నా భర్త రక్షణ కొరకు నేనెలా ప్రార్థించాలి?

నా భర్త రక్షణ కొరకు నేనెలా ప్రార్థించాలి?

షేర్ చెయ్యండి:

మీకందరికీ శుభోదయం! మరొక ప్రసారానికి మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఇటీవల మనము ఒక క్రైస్తవుడు, క్రైస్తవేతర అమ్మాయిని వివాహం చేసుకున్న కుటుంబంలో ఏర్పడగల ఉద్రిక్తతల గూర్చి మాట్లాడుకున్నాము. ఈ సమస్యలకు ఎన్నో కారణాలుంటాయి, కొన్నిసార్లు బుద్ధిపూర్వకంగానే ఈ పని చేసుండొచ్చు. ఒక క్రైస్తవుడు పాపము చేసి అతనికి తెలిసి కూడ క్రైస్తవేతర అమ్మాయిని వివాహమాడవచ్చు. దాని పరిణామాల గూర్చి ఇంతకు ముందు చర్చించాము. లేదా ఇద్దరు క్రైస్తవేతరులు వివాహం చేసుకుని, కొంతకాలానికి వారిలో ఒకరు రక్షింపబడొచ్చు. దీని గూర్చి కూడ చర్చించాము. లేదా క్రైస్తవులని చెప్పుకొన్న ఇద్దరు వివాహం చేసుకుని కొన్ని సంవత్సరాల తర్వాత, వారిలో ఒక్కరు నిజముగా విశ్వాసిగా, యథార్థంగా మారుమనస్సు పొందొచ్చు, రెండవ వ్యక్తి అవిశ్వాసిగా మారొచ్చు. వీటి వలన కలిగే పరిణామాలు మరియు పర్యవసానాల గూర్చి కూడ మనము ఇదివరకే చెప్పుకున్నాము.

ఇప్పుడు మనము చర్చించాలనుకుంటున్న విషయం ఏ వర్గానికి చెందుతుందో తెలీదు, ఎందుకంటే మన దగ్గర సమాచారం తక్కువగా ఉంది. గత సంవత్సరాల్లో దాదాపు ఆరు సార్లు రోజ్‌ అనే స్త్రీ తన ఇమెయిల్‌ పంపుతూ వచ్చింది. తన ఇమెయిల్లన్నీ ఎల్లప్పుడూ ఒకే విషయం గురించి ఉన్నాయి. అవి ఎల్లప్పుడు క్లుప్తంగా ఒక్క వాక్యంలో ఉంటున్నాయి. ఏమంటే, ‘‘పాస్టర్‌ జాన్‌ గారూ, నా భర్త రక్షింపబడుటకు నేనెలా ప్రార్థించాలి?’’

దుఖంతో నిండిన రోజ్ హృదయంలోనికి తొంగిచూచి, అవిశ్వాసియైన తన భర్త రక్షణ కొరకు ప్రార్థించడంలో రోజ్‌ కి ఎక్కడ కష్టమౌతుందో నేను చెప్పగలిగినట్లయితే, ఎంతో బాగుండునని భావిస్తున్నాను. అమె అసలు సమస్య ఏంటి? ఎంత తరచుగా ప్రార్థించాలనా? సంవత్సరాల తరబడి – వందలసార్లు, వేలసార్లు – ప్రార్థించినా ఫలితం కనబడటం లేదు కాబట్టి, వ్యర్థమైన ప్రార్థనలు ఎలా చేయకూడదనా? ఇంతకాలం ప్రార్థించినా, మార్పు కలుగుతున్న సంకేతం, రుజువు ఏదీ కనబడటం లేదు కాబట్టి యింకా తన ప్రార్థనలు ఎలా కొనసాగించాలనా? ఏవైనా నిర్దిష్టమైన వాక్యభాగాలను అన్వయించుకొనడంలో ఇబ్బంది పడుతుందా? తన సొంత హృదయంలోనే కోరికను, బహుశా, నిరీక్షణను లేదా ప్రేమను కోల్పోయిందా? దేవుని యందలి తన నమ్మకం చల్లబడిపోయిందా? అది, ‘‘నేను బిగ్గరగా ప్రార్థిస్తున్నానా? లేక, నేనొక గదిలోపల ప్రార్థిస్తున్నానా? లేదా రోజుకు ఎన్నిసార్లు ప్రార్థించాలి?’’ వంటి ఆచరణాత్మకతతో కూడిన సమస్యనా? నలుగురుగా కూడుకొన్నప్పుడు తన భర్త కొరకు ప్రార్థించడం వలన తన భర్తను అగౌరవపర్చడమనే భావన తనకుందా, అయ్యుండొచ్చు? ఇదే విషయాన్ని కొందరు స్త్రీలు నన్నడిగారు కూడా. తన భర్త ఇంటిలో ఉన్నప్పుడు అతనితో కూడ కలిసి ప్రార్థించడమా? ‘‘నేనిలా చేయగలనా? ఆయన ఇంటిలో ఉన్నప్పుడు నేనాయన కొరకు ప్రార్థించవచ్చా?’’ ఇతరులు అతనికి సువార్త చెప్పాలని వారికొరకు ప్రార్థించడమా లేక అతని ఆత్మ కొరకు ఆవిడే ప్రార్థించడమా? ఓ, ఆమె అడుగుతున్న అసలు విషయమేమిటో నాకు తెలిస్తే ఎంత బాగుండు!

