శ్రేయస్సు సువార్తలోని 5 తప్పులు

శ్రేయస్సు సువార్తలోని 5 తప్పులు

షేర్ చెయ్యండి:

ఒక శతాబ్దం క్రిందట, ఆనాటి క్రైస్తవ ప్రపంచంలోని అతి పెద్ద సంఘంలో మాట్లాడుతూ, చార్లెస్‌ స్పర్జన్‌ ఇలా అన్నాడు, సిరిసంపదలను పోగుచేసే లక్ష్యంతో బ్రతకడం, క్రైస్తవ్యానికి వ్యతిరేకమనీ, ఏ క్రైస్తవునికైనా అది అపవిత్రమైనదనీ నేను నమ్ముతున్నాను.

 ‘‘మనము సంపాదించుకోగలిగినంత డబ్బు సంపాదించుకోడానికి మనము ప్రయాసపడాల్సినంతగా ప్రయాసపడకూడదా?’’ అని మీరంటారు. మీరు కూడా అలాగే చేయొచ్చు. మీరలా చేయడం ద్వారా, దేవుని కొరకు ప్రయాసపడిన వారవుతారా అని నేను సందేహపడుతున్నాను. కాని నేనేమని చెప్పాను? సిరిసంపదలను పోగుచేసే లక్ష్యంతో బ్రతకడం క్రైస్తవ్యానికి వ్యతిరేకమని అన్నాను.1

ఏదైతేనేమి, కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోని కొన్ని పెద్ద పెద్ద సంఘాల్లో బోధింపబడుతున్న సందేశం మారింది, నిజంగా మారిపోయింది. ఈనాడు అనేక సంఘాల్లో ఒక క్రొత్త సువార్త బోధింపబడుతుంది. ఈ సువార్తకు రకరకాల పేర్లు పెట్టబడుతున్నాయి. 

ఉదా॥ ‘‘ఏం కావాలో చెప్పి అది తనదే అని నమ్మించే ” సువార్త. ‘‘ఇవ్వండి, తీసుకోండి ’’ అనే సువార్త. “ఆరోగ్యం మరియు ఐశ్వర్యం’’ అనే సువార్త. ‘‘శ్రేయస్సు’’నిచ్చే సువార్త మరియు ‘‘సానుకూల ఒప్పుకోలు (పాజిటివ్ కన్ఫెషన్) వేదాంతం’’ అనే సువార్త.

ఏ పేరుతో చెప్పుకున్నా, ఈ క్రొత్త సువార్త యొక్క సారాంశం, మామూలు మాటల్లో చెప్పుకుంటే, “విశ్వాసులు శారీరకంగా ఆరోగ్యవంతులుగాను, భౌతికంగా ఐశ్వర్యవంతులుగాను, వ్యక్తిగతంగా ఆనందభరితులుగాను ఉండాలని దేవుడు కోరుతున్నాడని, ఈ స్వార్థపూరిత ‘‘శ్రేయస్సు సువార్త’’ నేర్పిస్తుంది”.

ఈ సువార్తను (ప్రాస్పరిటీ గాస్పెల్) బోధించువారిలో ప్రసిద్దుడైన, రాబర్ట్‌ టిల్టన్‌ ఏమంటున్నాడో వినండి: ‘‘ఈ శ్రేయస్సు సువార్త ఎవరో ఒకరి విషయంలో చాలా బాగా పనిచేసిందని కాదు గాని, నేను ఈ విషయాన్ని దేవుని వాక్యంలో గమనిస్తున్నాను. కాబట్టి అందరు సిరిసంపదలతో తులతూగాలనేది దేవుని చిత్తమని నేను నమ్ముతున్నాను. నా దృష్టంతా నేను ఐశ్వర్యవంతుడను కావాలని నాకు శక్తినిస్తున్న దేవుని మీదనే ఉన్నది, గాని మనుష్యుల మీద కాదు.’’2 

ఈ శ్రేయస్సు సువార్తను బోధించేవారు, విశ్వాసులు భౌతిక ఆశీర్వాదాలతో వర్దిల్ల చేయుమని ప్రార్థన చేయాలని, అవసరమైతే గట్టిగా అడగాలని ప్రోత్సహిస్తుంటారు.

