ప్రతి రోజు బైబిలు ఎందుకు చదవాలి? – పది కారణాలు
గతించిన వారం ప్రారంభంలో, ఒకరిని క్రీస్తు దగ్గరికి నడిపించడం గూర్చి మనము తెలుసుకున్నాము. పాస్టర్ జాన్‌గారు మనకు నాలుగు విలువైన సంగతులను గురించి నేర్పించారు. ఈ రోజున మనము నూతన విశ్వాసులతో మాట్లాడుతాము. ఇది శ్రోతలలో ఎవరో తన పేరును చెప్పని వ్యక్తి దగ్గర్నుంచిన వచ్చిన ఇ-మెయిల్. ఇతనొక నూతన విశ్వాసి. ఇలా వ్రాస్తున్నాడు, ‘‘పాస్టర్ జాన్‌గారూ, ఈ ప్రసారం కొరకు మీకు ధన్యవాదములు. బైబిలు గూర్చి నాకు ఎక్కువగా తెలియదని తెలిసికొని నేను బాధపడ్డాను. భవిష్యత్తులో నేను ఇతరులను నడిపించడానికి, వాక్యం నన్ను నడిపించేలా, నేను బైబిలు గూర్చిన జ్ఞానంగలవ్యక్తిని అవ్వాలని ఆశిస్తున్నాను. అయితే, బైబిల్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎక్కడ మొదలుపెట్టాలో నాకు తెలియడం లేదు. ఒక విద్యార్థిగా నేనొక పరీక్ష కొరకు సిద్ధపడుతున్నట్లయితే, పరీక్షలో వ్రాయాల్సిన ముఖ్యాంశాలతో మొదలుపెడతాను. గాని బైబిలు విషయంలో, నాకు జీవితమే ఒక పరీక్షలా ఉంది. ఈ పరీక్షకు సిద్ధపడటానికి నేను తెలుసుకోవాల్సిందేమిటో నాకు తెలియడంలేదు. నేనంటున్నది మీకు అర్థమవుతుందనుకుంటాను. నేనెక్కడ మొదలుపెట్టాలి? దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా క్రీస్తును వెంబడించడానికి నేను తెలుసుకోవాల్సిన మొట్టమొదటి ముఖ్య విషయమేంటి?”
ఇతనంటున్నది నిజమే, అయితే నా జవాబు కాస్త నిరాశపర్చవచ్చు, ఎందుకంటే ఇతను బైబిలులోని ఒక నిర్దిష్టమైన సత్యం కోసం అడుగుతున్నాడు. నేను చెప్పబోయే జవాబేమంటే, ‘‘బైబిలు, బైబిలు, బైబిలు, బైబిలు’’ మాత్రమే.
ఖచ్చితంగా అవసరం
బైబిలుతో హృదయాన్ని నింపుకోకుండా, బైబిలును క్రమంగా ధ్యానించకుండా, బైబిల్ చదివి కంఠస్థం చేసిన వాక్యాలను తన హృదయంలో దాచుకోకుండా, పరిపక్వమైన, ఫలప్రదమైన, బలమైన, ఆధ్యాత్మిక వివేచనగల క్రైస్తవున్ని నేనెన్నడూ కలుసుకోలేదు. ఇది అనుకోకుండా జరిగేది కాదు. కాబట్టి, క్రీస్తునందు విశ్వాసముంచిన తరువాత, బైబిలు చదవాలి. దానిని ధ్యానించి, అర్థం చేసికోవాలి. కొన్ని వాక్యాలను కంఠస్థం చేయాలి. వీటన్నిటిని నీవు పూర్తిగా, లోతుగా, అనుభవపూర్వకంగా అనగా, స్థిరంగా, స్తిమితమైన ఒప్పింపుతో కూడిన అంకిత భావంతో చేయాలి. మనము దేవుని వాక్యంలో ఆయనను కలుసుకోవాలనే గురితో ప్రతి దినం వాక్యంలో నిలిచియుండాలి. అప్పుడు ఆయన మహిమకరమైన సత్యము మనల్ని కొంచెము కొంచెముగా నింపుతూ మన జీవితాలను మార్చుతుంది. కాబట్టి క్రైస్తవ జీవితానికి ఇవన్నీ ఖచ్చితంగా అవసరమని నేను నూతన విశ్వాసియైన ఈ ప్రశ్న అడిగిన మన స్నేహితున్ని ఒప్పించాలనుకుంటున్నాను.
