దేవునితో నాకున్న సంబంధం ఆరోగ్యకరమైనదై యున్నదా?
ఇదో, నాకొక ఉత్తరం వచ్చింది. ‘‘హలో, పాస్టర్ జాన్ గారూ! నా పేరు, మారా. నేను వయసులో చిన్నదాన్ని. అయినప్పటికిని, నా వయస్సుకు కూడ విశ్వాసం ముఖ్యమని నాకు తెలుసు. నేను దేవునితో సంబంధం కలిగి వున్నాననీ, దేవునితో నేను మాట్లాడొచ్చని, నేనాయన మీద ఆధారపడవచ్చుననీ నాకు తెలుసు. గాని కొన్నిసార్లు అది చెప్పడానికి కష్టమవుతుంది. నేను నిజముగా అడగాలనుకున్న విషయమేమంటే: నేను దేవునితో కలిగియున్న సంబంధం ఎంత మంచిదో నేను తెలుసుకోడానికి ఏదైనా ఒక మార్గం ఉందంటారా? నా విశ్వాసాన్ని నేను ప్రశ్నించాల్సిన పరిస్థితులు నేను ఇంత వరకైతే ఏమీ ఎదుర్కోలేదు. అది కూడ సంభవించే సమయం వస్తుందని నాకు తెలుసు. గాని నేను సరైన మార్గంలో ఉన్నానని తెలిసికోడానికి ఏదైనా ఒక మార్గం ఉందా? దయచేసి చెప్పండి.’’
మారా, నిన్ను అభినందిస్తున్నాను. నీవు చాల చాల మంచి ప్రశ్న అడిగావు. అన్నట్టు, ఇది పెద్దవాళ్లకు కూడ వర్తిస్తుంది. ఒక చిన్న బిడ్డగా నీవడిగిన ప్రశ్ననే అనేక మంది పెద్దవాళ్లు కూడ ఎదుర్కొంటున్నారు, నేను కూడ అప్పుడప్పుడు ఎదుర్కొంటున్నాను. దేవునితో మనకుగల సంబంధం ఎంత బాగుందో తెలిసికోడానికి నీకైనా నాకైనా ఏదైనా ఒక మార్గం ఉందా?
ఈ ప్రశ్న చాల మంచి ప్రశ్న అన్నాను కదా. ఎందుకంటే, బైబిలే ఈ ప్రశ్నను అడుగుతున్నది. ‘‘మీరు విశ్వాసం గలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా?’’ (2 కొరింథీ 13:5). కాబట్టి, నీవు ఈ ప్రశ్నను లేవదీయడం పూర్తిగా సరైనదే : ఈ సంబంధం కొరకు ఏవైనా పరీక్షలున్నాయా? దేవునితో నాకుగల సంబంధం మంచిదో కాదో నేను తెలిసికోడానికి నాకు సహాయకరంగా ఉంటుందని నేననుకోడానికి ఏదైనా ఒక మార్గమున్నదా? అని నీవడిగిన ప్రశ్నకు జవాబుగా నీకు చూపించాలని నేనాశిస్తున్న విషయాలనిప్పుడు చెప్పుతున్నాను.
1. దేవుని కృప మనలను రక్షిస్తుంది
మారా, నీవు రక్షింపబడ్డావు. అంటే, నీవు ఇంతకుముందే చేసిన మరియు ఎప్పుడైనా చేసే చెడు విషయాలన్నిటి గూర్చి నీవు క్షమింపబడి, ఆయన బిడ్డగా దేవుని చేత అంగీకరింపబడ్డావు. నీవు చేసిన మంచి పనులనుబట్టి కాదు లేదా నీవొక మంచి బిడ్డవై యున్నందుకు కాదు, గాని నీవు యేసునందుంచిన విశ్వాసమునుబట్టి నీకు నిత్యజీవం అనుగ్రహింపబడింది. ఇది ఎంతో ముఖ్యమైన, కీలకమైన విషయం. మంచివారమై ఉండటం అనేది చెట్టు మీద నున్న ఫలము వంటిది. గాని ఈ చెట్టు యేసునందలి విశ్వాసమై ఉన్నది. ‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెనని’’ యేసు అన్నాడు (యోహాను 3:16). యేసును నమ్మి ఆయనయందు విశ్వాసముంచి, యేసును మాత్రమే అంగీకరించినప్పుడే
మనం దేవునితో సరైన సంబంధాన్ని కలిగియుంటాం. లేదా ఎపెసీ 2:8లో ఇలా వ్రాయబడి యున్నది, ‘‘మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. దేవుని వరమే.’’
