ఈ ప్రశ్న సంఘ ఆరాధనలో ఒకరు ఎలా ప్రవర్తించాలి అనే దాని గురించి కాదు; ఇది దేవుని సంఘ సభ్యునిగా ఒకరు ఎలా జీవించాలి అనే దాని గురించి.

పౌలు 1 తిమోతికి 3:15లో స్పష్టంగా ఇలా చెప్పాడు, “అయినను నేను ఆలస్యముచేసినయెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్నది.”

ఈ లేఖనములో గ్రహించవలసిన రెండు వాస్తవాలు ఇక్కడ చూద్దాం.

మొదటిగా, “దేవుని మందిరములో” మరియు “జీవముగల దేవుని సంఘములో” అనే పదబంధాలను గమనించండి. సంఘము దేవునికి చెందినది. “మీరు నాకు చెందినవారు” అని దేవుడు సంఘముతో చెబుతున్నాడు. దేవునికి తప్ప సంఘముపై ఎవరికీ అధికారం లేదు. సంఘము దేవుని రక్తముతో కొనబడిన సమాజము.

సంఘములోని నాయకులు దేవుని సంఘముపై ఎవరు అధికారం కలిగియున్నారో గ్రహించాలి.

పౌలు లేదా తిమోతి సంఘముపై తమ యజమానులుగా అధికారం చెలాయించలేరు. సంఘము దేవునిదేనని వారు గ్రహించారు, ఒప్పుకున్నారు మరియు ప్రకటించారు.

రెండవది, దేవుని సంఘములో “ఒకడు ఎలా ప్రవర్తించాలో” అనే ఆజ్ఞను గమనించడం మర్చిపోవద్దు (1 తిమో. 3:15). సంఘము దేవునిది కాబట్టి, తన సంఘము యొక్క సభ్యులు ఎలా ప్రవర్తించాలి మరియు పనిచేయాలి అనే సంగతుల గురించి ఆయనే రూపొందించి ఆజ్ఞలనిచ్చాడు.

సంఘములకు వ్రాసిన పత్రికలే ఆ విషయాలపై దేవుని ప్రామాణికముగా మనం అంగీకరించాలి. దేవుని సంఘము యొక్క సభ్యులుగా కాపరులు మరియు విశ్వాసులు, తాము ఎలా ప్రవర్తించాలి అనే దానిపై ఈ పత్రికలు ఖచ్చితమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి.

విచారకరంగా, అనేకమంది క్రీస్తు సంఘములో భాగంగా ఉండడానికి  ఇష్టపడతారు కానీ, ఆయన చిత్త ప్రకారమైన సంఘ సభ్యులుగా జీవించుటకు ఇష్టపడరు. అయితే, పాస్టర్లకు మరియు విశ్వాసులకు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మరియు కోరికల ఆధారంగా వారి పరిచర్యలను నడిపించుటకు దేవుడు వారికి  అధికారము ఇవ్వలేదు అని తెలుసుకోవాలి.

ఈ వాక్య సత్యం చాలా ప్రాముఖ్యమైనది. 1 తిమోతి 3:15 లో, పౌలు తిమోతికి “యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను…” అంటాడు. అంటే తిమోతికి కూడా తన చిత్తానుసారముగా సంఘాన్ని నడిపించడానికి స్వేచ్ఛ లేదు అని అర్థం. అపొస్తలుల బోధ ప్రకారము సంఘమును నడిపించుటయే ఆయన బాధ్యత. తిమోతి పరిచర్యలో తిమోతి చేయవలసినది ఇదే అయితే, నేటి ఆధునిక విశ్వాసులు మరియు పాస్టర్ల విషయమేమిటి?

సంఘము యొక్క పనితీరుకు లేఖనము మాత్రమే అంతిమ అధికారము మరియు మార్గనిర్దేశముగా ఉన్నది. క్రీస్తు మన ప్రభువని మరియు మనం ఆయన సంఘ సభ్యులమని ఒప్పుకొనినయెడల, దేవుని వాక్యంలో ప్రస్తావించిన నియమాల ప్రకారం మన జీవితాలను, సంఘాలకు  కట్టుబడి ఉండే నిబద్ధత చాలా అవసరం. అలా చేయుటలో, దేవుని ప్రజలు తమ జీవితాలపై క్రీస్తు యొక్క శిరసత్వమును గౌరవిస్తారు.

మిమ్మల్ని మీరు పరీక్షించుకొండి: ఆయన వాక్యములో బయలుపరచబడిన ఆయన చిత్త ప్రకారం మీరు దేవుని సంఘములో ప్రవర్తిస్తున్నారా?

స్టీఫెన్ డేవిడ్
స్టీఫెన్ డేవిడ్

స్టీఫెన్ డేవిడ్ తెలంగాణలోని హైదరాబాద్లో గల ఎక్లేసియా ఎవాంజెలికల్ ఫెలోషిప్ సంఘములో ఒక సంఘ కాపరిగా పనిచేస్తున్నారు. స్టీఫెన్ ఆయన సతీమణి చైతన్య గార్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *