సువార్త ప్రకటించడమనేది సాధారణంగా బోధకులు, అపాలజిస్ట్లు (సువార్తని సమర్ధించే వారు), లేదా ప్రజల్లో బాగా కలిసిపోయే స్నేహగుణంగలవారు చేసే లేదా చేయాల్సిన పనంటూ కొందరు సువార్త ప్రకటించడాన్ని పట్టించుకోరు. కాని క్రైస్తవులందరు సువార్త ప్రకటించాలని క్రొత్త నిబంధన రూఢీగా చెప్పుతుంది. ఈ క్రింద ఉన్న 3 విషయాలను బట్టి మనం సువార్తని ప్రకటించాలి.
- ఉదాహరణ: సువార్త ప్రకటించడం అనే ఉదాహరణని మనం ఆది క్రైస్తవులలో చూడగలం: ‘‘కాబట్టి చెదరిపోయినవారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి’’ (అపొ. 8:4). మరియు యెరూషలేములో నుండి చెదరిపోయిన శిష్యులందరు సువార్త ప్రకటించారని అపొ. 11:19-21 చెప్పుతుంది.
- ఆదేశం: మనమందరమును ‘‘నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారమై, మనలో ఉన్న నిరీక్షణను గూర్చి మనలను హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండవలెనని’’ పేతురు మనకందరికిని ఆదేశమిస్తున్నాడు (1 పేతురు 3:15-16).
- ప్రేమ కోసం: మనం మన పొరుగువారిని మనకు వలెనే ప్రేమించవలసినవారమై ఉన్నామని బైబిల్ బోధిస్తుంది (మార్కు 12:31, యాకోబు 2:8). ఒకరిని ప్రేమించడానికి వారితో సువార్తను పంచుకోవడం కంటె ముఖ్యమైన మార్గం యింకేదైనా ఉందా?