“పాస్టర్‌ జాన్‌ గారూ! నేను ముందుకు సాగగలుగునట్లు మీరు ఏదైనా సూచించి సహాయం చేయండి“ అనే హృదయ వేదన అయ్యుండవచ్చు.’’ ఆమె మళ్లీ మళ్లీ మనవిచేసింది కాబట్టి ఈ పోరాటం చాలా కాలంగా ఉందనే విషయం స్పష్టమవడం తప్ప, ఆమె పోరాటం యొక్క పూర్తి వివరాలు నాకు తెలియడం లేదు.

నిరీక్షణను నిలబెట్టే సార్వభౌమాధికారం

క్రీస్తును అంగీకరించని అవిశ్వాసుల కొరకు ప్రార్థన చేయగల ఒక మార్గాన్ని సూచించాలని నేను ఆశపడుతున్నాను, ఎందుకంటే ఇది సహాయకరంగా, నిరీక్షణ కలిగించేదిగా ఉన్నట్టు నేను కనుగొన్నాను. ఇది దేవుడు సార్వభౌమాధికారియై యున్నాడనే లేఖనానుసారమైన ఒప్పింపు మీద ఆధారపడినదై యున్నది (ఈ విషయం నేను ఖచ్చితంగా చెప్పాలి. ఇది చాలా కీలకమై యున్నది). కాబట్టి, ఆయన తన కిష్టమైనపుడెల్లా, ఆయన కోరుకున్నపుడెల్లా, అనుకున్నపుడెల్లా, ఆయన అన్ని (అవి ఎన్ని వున్నా) ప్రతిఘటనలను (అడ్డంకులను ఎదిరించి) అధిగమించి (జయించి) ఎంత కఠినమైన పాపినైనను రక్షించగలడు. దేవుని సార్వభౌమాధికారముగల చిత్తమును కాదనే హక్కు, నెరవేరకుండా ఆపే అడ్డగించే అధికారం, మానవులకున్నదని నేను నమ్మను.

మానవ చిత్తము మీద గల ఇలాంటి దేవుని సంపూర్ణ సార్వభౌమాధికారం, లేఖనానుసారమైనదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను – బహుశా, ఇది విధివిధాన సిద్ధాంత భావాన్ని, లేదా చివరకు దేవుడు మన ప్రియులను రక్షింపకపోవచ్చనే నిరుత్సాహాన్ని కలిగుస్తుందని కొందరనుకోవచ్చు. గాని, మరొక విధంగా గమనిస్తే, అది వాస్తవానికి సార్వభౌమాధికారంగల దేవుని యందు ఆశను, నిరీక్షణను కలుగజేస్తుంది. అంటే, క్రీస్తునంగీకరింపనివాడు ఏంచేస్తున్నాడు లేదా ఏంచేశాడనే దానితో నిమిత్తము లేకుండా దేవుడు వానిని రక్షించగలడని అర్థం. ఆయనను ఏదీ ఆపజాలదు.

‘‘క్రీస్తునంగీకరింపనివాడు ఏంచేస్తున్నాడు లేదా ఏంచేశాడనే దానితో నిమిత్తము లేకుండా దేవుడు వానిని రక్షించగలడు. ఆయనను ఏదీ ఆపుజేయజాలదు.’’