‘‘యేసు పాపుల కొరకు మరణించాడు. దేవుడు భక్తిహీనులను నీతిమంతులనుగా ప్రకటిస్తున్నాడు. కాబట్టి, నీవు మొదట మంచిదానవు కాగలవని అనుకోవద్దు.’’
కాబట్టి, మారా, దేవుడు నిన్ను అంగీకరించడానికి నీవు చాలినన్ని మంచి పనులు చేశావో లేదో అని నీవు చేసిన మంచి పనులను లెక్కించడం అస్సలు మొదలుపెట్టవద్దు. ఆయన నిన్ను ఈ విధంగా అంగీకరించడు. నీవు దేవునితో సంబంధం కలిగియుండటానికి నీవు అలా చేయాలని నీకు అపవాది చెప్పుతుంటాడు. యేసు పాపుల కొరకు మరణించాడు. దేవుడు భక్తిహీనులను నీతిమంతులనుగా ప్రకటిస్తున్నాడు. కాబట్టి, నీవు మొదట మంచిదానవు అవ్వగలనని అనుకోవద్దు. లేదు. మనము విశ్వాసముంచుట ద్వారా మన పాపము నుంచి రక్షింపబడ్డాము, అంతేగాని మనము మంచివారమై యున్నందుకు కాదు. ఆ తరువాత మంచిని ప్రేమిస్తూ పాపమును ద్వేషించేలా మనం మార్చబడడానికి మనకు పరిశుద్ధాత్మ సహాయం చేస్తుంటాడు. నేను చెప్పదలచిన మొట్టమొదటి మరియు అతి ముఖ్యమైన విషయం ఇదే.
2. మన పాపమునకు విరోధంగా పోరాడుట
మనము రక్షింపబడిన తరువాత కూడ పాపము చేస్తుంటాము. అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని రోమా 7లో చెప్పుతున్నాడు. మనము ప్రతి దినము క్షమాపణ కొరకు వేడుకోవాలని యేసు మనకు నేర్పించాడు (మత్తయి 6:12). మనలో పాపము లేదని చెప్పుకొనిన యెడల మనము అబద్ధమాడుచున్నవారమవుతామని యోహాను చెప్పుతున్నాడు (1 యోహాను 1:10). మనము రక్షింపబడ్డాము, పరిశుద్ధాత్మ మన అంతరంగములో ఉన్నాడు. మనలను వినయమనస్కులనుగా చేయడానికి ఆయన మన పాత అలవాట్లను నిదానంగా జయిస్తుంటాడు. ‘‘పాస్టర్ జాన్‌గారూ, నన్ను మంచిదానిగా చేయడానికి దేవుడు ఇంత దీర్ఘ కాలం ఎందుకు తీసుకుంటాడు?’’ అని నీవు నన్నడుగవచ్చు. నాకిప్పుడు 68 సంవత్సరాలు. అయినా, ఈ ప్రశ్న నేను కూడ అడుగుతున్నాను. నన్ను మంచివానిగా చేయడానికి దేవుడు ఇంత ఎక్కువ కాలం ఎందుకు తీసుకుంటాడు? అని. దీనికి నా జవాబేమంటే, మనము గర్వించకుండునట్లు ఆయన మనలను వినయమనస్కులనుగాను, విరిగినలిగిన హృదయము గలవారముగాను, మనము ఆయన కొరకే అనగా, ఆయన కృప కొరకే కాచుకొని యుండునట్లు ఆయన ఉంచుతాడని నేననుకుంటాను.
