పనిచేసే చోట సువార్త ప్రకటించుట

పనిచేసే చోట సువార్త ప్రకటించుట

షేర్ చెయ్యండి:

రోజులు గడిచే కొద్దీ, క్రైస్తవులు మరియు క్రైస్తవ్యం పట్ల వ్యతిరేకత పెరిగిపోతుంది. మీరు పనిచేసే చోట సువార్త ప్రకటించే విషయంలో అది ఎలా ప్రభావం చూపిస్తుంది? మీరింకా  ఎక్కువగా నమ్మకమైన వారీగా ఉంటున్నారా లేక భయపడుతున్నారా?

నీవు భయపడుతున్నావంటే, ఆశ్చర్యం లేదు. ఒక ప్రక్క సామాజికపరమైన ఉదారవాదం (లిబరలిజం) త్వరత్వరగా అభివృద్ధి చెందుతుంది; మరొక ప్రక్క పనిచేసే స్థలంలో ‘‘సహనాన్ని‘‘ ప్రోత్సహించే విధానాలు రెండు భయాలను మరింత పెంచుతున్నాయి. ఈ రెండు భయాలు ఒకరు తాను పనిచేసే చోట సువార్త పంచుకోలేకపోడానికి సాధారణంగా కారణాలై ఉండవచ్చు. అవేంటంటే, సమాజపరంగా కష్టం లేదా నష్టం కలుగుతుందేమోనన్న భయం ఒకటి; రెండోది, ఉద్యోగంపై పడే ప్రభావం – ఉద్యోగం ఊడిపోతుందేమో లేదా ప్రమోషన్‌లు ఇవ్వబడవేమోనన్న భయం.

సువార్త ప్రకటించడం ఎప్పుడూ కష్టంగానే ఉన్నట్టు కనబడుతుంది. ఈ రోజుల్లో మనమెదుర్కొంటున్న సవాళ్లలో క్రొత్త విషయమేదైనా ఉందా అంటే, అది వ్యతిరేకతకు లభిస్తున్న ప్రోత్సాహం. ఇదివరకు క్రైస్తవేతరులు, ‘‘ఎవరిష్టం (ఎవరి మతం) వారిది’’ అని అనే వారు. ఇప్పుడలా కాదు. ఇప్పుడు మనకు బుద్ధిలేదని (‘‘మీరు యింకా పరిణామ సిద్ధాంతాన్ని నమ్మరా?’’), లేదా ద్వేషపూరితమైన మతోన్మాదం (‘‘స్వలింగ సంపర్కము పాపమని చెప్పడానికి నీకెంత ధైర్యం?’’) అంటూ నిందించడం జరుగుతుంది. ఉద్యోగాలిచ్చేవారు లేదా పదోన్నతులు కల్పించేవారు, మొదట ఒకరి సమాజపరమైన నేపథ్యం గూర్చి తీవ్రంగా విచారణలు జరిపిస్తుంటారు. ఇంతకు ముందు పనిచోట కలిగించబడే ఇబ్బందులు మరియు విచక్షణ విషయమై భయపడే కంపెనీలు, ఎక్కువ కష్టపడి పనిచేసే క్రైస్తవుని దాటేసి, తక్కువగా శ్రమించిన మరొకరికి పదోన్నతి కల్పించడం లేదా?

ఇంత జరుగుతున్నప్పటికినీ, మనుష్యుల కంటె ఎక్కువగా దేవునికి భయపడి నాకు సువార్త చెప్పిన సహోదరులకు నేనెంతో కృతజ్ఞుడనై యున్నాను. నేను పనిచేసే చోట ప్రకటించబడిన సువార్త ద్వారా రక్షించబడ్డాను.

పనిచేస్తున్న స్థలంలో తప్పిపోయి, దొరికితిని

12 సంవత్సరాల క్రితం, నేనొక పరిశోధన కేంద్రంలో పనిచేసేవాణ్ని. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, అన్నీ చాలినంతగా ఉన్నాయి, వృత్తి రీత్యా అంతకంతకు వర్ధిల్లుచుండిన హిందువునై యుంటిని. నాకు సరైన ఆధ్యాత్మిక నిశ్చయత లేదని ఎవరూ అనుకోరు. కాని, నిజం చెప్పుతున్నాను, నాకు సరైన ఆధ్యాత్మిక నిశ్చయత లేదని నాకే తెలియదు. నేను క్రీస్తును కావాలని వెతికే వ్యక్తిని కాను.

