్యారు గనుక వారు దేవుని స్థలములో నుండి, ఏదెను తోటలో నుండి వెళ్లగొట్టబడ్డారు. అలాగే ఇశ్రాయేలీయులు కూడ దేవుని చట్టమును పాటిస్తూ ఆయన గుణగణాలను ఇతర జనాంగాలకు కనుపర్చుటలో విఫలులయ్యారు గనుక వారు చెరగా కొనిపోబడ్డారు.
దేవుని స్వరూపమందు సృజింపబడిన జీవులంగా, మన క్రియలు సహజంగానే, అద్దం ముందు నిలబడ్డ వ్యక్తి రూపాన్ని అది చూపించినట్లు, ఆయనను చూపిస్తుంటాయి. సమస్యేమంటే, ప్రజలను ఆహ్లాదపర్చడానికి తమాషాకి మనుష్యులను తప్పుగా చూపించే అద్దాలలానే, పతనమైన మానవజాతి దేవుని స్వరూపాన్ని వక్రీకరిస్తున్నది, పాడుచేస్తున్నది. ఉదా॥ పతనమైన మానవజాతి అబద్ధాలు మాట్లాడుతుంది. గనుక దేవుని మాటలను నమ్మలేమని లోకం చెప్పుకుంటుంది. యథా రాజ, తథా ప్రజ అన్నట్టు, సృష్టికర్త ఎలా ఉంటే ఆయన చేసిన సృష్టి కూడా అలాగే ఉంటుంది. అందుచేత ఆయన ప్రజలు అబద్ధికులు కాబట్టి ఆయన కూడా అబద్ధికుడే అనుకుంటుంది. ఇది ఎంత బాధకరం!
ఆలోచించండి! దేవుని కృపని జ్ఞాపకం చేసుకొంటే, ఆదాము సంతానమైన ఒక కుమారుడు, మరియు ఇశ్రాయేలు వంశంలో పుట్టిన ఒక కుమారుడు దేవుని ఆజ్ఞలను సంపూర్ణంగా పాటించారు. ఇతనినే పౌలు, ‘‘అదృశ్యదేవుని స్వరూపి’’యని క్రీస్తుని వర్ణిస్తున్నాడు (కొలస్స 1:15). కాబట్టి ఈ కుమారునితో ఐక్యపరచబడినవారు అదే ‘‘స్వరూపమును’’ ధరించినవారై యుండాలని పిలుపు ఇవ్వబడుతున్నది. సంఘ జీవితం ద్వారా దీనిని ‘‘మహిమ నుండి అధిక మహిమకు’’ మార్చబడటాన్ని మనం చూస్తాం (2 కొరింథీ 3:18; రోమా 8:29; 1 కొరింథీ 15:49; కొలస్స 3:9-10 చూడుము).
స్థానిక సంఘాలు ఈ లోకంలో దేవుని స్వరూపమును యథార్థంగాను, నిజాయితీతోను అంతకంతకు ఎక్కువగా చూపించే విశ్వాసులను కనుగొనడానికి ప్రజలు చేరుకొనే స్థలాలై యుండాలి. స్థానిక సంఘాల్లోని పరిశుద్ధతను, ప్రేమను, మరియు ఐక్యతను లోకం కన్నులారా చూచినప్పుడు, ప్రజలు దేవుడు ఇలా ఉంటాడు కదా అని చక్కగా అర్థం చేసుకొని ఆయనను స్తుతిస్తుంటారు (మత్తయి 5:14-16; యోహాను 13:34-35; 1 పేతురు 2:12). అలాగైతే, సంఘ క్రమశిక్షణ, తన సొంత సభ్యుడొకరు దేవునికి లోబడక, దేవుని పరిశుద్ధతను, ప్రేమను, లేదా ఐక్యతను చూపించనప్పుడు సంఘం చూపించే ప్రతిస్పందనయై ఉంది. అది, క్రీస్తు శరీరమైయున్న సంఘం యొక్క జీవితంలో తప్పుడు స్వరూపాలు తలెత్తునప్పుడు, అద్దం మీది మరకలను తొలగించడానికి తుడిచినట్టు, వాటిని సరిచేయడానికి చేయబడే ఒక ప్రయత్నమై ఉంది.
సంఘ క్రమశిక్షణకై వాక్య ఋజువులు
స్థానిక సంఘ సమాజాలు తమ సొంత సభ్యులను క్రమశిక్షణలో పెట్టుటకు యేసు, మత్తయి 16:16-19 మరియు 18:15-20లో సంఘానికి అధికారమిస్తున్నాడు. మత్తయి 16:18లో మొదట పేర్కొనబడిన, భూలోకమందు బంధించడానికి మరియు విప్పడానికివ్వబడిన శక్తిగల తాళాలు, మత్తయి 18:15-20లో స్థానిక సంఘ సమాజానికి ఇవ్వబడ్డాయి. ఈ విషయం గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు ఈ క్రింద జాగ్రత్తగా చూద్దాము.
సంఘ క్రమశిక్షణ గూర్చి పౌలు తన పత్రికల్లో అనేక చోట్ల వర్ణిస్తున్నాడు: 1 కొరింథీ 5, 2 కొరింథీ 2:6, గలతీ 6:1, ఎఫెసీ 5:11, 1 థెస్స 5:14, 2 థెస్స 3:6-15, 1 తిమోతి 5:19-20, 2 తిమోతి 3:5, మరియు తీతు 3:9-11.
యోహాను, సంఘ క్రమశిక్షణ గూర్చి 2 యోహాను 10వ వచనంలో ప్రస్తావిస్తున్నాడు. ఇదే విషయం యూదా మనస్సులో కూడ ఉన్నట్టు (యూదా 22-23 వచనాలు) కనబడుతున్నది. ఇంకాఎన్నో వచనాలు ఇక్కడ చెప్పుకోవచ్చు. యేసుగాని మరియు బైబిలు గ్రంథకర్తలుగాని, వారి శ్రోతలు తమ జీవితంలోని పాపాన్ని ఒకరికొకరు సరిదిద్దుకోవాలని చెప్పినపుడెల్లా, సంఘ క్రమశిక్షణనే వారి మనస్సులో ఉండింది.
