సువార్త ప్రకటన కార్యక్రమాలతో గల సమస్య
సువార్త ప్రకటించడానికి సంఘంగా/గుంపుగా కూడుకొనుట సౌకర్యవంతమైనదని ఎక్కువ మంది క్రైస్తవులను ఒప్పించడానికి ఎక్కువగా ప్రయాసపడనక్కర్లేదు. సువార్త ప్రకటించడంలో సహకరిస్తూ సహాయపడటానికి మనుష్యులను పోగేయడం కూడ కష్టమేమీ కాదు.
గాని సమాజంగా సువార్త ప్రకటించుట గూర్చి మనము ఆలోచించగానే, సాధారణంగా మనము సువార్త మహా సభల కార్యక్రమాల గూర్చి ఆలోచిస్తుంటాము, ఈ రెండూ ఒకటి కాదు. నేను ‘‘కార్యక్రమము’’ అని అన్నప్పుడు, ఎప్పుడో ఒకసారి, ప్రసిద్ధిగాంచిన ప్రసంగీకుని పిలిపించి, ఆసక్తికరమైన అంశం గూర్చి ప్రసంగించడమనేది నా భావం. ఇలా చేసినప్పుడు, ఏదో ఒక సందర్భంలో సువార్త ప్రకటింపబడుతుంది. లేదా ఇలాంటి కార్యక్రమము క్రొత్త అన్వేషకులకు హడావిడేమీ లేకుండా, భవిష్యత్తులో ఆత్మీయమైన సంభాషణలకు ద్వారాలు తెరవగలదనే ఆశతో జరిపింపబడు ఆటల పోటీల వంటి కార్యక్రమమై యుండవచ్చు.
దేవుడు కార్యక్రమాలను వాడుకుంటాడు. సువార్త ప్రకటన సభలు జరిపింపబడినప్పుడు క్రీస్తునంగీకరించినవారిని నేనెరుగుదును. మీకందరికి తెలిసేట్టు, అవసరమైతే వ్రాసిపెట్టుకోడానికి, సౌవార్తీకరణ కార్యక్రమాలను నేను తరచుగా ప్రోత్సహిస్తుంటాను, ప్రసంగిస్తుంటాను. కాని సౌవార్తీకరణం కొరకు కార్యక్రమాలు జరిపించడం అత్యంత కార్యసార్థకమైన విధానమని, ఆ మాటకొస్తే ప్రాథమికమైన పద్ధతని నేననుకోను.
కాబట్టి, కార్యక్రమాలను ఎలాంటి భావోద్రేకమైనా లేకుండా విశ్లేషిస్తూ విమర్శనాత్మకంగా చూచినప్పుడు, తలెత్తుతున్న విషయాలు అర్థవంతమైనవిగా, ఆచరణాత్మకంగా ఉన్నట్టు అగపడదు. ఒకరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, నా మట్టుకైతే, ఖర్చు ఎక్కువవుతుంది గాని ప్రయోజనం తక్కువవుతుంది, ఆశించినంత ఫలితం ఉండదు. ఉదా॥ 21 సంవత్సరాలు మరియు అంతకు తక్కువ వయస్కులు (ఎక్కువ మంది క్రీస్తునంగీకరించే వయస్సు), వారు తిరిగి జన్మించిన అనుభవంలోనికి ఎలా వచ్చారని ప్రశ్నింపబడినప్పుడు, 1% మంది మాత్రమే టివి లేదా ఇతర ప్రసార మాధ్యమముల ద్వారా వచ్చారనీ, 43% మంది ఒక స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుని ద్వారా వచ్చారనీ తెలిపారు. ఒక కప్పు టీ కయ్యే ఖర్చుకు, ఒక టివి కార్యక్రమం ఖర్చుకు తేడా ఎంతుంటుందో మీరే ఆలోచించండి. ఒకరి ప్రభావం గూర్చి ఒకసారి ఆలోచించండి: కార్యక్రమాల కంటె తల్లితండ్రులే ఎక్కువ మందిని ప్రభువు నొద్దకు నడిపిస్తున్నారు.
విచిత్రమేమంటే, సువార్త ప్రకటన సభా కార్యక్రమాలు సువార్తను ప్రకటించుట కంటె ఇతర పనులు చాలా చక్కగా జరిపిస్తాయి: వీటిలో పాల్గొనే క్రైస్తవులు గుంపులు గుంపులుగా ఏర్పడతారు, క్రీస్తు పక్షం వహించాలని విశ్వాసులను ప్రోత్సహిస్తాయి, క్రొత్త లేదా వేరుగా పరిచర్య ప్రారంభించడానికి సంఘాలను అవి విడదీయగలవు.
