శ్రమలలో ఎక్కడున్నావు దేవా?

శ్రమలలో ఎక్కడున్నావు దేవా?

షేర్ చెయ్యండి:

ఇన్ని బాధలు పడుతున్నాను, ఎక్కడున్నావు? శ్రమలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి, ఏమైపోయావు దేవా? అనే ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడు మనందరం వేసినవారమే. కొన్నిసార్లు లేదా చాలా సార్లు మన కష్టాల్లో మొదటిగా ప్రశ్నించేది దేవుణ్ణే.

అంతా సాఫీగా సాగిపోతున్నపుడు రాని ఈ ప్రశ్నలు, శ్రమలు పలకరించగానే పుంఖాను పుంఖాలుగా పుట్టుకొస్తుంటాయి. కొందరు సూటిగా ప్రశ్నించక పోయినా, ప్రభువా, అసలు మా గూర్చి నీకు చింత లేదా అనే మాటలను మాటి మాటికీ నెమరు వేస్తూ కాలం వెళ్లదీస్తుంటారు.

కానీ, ఈ ప్రశ్నలకు బైబిల్ ఎప్పుడో జవాబులు ఇచ్చేసింది. ఇక్కడ సమస్య జవాబులు దొరక్క కాదు,జవాబులను అంగీకరించి, అన్వయించుకోకపోవడమే.

నిజమా అని మీరు ఆశ్చర్యపడేలోపు మనుష్యులు శ్రమల్లో ఉన్నపుడు దేవుడు ఎక్కడ ఉంటాడో, ఎక్కడ ఉన్నాడో బైబిల్ నుండే చూపించే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు దేవునికి గల ఒక ప్రాముఖ్యమైన గుణ లక్షణం గురించి మాట్లాడుకుందాం.

దేవుడు ఆత్మ. అంటే ఆయనకు శరీరం ఉండదు. ఈ ఆత్మ అయిన దేవుడు అన్ని ప్రదేశాల్లో తన ఉనికిని పూర్తిగా కలిగి ఉంటాడు. అందుకే దేవుడు సర్వవ్యాపి అని అంటుంటారు. సర్వవ్యాపి అయిన దేవుడు, మనుష్యులు శ్రమల గుండా వెళ్లనప్పుడు ఎక్కడ ఉంటాడో, అదే మనుష్యులు శ్రమల గుండా వెళ్ళినపుడు కూడా అక్కడే ఉంటాడు అనే విషయం ముందుగా మన బుర్రల్లో గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి.

సరే, ఇక బైబిల్లో కష్టాల గుండా వెళ్లిన ప్రజలను,ఆ కష్టాల్లో దేవుడు ఎక్కడ వారిని పలకరించాడో ఇప్పుడు చూద్దాం.

మొదటిగా, యోసేపును అడుగుదాం.

యోసేపు, నీ అన్నలే నిన్ను గుంటలో పడేశారు, ఇష్మాయేలీయులకు అమ్మేశారు. పోతీఫరు చేత చేయని తప్పుకు చెరసాలలో బంధింపబడ్డావు, ఎన్నో కష్టాలు అనుభవించావు. దేవుడెక్కడ అనే ప్రశ్న నీకు రాలేదా?

యోసేపు, ఆది 39:20,21- యోసేపు చెరసాలలో ఉండెను, అయితే యెహోవా యోసేపునకు తోడైయుండెను అనే ఈ వచనం చూపించి, నా శ్రమలలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని జవాబు చెప్తాడేమో.

రెండవదిగా, దానియేలుని ప్రశ్నిద్దాం.

అదేంటయ్యా, శ్రేష్టమైన బుద్ధి గలవాడవై ప్రధానులలో ప్రఖ్యాతి గలవాడవై, నమ్మకస్తుడవైన నిన్ను సింహాల బోనులో పడేసారు కదా. యెహోవా దేవా, నేనేం తప్పు చేశాను, అసలు ఎక్కడున్నావు అని ఎందుకు ప్రశ్నించలేదు అని దానియేలుని అడుగుదాం.