శ్రేయస్సు సువార్తలోని ఐదు వేదాంతపరమైన తప్పులు

ఇటీవలనే, రసెల్‌ వుడ్‌బ్రిడ్జ్‌ మరియు నేను కలిసి ఒక పుస్తకం వ్రాశాము. దాని శీర్షిక – ఆరోగ్యం, ఐశ్వర్యం, మరియు ఆనందం. శ్రేయస్సునిచ్చే సువార్తను బోధించే సువార్తికుల ప్రతిపాదనలను పరీక్షించాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం వ్రాయబడింది. 3 ఈ పుస్తకం అనేక తలంపులతో చాలా పెద్దదిగా ఉన్నది కాబట్టి ఇక్కడ దాని సారాంశం చెప్పడం కుదరదు, గనుక ఈ వ్యాసంలో, పుస్తకంలోని ఐదు సిద్ధాంతాలను, అనగా శ్రేయస్సు సువార్త ప్రతిపాదకులు తప్పుచేస్తున్న సిద్ధాంతాలను పున: సమీక్షించాలని నేనాశిస్తున్నాను. కీలకమైన సిద్ధాంతాలకు సంబంధించిన ఈ తప్పులను వివేచిస్తూ, ఈ వ్యాసాన్ని చదువుతున్నవారు, శ్రేయస్సు లేదా సంపాదన సువార్తలోని అపాయాలను స్పష్టంగా గమనిస్తారని నేనాశిస్తున్నాను.

నేను చెప్పదలచిన సిద్ధాంతాలు: అబ్రాహాముతో చేయబడిన నిబంధన, ప్రాయశ్చిత్తము, దాతృత్వము, విశ్వాసము, మరియు ప్రార్థన.

1) అబ్రాహాముతో చేయబడిన నిబంధన మన భౌతిక హక్కుకు ఒక సాధనమైయున్నది.

మనము మొట్టమొదట ఆలోచించే తప్పు ఏమంటే, అబ్రాహాముతో చేయబడిన నిబంధన మన భౌతిక హక్కుకు ఒక సాధనమైయున్నదనే శ్రేయస్సు సువార్తికుల దృక్పథం కలిగియుండడం. అబ్రాహాముతో చేయబడిన నిబంధన (ఆది 12, 15, 17, 22) శ్రేయస్సు సువార్త యొక్క వేదాంతపరమైన ఆధారాలలో ఒకటి. లేఖనాల్లో అత్యధిక శాతం అబ్రాహాముతో చేయబడిన నిబంధన యొక్క నెరవేర్పైయున్నదని, శ్రేయస్సు సువార్త చెప్పే వేదాంతశాస్త్ర పండితులు గుర్తిస్తున్నారనేది మంచి పరిణామమే, కాని ఈ నిబంధన యొక్క సనాతన దృక్పథాన్ని వారు కొనసాగించకపోవడమనేది మంచిది కాదు. వారిలో ఈ నిబంధన యొక్క ఆరంభం గూర్చి తప్పుడు అభిప్రాయమున్నది; మరి ముఖ్యంగా, వారిలో ఈ నిబంధన అన్వయింపు గూర్చి తప్పుడు దృక్పథమున్నది.

ఎడ్వర్డ్‌ పౌస్సన్‌, ‘‘క్రైస్తవులు విశ్వాససంబంధమైన ఆశీర్వాదాలకు అబ్రాహాము యొక్క ఆత్మసంబంధమైన పిల్లలు మరియు వారసులునై యున్నారు…. అబ్రాహాము స్వాస్థ్యము ప్రాథమికంగా భౌతిక హక్కుల విషయంలో విప్పబడిందని’’ వ్రాస్తూ, అబ్రాహాముతో చేయబడిన నిబంధన యొక్క అన్వయింపు మీద శ్రేయస్సు సువార్త అభిప్రాయాన్ని చాల చక్కగా చెప్పాడు. అనగా, దేవుడు అబ్రాహామును భౌతిక సంపదతో ఆశీర్వదించాలనేది అబ్రాహాముతో చేయబడిన నిబంధన యొక్క మొట్టమొదటి ఉద్దేశ్యమై ఉన్నదని, శ్రేయస్సు సువార్త బోధిస్తున్నదని మరొక మాటలో చెప్పుకోవచ్చు. విశ్వాసులు అబ్రాహాము యొక్క ఆత్మసంబంధమైన పిల్లలై యున్నారు గనుక, ఈ ఆర్ధిక ఆశీర్వాదాలను వారు స్వాస్థ్యంగా పొందారు.