ఒక రోజు నా సహోద్యోగియైన హంటర్‌ లోపలికి వచ్చాడు. అతడు ఆఫీస్‌లో అందరికి బాగా తెలుసు, ఇష్టం కూడా. ఇతనికి అనేక విషయాల్లో ఆసక్తి ఎక్కువ. ‘‘అతడొక క్రైస్తవుడు, తెలుసా’’ అని నాతో ఒకరన్నారు. ‘క్రైస్తవుడు’ అనే మాటకు అర్థమేంటో మా ఇద్దరికీ తెలియదు.

హంటర్‌, క్రైస్తవుడంటే ఇలా ఉంటాడని నేను మానసికంగా చిత్రించుకున్నట్టు ఉండడని నాకు తెలియదు. క్రైస్తవులు మంచివారు, పాతకాలపు మనుష్యులు, వేషధారులు, చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పుతుంటారని అనుకొనేవాడను. హంటర్‌ అలా లేడు. కాబట్టి నేనతన్ని బాగా గమనించడం మొదలుపెట్టాను.

మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాము. ఇద్దరము కలుసుకున్నామంటే, టెలివిజన్‌ కార్టూన్లు, కట్టుకథల్లోని దేవుళ్లు, క్రీస్తు, కృష్ణుడు, కాఫీ, పని మొ॥ అనేక విషయాల గురించి మాట్లాడుకొనేవాల్లం. హంటర్‌ నన్ను వెంటాడుతూనే ఉండునట్లు ప్రభువతన్ని వాడుకొనుచుండగా, అతడు తన అభిప్రాయాలను, విశ్వాసమును నాకు బలవంతంగా అంటగట్టాలని చూస్తున్నట్టు నాకు ఎన్నడూ అనిపించలేదు, కేవలము ఒక స్నేహితునిగానే ఉన్నాడు. దేవుడు మాత్రమే చేయగలిగిన విధంగా, ఆయన తన కటాక్షము చొప్పున, ఆయన నా జీవితంలో ఒక ఆధ్యాత్మిక సంక్షోభాన్ని కలుగజేసి సరిగ్గా అదే సమయానికి హంటర్‌ను నా దగ్గరకు పంపించాడు. కాబట్టి నా జీవితంలో ఎప్పుడు, ఏది అత్యావశ్యకమై ఉన్నదో సరిగ్గా అదే విషయానికి సంబంధించిన సత్యాన్ని హంటర్‌ నాకు తెలియజెప్పునట్లు దేవుడు హంటర్‌కు జ్ఞానమిచ్చాడు, ధైర్యాన్నిచ్చాడు.

పనిచేసే చోట సువార్తికుని ప్రవర్తన

ఆ సమయంలో హంటర్‌ తన విశ్వాసంలో ఎదుగుతున్న యౌవనస్థుడు, గనుక ఏ విశ్వాసియైనా హంటర్‌ కనుపర్చిన మాదిరి నుండి నేర్చుకొని తాను పనిచేసే చోట అన్వయించుకోడానికి అనేక విషయాలున్నాయి.

1. అందరికి క్రీస్తును కనుపర్చు

మొట్టమొదటిదిగా, అందరి ముందు క్రీస్తును కనుపర్చు. ఎందుకంటె మనం పనిచేసే చోట క్రైస్తవులు అరుదుగా కనబడతారు గనుక నీతో కలిసి పనిచేసేవారందరు నీవు క్రైస్తవుడవని తెలిసికొనడం ఎంతో ముఖ్యం. ఇది జరిగినప్పుడు నీవు బలహీనులైన విశ్వాసులను బలపర్చడానికి అందుబాటులో ఉండగలవు, ఇతరులకు మాదిరివై యుండగలవు. హంటర్‌ క్రైస్తవుడని నాకు ఒక క్రైస్తవేతరుడు చెప్పాడు. ఈ విషయాన్ని మనం ఒకరికి అభ్యంతరకరంగా ఉండేట్టుగాని లేదా బాధ్యత లేకుండగాని చేయకూడదు, గాని నీవు వారాంతాన్ని (వీకెండ్) గడిపిన విషయాన్ని జ్ఞాపకం చేసికొనడం ద్వారా, నీవు హాజరవుతున్న బైబిలు స్టడీలో నేర్చుకొన్న విషయాలను వివరించడం ద్వారా, లేదా నీవు ఇతరుల కోసం ప్రార్థనచేసే విధానం ద్వారా, ఇతరులు నీవు క్రైస్తవుడవని త్వరగా తెలుసుకుంటారు.