చాలా మంది క్రైస్తవులు ఇలా చేయడం లేదని నాకు తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉండి కూడా వారు సోమరులుగా ఉంటున్నారు. వారికి ఇదివరకే చాలా తెలుసు మరియు వారు ఇతర పుస్తకాలు చాలా చదివారు కాబట్టి బైబిలును ఇష్టముంటే చదవొచ్చు, లేకుంటే లేదని వారనుకుంటున్నారు. ఇది మంచి అలవాటు కాదు. ఇది ప్రమాదకరం అని నేననుకుంటాను.
ప్రతి రోజు బైబిలు చదవడానికిగల పది కారణాలు
బైబిలు చదవడం, దానిని అర్థం చేసుకోవడం, బైబిల్ వాక్యాలు కంఠస్థం చేయడం క్రైస్తవ జీవితానికి ఖచ్చితంగా అవసరమని చెప్పడానికి నేను పది కారణాలు మీముందుంచుతున్నాను. ‘‘నాకు ప్రతి రోజు దేవుని వాక్యం అక్కర్లేదని’’ చెప్పే స్వయంసమృద్ధితో కూడిన భావోద్వేగాలను ప్రతిఘటించండి. ఆ పది కారణాలు ఇవే :
1. లేఖనము రక్షిస్తుంది.
‘‘నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్తకలిగి యుండుము. వీటిలో నిలుకడగా ఉండుము. నీవీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు’’ (1 తిమోతి 4:16).
‘‘దేవుడు మనలను ప్రతి దినము లేఖనముల ద్వారా రక్షిస్తాడు.’’
దేవుని ప్రజలు రక్షింపబడ్డారు, ఈ క్షణంలో దేవుని ప్రజలు రక్షింపబడుతున్నారు, దేవుని ప్రజల రక్షణ వారి పున:రుత్థానమందు సంపూర్ణమవుతుంది. బోధను గట్టిగా పట్టుకో, తద్వారా నిన్ను నీవు రక్షించుకో అని ఇక్కడ పౌలు చెప్పుతున్నాడు.
2. లేఖనము సాతాను నుండి విడిపిస్తుంది.
‘‘నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును’’ (యోహాను 8:31బి-32).
ఈ వచనాన్ని గమనిస్తే, యూదా నాయకులు, వారు సాతాను దాసులు కారని అనుకుంటున్నప్పటికీ, ‘‘మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారని’’ యేసు చెబుతున్న సందర్భమిది (యోహాను 8:44). యౌవన క్రైస్తవుడా, సాతాను నీ శత్రువు. వాడు నీ కంటె వెయ్యి రెట్లు బలవంతుడు. గనుక యౌవన విశ్వాసులకు అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాస్తున్నాడు,
‘‘యౌవనస్థులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీయందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను’’ (1 యోహాను 2:14).
శత్రువును ఓడించడానికి మనకున్న ఒకే ఒక్క నిరీక్షణ ఇదే. యేసు సాతాను చేత శోధింపబడిన ప్రతిసారి (మత్తయి 4:1-11, మార్కు 1:12-13, లూకా 4:1-13), ‘‘దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గముతో’’ (ఎఫెసీ 6:17) వానికి గట్టి జవాబిచ్చాడు. ఈ వాక్యమును ఆయన అదివరకే కంఠస్థంచేశాడు కాబట్టి అరణ్యంలో ఆయనకు బైబిలు అవసరం (రా)కాలేదు.