సంఘం, సంఘ క్రమశిక్షణను ఎప్పుడు అమలు చేయాలి?
సంఘం, క్రమశిక్షణను ఎప్పుడు అమలు చేయాలి? ఒక్క మాటలో జవాబు చెప్పాలంటే, ఎవరైనా పాపం చేసినప్పుడు అని చెప్పవచ్చు. అయితే ఇదే సమాధానం కొంత వేరుగా ఉండవచ్చు. మనం అనధికార సంఘక్రమశిక్షణ (Informal Discipline) గురించి చెప్పుకుంటున్నామా లేక అధికారిక సంఘక్రమశిక్షణ (Formal Discipline) గురించి చెప్పుకుంటున్నామా, జే ఆడమ్స్ ప్రతిపాదించిన ఏకాంత దిద్దుబాటు పద్ధతిని ఉపయోగించాలా లేక బహిరంగంగా సంఘమంతటి ముందు జరిపింపబడే దిద్దుబాటు పద్ధతిని ఉపయోగించాలా అనే దాని ఆధారంగా ఇది వేరుగా ఉంటుంది.
ఏ పాపమైనా, అది ఎంత తీవ్రమైనదైనా కాకపోయినా, విశ్వాసులైన ఇద్దరు సహోదరుల లేదా సహోదరీల మధ్య ఏకాంతంగా సరిచేయవచ్చు. అలాగని, సంఘ సభ్యుడు చేసే ప్రతి పాపం గురించి అతన్ని గద్దించాలని కాదు కానీ పాపం ఎంత చిన్నదైనా, ఇద్దరు క్రైస్తవులు వ్యక్తిగతంగా దాని గూర్చి ప్రేమతో ఒకరితోనొకరు చర్చించుకోవాలి అనే విషయం మనకి తెలియజేస్తుంది.
ఏ పాపాల విషయంలో అధికారపూర్వకంగా లేదా సంఘమంతా కలిసి సంస్కరించే క్రమశిక్షణను (Corrective Discipline) అమలుచేయవలసి ఉంటుందనే ప్రశ్న వచ్చినప్పుడు, మనం యింకా కొంచెం ఎక్కువ జాగ్రత్తగా నడుచుకోవలసి యుంటుంది.
బైబిలు జాబితాలు
కొందరు పాతకాలపు వేదాంతవేత్తలు, సంఘం అధికారికంగా క్రమశిక్షణను (Formal Discipline) అమలు చేయడం ఎప్పుడు తగిన సందర్భమవుతుందో చెప్పే జాబితాలను ప్రతిపాదించారు. ఉదా॥ సేవకుడైన జాన్ యాంగెల్ జేమ్స్, 5 రకాలైన పాపాల విషయంలో క్రమశిక్షణ అమలు చేయబడాలని అన్నాడు: (1) అపకీర్తిపాలుజేసే అన్ని దుర్గుణాలు మరియు నీతిలేని పనులు (ఉదా॥ 1 కొరింథీ 5:11-13); (2) క్రైస్తవ సిద్ధాంతాలను ఒప్పుకొనకపోవడం (ఉదా॥ గలతీ 1:8; 2 తిమోతి 2:17-21; 1 తిమోతి 6:35; 2యోహాను 10. (3) సంఘంలో విభజనలు పురికొల్పుట (తీతు 3:10); (4) అక్కరలో ఉన్న సమీప బంధువుకు సహాయం చేయకపోవడం (ఉదా॥ 1 తిమోతి 5:8); (5) సమాధానపడని వైరము (ఉదా॥ మత్తయి 18:7).1
ఈ రకమైన బైబిలు జాబితాలు పేర్కొనబడిన విషయంలో సహాయకరంగా ఉంటాయి. పేర్కొనబడిన పాపములన్నీ తీవ్రమైనవి మరియు అవి బయటికి వ్యక్తమవుతుంటాయనే విషయం గమనించండి. అవి కేవలం హృదయంలో దాగియుండే అంతర్గత పాపములు కావు; వాటిని కంటితో చూడొచ్చు, చెవులతో వినొచ్చు. ఇవి లోకాన్ని మరియు ఇతరులను క్రైస్తవ్యం గురించి తప్పుదోవ పట్టిస్తాయి.
అయినను, ఇలాంటి జాబితాలు బైబిలులో ఎన్నడునూ పేర్కొనబడని అనేక పాపాలను తెలియజెప్పవు (ఉదా: అబార్షన్ సంగతేంటి?), మరియు, సంఘక్రమశిక్షణ గురించిన వాక్యభాగాలు ఏదైన ఒక నిర్దిష్టమైన పాపమును పేర్కొనవచ్చు. ఉదా॥ 1 కొరింథీ 5వ అధ్యాయం, ఒకడు తండ్రి భార్యతో శయనించడము గూర్చి చర్చిస్తున్నది; గాని సంఘాలు ఈ ఒక్క పాపము విషయంలో మాత్రమే క్రమశిక్షను అమలు చేయాలనేది ఖచ్చితంగా పౌలు భావం కాదు. ఇలాంటి ఉదాహరణముల ద్వారా తెలుస్తున్న వివరాలు, ఇతర పాపాలకు కూడా వర్తించవచ్చునని సంఘాలు వీటిని ఎలా అన్వయించాలి?
