దేవుడు తాను ప్రేమించే పిల్లల కొరకు శ్రమను ఎందుకు కోరుచున్నాడు?

దేవుడు తాను ప్రేమించే పిల్లల కొరకు శ్రమను ఎందుకు కోరుచున్నాడు?

షేర్ చెయ్యండి:

సంతోషాన్ని, బాధను కలపడం ప్రమాదకరమైన పని. దేవుని వాక్యము ఆనందము మరియు శ్రమలను గూర్చి కలిపి మాట్లాడుతుంది కాబట్టి నేను కూడా ఆ రెండింటినీ అనుసంధానిస్తాను.

నూతన నిబంధన నుండి కొన్ని వచనాలు ఇప్పుడు చూద్దాం;

“అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము”. (రోమా 5:3-4)

“నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి”. (యాకోబు 1:2-3)

“క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతో షించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి”. (1పేతురు 4:13)

“ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి”. (హెబ్రీ 10:34)

“ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయిరి”. (అపోస్త 5:41)

“అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందె బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను”. (2కోరింతీ 12:9-10)

“మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనానందించి మీ యందరితోకూడ సంతోషింతును”.(ఫిలిప్పీ 2:17)

“ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను”. (కొలస్సి 1:24)

“పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమునంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి”.(1 థెస్స 1:16)

“సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియ జేయుచున్నాము. ఏలాగనగా, వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను”. (2 కోరింతీ 8:1-2)

పరిస్థితుల ద్వారా కాదు

ఇక్కడ మీరు ముఖ్యమైన అంశాన్ని కోల్పోవద్దు. అది హింసైనా  లేదా క్యాన్సరైనా మనము శ్రమల గుండా వెళ్తున్నపుడు సంతోషించమని క్రొత్త నిబంధన మనకు గట్టిగా చెబుతుంది. ఆ శ్రమలకు కారణం శ్రేయస్సు, ఆరోగ్యం లేదా సంపద కాదు. మాసిదోనియా వారి ఆనందము “బహు శ్రమలో” కూడా విస్తరించిందని మీరు చూస్తారు (2 కొరింథీయులు 8:2).  ఇక్కడ వారి భోగభాగ్యాలు, వారి భద్రత అన్నీ తీసివేయబడుతున్న సమయంలో కూడా, వారు సంతోషిస్తున్నారు. కాబట్టి వారి సంతోషం సుఖాల మీద, ఇబ్బంది కష్టం లేకపోవడం మీద ఆధారపడిలేదు.

నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను… అత్యధికముగా సంతోషించిరి. వారి జీవితాలలో గల దేవుని కృప వారి పేదరికాన్ని తీసివేయలేదు మరియు వారి డబ్బులేని స్థితి వారి ఆనందాన్ని తీసివేయలేదు. కాబట్టి ఆనందం అనేది ఇంకా వేరే దానిలో ఉండాలి. 1 వ వచనంలో చెప్పబడ్డ కుమ్మరించబడిన దేవుని కృపలోనే ఆ ఆనందం అని అర్థమవుతుంది. మనం ఆ ఆనందాన్ని ఎలా అనిభవించగలం? మనం మన సంపాదనలో ఆరోగ్యంలో సౌకర్యాలలో సంతోషించకుండా, దేవునిలో సంతోషిస్తూ, ఇవన్నీ పోగొట్టుకున్నప్పటికీ అంతే సంతోషంతో సంఘానికి ఎలా రాగలం? మీరు దానిని ఎలా చేస్తారు? మీ ప్రజలు డబ్బులో ఆరోగ్యంలో, సౌకర్యాలలో సంతోషంగా ఉండకుండా, వారు దేవునిలో సంతోషిస్తూ, ఇవన్నీ  పోగొట్టుకున్నప్పటికీ అంతే ఆనందంతో సంఘానికి రావడానికి వారికి మీరెలా సహాయం చేస్తున్నారు?

మన జీవితాలు మరియు పరిచర్యలు అన్నీ కూడా, మనం మన బాధలను, ఆనందమును మించి, క్రీస్తునందు ఉన్నతమైన ఆనందమును ఎలా కలిగియుండాలనే దాని గురించే ఉంది.  సాతానుకి రెండు ఆయుధాలు మాత్రమే ఉన్నాయి: శ్రమ మరియు ఆనందం. వాడు మీరు దేవుణ్ణి ద్వేషించేంతగా మిమ్మల్ని చాలా బాధపెడతాడు లేదా మీకు దేవుడు అవసరం లేని చాలా ఆనందాన్ని ఇస్తాడు. ఈ రెండింటికీ పరిష్కారం ఒకటే: నేను కోల్పోయే దానికంటే దేవుడు ఎంతో ప్రశస్తమైనవాడు; నేను సంపాదించుకునే దానికంటే దేవుడు ఎంతో విలువైననవాడు. సాతాను, మనల్ని ఏమీ చేయలేడు. అందమైన పర్వత ప్రాంతంలోని ఆనంద క్షణాల నుండి అదే విధంగా ప్రమాదపు అంచుల్లో ఉన్న ప్రదేశం లోని బాధల నుండి మనం సురక్షితంగా ఉన్నాము.