ఆప్పుడు దానియేలు 6:22 – నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు, అక్కడే ఆ సింహాల బోనులోనే దేవుడు నాతో ఉన్నాడు అని మనకు జవాబిస్తాడేమో !

మూడవదిగా, యేసు క్రీస్తు శిష్యులను అడుగుదాం.

మీరున్న దోనెమీద పెద్దతుఫాను రేగింది కదా, ప్రభువా మీకు చింత లేదా అని మీరు ప్రశ్నించారు కదా ! ఎక్కడున్నాడు దేవుడు ఆ సమయంలో ? అప్పుడు,క్రీస్తు మాతో పాటు అదే దోనెలో ఉన్నాడు, మేమే నమ్ముకలేక భయపడిపోయాం, దేవున్ని ప్రశ్నించాం అని మనకు శిష్యులు హిత బోధ చేస్తారేమో (మార్కు 4:35-41)!

చివరిగా, ఈ ఇద్దరు పెద్ద మనుష్యులను కూడా అడిగేద్దాం రండి.

పౌలు సీల గారు ,అసలే చాలా దెబ్బలు తిన్నారు, కాళ్ళకు చేతులకు సంకెళ్లు వేసి, కరెంటు లేని చీకటి గుహలో గల చెరసాల్లో మిమ్మల్ని పడేశారు. బాగా నొప్పి, జీవితం మీద నిరాశ, చస్తే బాగుంటుంది అనే నిస్పృహ ఇవన్నీ ఉండాల్సిన సమయంలో మరీ వింతగా పాటలు పాడుతూ, దేవునికి ప్రార్థన చేశారట కదా! అసలు ఎక్కడున్నావు దేవా, ఇంతగా మేము బాధపడుతుంటే, నీకు పట్టట్లేదా? అని కదా ప్రశ్నించాలి.

అప్పుడు పౌలు సీలలు, మీకింకా అర్థం కాలేదా?, ఆ మధ్యరాత్రి వేళ, ఆ చీకటి చెరసాలలో, మా శ్రమల సంద్రంలో దేవుడక్కడే ఉన్నాడు, అందుకే మేము ఆయన్ను కీర్తించాం, ప్రార్థించాం అని నవ్వుతూ జవాబిస్తారేమో (అపోస్త 16:19-26).

మన జీవితంలో శ్రమలు,మన పాపం వల్ల కలిగిన ఫలితాలు. అవి మనతో ఉండాల్సిందే, మనం వాటితో ప్రయాణం చేయాల్సిందే. శ్రమల ద్వారానే మనం సంపూర్ణతలోకి ఎదుగుతాం, సర్వాధికారియైన దేవునిపై ఇంకా ఆధారపడతాం. ఆ శ్రమలలోనే దేవుడు మనకు తోడుగా ఉంటాడు.

ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను (మత్తయి 28:20) అని యేసు చెప్పిన మాటకి, యుగ సమాప్తి వరకు మనకు కలిగే శ్రమలలో, కష్టాలలో, కన్నీళ్లలో దేవుడు తోడై ఉంటాడు అని అర్థం.

శ్రమలలో దేవున్ని ప్రశ్నించడం కాదు, దేవున్ని స్తుతించడం నేర్చుకోవాలి. ఎన్ని రోజులు దేవా ఈ శ్రమలు అని దేవుణ్ణి మనం ప్రశ్నిస్తే “ 1 పేతురు 1:6 అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది” అనే వాక్యం గుర్తుచేసుకుందాం. కొంచెం కాలమే ఈ శ్రమలు ఈ ఇబ్బందులు. ఆ తర్వాత నిత్య సంతోషం.

డా.శంకర్

డా.శంకర్

తెలంగాణ రాష్టంలోని హైదరాబాద్ పట్టణంలో హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ సంఘ కాపరులలో ఒక సంఘ కాపరిగా పరిచర్య చేస్తున్నారు.
శంకర్ బాబు ఆయన సతీమణి మేరీ గార్లకు ముగ్గురు పిల్లలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...