వెలుపటి, తీవ్రమైన, మరియు మారుమనస్సుపొందని (పశ్చాత్తాప పడని)
బైబిలు వివరాలను క్లుప్తంగా చెప్పాలంటే, వెలుపటి, తీవ్రమైన, మరియు మారుమనస్సు పొందని పాపముల సందర్భాల్లో అధికారిక సంఘక్రమశిక్షణ (Formal Discipline) అవసరమని చెప్పవచ్చు. పాపానికి రుజువు లేదా బయటికి కనిపించేదిగా తప్పనిసరిగా ఉండాలి. అది కంటికి కనబడాలి, చెవులకు వినబడాలి. సంఘాలు, ఒకని హృదయంలో దురాశ లేదా గర్వమున్నదని అనుమానించిన ప్రతిసారి, ఇలా చేస్తే వెలివేయబడతావు, జాగ్రత్త అంటూ ఆ వ్యక్తిని మరుక్షణమే భయపెట్టొద్దు. అలాగని, హృదయంలో ఉండే పాపములు తీవ్రమైనవి కావని చెప్పడం లేదు. గాని, ఒకని హృదయంలోపల ఏముందో మనం చూడలేము గాని దేవుడు చూస్తాడు. మరియు హృదయంలోని పాపములు చివరకు ఏదో ఒక దినాన, ఏదో ఒక విధంగా బయటపడతాయి (1 సమూ 16:7; మత్తయి 7:17 మొదలుకొని; మార్కు 7:21).
రెండవది, పాపం తీవ్రమైనదై యుండాలి. ఉదా॥ ఒక సహోదరుడు ఒక సంఘటన గురించిన వివరాలను ఉన్నవి ఉన్నట్టుగాక పెద్దదిచేసి చెప్పడం నేను గమనించవచ్చు. అప్పుడు నేనతడు ఒంటరిగా ఉన్నప్పుడు కలుసుకొని ఈ విషయమై మందలించవచ్చు. గాని, అతడు దీనిని ఒప్పుకోకపోయినప్పటికిని, నేనతన్ని సంఘం ముందుకు లాగను. ఎందుకు లాగకూడదు? మొదటిదిగా, జరిగిన సంఘటనలకు పెద్దదిచేసి చెప్పడం వంటి పాపం, విగ్రహారాధన మరియు స్వీయసమర్థనవంటి ఇంత కంటె ఎక్కువ ముఖ్యమైన మరియు కంటికి కనబడని పాపములలో వేళ్లూని ఉంది. ఇలాంటి పాపముల గూర్చి చర్చించడానికి నేనావ్యక్తితో వ్యక్తిగతంగా సమయం గడపాలని ఆశిస్తాను. రెండవదిగా, ఈ విధంగా సంఘ జీవితంలోని ప్రతి చిన్న పాపము విషయంలో తప్పుపట్టుతున్నట్లయితే, అది చివరకు సభ్యులలో మతిస్థిమితం వచ్చేట్లు చేసి వారిని ఆజ్ఞల నియంతృత్వం (లీగలిజం) వైపు నెట్టవచ్చు. మూడవదిగా, సంఘ జీవితంలో, ‘‘అనేక పాపములను కప్పుటకు’’ సహోదర ప్రేమ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరమున్నది (1పేతురు 4:8). ప్రతి పాపం గూర్చి విపరీతమైన లోతుల్లోకి త్రవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన విషయంలో దేవుడు అలా చేయలేదు.
చివరగా, మారుమనస్సు పొందని పాపం విషయంలో అధికారిక సంఘ క్రమశిక్షణ సరైనదై ఉంది. పాపంలో తీవ్రంగా చిక్కుకొనిపోయిన వ్యక్తి, బైబిలులో దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞల ఆధారంగా, ఒంటరిగా ఉన్నప్పుడు మందలింపబడ్డాడు. అయినా గాని అతడు ఆ పాపాన్ని మానెయ్యడం లేదు, మానెయ్యడానికి నిరాకరిస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే, అతడు యేసు కంటె ఎక్కువ ఆ పాపముకే విలువనిస్తూ దానినే ప్రేమిస్తున్నాడు. దీనికి, ఈ క్రింద చెప్పబడినట్లు, ఒక విధమైన మినహాయింపు ఉండవచ్చు.
సంస్కరించు సంఘక్రమశిక్షణలో (Corrective Discipline) నేను మొదటిసారి పాల్గొన్నప్పటి అనుభవంలో పైన పేర్కొనబడిన మూడు అంశాలున్నాయి. సరిచేయబడిన వ్యక్తి నాకు మంచి స్నేహితుడు మరియు ప్రతి రోజూ ఇద్దరం కలిసి జాగింగ్ చేసేవాళ్లం. అయినను, అతడు లైంగికపరమైన పాపపు జీవితం జీవిస్తున్నాడని ఒక లంచ్ సమయంలో అతడు చెప్పేంత వరకు నాకు గాని, సంఘానికి గాని తెలియదు. ‘ఇలాంటి విషయం గూర్చి బైబిలు ఏమి చెప్పుతున్నదో తెలుసా?’ అని నేనతన్ని వెంటనే అడిగాను. తెలుసన్నాడు. అయినను, అతడు దేవునితో సమాధానపడినట్టు చెప్పాడు. కానీ అతడు ఆ పాపంలోనే కొనసాగాడు, అతడు మారుమనస్సు పొందాలని నేను బ్రతిమిలాడాను. చివరికి ఇతరులు కూడ ఈ ప్రయత్నం చేశారు. గాని అతడు మా అందరికి ఒకే మాట చెప్పాడు: ‘‘ఆ విషయంలో అదేం తప్పులేదు, దేవుడు దాన్నీ అంగీకరిస్తాడు” అని. ఇలా చాలా నెలల వరకు మా సంభాషణలు కొనసాగాయి. ఫలితం కనబడలేదు. చివరకు సంఘం అతన్ని అధికారికంగా సంఘ సహవాసంలో నుండి తొలగించింది. అతని పాపం తీవ్రమైనదై యుండింది, అతడు మారుమనస్సు పొందలేదు, మరియు బాహ్యంగా అది కంటికి కనబడుచుండింది, చెవులకు వినబడుచుండింది. ఒకడు క్రైస్తవుడై యుండుట అంటే ఏమిటో అనే విషయంలో అతడు చేస్తున్న పాపం, సంఘంలో ఉన్నవారిని మరియు సంఘానికి వెలుపట ఉన్నవారిని తప్పుదారి పట్టిస్తుంది. ఇతన్ని ఒప్పించడానికి సంఘం వరుసగా చాలా నెలల వరకు ప్రయాసపడింది. మేమతన్ని ప్రేమించాం. అతడు ఆ పాపమును విడిచిపెట్టి, ఈ లోకం ఇవ్వగలిగిన అన్నిటి కంటెను యేసే ఎక్కువ విలువైనవాడని అతడు తెలిసికోవాలని ఎంతో ఆశించాం. అయినను, అతడు మారాలనే ఉద్దేశం అతనిలో లేనట్టే దాదాపుగా స్పష్టమయ్యింది. అతడు తాను పట్టిన పట్టును వదలలేదు. పాపం కావాలా లేక దేవుని వాక్యం కావాలా అనంటే, అతడు పాపమునే ఎన్నుకున్నాడు. గనుక సంఘం అధికారిక సంఘ క్రమశిక్షణ చర్యను చేపట్టక తప్పలేదు.