2. నీ పనులను శ్రేష్ఠంగా చేయాలి 

రెండవదిగా, నీకు చెప్పబడిన పనులను, చెప్పబడినట్టు, చెప్పబడిన సమయంలోగా మంచిగా చేయాలి. నీవు క్రీస్తును కనుపర్చునప్పుడు, నేను హంటర్‌ను గమనించినట్టు, నిన్ను నీతోటి వారందరూ గమనిస్తుంటారని జ్ఞాపకముంచుకొని, అందుకు తగిన విధంగా ప్రవర్తించాలి. దేవుని సృజనాత్మకతను, ఉద్దేశాన్ని, మరియు మంచితనాన్ని చూపించే విధంగా పనులు చేస్తుండాలి. నీ నమ్మకత్వాన్ని, నీతిని, నిజాయితీని నీ పనుల్లో, ప్రవర్తనలో చూపించు. నీ పనుల గురించి సణగొద్దు, ఫిర్యాదు చేయొద్దు. అధికారులకు లోబడుతు, వినయంతో పనులు చేయాలి.

ఇదే సువార్త ప్రకటన కాదు, గాని మనం పంచుకొనే లేదా పంచుకోవాలనే సువార్త మన జీవిత విధానం మరియు మనం పనులు చేసే పద్ధతులు బలపర్చాలే గాని, బలహీనపర్చకూడదు.

3. తోటిపనివారిని ప్రేమించాలి

మూడవదిగా, నీతో కలిసి పనిచేసేవారందరిని ప్రేమించాలి. తోటి పనివారిలోని క్రైస్తవేతరులతో, ఏదో మొక్కుబడిగా కాదు గాని వారు కూడ దేవుని స్వరూపంలో సృజింపబడినవారని ప్రేమపూర్వకంగా స్నేహం పెంచుకోడానికి ప్రయత్నించు. వారికి నీపై ఏర్పడే నమ్మకాన్ని తక్కువగా అంచనావేయవద్దు. హంటర్‌ మరియు నేను ఒకటిన్నర సంవత్సరాల తరువాత కలిసి బైబిలులోని వాక్యాలు అధ్యయనం చేయగలిగాము, అప్పుడు విన్నాను నేను, సువార్త.

బ్రేక్ సమయాన్ని జాగ్రత్తగా, ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలి. ఇతరులను ఆదరించుటలో, ఆతిథ్యమిచ్చుటలో నీ శాయశక్తులా ప్రయత్నిస్తూ, ఆఫీసు పనులేవీ లేకుండా నీవు నీ జీవితాన్ని ఇతరులతో పంచుకోవచ్చు.

4. సువార్తను అందించడానికి సిద్ధపడాలి

నాలుగవదిగా, సువార్తను పంచుకోడానికి సిద్ధపడాలి. సిద్ధపడటం అనవసరమైన విషయంగా అనిపించినప్పటికినీ, సువార్తను సులభంగా ఎలా వివరించాలో తెలిస్తే చాలా సహాయకరంగా ఉంటుంది. అవసరమైతే, ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే మంచిదే.

ఎందుకంటె, దేవుడు నీకొక అవకాశనిచ్చినప్పుడు, ‘అయ్యో, ఇప్పుడేం చెప్పాలి, ఏం చేయాలి నేను’ అని నీలో నీవు బాధపడకూడదు. నీవు నీ తోటిపనివానికి చెప్పే విషయంలో నీకు స్పష్టంగా తెలిసియుండాలి, అవతలి వ్యక్తి ఏ విషయంతో సతమతమవుతున్నాడో నీవు అర్థం చేసుకోగలిగి యుండాలి. ఎంతైనా, ఒకరిని రక్షించేది సువార్తయే, మన చాకచక్యం కాదు, లేదా విశ్వాస సమర్థింపు జ్ఞానమూ కాదు! హంటర్‌ నాకు సువార్త చెప్పినప్పుడు సువార్త గూర్చి అతనికున్న స్పష్టత, ధైర్యం మరియు సువార్త శక్తిలో ఉన్న నమ్మకాన్నిబట్టి నేను దేవున్ని స్తుతిస్తున్నాను.