ఆనందించుటకు గల కారణాలు

ఈ వచనాల నుండి, ఒక క్రైస్తవుని సంతోషము అవి మంచివైనా, చెడ్డవైనా  ఆయా పరిస్థితులలో ఉండదని స్పష్టమవుతుంది. ఒక క్రైస్తవుని ఆనందం ఎవ్వరూ నాశనం చేయలేనిది; అది దేవునిలో ఉంది. అది క్రీస్తులో ఉంది. ఆయన ప్రశస్తమైనవాడు. ఆయనే మన ఐశ్వర్యము, మన నుండి ఆయన  తీసివేయబడలేడు. కాబట్టి, దేవుడు శ్రమలను ఎందుకు నియమిస్తాడనే దాని గురించి ఆరు సంగతులను నేను క్రొత్త నిబంధన నుండి చూపించాలనుకుంటున్నాను.

మీ సంఘము లేదా కుటుంబంలోని ప్రజలు కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తున్నపుడు “ఎందుకు ఇలా జరుగుతోంది?” అని అడిగినప్పుడు, అది కేవలం ఒక ప్రశ్నే కాదు;  అది బాధనుండి బైటికివచ్చే ఒక ఏడుపు వంటిది. ఆ క్షణంలో, వారికి, ఇదిగో వాటికి ఈ ఆరు కారణాలు అనే  జాబితా కాదు గానీ, ఓదార్పు అవసరం. బాధపడేవారిని ఓదార్చడమనే ప్రాముఖ్యమైన విషయం మనకు కూడా తెలుసు.  కానీ తరువాత, అది  బాధనుండి బైటికివచ్చే ఏడుపు మాత్రమే కాదు, ఒక నిజమైన ప్రశ్నగా రావొచ్చు. వారు, “దేవుడు నా భర్తను ఎందుకు తీసుకున్నాడు ?” ఇలాంటి ప్రశ్నలకు వివరణను అడగొచ్చు.

ఆ సమయంలో, “బైబిల్ మనకు అలాంటి సమాధానాలను ఇవ్వదు.” అని మనం చెప్పకూడదని  నేను ఆశిస్తున్నాను. అలా చెప్పడం బాధల్లో ఉన్నవారికి , శుభవార్త కాదు. కొన్ని విషయాలను తెలుసుకోకపోవడం ఓదార్పునిస్తుందని మనల్ని మనం ఒప్పించవచ్చు, కాని బైబిల్ అంగీకరించదు. దేవుడు తన పిల్లలకు  శ్రమలను  ఎందుకు అనుమతిస్తున్నాడనేదానికి ఇవి వాక్యానుసారమైన వివరణలు. మీరు కాపరులైతే, మీరు నేను తెలుసుకోవాల్సింది ఇదే, ఎందుకంటే మనం అటువంటి ప్రజల మధ్య సేవ చేస్తున్నాము  కాబట్టి మరియు వారికి సమాధానాలు అవసరం కాబట్టి. మీరు విశ్వాసులైతే కూడా ఇదే వర్తిస్తుంది. శ్రమల్లో ప్రజలకు బలం కావాలి; పట్టుదలతో కొనసాగడానికి వారికి సహాయం కావాలి.

లోతైన పరిశుద్ధత, లోతైన విశ్వాసము

మొదటిగా, మన పరిశుద్ధతను మరియు విశ్వాసాన్ని బలపర్చడానికి, శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. ఈ సంగతి హెబ్రీ 12:10 లో, “ఆయన మన మేలుకొరకే శిక్షించుచున్నాడు అని ఉంటుంది.  సందర్భము గమనిస్తే, ” రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు (హెబ్రీ. 12:4) అని ముందుగానే చెబుతాడు. ఇక్కడ సందర్భం, ఆ శ్రమలు సులభమైనవని చెప్పడం లేదు. విపరీతమైనవి కాకపోయినా అక్కడ సంఘంలో ఘర్షణ వాతావరణం ఉంది. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే, మనలను మెరుగుపరచడానికే, మేలు కొరకే, దేవుడు క్రమశిక్షణ గుండా మనల్ని తీసుకెళ్తాడు. కారణం :  మనము ఆయన పరిశుద్ధతలో పాలుపంచుకోడానికి. మనకు శ్రమలు సంభవించడానికి గల ఒక ముఖ్య కారణం ఏమిటంటే, మనలను మరింత పరిశుద్ధులుగా చేయడానికే.