సంఘం క్రమశిక్షణను ఎలా అమలు చేయాలి?
ఒక సంఘం, సంఘ క్రమశిక్షణను ఎలా అమలు చేయాలి? దీనికి సంబంధించిన ప్రాథమిక క్లుప్త వర్ణనను యేసు మత్తయి 18:15-17లో సెలవిచ్చాడు. ఆయన తన శిష్యులతో ఇలా చెప్పుతున్నాడు,
‘‘మరియు నీ సహోదరుడు నీ యెడల తప్పిదము చేసిన యెడల, నీవు పోయి, నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దింపుము. అతడు నీ మాట వినిన యెడల, నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని యెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని యెడల, ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు వినని యెడల, అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.’’
ఇక్కడ ఒక విషయం గమనించండి. ఒకరిని గాయపర్చడం ఇద్దరు సహోదరుల మధ్య మొదలవుతుంది. కాబట్టి ఈ ఇద్దరి మధ్య సమాధానం కుదరాలి గనుక దీనికి సంబంధించిన ప్రతిస్పందన మొదట ఈ ఇద్దరి మధ్య జరగాలి. దీనికి సంబంధించిన ప్రక్రియను లేదా పద్ధతిని యేసు నాలుగు దశలుగా వివరిస్తున్నాడు.
నాలుగు ప్రాథమిక దశలు
1. సంబంధిత పాపము గురించిన సమస్య ఇద్దరి మధ్యనే పరిష్కరింపబడినట్లయితే, దాని గురించి ముందుకు సాగనవసరము లేదు. అది అంతటితో అయిపోయినట్లే.
2. ఒకవేళ పరిష్కరింపబడనట్లయితే, ‘‘ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు’’ తన యెడల పాపము చేయబడిన సహోదరుడు ఇంకా ఇద్దరు లేదా ముగ్గురి తోడుకొని రావాలి (మత్తయి 18:16). యేసు ఈ పదజాలమును ద్వితీ. 19వ అధ్యాయంలో నుండి తీసుకుంటున్నాడు. ఒకరిపై తప్పుడు నిందలు మోపబడకుండునట్లు ఈ చర్య ఉద్దేశింపబడింది. వాస్తవానికి, చేయబడిన నేరం గూర్చి ఎలాంటి సందేహమున్నా, ‘‘అది బాగుగా విమర్శింపబడవలెనని’’ వాక్యం కోరుతుంది (ద్వితీ 19:18). అదే విధంగా, క్రైస్తవులు సత్యం మరియు న్యాయం గురించి చింతించువారై యుండాలంటే, అందుకు తగిన పట్టింపు లేదా శ్రద్ధ ఉండాలని యేసు భావించియున్నాడని నేను అర్థంచేసుకుంటున్నాను. ఈ ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు చేయాల్సిన పనేంటంటే, చేయబడిన పాపము నిజంగా తీవ్రమైనది మరియు అది బాహ్యమైనదని ధృవీకరించాలి; అలాగే, పాపము చేసినవాడు నిజంగా పశ్చాత్తాపపడలేదని కూడ ధృవీకరించాలి. ఇద్దరు ముగ్గురు సాక్షులను తీసుకరావడం వలన, పాపం చేసినవానికి బుద్ధివచ్చునట్లు చేయగలదు లేదా ఎవరైతే గాయపరచబడ్డారో ఆ వ్యక్తి అంతగా నొచ్చుకోనవసరం లేదని తెలుసుకొనేట్లు ఇది అతనికి సహాయకరంగా ఉంటుంది. ఈ దశకు మరియు దీని ముందటి దశలో ఇరువర్గాలు చాలా సార్లు కలిసికొని సంభాషించవలసి రావచ్చు. పరిస్థితిని బట్టి వివేకంగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి.
3. ఇద్దరు ముగ్గురు సాక్షుల జోక్యం వలన కూడా ఎలాంటి పరిష్కారం కుదరనట్లయితే, బాధితుడు ఈ విషయాన్ని సంఘానికి తెలుపాలని కోరుకుంటాడు (మత్తయి 18:17). నా సొంత సంఘంలో, ఇదే పద్ధతి సంఘ కాపరుల ద్వారా చేయబడుతుంది, ఎందుకంటె సంఘ వ్యవహారాలన్నిటిని పర్యవేక్షించడానికి ప్రభువు సంఘానికి కాపరులను సమకూర్చాడు (1 తిమోతి 5:17; హెబ్రీ 13:17; 1 పేతురు 5:2). తీవ్రమైన, బాహ్య లక్షణాలుగల మరియు మారుమనస్సు పొందని (పశ్చాత్తాపపడని) పాపము చేసిన వ్యక్తి పేరును కాపరులు ప్రకటిస్తారు. వారు ఆ పాపము గూర్చి చాల క్లుప్తంగా వివరిస్తారు. అది ఇతరులు తొట్రిల్లకుండాలని, అలాగే ఆ వ్యక్తి కుటుంబమునకైనా అనవసరమైన ఇబ్బంది కలుగజేయకూడదనేట్టుగా వివరింపబడుతుంది. ఇదే పద్ధతి ప్రకారం, సంఘం పాపం చేసిన వ్యక్తిని కనుగొని ఆ వ్యక్తి ఆ పాపం విషయంలో మారుమనస్సు పొందునట్లు ప్రార్థనాపూర్వకంగా ఆ వ్యక్తిని ఒప్పించడానికి రెండు నెలల సమయం ఇవ్వబడుతుంది.