అనగా, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా, ఎంత పాపాన్ని పోగేసుకున్నా (చేసినా, ఒడిగట్టుకున్నా), హృదయం ఎంతటి కఠినమైనదైనా, హేళనచేసే లేదా ఎగతాళిచేసే విరోధం ఎంతటిదైనా, ఏ బహిరంగా అపహాస్యమైనా, కోపంతో కూడిన ఏ ఎదిరింపైనా – దానంతటిని తొలగించి రక్షించాలనేది దేవుని చిత్తమైనట్లయితే, ఏదీ కూడా ఆయన రక్షణకార్యాన్ని ఆటంకపరచజాలదని అర్థం. నన్నడిగితే, క్రీస్తునంగీకరించనివారు రక్షింపబడతారు అనడానికి ఈ ఒక్క నిరీక్షణనే మనకున్నది. ఎందుకంటే, వారందరు వారి అపరాధములలోను పాపములలోను చచ్చినవారై యున్నారు – చచ్చినవారు అంటే, చచ్చిపోయినట్టే లెక్క. నేను చేయగలిగిందేమీ లేదు. దేవుడు రక్షణ కార్యాన్ని చేయనట్లయితే, మనుష్యులు నశించిపోతారు. నేను కూడా నశించిపోయేవాడినే.

మన తండ్రి ధారాళమైన ఔదార్యంగలవాడు

కాబట్టి, నిరీక్షణనిచ్చే దేవుని సార్వభౌమాధికారాన్ని గూర్చిన ఈ ఒప్పింపు ఆధారంగా, దేవుని వాగ్దానాలతో, దేవుని వాగ్దానాల కొరకు, మరి ముఖ్యంగా క్రొత్త నిబంధనలోని రక్షణ వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. అయితే నేను ఆ వాగ్దానాలను పేర్కొనడానికి ముందుగా,  ఆయన పిల్లలు చేసే ప్రార్థనలకు జవాబివ్వడంలో దేవుడు నిజముగా ఎంతో ఆనందిస్తాడని – బైబిలులో నుండి ప్రతి వారం నాకు నేను – గుర్తుచేసుకొనడం నాకు ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలుసుకున్నాను. ఇది క్రమంగా జరగాలి. దీనిని దేవుడే తన సొంత మాటల్లో నాకు గుర్తుచేయాల్సిన అవసరమున్నది. ఆయన అసూయపడే తండ్రి కాడు.

ఉదాహరణకు, నేను తరచుగా మత్తయి 7:9-11ను తీసుకుంటాను:

‘‘మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన యెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన యెడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగియుండగా పరలోకమందున్న తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును. మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మ శాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది.’’

లూకా 12:32 కూడ చూడండి: ‘‘చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.’’ ‘‘దేవుడు తన పిల్లలు చేసే ప్రార్థనలకు జవాబివ్వడానికి నిజముగా ఎంతో ఆనందిస్తాడు.’’

మనము ప్రార్థన చేయునట్లు మనలను ప్రోత్సహించడానికి, ఆయన తన పిల్లల యెడల ధారాళమైన ఔదార్యంగల తండ్రియై యున్నాడని మనము ఆయన గూర్చి ఆలోచించాలని మనకు గుర్తుచేయడానికే యేసు ఈ విషయాలు తెలియజెప్పాడు. ఒక కాపరి తన మందను దీవించుటకు ఆసక్తిపరుడై యున్నట్టు, ఒక రాజు తన రాజ్యములోని ప్రజలకు, పౌరులకు ఏదైనా ఇవ్వాలని ఆసక్తిపరుడై యున్నట్లు, మనం ప్రార్థిస్తుండగా చూడటానికి దేవుడు ఎంతో ఇష్టపడుతుంటాడు. ఇప్పుడు, దేవుడు మన ప్రార్థనలకు చెవియొగ్గి, మన ప్రార్థనలను ఆలకిస్తూ వాటికి జవాబివ్వడానికి కలిగియున్న ఆసక్తిని గుర్తుచేస్తూ, క్రొత్త నిబంధనలోని వాగ్దానాల వైపు మళ్లుతున్నాను.