మరో శ్రేయస్సు సువార్త బోధకుడైన కెన్నెత్‌ కోప్లాండ్‌ ఇలా వ్రాశాడు, ‘‘దేవుని నిబంధన స్థిరపరచబడింది గనుక, సంపద ఈ నిబంధన యొక్క సమకూర్పైయున్నది గనుక, ఇప్పుడు సంపద మీకు చెందినదేనని మీరు తెలిసికోవాలి!’’5

ఈ వాదనకు మద్దతుగా, శ్రేయస్సు సువార్త బోధకులు, ‘‘అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై …’’ అని ప్రస్తావిస్తున్న గలతీ 3:13-14 ను ఉపయోగించుకుంటారు. ఏదైతేనేమి, వీరు గలతీ 3:13-14ను వాడుతున్నప్పుడు, ఈ బోధకులు ఈ వచనంలోని మొదటి సగ భాగాన్ని అలక్ష్యం చేస్తున్నారనేది ఆసక్తికరమైన విషయమై యున్నది. మొదటి సగ భాగంలో ఇలా వ్రాయబడి యున్నది, ‘‘ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు…’’ పౌలు ఈ వచనంలో, రక్షణలోగల భౌతిక సంపద గూర్చిన ఆశీర్వాదము కాదు గాని, ఆత్మసంబంధమైన ఆశీర్వాదము గూర్చి గలతీయులకు స్పష్టంగా గుర్తుచేస్తున్నాడు.

2) యేసు చేసిన ప్రాయశ్చిత్తం భౌతిక పేదరికమనే ‘‘పాపము’’నకు పొడిగించబడింది

శ్రేయస్సు సువార్త యొక్క వేదాంతపరమైన రెండవ తప్పు, ప్రాయశ్చిత్తము గూర్చిన తప్పుడు అభిప్రాయం.

దేవశాస్త్ర పండితుడైన కెన్‌ సార్లెస్‌ ఇలా వ్రాస్తున్నాడు, ‘‘భౌతిక స్వస్థత మరియు ఆర్ధికంగా వర్ధిల్లుట ప్రాయశ్చిత్తములో సమకూర్చబడియున్నవని శ్రేయస్సు సువార్త గట్టిగా చెప్పుతున్నది”.6 ‘‘దేవుడు మన పాపమును, అనారోగ్యమును, వ్యాధిని, దు:ఖమును, విచారమును, మరియు పేదరికమును కలువరిలో యేసు మీద మోపాడని తెలుసుకోవడం క్రైస్తవ జీవితం యొక్క ముఖ్యమైన సూత్రమై యున్నదని’’ కెన్నెత్‌ కోప్లాండ్‌ చేసిన వ్యాఖ్యానం దృష్ట్యా, ఇది ఖచ్చితమైన గమనికైయున్నట్టు కనబడుతున్నది.7 ప్రాయశ్చిత్తం గూర్చిన ఈ అపార్థానికి గల ఆస్కారం శ్రేయస్సు సువార్త ప్రతిపాదకులు చేస్తున్న రెండు తప్పుల నుండి పుట్టుకొస్తుంది.

మొదటిదిగా, శ్రేయస్సు సువార్త వేదాంత శాస్త్రాన్ని అంటిపెట్టుకొనే చాలా మందిలో, క్రీస్తు జీవితం గూర్చిన మౌలిక తప్పుడు భావన ఉంది. ఉదా॥ ఉపాధ్యాయుడైన జాన్‌ అవంజిని, ‘‘యేసుకి ఒక మంచి ఇల్లు ఉండింది, ఒక పెద్ద ఇల్లుండింది,’’8 ‘‘యేసు డబ్బును భారీ మొత్తంలో మేనేజ్ (నిర్వహించాడు) చేశాడు’’9 మరియు ఆయన ‘‘ఫ్యాషన్‌ డిజైనర్‌ రూపొందించిన వస్త్రాలు కూడ ధరించాడని’’10 ప్రచురం చేశాడు. క్రీస్తు జీవితం గూర్చి తప్పుగా వివరింపబడిన దృక్పథం, అదే రీతిగా ఆయన మరణాన్ని గూర్చిన తప్పుడు అభిప్రాయాన్ని కూడ కలిగించగలదని సులభంగా గ్రహించవచ్చు.