4. సంఘ క్రమశిక్షణలోని చివరి దశ: ఆ వ్యక్తిని సహవాసంలో నుండి లేదా సంఘ సభ్యత్వంలో నుండి తొలగించుట. అనగా, ఆ వ్యక్తి ప్రభు భోజన సంస్కారంలో కూడ పాల్గొనకూడదని అర్థం: ‘‘అతడు సంఘపు మాటయు వినని యెడల, అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము’’ (మత్తయి 18:17). అతనిని దేవుని నిబంధన ప్రజలకు వెలుపల ఉన్న వ్యక్తిగా ఎంచాలి, క్రీస్తు యొక్క నిబంధన భోజనంలో (ప్రభు బల్లలో) పాల్గొనకూడని వానిగా ఎంచాలి (అయితే, అతడు సంఘ కూడికలకు హాజరయ్యేట్లు ప్రోత్సహింపబడవచ్చు). ఇవ్వబడిన రెండు నెలల కాలములో ఆ వ్యక్తి మారనట్లయితే, ఆ పాపమును విడిచిపెట్టడానికి నిరాకరించినట్లయితే, మా సొంత సంఘం ఈ చర్యను తీసుకుంటుంది. రెండు నెలలు అనేది, ఖచ్చితమైన సంఖ్య కాదు. ఏదైన ఒక పరిస్థితిలో, ఈ రెండు నెలల సమయాన్ని సంఘం తగ్గించవచ్చు, పొడిగించవచ్చు.
ఎందుకని కొన్నిసార్లు సంఘ క్రమశిక్షణ వేగం తగ్గించాలి లేదా పెంచాలి?
కొన్నిసార్లు ఈ సంఘ క్రమశిక్షణ ప్రక్రియ నిదానంగా సాగుతుంది. ఉదా॥ అపరాధం చేసిన వ్యక్తి తన తప్పులో నుండి బయటపడటానికి ప్రయత్నించుటకు కొంత ఆసక్తిని కనుపర్చినప్పుడు, నిదానంగా సాగుతుంది. అతడు ఏం పాపము చేశాడు, దాని లక్షణమేంటి అనేది మాత్రమే కాదు గాని, పాపి యొక్క స్వభావం ఎలాంటిదని కూడ ఆలోచించాల్సి వుంటుంది. సూటిగా చెప్పాలంటే, వేర్వేరు పాపుల విషయంలో వేర్వేరు పద్ధతులు, వ్యూహాలు అనుసరించాల్సి వుంటుంది. ఉదా॥ పౌలేమంటున్నాడు, ‘‘అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనియ్యుడి, అందరి యెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి’’ (1 థెస్స 5:14). కొన్నిసార్లు మనుష్యులు అక్రమంగా నడుచుకుంటున్నారో లేదా వారి పాపము పట్ల ఉదాసీనంగా ఉంటూ ఎవరేంచెప్పినా పట్టించుకొనడం లేదో, లేదా వారు నిజముగానే బలహీనులై యున్నారో వెంటనే బయటపడదు.
నేను ఒక సహోదరుని సరిదిద్దుటకు చేసిన ప్రయత్నం నాకింకా జ్ఞాపకమున్నది. అతడు ఒక విధమైన వ్యసనానికి బానిసయ్యాడు. అతడు తన నైతిక లోపాల విషయం కుంటిసాకులు చెప్తున్నాడో, లేదా అతని ఆత్మ నిజముగానే బలహీనమై, సంవత్సరాల కొలది చేస్తున్నందున తన ఆత్మనే బండబారినట్లయ్యిందో, లేదా ఆ పాపము చేయకుండా ఉండటానికి అతడు ఎందుకంత కష్టపడుతున్నాడో, నాకు చాలా కాలం వరకు ఖచ్చితంగా అర్థం కాలేదు. ఇలాంటి ప్రశ్నలకు వచ్చే జవాబులు, క్రమశిక్షణ విషయమైన తుది నిర్ణయానికి ఎంత త్వరగా రావాలో, లేక సమయం తీసుకోవాలో, తప్పక ఆలోచింపజేస్తాయి.
కొన్నిసార్లు ఈ ప్రక్రియను త్వరగా ముగించాల్సిన అవసరం రావచ్చు, అలాంటప్పుడు మత్తయి 18లో యేసయ్య వివరించిన ఒకటి రెండు దశలు పాటించకుండా విడిచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమశిక్షణ పద్ధతిని వేగవంతం చేయడానికి అధికారమిచ్చు స్పష్టమైన బైబిలు అనుమతులు రెండున్నాయి: (1) సంఘంలో విభజనలు మరియు (2) బహిరంగ అపకీర్తి (అనగా, సంఘానికి ఆవల సమాజంలో క్రీస్తు గూర్చి, క్రైస్తవ్యము గూర్చి తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచే పాపము). మొదటి దాని గూర్చి, పౌలు ఇలా చెప్పుతున్నాడు, ‘‘మతభేదములు కలిగించు మనుష్యునికి, ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత, వానిని విసర్జించుము’’ (తీతు 3:10). ఈ సందర్భములో పౌలు మనస్సులో ఏ విధమైన పద్ధతి ఉండిందో పూర్తిగా స్పష్టంగా తెలియడములేదు. గాని సంఘ క్షేమము దృష్టిలో ఉంచుకొని, విభజనలు చేయువారి విషయంలో, సంఘం వీలైనంత త్వరగా మరియు ఒక స్థిరమైన నిర్ణయంతో ప్రతిస్పందించాలని అతని మాటలు చెప్పుతున్నాయి.