వాస్తవంగా చెప్పాలంటే, 1 యోహాను 1:6-10 వరకు చూడండి. ఈ వచనాల్లో ఆశ్చర్యకరమైన విషయమున్నది. ‘‘ఆయనతో కూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల, మనము మన పాపములను ఒప్పుకుంటాము గనుక మనము అన్యోన్య సహవాసముగలవారమై యుందుము.’’ ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే, వెలుగులో నడవడం అంటే దేవునితో మంచి సంబంధం కలిగియుండడం అని దానిలో పాపముల ఒప్పుకోలు కూడా ఉంది అని అర్థం. వెలుగులో నడవడమంటే పాపములేనివారమని అర్థం కాదు. అది అలా అర్థమీయదు. కాబట్టి, నీవు దేవునితో మంచి సంబంధంగలదానవై యున్నావని తెలుసుకోడానికి ఒక మార్గమేమంటే, నీవు ఎప్పుడునూ పాపము చేయవద్దు, గాని నీవు నీ పాపమును గుర్తించాలి. ఎందుకంటే వెలుగు నీలో ప్రకాశించుచున్నది మరియు పాపాన్ని ఒప్పుకుంటున్నావు. ‘‘నన్ను మన్నించు దేవా’’ అని నీవు దేవునికి మొరపెట్టు, ఆయన తన రక్తములో నీ పాపమును తుడిచివేయాలని యేసును అడుగు. ‘‘అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును.’’ ఇది రెండవ విషయం. క్రైస్తవులమైన మనము పాపము చేస్తు ఉంటామనే వాస్తవముతో వ్యవహరించుట నేర్చుకోవాలి.
3. మనము కలిగియుండగల (ఆత్మ)విశ్వాసం
నీవు దేవునికి చెందినదానవనే ఆత్మవిశ్వాసం నీకుండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మారా, ఆయనతో నీకున్న సంబంధం గూర్చి నీవు చింతించాలని దేవుడు కోరడం లేదు. 1 యోహాను 5:13లో ఇలా వ్రాయబడి యున్నది, ‘‘దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను.’’ నీవు నీ ఆత్మవిశ్వాసాన్ని, సంతోషాన్ని, మరియు నిశ్చయతతో కూడిన అభయాన్ని ఆనందంగా అనుభవించాలని ఆయన కోరుతున్నాడు. నీవు రాత్రివేళ నిద్రపోవునప్పుడు, దేనిగూర్చికూడా భయపడకుండా, దేవునితో సరైన సంబంధం గలదానవై యున్నావనే దృఢనిశ్చయత గలదానవై యుండాలని ఆయన ఆశిస్తున్నాడు. నీవు అక్షరాలా పూర్ణ సమాధానంగలదానవై నిద్రించవచ్చు. ఒకవేళ, నీవు మధ్య రాత్రిలో మరణించినప్పటికిని, నీవు దేవునితో సరైన సంబంధంగలదానవై యుంటావు. నీవు యేసు చెంత సురక్షితంగా ఉంటావు.
4. మనము రక్షించబడితిమని తెలుసుకొనగల మార్గాలు
నీవడిగిన ప్రశ్నలో ఇది ముఖ్యమైన విషయమని నేననుకుంటున్నాను. దేవునితో మనకుగల సంబంధము మంచిదో కాదో మనల్ని మనం పరీక్షించి తెలుసుకోడానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది. మచ్చుకు ఒకట్రెండు నీ ముందుంచుతున్నాను. ఒకటి, ‘‘పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడు’’ (1 కొరింథీ 12:3). కాబట్టి, ‘‘యేసూ, నీవు నా ప్రభువై యున్నావు. నీవు నా యజమానివై యున్నావు. నీవు నా దేవుడవై యున్నావు. నేను నీ చిత్తాన్ని తెలుసుకొనగోరుతున్నానని’’ నీ హృదయం చెప్పినట్లయితే, ఇది నీ జీవితంలో పరిశుద్ధాత్మ చేయుచున్న పనైయున్నదని అర్థం.
రెండవది: ‘‘ఆ ఆత్మ కలిగినవారమై మనము, ‘అబ్బా! తండ్రీ’ అని మొఱ్ఱపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు’’ (రోమా 8:15-16). అనగా, నీ హృదయం దాని అంతరంగం నుండి ఉప్పొంగిపోయి, ‘‘దేవా, నీవు నా తండ్రివి. నేను నీ బిడ్డను. నాకు తండ్రి కావాలి. నేనొక చిన్న పిల్లను, బొత్తిగా నీ మీదే ఆధారపడుతున్నానని’’ చెప్పినప్పుడు, నీ హృదయం ఇలా మాటలాడినప్పుడు, అదే నీలో ఉన్న పరిశుద్ధాత్ముని సాక్ష్యం.