వాగ్దానాలను ప్రార్థనలుగా మార్చుకొనుట

యెహెజ్కేలు 36వ అధ్యాయం ప్రకారం, క్రొత్త నిబంధన, మోషే నిబంధనకు భిన్నమై యున్నదనే విషయాన్ని జ్ఞాపకముంచుకొనండి. ఎందుకంటే మోషే నిబంధన కేవలము వెలుపటి నుండి వస్తున్న డిమాండ్లతో కూడినది కాదు, నిబంధనలో ఇవ్వబడిన ఆజ్ఞల ప్రకారం నడుచుకొనగల సామర్థ్యముతో సెలవియ్యబడుతున్నది. ఆయన, ‘‘నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొనువారినిగాను మిమ్మును చేసెదనని’’ సెలవిస్తున్నాడు (యెహె 36:27). ‘‘నేను మీకు కేవలము కట్టడలను ఇవ్వడము మాత్రమే కాదు – మీరు వాటిని అనుసరించునట్టు, గైకొనునట్టు చేసెదను.’’ క్రొత్త నిబంధన యొక్క కీలకమైన విషయం ఇదే. ఈ నూతన నిబంధన ఆయన చేతనే తన స్వరక్తముతో భద్రపరచబడినదని యేసు సెలవిచ్చాడు. ‘‘ఆ ప్రకారమే ఆయన భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ‘ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన’’ అని అన్నాడు (లూకా 22:20). ఆయన దానిని కొన్నాడు, గనుక అది నిశ్చయమైనదై యున్నది.

కాబట్టి, నేను క్రీస్తునంగీకరించని నా ప్రియమైన వారి కొరకు చేసే ప్రార్థనలుగా మార్చుకొను కొన్ని అమూల్యమైన వాగ్దానాలు మీ ముందుంచుతున్నాను.

‘అతని దేవుడనవుతాను.’

యెహెజ్కేలు 11:19-21 :

‘‘వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి, వారియందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులై యుందురు, నేను వారికి దేవుడనై యుందును. అయితే తమ విగ్రహములను అనుసరించుచు, తాము చేయుచు వచ్చిన హేయక్రియలను జరిగింప బూనువారి మీదికి తమ ప్రవర్తన ఫలము రప్పింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.’’

కాబట్టి, నీ భర్త కోసం ఇలా ప్రార్థన చేయు: ‘‘ప్రియమైన తండ్రీ, నీవు, నీ గొప్ప కృప చొప్పున, యేసు రక్తముతో కొనిన, నా భర్తలోని రాతి గుండెను తీసివేసి అతనికి మాంసపు గుండెను, నీ యెడల మెత్తగా నుండు హృదయమిమ్మని నేను ప్రియమైన నా భర్త కొరకు ప్రార్థిస్తున్నాను. అతనిలో నూతన ఆత్మనుంచుము. అతడు నీ వాక్యమును ప్రేమిస్తూ దానిని గైకొనునట్లు అతనికి ఒక క్రొత్త మనస్సును, స్వభావమును ఇయ్యండి. నీవు అతనికి దేవుడవు కావాలి. అతనిని నీ బిడ్డగా చేసికొనుము.’’

‘అతని హృదయానికి సున్నతి చేయుము.’

క్రొత్త నిబంధన వాగ్దానం మరొక దానిని చూడండి. ద్వితీ 30:6. మోషే వంటి ` అనగా, యేసు వంటి – ఒక ప్రవక్త బయల్దేరే ఆ రోజు కొరకు దేవుడు ఎదురుచూస్తున్నాడు మరియు ఆయన ఏర్పరచుకొనినవారికి ఈ వాగ్దానమిస్తున్నాడు:

‘‘మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృదయమునకును సున్నతి చేయును.’’

కాబట్టి, నీవిప్పుడు ఇలా ప్రార్థన చేయు: ‘‘ఓ తండ్రీ, మాలో ఏ ఒక్కరమైనను నిన్ను మొదట ప్రేమించి నీవు మమ్ములను ప్రేమించునట్లు నీ హృదయాన్ని త్రిప్పలేదు. నీవు, నీ గొప్పదైన, ఉచితమైన, కృపాసహితమైన ప్రేమచేత మా హృదయాలకు సున్నతి చేస్తే తప్ప మేము నిన్ను ప్రేమించలేము. స్వీయ హెచ్చింపును, స్వీయ ఔన్నత్యమును, స్వీయ నియంత్రణతోను కూడిన మా పాత స్వభావాన్ని పరిత్యజించాల్సి వున్నది. నా కొరకు నీవు ఈ పని చేశావు. ఆ కార్యము నా భర్తలో చేయబడుట కంటె ఎక్కువ నాలో చేయబడుటకు నేను యోగ్యురాలను కాను, అయినా చేశావు. గనుక ఓ దేవా, అతని హృదయం నీ సత్యమును, మంచితనమును ఎదిరించకుండునట్లు నా భర్త హృదయానికి సున్నతి చేయుమని నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను. ఓ ప్రభువా, క్రీస్తునుబట్టి, అతడు నిన్ను ప్రేమించునట్లు చేయుము.’’