1 కొరింథీ. 5వ అధ్యాయం చూస్తే, యింకా వేగవంతమైన పద్ధతి కనబడుతుంది. బహిరంగంగా అపకీర్తిపాలుజేయు పాపం చేసిన వ్యక్తిని, క్రైస్తవేతర సమాజం కూడ ఆమోదించని పాపం చేసిన వానిని సంఘం వెంటనే తొలగించాలని పౌలు చెప్పుతున్నాడు. వాస్తవానికి, ఆ వ్యక్తి పశ్చాత్తాపపడి ఆ విషయంలో మారుమనస్సు పొందవచ్చు గనుక అతన్ని ఒకసారి హెచ్చరించండని కూడ సంఘానికి చెప్పడం లేదు. ‘‘అట్టివానిని సాతానుకు అప్పగింపవలెనని’’ సూటిగా చెప్పుతున్నాడు (వ4-5).
మారుమనస్సు పొందడం గురించిన ప్రశ్నను ఎందుకు విడిచిపెట్టాలి, అతనికి మరొక తరుణం ఎందుకివ్వగూడదు? పౌలు అలాగంటున్నాడంటే, అతనికి మారుమనస్సు గూర్చి గాని లేదా మరొక తరుణమివ్వడం గూర్చి ఆసక్తిలేదని కాదు. గాని, విశేషంగా, ‘‘ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు’’ అతన్ని తొలగించండని చెప్పుతున్నాడు (వ4-5). ఖచ్చితంగా, ఆ వ్యక్తి నిజంగా మారుమనస్సు పొందినట్లు రుజువుచేస్తే సంఘం తప్పక అతన్ని చేర్చుకొనాలనే పౌలు తెలియపరుస్తున్నాడు (2కొరింథీ 2:5-8 చూడుము). అయితే, ఇక్కడి విషయమేమంటే, అతని పాపం అందరికీ తెలిసిపోయింది, క్రీస్తు అంటే ఇదేనేమో అని అర్థం చేసుకొనే అవకాశం అతను ఇచ్చాడు. కాబట్టి, సంఘం కూడ బహిరంగంగా, అందరికీ తెలిసేట్టు, ‘‘దీనిని మేము అంగీకరించం! క్రైస్తవులు దీనిని చేయరు!’’ అని ప్రకటించే చర్య తీసుకోవాలి.
1కొరింథీ. 5వ అధ్యాయంలో, ఆ వ్యక్తి పాపము చేయుచుండినాడో లేదో అనేదాని ప్రస్తావన లేదు. ఈ విషయం అందరూ అంగీకరించిన వాస్తవమై ఉండింది. ఏదైతేనేమి, అది అపకీర్తిపాలుజేసే పాపమైనప్పటికిని, అది జరిగిందో లేదో అనే ఒక ప్రశ్న, సందేహం తలెత్తినప్పుడు, దీని గూర్చి క్షుణ్ణంగా ఆరాతీయడానికి సంఘం కావలసినంత సమయం తీసుకోవాలి. మత్తయి 18వ అధ్యాయంలో యేసు చెప్పింది కూడా ఇదే. ఉదా॥ ఒకడు తనకు ఒప్పగింపబడిన సొత్తును అపహరించాడంటూ వినబడుచుండు వదంతుల ఆధారంగా (ఇది బహిరంగంగా అపకీర్తిపాలుజేసే పాపము) ఒక సంఘం అతనిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టలేదు. మూడు నెలల తరువాత ఇదే కేసు, కావలసినన్ని రుజువులు లేనందుకు, కోర్టులో కొట్టివేయబడుతుంది.
అలాగైతే, క్రమశిక్షణ గూర్చి త్వరగా ఒక నిర్ణయానికి వచ్చుటకు సంఘం ఆలోచించాల్సిన రెండు విషయాలేంటి? సంఘం తన క్రమశిక్షణ గురించిన నిర్ణయానికి ఈ క్రింది సందర్భాలలో త్వరగా రావచ్చు: (1) సంఘ ఐక్యతకు భంగం కలుగవచ్చుననే తక్షణ ప్రమాదం ఉన్నప్పుడు లేదా, (2) చేయబడిన పాపం సమాజంలో క్రీస్తు నామానికి గొప్ప అపకీర్తి కలుగజేస్తుందనుకున్నప్పుడు. ఈ రెండింటిలో ఏ ఒక్కటైనా సరిగ్గా ఎప్పుడు జరుగుతుందో చెప్పడానికి ఖచ్చితమైన సూత్రమంటూ ఏదీ లేదు కాబట్టి ఇలాంటి కష్టమైన విషయాలను పర్యవేక్షించడానికి సంఘం భక్తిపరులైన కాపరులను కలిగి ఉండాలి.
హాజరగుచుండుట మరియు తిరిగి సంఘంలో మళ్లీ చేర్చుకొనుట
సంఘ సభ్యత్వం నుండి తొలగింపబడి, ప్రభు భోజన సంస్కారంలోనైనా పాల్గొననివ్వబడని వ్యక్తి వారంలో జరిగే ప్రతి కూడికకు హాజరగుచుండవచ్చునో లేదో మరియు వారు అట్టి వ్యక్తితో (మాట్లాడొచ్చా, కలవచ్చా, ఇంటికి ఆహ్వానించొచ్చా, మొ॥ విషయాల్లో) ఎలా మెలగాలో అని సంఘ సభ్యులు తరచుగా ఆశ్చర్యపడుతుంటారు. ఈ విషయం క్రొత్త నిబంధనలో అనేక చోట్ల తెలుపబడి ఉంది (1 కొరింథీ. 5:9,11; 2 థెస్స 3:6, 14-15; 2 తిమోతి 3-5; తీతుకు 3:10; 2 యోహాను 10), మరియు ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క విధంగా మెలగాల్సిన అవసరం ఏర్పడుతుంది. గాని మా సొంత సంఘంలోని కాపరులిచ్చిన సూచనలు సామాన్యంగా రెండు రకాలుగా ఉన్నాయి:
– మారుమనస్సు పొందని (పశ్చాత్తాపపడడని) వ్యక్తి కూడికకు వచ్చి సంఘ సమాజానికి భౌతికంగా ఏదైన హాని కలిగించవచ్చునేమో అనే సందేహం తలెత్తే సందర్భం మినహాయిస్తే, ఆ వ్యక్తిని కూడికకు ఆహ్వానించవచ్చు. ఆ వ్యక్తి దేవుని వాక్యం వినడం కన్నా శ్రేష్ఠమైన స్థలం మరొకటి ఏముంటుంది చెప్పండి!