5. ప్రార్థించాలి

ఐదవదిగా, ప్రార్థించడము. నీ తోటిపనివారి కొరకు ప్రతి రోజూ ప్రార్థన చేయాలి. అవకాశములు దయచేయుమని మాత్రమే కాదు గాని అవకాశం దొరకినప్పుడు దానిని సరిగా ఉపయోగించుకొనే జ్ఞానం కొరకు కూడ ప్రార్థించాలి. బలంగా ప్రకటించాలి, భయపడక ప్రకటించాలి కాబట్టి ధైర్యం కొరకు దేవుని వేడుకోవాలి. దేవుడు హెచ్చింపబడునట్లు, మానవులమైన మనం తగ్గించబడునట్లు ప్రార్ధన చెయ్యాలి ఎందుకంటె, ఈ రెండు విషయాల్లో మనం అప్పుడప్పుడూ శోధనకు గురవుతాము.

మీ సంఘసభ్యులు సైతం ప్రార్థించాలని వారిని ఆహ్వానించాలి. నేను హంటర్‌ను క్రైస్తవ విశ్వాసం గూర్చి అడిగినప్పటి నుంచి అతను హాజరయ్యే పురుషుల బైబిలు స్టడీ గ్రూప్ సభ్యులు నా కొరకు ప్రార్థించారని హంటర్‌ నాకు తర్వాత చెప్పాడు.

నమ్మకత్వం కొరకైన పిలుపు

మనం పనులు చేసే స్థలాల్లో కూడ క్రైస్తవ్యం పట్ల విరోధభావం ఎక్కువవుతున్నందున, మనం ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలు మరింత ముఖ్యమవుతున్నాయి. ‘మంచి అవకాశాలు, అవకాశాలతోపాటు ఆ సమయానికి మరియు సందర్భానికి సరిపడు క్లుప్త సందేశాన్ని కూడ దయచేయు, ప్రభువా!’ అని నేను చేసే ప్రార్థనలకు దేవుడు తన మహా కృపనుబట్టి జవాబులు అనుగ్రహిస్తున్నాడు. నేను క్రైస్తవుడనని అందరికి తెలియడం, వృత్తిపరంగాను, తోటిపనివారితో కలిగియున్న మంచి సంబంధాల విషయంలో నా విశ్వాసాన్ని కనుపర్చగలుగుతున్నందుకూ, వారు కూడ దేవుని స్వరూపంలో సృజింపబడినవారని వారిని ప్రేమించుటనుబట్టీ, నేను నా విశ్వాసం గూర్చి బహిరంగంగా సాక్ష్యమియ్యడానికి అవకాశాలను ఇస్తుంది. ఇంతేగాక, దేవుని అద్భుతమైన కృపచేత, తోటి పనివారిలో ఒకరిని ప్రభువు నొద్దకు నడిపించునట్లు  ఉపయోగించుకోడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు.

మనం క్రీస్తు గూర్చి సాక్ష్యమియ్యడానికి కావలసిన అవకాశాలనిస్తాడని, మనం చేసే ప్రార్థనలకు దేవుడు తప్పక జవాబిస్తాడని నమ్ముతూ, ధైర్యం కోసం ప్రార్థించాలి. తోటివారితో మంచి సంబంధాలు ఏర్పరచుకొని క్రీస్తు కొరకు సాక్ష్యమియ్యడానికి దానిని ఉపయోగించుకోడానికి నీవు ఇష్టపడాలి. దేవుడు నిన్ను నీ పని చేసే స్థలంలో అక్కడ ఒక ఉద్దేశంతో ఉంచాడు.

అశోక్‌ నచ్‌నాని

అశోక్‌ నచ్‌నాని

అశోక్ నచ్‌నాని నార్త్ కరోలినాలోని డర్హామ్‌లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్‌లో పెద్ద మరియు మల్టీనేషనల్ ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీలో స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్.

2 Comments

  1. Ee are from GGC church.
    Huzurabad
    We are really inspired by this article thank you so much for giving such a beautiful article ❤️

  2. మా చర్చి fellowship లో ఉన్న మేము ఈ ఆర్టికల్ చదివి చాలా ప్రోత్సహించబడ్డాము .. మేము పని చేసే దగ్గర ఎలా ఉండాలి నేర్చుకున్నాము .. మాదిరిగా , క్రీస్తు ను ప్రకటించాలని ప్రార్ధిస్తున్నాము .. ఇప్పడు ప్రతి ఒక్కరం వారికి తెలిసిన ఒక ఐదుగురి కోసం ప్రార్ధిస్తున్నాం .. ఆ తరువాత ప్రకటించే అవకాశం కోసం వేచి చూస్తాము .. thank you so much for this artical….We have been blessed by these articals as Grace Gospel Church, Huzurabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...