మూడవది: ‘‘మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవము లోనికి దాటియున్నామని యెరుగుదుము’’ (1 యోహాను 3:14). యేసు మన కొరకు తననుతాను అప్పగించుకొని మరణించుట ద్వారా ఆయన చేత ప్రేమింపబడుట వలన కలిగే ప్రభావాల్లో ఒకటేమంటే, మనము ఆయన వలెనే ఇతరులను, ముఖ్యంగా ఇతర క్రైస్తవులను ప్రేమించుటకు మొదలుపెట్టుతాము. గనుక, నీవు ఇతర క్రైస్తవులను ప్రేమిస్తున్నట్లయితే, ఇతరులు రక్షింపబడడాన్నిబట్టి నీవు ఆనందిస్తున్నట్లయితే, వారి గూర్చి తెలిసికొని వారితో సహవాసం చేయుటకు ఆశపడుతున్నట్లయితే, నీవు కూడ దేవుని కుటుంబములోనికి చేర్చుకోబడ్డావని చెప్పడానికి అదొక సంకేతమై యున్నది.
‘‘యేసు మన కొరకు తననుతాను అప్పగించుకొని మరణించుట ద్వారా ఆయన చేత ప్రేమింపబడుట వలన కలిగే ప్రభావాల్లో ఒకటేమంటే, మనము ఇతరులను ప్రేమించుటకు మొదలుపెట్టుతాము.’’
మరొకటి: ‘‘దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక వాడు పాపము చేయజాలడు’’ (1 యోహాను 3:9). నీవు పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల నీవు అబద్ధికుడవనే విషయాన్ని మనము ఇదివరకే 1 యోహాను 1:10లో చదివాము. నీవు ఎన్నడూ పాపము చేయవనేది ఈ వచనము యొక్క అర్థం కాదు. దాని భావమేమంటే, ‘‘నేను నా పాపాన్ని ప్రేమిస్తున్నాను. నేను నా పాపాన్ని నా దగ్గరే ఉంచుకోబోతున్నాను. దేవుడు ఏమంటాడో అనే విషయం నాకక్కర్లేదు. నేను దీనిని చేస్తూనే ఉంటాను. దీని ప్రభావం నాకు ముఖ్యం కాదు గనుక నేను దానిని పట్టించుకోనని’’ నీవు చెప్పుటకు ఒక నిర్దిష్టమైన ప్రవర్తనా నమూనా లేదు. నీవు పాపముతో స్థిరపడినట్లయితే, పాపముతో స్నేహం చేసినట్లయితే, ఇలాగే నీవు పాపమును వెంబడిస్తుంటే, నీవు దేవునితో ఎప్పటికీ సరైన సంబంధం కలిగియుండలేవు, మరియు నీవసలు ఖచ్చితంగా రక్షింపబడినావో లేదో అనే అనుమానం కూడ కలుగవచ్చు.
5. దేవుని ప్రేమ
ఇక చివరి పరీక్ష: ‘‘దేవుని ఎరిగినవాడు మన మాట వినును’’ (1 యోహాను 4:6). ‘‘మన’’ అనగా బైబిలు రచయితలు, అపొస్తలులు. ‘‘నా గొఱ్ఱెలు నా స్వరము వినును’’ (యోహాను 10:27). గనుక, నీవు దేవునితో మంచి సంబంధం కలిగియున్నావని చెప్పడానికిగల సంకేతాలలో మరొకటేమంటే, నీవు నీ బైబిలును ప్రేమిస్తావు. దేవుని గూర్చి తెలుసుకోవాలని నీవు ఎంతో ఆశపడుతుంటావు. నీవు దేవుని గూర్చి యింకా ఎక్కువ, యింకా ఎక్కువ తెలుసుకోవాలని తృష్ణగొంటావు.