– సంఘ క్రమశిక్షణ క్రింద ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులు కుటుంబ జీవితం గురించిన బైబిలు కర్తవ్యాలను (ఉదా॥ ఎఫెసీ 6:1-3, పిల్లల పెంపకము, బాప్తిస్మము; 1 తిమోతి 5:8, కుటుంబ సభ్యుల సంరక్షణ; 1 పేతురు 3:1-2, భార్యాభర్తల బంధమును కాపాడుట) నిశ్చయంగా నెరవెరుస్తూ ఉన్నప్పటికిని, సంఘ క్రమశిక్షణ క్రింద ఉన్న వ్యక్తితో సంఘ సభ్యులు కలిగి ఉన్న సంబంధాల ధోరణి లేదా తీరులో చెప్పుకోదగినంత మార్పుండాలి. పరస్పర సంభాషణలు, అప్పుడప్పుడైనా మాట్లాడాలి కదా అన్నట్టుగాని, స్నేహంగాగాక, అవి ఎక్కువగా ఆ వ్యక్తి మారుమనస్సు పొందేట్లు ప్రోత్సహించే ఉద్దేశంగలవై యుండాలి.
ఆ వ్యక్తి యథార్థంగా మారుమనస్సు పొందాడను రుజువులు కనబడినప్పుడు, సంఘంలో మళ్లీ చేర్చుకొనడమనేది జరుగుతుంది. ‘యథార్థమైన మారుమనస్సు’ అనేది పాపము యొక్క తీవ్రతపై ఆధారపడియుంటుంది. కొన్నిసార్లు అది సులభంగా అర్థం అవుతుంది, ఉదా॥ తన భార్యను విడిచిపెట్టిన భర్త విషయంలో మారుమనస్సు పొందడమంటే, యథాప్రకారంగా తన భార్యతో కలిసి ఆనందంగా జీవించడమే. మరి కొన్నిసార్లు పాపముపై పోరాడాలని ఒక క్రొత్త శ్రద్ధను కనుపర్చునంతగా ఆ పాపమును పూర్తిగా జయించేంతగా మారుమనస్సు పొందినట్లు కనిపించకపోవచ్చు. ఉదా॥ వ్యసనానికి బానిసయైన వ్యక్తి.
యథార్థంగా ఒకరు మారుమనస్సు పొందారని చెప్పడం కష్టం, దానికి ఎంతో జ్ఞానం అవసరమవుతుంది. ఎంత జాలి కనుపరిస్తే, అంతే స్థాయిలో (ముందు) జాగ్రత్తను కూడ పాటించాలి. మారుమనస్సుకు తగిన ఫలములు ఫలించడానికి కొంత కాలం గడిచిపోవలసి యుంటుంది, అయితే మరీ ఎక్కువ సమయం కాదు (2 కొరింథీ 2:5-8 చూడుము). మారుమనస్సు పొందిన వ్యక్తిని సంఘంలోనికి చేర్చుకొని, సంఘ సభ్యత్వమిచ్చి, ప్రభు భోజన సంస్కారములో పాల్గొనుటకు అనుమతించిన తరువాత, ఇకమీదట అర్హతాపరీక్ష కాలమనిగాని లేదా, సంఘ సభ్యులకున్న సకల హక్కులు లేనివానిగా చూడటంగాని, దాని గూర్చి మాటలాడటంగాని జరుగకూడదు. విశేషంగా, సంఘం ఆ వ్యక్తిని క్షమించిన విషయం సంఘమంతటి ముందు ప్రకటింపబడాలి (యోహాను 20:23), అతని పట్లగల ప్రేమను ధ్రువీకరించాలి (2 కొరింథీ. 2:8), మరియు పండుగ చేసుకోవాలి (లూకా 15:24).
క్రమశిక్షణను సంఘం ఎందుకు పాటించాలి?
సంఘం క్రమశిక్షణను పాటించడానికి మొదలుపెట్టినప్పుడు, కష్టతరమైన మరియు ఎలా చెయ్యాలో బైబిలులో లేని కొన్ని నిజ జీవిత పరిస్థితులను అది తరచుగా ఎదుర్కొంటుంది. గనుక అధికారపూర్వక సంఘ క్రమశిక్షణ అవసరమవుతుందో లేదో, లేక ఈ ప్రక్రియ ఎంత కాలం కొనసాగాలి, లేక పాపం చేసిన వ్యక్తి నిజంగా మారుమనస్సు పొందాడని చెప్పడం, మొ॥ విషయాల్లో సంఘం ఎల్లప్పుడు స్పష్టంగా ఎరిగియుండలేదు.
సంఘ సభ్యులు మరియు సంఘ కాపరులు కలిసి ఇలాంటి కష్టతరమైన సమస్యల గూర్చి ఆలోచించేటప్పుడు, నిర్ణయాలు తీసుకొనేటప్పుడు, సంఘం, అన్నిటి కంటె ముఖ్యంగా క్రీస్తు నామాన్ని మరియు ఆయన మహిమను కాపాడుటకు పిలువబడిందని జ్ఞాపకముంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. సంఘ క్రమశిక్షణ మౌలికంగా, క్రీస్తుని మహిమపర్చడానికై ఉంది అలాగే ఒక వ్యక్తి జీవితం క్రీస్తును తప్పుగా చూపిస్తూనే తమ నోటి మాటలతో మాత్రం క్రీస్తుని విశ్వసిస్తున్నాను అంటే సంఘంగా ఇంకా వారిని విశ్వాసులుగా ధృవీకరిస్తూనే ఉండాలా వద్దా అనే విషయం గురించినదై ఉంది. పాపాలు అవి చేయబడిన పరిస్థితులు చాలా వేర్వేరుగా ఉంటాయి, కానీ సంఘ ఆలోచనల్లో ఒక విషయం ఎల్లప్పుడు అన్నిటి కంటె ముందుండాలి. అదేంటంటే ‘‘ఒకరు చేసిన పాపం మరియు దాని పట్ల సంఘ ప్రతిస్పందన క్రీస్తు యొక్క పవిత్రమైన ప్రేమను ఎలా ప్రతిబింబిస్తాయి?’’