రెండవది : పౌలు, 2 కొరింథీయులు 1:8-9లో : ” సహో దరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతివిు. మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను” అని రాస్తాడు. వారు శ్రమపడుటకు గల కారణము ఇదే: ” నిశ్చయంగా మరణమవుతామని మేము భావించాము. అయితే, మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు అది జరిగింది. అందుకే ఆ  శ్రమల సమయం ఎదురైనది అంటున్నాడు.`

కాబట్టి, ఇక్కడ పౌలు, తన కఠినమైన కష్ట సమయాల్లో దేవునిపై ఎక్కువగా ఆధారపడటం అనేది ఎవరి ఆలోచనగా ఉంది ? మనకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి: (1) అతనికి వ్యతిరేకంగా గల శత్రువులదై ఉండాలి (2) అపవాదిదై ఉండాలి  మరియు (3) దేవుడిదై ఉండాలి.  నేను వీటికి వేరుగా మరొక ఆప్షన్ గురించి ఆలోచించలేను. ఇప్పుడు, ఈ ముగ్గురిలో ఎవరు, దేవున్ని ఎక్కువగా పౌలు విశ్వసించాలని కోరుకుంటారు? అపవాది లేదా శత్రువులు కారు ఎందుకంటే, వారి గురి పౌలు విశ్వాసమును నాశనం చేయడమే. ఈ సందర్భంలో, ఆ ఆలోచన వెనుక ఉన్నది కేవలం దేవుడే  అని మనం ఒప్పుకోవాల్సిందే.

మళ్ళీ ఆ వచనం చూద్దాం :  మరణశిక్షను పొందియున్నామని మేము భావించితిమి [మేము భరించలేనంతగా నలిగిపోయాము]. మనము మనయందు ఆధారపడక మృతులను లేపు దేవునియందే ఆధారపడవలెనని దేవుడు ఈలాగు చేసెను.” ” మృతులను లేపు దేవుని మీదనే ” అని చెప్పడానికి గల కారణము, పౌలు తన మరణానికి చాలా దగ్గరగా ఉండటమే అనిపిస్తుంది.

“నాకు మరియు మరణానికి మధ్య నేను చూడగలిగినదేమీ లేదు. నాకు మరియు నా మరణానికి మధ్య ఉన్న ఈ చిన్న అంతరంలో నాకు ఏదైనా నిరీక్షణ ఉందంటే, అది కేవలం పునరుత్థానంలోనే  ఉంది . మీరు మృతులను లేపు దేవునియందు విశ్వాసముంచడానికి మరియు ఆయనయందు మాత్రమే నమ్మికఉంచడానికి అందువల్లే, మీరు కూడా శ్రమలలో ఉన్నారు” అని పాలు మనకు చెబుతాడు.

బాహ్యమైన మద్దతు లేని విశ్వాసము

 మన జీవితాల్లో జరిగేది కూడా ఇదే కదా? చాలా మంది, మేము “అంతా బాగున్నపుడు మరియు సంతోషకరమైన రోజులలో దేవుని సన్నిధిని ఎక్కువగా అనుభవించాము అని చెప్పరు. బదులుగా, వారు, “నేను కష్టతరమైన రోజులలో ఆయన బలాన్ని అనుభవించాను, శ్రమల్లో దేవుణ్ణి లోతుగా అనుభవించాను అంటారు. 2 కొరింథీయులు 1:8–9 నుండి  పౌలు సొంత అనుభవము కూడా ఇదే. కాబట్టి, శ్రమల యొక్క  ప్రధాన ఉద్దేశ్యము, మన విశ్వాసములో లోతుగా ఎదుగుట ద్వారా మన పరిశుద్ధతలో లోతుగా ఎదుగుటయే.

మనం మొగ్గుచూపే వాటిని, ఎక్కువగా ఇష్టపడేవాటిని, శ్రమల ద్వారా, దేవుడు మన నుండి తీసివేస్తాడు. నాకు నా వ్యక్తిగత సవాళ్లు  ఉన్నాయి. నా కుటుంబంలో కొన్ని విషయాలు మెరుగుపడాలి అని నేను కూడా వేచి ఉంటున్నాను. ఇది నాకు సవాలుతో కూడుకున్న పని. ఎందుకు? జాన్ పైపర్ హృదయంలో మరియు నా భార్య మరియు ఇతరులలో దేవుని-కేంద్రీకృత, క్రీస్తు-ఆధారిత పని ఇంకా జరగాలి కాబట్టి. దేవుడు ఎల్లప్పుడు పనిచేస్తూ ఉంటాడు. ఆయన చేసే వెయ్యి పనుల్లో మనం కేవలం రెండు మాత్రమే చూడగలం.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...