‘అతనికి మారుమనస్సు కలుగజేయుము.’

2 తిమోతి 2:24-26లోని ఆదేశము మరియు వాగ్దానము గూర్చి ఆలోచించు. ఇది, క్రీస్తునంగీకరించని ఒక వ్యక్తిని చీకటిలో నుండి వెలుగైయున్న యేసు నొద్దకు నడిపించునట్లు చేసే ప్రయత్నంలో మనము ఎప్పుడు ప్రార్థన చేసినా ఉపయోగించుకునే వచనం అని నేను భావిస్తున్నాను. ఆ వచనాల్లో ఇలా ఉంది :

‘‘సత్య విషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును. అందువలన సాతాను తన యిష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని, ప్రభువు యొక్క దాసుడు (ఇప్పుడు ఇది నేనైయుంటాను, ఈ భార్య అయియుంటుంది) అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను.’’

కాబట్టి, మనమిలా ప్రార్థిస్తాము: ‘‘తండ్రీ, రక్షింపబడుటకు ఏ ఒక్కరునూ యోగ్యులు కానప్పటికిని, మారుమనస్సు అనే వరము పొందుటకు ఎవరునూ యోగ్యులు కానప్పటికిని, దుష్టుని నుండి తప్పించుకోడానికి ఎవరును అర్హులు కానప్పటికిని, నీవు కనికరముగల దేవుడవై యున్నావు. ఇది నాకు బాగా తెలుసు ఎందుకంటే నా భర్త హృదయం గ్రుడ్డిదైయున్నట్టు, అది చచ్చినదై యున్నట్టు, అదే స్థితిలో ఉండిన నేను దానిలో నుంచి తప్పించుకున్నాను. ఇప్పుడు నా జీవితంలో నీవు కనుపర్చిన ఆశ్చర్యకరమైన కృపనుబట్టి నేను నీకు మొరపెట్టుతున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నమ్ముతున్నాను! ఈ ప్రకారంగా, దేవా, నీవు కనికరముగల దేవుడవై యున్నావు. గనుక నీ చిత్తమైతే, నీవు మారుమనస్సును, విడుదలను, విశ్వాసమును, మరియు జీవమును అనుగ్రహించగలవు. నీవు ఎవరిని కనికరింపగోరుదువో వానిని కనికరిస్తావని నాకు తెలుసు. నీవు స్వేచ్ఛాపరుడవును సర్వజ్ఞానివియునై యున్నావని నాకు తెలుసు. నీ బిడ్డగా, నీవు నీ కృపామహిమ కొరకు, నా భర్తకు మారుమనస్సు ననుగ్రహించుమని నేను నిన్ను వేడుకుంటున్నాను.’’

కలవరపడవద్దు

ఈ విధంగా, దేవుని వాగ్దానాలను మరియు కార్యాలను ఎన్నింటినైనా మనము ప్రార్థనలుగా మార్చుకొనగలము.

అపొ 16:14ను ఇలా మార్చుకోవచ్చు: ‘‘ప్రభువా, లూదియ హృదయాన్ని తెరచినట్టు నా భర్త హృదయాన్ని తెరువుము.’’ 2 కొరింథీ 4:6ను ఇలా మార్చుకోవచ్చు: ‘‘తండ్రీ, దేవుని స్వరూపియై యున్న క్రీస్తు మహిమను కనుపర్చు సువార్త ప్రకాశం వారి హృదయాల్లో ప్రకాశింపజేయుము.’’ లేదా, లూకా 18:27లోని యేసు మాటలను మన ప్రార్థనగా మార్చుకోవచ్చు: ‘‘ప్రభువైన యేసూ, ధనవంతుడైన యౌవన అధికారి మార్పునొందవచ్చునను సందర్భములో, ‘మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని’ సెలవిచ్చావు. కాబట్టి, ఇప్పుడు అదే అసాధ్యమవుతున్న దానిని సాధ్యం చేయుము. నా భర్తను మార్చుము.’’

కాబట్టి, రోజ్‌, నీవు క్రీస్తునంగీకరింపని నీ ప్రియమైన భర్త రక్షణ కొరకు ప్రార్థనలో సాగిస్తున్న గొప్ప పోరాటంలో, మేము కూడ నీతో ఉన్నాము. ‘‘విసుకక (కలవరపడక), నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని’’ యేసు సెలవిచ్చినట్టు లూకా 18:1లో వ్రాయబడిన మాటలను మనము మర్చిపోవద్దు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...