ఎంతైనా, సంఘం క్రీస్తు మహిమని గురించి శ్రద్ధ వహిస్తుందంటే క్రైస్తవేతరుల మేలు గురించి కూడా శ్రద్ధ వహిస్తున్నట్లే. గనుక సంఘం తన క్రమశిక్షణను అమలు చేయనప్పుడు, ఆ సంఘానికీ లోకానికీ తేడా ఏమీ ఉండదు, సంఘం కూడ లోకంలానే కనబడుతుంది. సంఘం, మనుష్యుల చేత త్రొక్కబడుటకే పనికివచ్చును దాని సారమును కోల్పోయిన ఉప్పు వలె ఉంటుంది (మత్తయి 5:13). చీకటిలో కొట్టుమిట్టాడుతు నశించిపోతున్న లోకానికి సంఘం ఏమాత్రమును సాక్ష్యమై ఉండదు.
అంతేకాదు, క్రీస్తు మహిమ గురించి శ్రద్ధ వహిస్తుందంటే, సంఘంలోని సభ్యుల మేలు గురించి కూడా శ్రద్ధ వహిస్తున్నట్లే. క్రైస్తవులు యేసును పోలినవారై యుండాలని కోరుకోవాలి. గనుక సంఘ క్రమశిక్షణ పవిత్రమైన ఆయన నామమును స్పష్టంగా కాపాడడానికి సహాయపడుతుంది. అధికారపూర్వక క్రమశిక్షణా చర్య తీసికోబడినపుడెల్ల, సభ్యులు వారి సొంత జీవితాల్లో మరి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని సంఘ సభ్యులకు గుర్తుచేయబడుతుంది. పాస్టర్ జేమ్స్ గారు దీనంతటి సారాంశమును చక్కగా ఇలా చెప్పుతున్నాడు: ‘‘సంఘ క్రమశిక్షణలోగల అనుకూలతలు, మేళ్లు స్పష్టంగా ఉన్నాయి. అది విశ్వాసభ్రష్టులైనవారిని మళ్లీ చేర్చుకుంటుంది, వేషధారులను గుర్తిస్తుంది, ఆరోగ్యకరమైన ఆశ్చర్యమును సంఘమంతట వ్యాపింపజేస్తుంది, మెలకువగా ఉండుటకును ప్రార్థన జీవితం గూర్చి ఎక్కువ ప్రోత్సాహమునిస్తుంది, మానవుల బలహీనత గురించిన వాస్తవాన్ని మరియు దాని వలన కలుగు ఫలితాలను మన సందేహాలను మించి రుజువు చేస్తుంది, ఇంతేగాక, దుర్నీతికి విరోధంగా బహిరంగంగా సాక్ష్యమిస్తుంది.’’2
క్రీస్తు మహిమ గురించి సంఘం శ్రద్ధ వహిస్తుందంటే, పాపంలో పట్టబడిన వ్యక్తి మేలు, శ్రేయస్సు గురించి కూడా శ్రద్ధ వహిస్తున్నట్లే. 1 కొరింథీ. 5వ అధ్యాయంలో, ‘‘ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు’’ (1 కొరింథీ. 5:5), పాపము చేసినవారిని సంఘం నుండి తొలగించడం అత్యంత ప్రేమతో కూడిన పని అని పౌలుకి తెలుసు.
సంఘం, సంఘ క్రమశిక్షణను ఎందుకు అమలుచేయాలి? ఒక వ్యక్తి యొక్క మేలు, శ్రేయస్సు కొరకు, క్రైస్తవేతరుల మేలు కొరకు, సంఘ మేలు కొరకు, మరియు క్రీస్తు మహిమ కొరకు అమలుచేయాలి.3 ఈ ప్రాథమిక లక్ష్యాలను మనస్సులో ఉంచుకోవడం ద్వారా కష్టమైన ప్రతీ సమస్యను పరిష్కరించుకోడానికి సంఘం మరియు సంఘ కాపరులు, మన జ్ఞానం మరియు ప్రేమ ప్రయోజనపడవని దేవుని జ్ఞానం మరియు ఆయన ప్రేమే జయిస్తాయని తెలిసికొని వాటిని చేయడానికి సహాయకరంగా ఉంటుంది.
1. John Angell James, Church Fellowship or The Church Member’s Guide,excerpted from volume XI of the 10th edition of the Works of John Angell James, 53.
2. James, Christian Fellowship, 53.
3. Mark Dever, Nine Marks of a Healthy Church(Crossway, 2004), 174-78.
జోనాతన్ లీమన్
జోనాతన్ 9మార్క్స్ పుస్తకాలని అలాగే 9మార్క్స్ జర్నల్స్ ను ఎడిట్ చేస్తారు. అతను సంఘానికి సంబంధించిన అనేక విషయాలపై పుస్తకాల రచయిత కూడా. జోనాతన్ సదరన్ సెమినరీ నుండి MDiv మరియు యూనివర్శిటీ ఆఫ్ వేల్స్ నుండి ఎక్లెసియాలజీలో Ph.D ని సంపాదించారు. అతను మేరీల్యాండ్‌లోని షెవర్లీలో తన భార్య మరియు నలుగురు కుమార్తెలతో నివసిస్తున్నాడు, అక్కడ అతను షెవర్లీ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ గా ఉన్నాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web