మరి ఎక్కువ ఎదుగుదలకుగల మార్గం
మారా, నీవు దేవునితో మంచి సంబంధంగలదానవై యున్నావని ఖచ్చితంగా తెలుసుకొనగల ఐదు పరీక్షల గూర్చి నీకు నేను ఇంతవరకు చెప్పాను. అయితే, ఒక బలమైన సలహా కూడ ఇవ్వాలని ఆశపడుతున్నాను. నీవు, నిన్ను నీవు పరీక్షించుకొనడంలోనే ఎక్కువ సమయం గడుపవద్దు. లేదు, ఆ పని చేయకు. అదొక సమస్యగా మారుతుంది, ఎందుకంటే, అలా చేస్తే ఏంజరుగుతుందో నీకు తెలుసా? అలా చేస్తే, నీవు నిన్ను గూర్చి ఎక్కువగా ఆలోచిస్తుంటావు. కాబట్టి, అలా చేయడానికి బదులుగా, ఈ పరీక్షలను అప్పుడప్పుడు మాత్రమే ఉపయోగించుకుంటూ, నీ సమయంలో మరి ఎక్కువగా యేసును, ఆయన వాక్యమును, ఆయన నీకు చేసిన మరియు చేయుచున్న మేళ్లన్నిటితోపాటు ఆయన వాగ్దానాల గూర్చి ఆలోచిస్తూ ఉండు. అనగా, నీకు దేవునితోగల సంబంధం మంచిదైయున్నదనే నిశ్చయతతో కూడిన అభయం మరియు ఆత్మవిశ్వాసం కొరకు నీవు చేయగల ఉత్తమమైన పనేమంటే – నిన్ను నీవు మర్చిపోవడమని మరొక మాటలో చెప్పుకొనవచ్చు. నీవు యేసును చాలా చక్కగా తెలిసికొని, ఆయనను మరి ఎక్కువగా తెలిసికొంటూ ఆయన లేఖనములలో నుండి ఆయనను గూర్చిన విషయాల్లో నీవు ఆనందించడానికి ఎంతో ఎక్కువ సమయం గడుపగలిగినప్పుడు, నిన్ను గూర్చి నీవు ఏమాత్రమైనను ఆలోచించవనేది ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది.
‘‘నీకు దేవునితోగల సంబంధం మంచిదైయున్నదనే నిశ్చయతతో కూడిన అభయం మరియు ఆత్మవిశ్వాసం కొరకు నీవు చేయగల ఉత్తమమైన పనేమంటే – నిన్ను నీవు మర్చిపోడం.’’
ఇదే విషయమై ఇంకా ఒకట్రెండు తలంపులు. మారా, నీ విశ్వాసం బలహీనమవకుండా లేదా నీవు దేవునియందలి నీ నమ్మికను కోల్పోకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. ఆయన నిన్ను తన చేతులతో ఎత్తిపట్టుకుంటాడు. ‘‘నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటినెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు’’ (యోహాను 10:27-28). కాబట్టి గట్టి ఆత్మవిశ్వాసంగలదానవై యుండుము. దేవుడు నిన్ను కాపాడుతుంటాడు. ఆయన నీ సంబంధాన్ని మంచి సంబంధంగా చేస్తుంటాడు.
ఇక ముగింపులో నేను చెప్పాలనుకున్న చివరి విషయం: రేపటి దినాన దేవునితో నీకున్న సంబంధం చాలినంత మంచిదై యుంటుందా, ఉండదా అని ఈ రోజు చింతించవద్దు. ప్రతి రోజుకు దాని దాని పరీక్షలు దానికుంటాయి, ఆ పరీక్షలతో పాటే ఏనాటి కృపాకనికరములు ఆనాడుంటాయి. విలాపవాక్యములు 3:22 ఈ విషయాన్నే చెప్పుతున్నది: ‘‘యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.’’ రేపటి దినాన నీకు అవసరమైయున్న సమస్తమును దేవుడు నీకిస్తాడు. కాబట్టి, మారా, ఈ ప్రశ్న అడిగినందుకు నీకు చాల వందనాలు. దేవుడు నిన్ను బలమైన మరియు ఫలభరితమైన స్త్రీగా చేయాలని ఆశిస్తున్నాను, దాని గురించే ప్రార్థిస్తున్నాను. దేవుడు నిన్ను దీవించుగాక.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web