ప్రాయశ్చిత్తం గూర్చి తప్పుడు దృక్పథానికి తావిచ్చే రెండవ తప్పేమంటే, 2 కొరింథీ 8:9 గూర్చి తప్పుడు అర్థవివరణ చెప్పబడుట. 2 కొరింథీ 8:9లో, ‘‘మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా? ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్య్రమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెనని’’ వ్రాయబడియున్నది. ఈ వచనాన్ని పైపైన చదివినపుడు పౌలు ఐహిక ఐశ్వర్యము పెరిగిపోవుట గూర్చి బోధించేవాడని అనిపిస్తుంది. అయితే ఇదే వచనాన్ని సందర్భానుసారంగా చదివినప్పుడు పౌలు వాస్తవానికి పైన గల వ్యాఖ్యానానికి పూర్తిగా భిన్నంగా ఉన్న సూత్రాన్ని బోధిస్తున్నాడని అర్థమవుతుంది. నిజానికి, యేసు క్రీస్తు ప్రభువు తాను చేసిన ప్రాయశ్చిత్తము ద్వారా వారి కోసం ఎంతో సాధించాడు గనుక, వారు తమ రక్షకుని సేవించుటకు, తమ సిరిసంపదల విషయంలో తమ్మును తాము పూర్తిగా ఏమీ లేనివారిగా చేసికోవాలని పౌలు కొరింథీయులకు బోధిస్తున్నాడు. ఈ కారణాన్నిబట్టే, కొరింథీయులు తమ ధనాన్ని అవసరములో ఉన్న తమ సహోదరులకు ఇచ్చివేయాలని కేవలము ఐదు వచనాల తరువాతే ఇలా వ్రాస్తున్నాడు, ‘‘ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకు సహాయమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను’’ (2 కొరింథీ 8:14-15).

3) క్రైస్తవులు, తమ దేవుని నుండి భౌతిక నష్టపరిహారం పొందేందుకు ఇస్తుంటారు

క్రైస్తవులు తమ దేవుని నుండి భౌతిక నష్టపరిహారం పొందేందుకు ఇవ్వాలనేది శ్రేయస్సు సువార్త యొక్క మూడవ తప్పు. శ్రేయస్సు వేదాంత బోధకులు మరొక విషయం గూర్చి ఆలోచించలేనంతగా, ఇవ్వడం గూర్చిన అంశానికే అతుక్కపోయినట్టుండుట వారిలో స్పష్టంగా కనబడే లక్షణాల్లో ఒకటై ఉంది. ఈ సువార్త వినేవారు ధారాళంగా ఇవ్వాలని ప్రోత్సాహించబడుతూ, “మానవుల జీవితంలోని ఏ కోణంలోనైనా వారి అవసరాలను తీర్చుటకు దేవుని శక్తిని ఉపయోగించుకోడానికి గల సామర్థ్యం నిజమైన సంపద సంపాదనయైయున్నదని”11 మరియు, ‘‘సర్వ లోకానికి సువార్త అందించబడునట్టు ఆర్ధికంగా సహాయం చేయడానికి మనము పిలువబడి యున్నామనే’’12 భక్తితో కూడిన ప్రకటనలు ఎదుర్కొంటున్నారు.

ఈ మాటలు ఒక ప్రక్క హర్షింపదగినవిగా కనబడుతున్నప్పటికిని, ఇవ్వడం గూర్చి నొక్కి చెప్పబడటం వెనుక ఉన్న ప్రోత్సాహకాలు ఇచ్చేవారి క్షేమం నిమిత్తమైయున్నట్టు కనబడుట లేదు. ఈ బోధ ‘‘నష్టపరిహార చట్టం’’మని శ్రేయస్సు సువార్త బోధకుడైన రాబర్ట్‌ టిల్టన్‌ బోధపై ఆధారపడి ఉన్నట్టు మనం గమనించవచ్చు. మార్కు 10:30పై ఉద్దేశపూర్వకంగా ఆధారపడియున్న ఈ చట్టం ప్రకారం13, క్రైస్తవులు ఇతరులకు ధారాళంగా ఇవ్వాల్సిన అవసరమున్నది ఎందుకంటే వారు అలా ఇచ్చినప్పుడు, దేవుడు వారికి మరలా యింకా ఎక్కువగా ఇస్తాడు. నిరంతరం ఇలా చేయడం వలన సంపద కూడా నిరంతరం పెరుగుతూనే ఉంటుంది.