3. లేఖనము కృపను మరియు సమాధానమును అందజేస్తుంది.
‘‘దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక (2 పేతురు 1:2-3).
లేఖనాల ద్వారా సంపాదించుకున్న దేవుని గూర్చిన జ్ఞానము వేరు, కృప వేరు. రెండూ ఒకటే కాదు. గాని దేవుని గూర్చిన జ్ఞానము కృపను పొందడానికి సాధనమైయుందని పేతురు చెప్పుతున్నాడు. మనము దేవుని కృప ద్వారా సమాధానముగలవారముగాను శక్తిమంతులముగాను చేయబడాలని కోరుతున్నట్లయితే, ‘‘దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన’’ చేయబడుదుమని పేతురు చెప్పుతున్నాడు. ఈ అనుభవజ్ఞానము లేఖనములో ఉన్నది.
4. లేఖనము పవిత్రులనుగా చేస్తుంది.
‘‘సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యమని’’ యేసు ప్రార్థించాడు (యోహాను 17:17).
‘‘మనమందరమును ఎంతో కొంత మేరకు దేవుని వాక్యముతో వ్యవహరించుటకు నియమింపబడియున్నాము.’’
పవిత్రులముగా చేయబడుట అనేది పరిశుద్ధులముగా చేయబడు ప్రక్రియయైయుంది. అంటే, సంపూర్ణముగా పరిశుద్ధుడైయున్న క్రీస్తు వలె, దేవుని వలె అవ్వడం అని అర్థం. ఇది ఒక వ్యక్తి తన ఇష్టప్రకారముగా ఎంపిక చేసుకునే విషయం కాదు. ‘‘. . . పరిశుద్ధత కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడడని’’ హెబ్రీ 12:14 సెలవిస్తున్నది.
మనము ఈ జీవితంలో పరిపూర్ణులముకాము, గాని మనము పరిశుద్ధులమవుతాము. దేవుడు తన ప్రజలను పవిత్రులనుగా చేస్తాడు. ‘‘సత్యమందు వారిని ప్రతిష్ఠచేయుము. నీ వాక్యమే సత్యమని’’ యేసు తన తండ్రికి ప్రార్థించాడు. ఇది స్పష్టమైనది మరియు ముఖ్యమైనది.
5. లేఖనము సంతోషమునిస్తుంది.
‘‘పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించితిరి’’ (1 థెస్స. 1:6).
‘‘యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము అతడు దానిని ధ్యానించును’’ (కీర్తన 1:2).
సంతోషములేని జీవితం సహింపజాలనిది. క్రైస్తవ జీవితం అనేక శ్రమలతో కూడినదై యున్నది. గాని, వాటన్నిటిలో, దేవుడు లేఖనము ద్వారా ఆనందింపజేస్తాడు.
6. లేఖనము మనలను నాశనకరమగు పొరపాటు నుండి కాపాడుతుంది.
‘‘మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది … మనమిక మీదట పసిపిల్లలమై యుండి, … కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలల చేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక … అన్ని విషయములలో ఎదుగుదము’’ (ఎఫెసీ 4:11-15).
సంస్కృతికి మరియు థియాలజీకి సంబంధించిన విషయాలకు మరియు అభిప్రాయములకు, యవ్వన క్రైస్తవులు, ఆకుల వలె అటూ ఇటూ కొట్టుకొనిపోకుండా ఎలా ఉండగలరు? ఎలాగంటే, ‘‘విశ్వాస విషయములోను, మనుష్యుల అభిప్రాయం కాదు గాని దేవుని వాక్య ప్రకారమైన అనుభవజ్ఞానముగల దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొందుట ద్వారా’’ ఉండగలరు. ఇది బైబిలులో దొరుకుతుంది.
7. లేఖనము పరలోకమును గూర్చిన నిరీక్షణయై యున్నది.