గ్లోరియ కోప్‌ల్యాండ్‌ ఇలా చెప్పుతున్నారు, ‘‘పది రూపాయలిచ్చి వెయ్యి రూపాయలు పొందు; అలాగే వెయ్యి రూపాయలిచ్చి, లక్ష రూపాయలు పొందు… దీన్నే క్లుప్తంగా చెప్పుకొంటే, మార్కు 10:30 చాలా మంచి బేరం.’’14 అలాగైతే, శ్రేయస్సు సువార్త యొక్క ఇచ్చుట గూర్చిన సిద్ధాంతం తప్పుడు ప్రేరణల మీద ఆధారపడి యున్నదని స్పష్టమవుతున్నది. ‘‘ప్రతిఫలంగా ఏమైనను పొందాలని ఆశించకుండానే, మీరు ఇవ్వండని’’ యేసు తన శిష్యులకు నేర్పించాడు; అయితే, ‘ప్రతిఫలంగా భారీ మొత్తంలో పొందుతారు కాబట్టి మీరు ఇవ్వండని’ ఈ శ్రేయస్సు సువార్త వేదాంత బోధకులు వారి శిష్యులకు నేర్పిస్తున్నారు.

4) విశ్వాసం సంపద సంపాదించడానికి  తోడ్పడే స్వీయ ఉత్పాదిత ఆధ్యాత్మిక శక్తియైయున్నది

విశ్వాసం సంపద సంపాదనకు తోడ్పడే స్వీయ ఉత్పాదిత ఆధ్యాత్మిక శక్తియై యున్నదని బోధించడం, శ్రేయస్సు సువార్త వేదాంతం చేస్తున్న నాలుగవ తప్పు. యేసు క్రీస్తులో ఉంచబడిన నమ్మకం విశ్వాసమై యున్నదని సనాతన క్రైస్తవ్యం అర్థంచేసుకుంటుంది. అయితే, శ్రేయస్సు సువార్త బోధకులు పూర్తిగా భిన్నమైన సిద్ధాంతాన్ని స్వీకరిస్తున్నారు. ది లాస్‌ ఆఫ్‌ ప్రాస్పెరిటి (సంపద సంపాదన నియమాలు) అనే తన పుస్తకంలో, కెన్నెత్‌ కోప్‌ల్యాండ్‌ ఇలా వ్రాస్తున్నాడు, ‘‘విశ్వాసం, ఒక ఆధ్యాత్మిక సహజశక్తియై యున్నది, కార్యమును నిర్వహించు ఆధ్యాత్మిక శక్తియై యున్నది, ఆధ్యాత్మిక అధికార శక్తియై యున్నది. ఆత్మల మండలము యొక్క నియమాలు పనిచేయునట్లు చేసేది విశ్వాసము యొక్క ఈ శక్తియే. . . సంపద సంపాదనను శాసించు కొన్ని నియమాలు దేవుని వాక్యంలో బయలుపరచబడి ఉన్నాయి. విశ్వాసం, అవి పనిచేసేలా చూస్తుంది.’’15 ఇది విశ్వాసమును గూర్చిన ఒక తప్పుడు గ్రహింపై యున్నది, అది మతవిరోధమైనదని కూడ చెప్పుకొనవచ్చు.

శ్రేయస్సు సువార్త వేదాంతశాస్త్రం ప్రకారం, విశ్వాసమనేది దేవుడిచ్చిన, దేవుడు కేంద్రీకృతమైన సంకల్ప చర్య కాదు. విశ్వాసం మనుష్యుని స్వభావం ప్రకారం సృష్టించుకొనబడి, దేవుని వైపు మళ్లించబడిన ఆధ్యాత్మిక సహజశక్తియైయున్నది. నిజముగా, విశ్వాసాన్ని దేవుని యెదుట నీతిమంతుడుగా తీర్చబడు సాధనంగా గాక, కేవలము భౌతికమైన మేలుల కోసం ప్రయోజనపడు ఒక సాధనంగా చూచే ఏ వేదాంతశాస్త్రమైనా తప్పైనదిగాను, చాలినది కాని విషయంగాను ఎంచబడాల్సిందే.