అనగా, లేఖనముల గూర్చిన పూర్తి గ్రహింపు, లేఖనములోని సత్యమును గూర్చిన సంపూర్ణ ఆనందకరమైన అనుభవము, పరలోకంలో మాత్రమే అనుభవిస్తాము అని నా భావం. ‘‘ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును’’ (1 కొరింథీ 13:12).
దేవుని గూర్చిన జ్ఞానము – అనగా, సృజింపబడిన వ్యక్తి సరైన విధంగా అర్థంచేసికొని, ఆనందంగా అనుభవించగల సర్వ సంపూర్ణత – మన నుండి నిరవధికంగా నిలిపివేయబడదు. ప్రస్తుతము పరిమితమైన మన అవగాహన మరియు ఆనందానుభవము వలన కలిగే ఆటంకాలు తీసివేయబడతాయి. అలాగైతే, రాబోయే యుగంలోని మన అంతిమ ఆనందంలో ఇప్పుడు మనము నిరంతరము ఎదుగుతూ ఉండడం ఎంత యోగ్యమైనది కదా.
8. లేఖనమును కొందరు ఎదిరిస్తారు.
‘‘జనులు ఆరోగ్యకరమైన బోధను సహింపక, దురద చెవులుగలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగుచేసికొను’’ సమయం వస్తున్నది (2 తిమోతి 4:3).
అంటే, మనము అబద్ధ బోధకుల చేత మనకున్న జ్ఞానాన్ని కోల్పోయి తప్పుడు మార్గంలో నడిపింపబడకుండా, మనం లేఖనాలను తెలుసుకొనియుండాలి. లేఖనాలను తృణీకరించేవారిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండడానికి మనము లేఖనాలను తప్పక తెలుసుకోవాలి.
9. లేఖనములతో సరైన విధంగా వ్యవహరించుట దేవుని చేత ఆమోదింపబడినది.
‘‘దేవుని యెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము’’. (2 తిమోతి 2:15).
ఒక అత్యంత ప్రాముఖ్యమైన పని చేయడానికి నియమింపబడడం, ఆ తరువాత యజమానుడు వానిని ‘‘భళా, నమ్మకమైన మంచిదాసుడా’’ అని ఆమోదించడం ఎంతో విలువైన విషయం. మనమందరం, దేవుని వాక్యమును ఉపదేశించడానికి ఎంతో కొంత మేరకు నియమింపబడియున్నాము. ప్రభువును సంతోషపర్చువారమై యుండుట ఎంత గొప్ప భాగ్యం కదా!
10. లేఖనము జీవమునిస్తుంది మరియు దానిని కొనసాగిస్తుంది.
‘‘మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును’’ (మత్తయి 4:4).
భౌతిక పరమైన జీవితం లాగానే, ఆధ్యాత్మిక జీవితము – నిత్యజీవం – పోషించబడాలి. అది రొట్టె చేత కాదు గాని దేవుని వాక్యం చేత పోషింపబడుచుండాలి. నిత్యజీవమనేది, నరకానికి వ్యతిరేకమైన (నరకాన్ని నిరోధించు), ఏ పోషణ అవసరములేని సూదిమందు (వ్యాక్సినేషన్) అని నువ్వు అనుకుంటున్నట్లైతే, ఆధ్యాత్మిక జీవితమంటే ఏమిటో నీకు తెలియదని అర్థమౌతుంది.
కాబట్టి, యౌవనస్థులైన విశ్వాసులు, వారి పూర్ణ బలముతో, దేవుడు వారికనుగ్రహించు శక్తి అంతటితో, వారి క్రైస్తవ జీవితంలో, లేఖనములను చదవడము, ధ్యానించడము, గ్రహించడము మరియు కంఠస్థం చేయడము ఎందుకు ఖచ్చితమైనది, ఎందుకు తప్పకుండా చేయాల్సినది అని తెలియజెప్పుతున్న పది కారణాలు మీముందున్నాయి.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web