5) ప్రార్థన, సంపాదననివ్వమని దేవున్ని బలవంతం చేయడానికి ఒక సాధనమై యున్నది

చివరిగా, సంపాదననివ్వమని దేవున్ని బలవంతం చేయడానికి ప్రార్థన ఒక సాధనమై యున్నదని శ్రేయస్సు సువార్త ఎంచుతున్నది. మనము ‘‘అడుగనందున మనకేమియు లేదని’’ (యాకోబు 4:2) ఈ బోధకులు తరచుగా బోధిస్తుంటారు. విశ్వాసులు వ్యక్తిగతంగా తమ జీవితంలోని అన్ని రంగాలలోను విజయం సాధించునట్టు ప్రార్థించాలని శ్రేయస్సు సువార్తను ప్రతిపాదించువారు వారిని ప్రోత్సహిస్తుంటారు. క్రెఫ్లొ డాలర్‌ ఇలా వ్రాస్తున్నాడు, ‘‘మనము ప్రార్థిస్తున్న విషయాలను మనము ఇదివరకే పొందియున్నామనే నమ్మకంతో మనము ప్రార్థించినప్పుడు, దేవుడు మన ప్రార్థనల ప్రకారం చేయడం కాకుండా ఆయనకు గత్యంతరం లేదు . . . క్రైస్తవునిగా ఫలితాలను పొందడానికి ఇదొక కీలకమైన విషయమై యున్నది.’’16

ఖచ్చితంగా వ్యక్తిగతంగా దీవించబడాలని చేసే ప్రార్థనలు సహజసిద్ధంగా తప్పు కాదు, కాని దేవుడు వారి కోరికలను తీర్చుటకు ఆయనను బలవంతం చేయాలని మానవుడు ప్రార్థనను ఒక సాధనంగా చేసుకోవాలని శ్రేయస్సు సువార్త మితిమీరి నొక్కిచెప్పడం తప్పు.

ఈ శ్రేయస్సు సువార్త వేదాంతశాస్త్రంలో, ప్రార్థనలో దేవుడు కాదు గాని మానవుడే ప్రధానాంశమవుతున్నాడు. ఆసక్తికరమైన విషయమేమంటే, ‘‘మీరడిగినను, మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు, గనుక మీకేమియు దొరుకుట లేదని’’ అని వ్రాస్తూ (యాకోబు 4:3) ప్రార్థన గూర్చి యాకోబు చెప్పుతున్న బోధను శ్రేయస్సు లేదా సంపాదన బోధకులు తరచుగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన నామానికి ఘనత తీసుకొనిరాని స్వార్థంతో కూడిన మనవులను దేవుడు ఆలకించడు, అనుగ్రహించడు.

ఖచ్చితంగా, మనము మన మనవులన్నిటినీ దేవునికి చెప్పుకోవాలి (ఫిలిప్పీ 4:6 చూడుము), కాని శ్రేయస్సు సువార్త ఎక్కువగా మానవుని కోరికలపైనే తన దృష్టిని కేంద్రీకరిస్తున్నది గనుక మనుష్యులు దేవునికి మహిమ తీసుకురాని, స్వార్థంతో కూడిన, అర్థంపర్థంలేని, పైపై ప్రార్థనలు చేస్తున్నారు. ఇంతేగాక, విశ్వాసానికి సంబంధించిన శ్రేయస్సు సువార్త సిద్ధాంతంతో ఇది కలుపబడినప్పుడు, మనుష్యులు వారాశించే వాటిని పొందడానికి దేవున్ని తారుమారు చేయడానికి ప్రయత్నించుటకు ఈ బోధన కారణం కాగలదు, అయితే ఈ ప్రయత్నం వ్యర్థమే. ఇది దేవుని చిత్తం నెరవేరునుగాక అని చేసే ప్రార్థనకు చాలా వ్యతిరేకమైనదై యున్నది.

అబద్ధ సువార్త

లేఖనాల వెలుగులో, శ్రేయస్సు సువార్త మౌలికంగా లోపము గలదై ఉన్నది. ప్రాథమికంగా, శ్రేయస్సు సువార్త వాస్తవంగా ఒక అబద్ధ సువార్తయైయున్నది. ఎందుకంటే, దేవునికిని మానవునికిని మధ్య గల సంబంధం గూర్చిన దాని దృక్పథం తప్పైయున్నది. మామూలు మాటల్లో చెప్పాలంటే, శ్రేయస్సు సువార్త సత్యమైతే, కృప వాడుకలో లేనట్టే. దేవుడు పొందికలేనివాడన్నట్టే, మరియు అన్ని విషయాలకు అంతిమ మూలం మానవుడు గాని దేవుడు కాదని అర్థం. ఈ సువార్త బోధకులు అబ్రాహాముతో చేయబడిన నిబంధన, లేదా ప్రాయశ్చిత్తము, ఇచ్చుట, విశ్వాసం, లేదా ప్రార్థన ` దేని గూర్చి మాటలాడినా, వారు దేవునికిని మానవునికిని మధ్య గల సంబంధాన్ని ఇచ్చిపుచ్చుకొనడముగా మారుస్తున్నారు. జేమ్స్‌ ఆర్‌. గోఫ్‌ గమనించినట్టు, దేవుడు ‘‘తలుపు దగ్గర అప్రమత్తంగా నిలబడి, పిలిచినవారికెల్లా పలికే లేదా అవసరములో ఉన్నవారికెల్లా వారి కోరికలను తీర్చే ఒక విధమైన ‘అంతరిక్షంలో ఉన్న సేవకునిగా, ద్వారపాలకునిగా’ తగ్గించబడ్డాడు.’’17 ఇది దేవునికిని మానవునికిని గల సంబంధం గూర్చి బొత్తిగా లోపముతో నిండినది మరియు లేఖనానుసారముకాని అభిప్రాయమైయున్నది.

Foot Notes:

(1) Tom Carter, ed., 2,200 Quotations from the Writings of Charles H. Spurgeon (Grand Rapids: Baker Book House, 1988), 216.

(2) Robert Tilton, God’s Word about Prosperity (Dallas, TX: Word of Faith Publications, 1983), 6.

(3) David W. Jones and Russell S. Woodbridge, Health, Wealth, and Happiness: Has the Prosperity Gospel Overshadowed the Gospel of Christ? (Grand Rapids: Kregel, 2010).

(4) Edward Pousson, Spreading the Flame (Grand Rapids: Zondervan, 1992), 158.

(5) Kenneth Copeland, The Laws of Prosperity (Fort Worth, TX: Kenneth Copeland Publications, 1974), 51.

(6) Ken L. Sarles, “A Theological Evaluation of the Prosperity Gospel,” Bibliotheca Sacra 143 (Oct.-Dec. 1986): 339.

(7) Kenneth Copeland, The Troublemaker (Fort Worth, TX: Kenneth Copeland Publications, 1996), 6.

(8) John Avanzini, “Believer’s Voice of Victory,” program on TBN, 20 January 1991. Quoted in Hank Hanegraaff, Christianity in Crisis (Eugene, OR: Harvest House, 1993), 381.

(9) Idem, “Praise the Lord,” program on TBN, 15 September 1988. Quoted in Hanegraaff, 381.

(10) Avanzini, “Believer’s Voice of Victory.”

(11) Kenneth Copeland, The Laws of Prosperity, 26.

(12) Gloria Copeland, God’s Will is Prosperity (Fort Worth, TX: Kenneth Copeland Publications, 1973), 45.

(13) Other verses that the “Law of Compensation” is based upon include Eccl. 11:1, 2 Cor. 9:6, and Gal. 6:7.

(14) Gloria Copeland, God’s Will, 54.

(15) Kenneth Copeland, The Laws of Prosperity, 19.

(16) Creflo Dollar,“Prayer: Your Path to Success,” March 2, 2009,http://www.creflodollarministries.org/BibleStudy/Articles.aspx?id=329 (accessed on October 30, 2013).

(17) James R. Goff, Jr., “The Faith That Claims,” Christianity Today, vol. 34, February 1990, 21.

డేవిడ్ డబ్ల్యు జోన్స్

డేవిడ్ డబ్ల్యు జోన్స్

జోన్స్ డేవిడ్ డబ్ల్యు
క్రిస్టియన్ ఎజోథిక్స్ ప్రొఫెసర్
థియోలాజికల్ స్టడీస్ కోసం అసోసియేట్ డీన్
ఫ్యాకల్టీ సపోర్ట్ కోసం అసోసియేట్ డీన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...