అట్లయినప్పటికిని, సువార్త ప్రకటించడానికి మనము కార్యక్రమాలను ఎక్కువగా జరిపించుచుండాలనే మన ఆకలి యింకా తీరకున్నది. ఎందుకని? ఈ కార్యక్రమాలు చక్కెరలాంటివి. ఇవి రుచికరంగా ఉంటాయి, వాటికే అలవాటుపడిపోయేట్టుగా కూడ చేయగలవు. ఏదైతేనేమి, మరి ఎక్కువ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసికొనాల్సిన ఆకలిని చంపేస్తాయి. సభలో ఉన్నంతసేపు అత్యుత్సాహం, ఆత్మానందం పొంగిపొర్లుతుంటాయి, గాని సమయం గడిచేకొద్దీ నీవు ఆధ్యాత్మికంగా లావెక్కిపోయి, ఉబ్బిపోతావు, లోపల బలమేమీ ఉండదు, స్థిరమైన మరియు అసలైన ఆహారం నీకు గిట్టదు.
సువార్త ప్రకటన కార్యక్రమాలతో కూడిన ఖచ్చితమైన ఆహారం పోషకాహార లోపంతో కూడిన సువార్త ప్రకటించే విధానానికి దారీ తీస్తుంది. చక్కెర తింటున్నంతసేపు, మనము వాస్తవంగా భోజనము చేయనప్పటికిని, భోజనము చేసినంతటి అనుభూతిని కలిగిస్తుంది; సువార్త ప్రకటన కార్యక్రమాలు కూడ అంతే; మనము సువార్త ప్రకటించామనే తృప్తినిస్తాయి కాని వాస్తవానికి మనము సువార్త ప్రకటించలేదు. గనుక ఇలాంటి కార్యక్రమాల గూర్చి మనకు సరైన దృక్పథముండాలి. దేవుడు ఒక కార్యక్రమాన్ని పంపలేదు గాని, ఆయన తన కుమారున్ని పంపించాడని గుర్తుంచుకుంటూ, ఈ కార్యక్రమాలను మనము వ్యూహాత్మకంగా మితంగా ఏర్పాటుచేయాలి.
మనమేంచేయాలి? సంఘంగా సువార్త సభలు జరిపించాలని, గుంపుగా సువార్త చేయాలని ఆశిస్తున్నాము. మన విశ్వాసాన్ని పంచుకునేటప్పుడు తోటి స్నేహితులు మనతో ఉండాలని కోరుకుంటున్నాము. గాని అదే సమయంలో, కార్యక్రమాలకు పరిమితులున్నట్టు, ఆ మాటకొస్తే, వాటి వలన ప్రమాదాలున్నట్టు గమనిస్తున్నాము. అలాంటప్పుడు దీనికి ప్రత్యామ్నాయ మార్గమేదైనా ఉన్నదా?
నేనొక మంచి విషయాన్ని, ఆచరణాత్మకమైన సంగతిని చెప్పాలని ఆశిస్తున్నాను. ఇది పూర్తిగా భిన్నమైనది, సంఘపరమైన మరియు వ్యక్తిగతమునైనదై యున్నది. ఏమంటే, స్థానిక సంఘాన్ని సువార్త ప్రకటన సంస్కృతిగల కేంద్రంగా చేయుట.
సంఘము మరియు సువార్త ప్రకటన
‘‘మీరు ఒకని యెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురని’’ యేసు చెప్పాడు (యోహాను 13:35). కొంతసేపటి తరువాత, ఆయన తన శిష్యులతో కూడ ఉన్నప్పుడే, ‘‘నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు’’ ఆయన శిష్యులు ఏకమైయుండాలని ఆయన ప్రార్థించాడు (యోహాను 17:20`21). మనము ఒక విషయాన్ని అర్థంచేసుకోవాలి. ఏమంటే, మనము సంఘ సభ్యులముగా ఒకని యెడల ఒకరము కలిగియుండు ప్రేమ మనలో నిజముగా మార్పు కలిగిందని ప్రకటిస్తుందని యేసు సెలవిస్తున్నాడు. మనము క్రీస్తు శరీరమైయున్న సంఘములో ఐక్యమైయున్నప్పుడు, యేసు, దేవుని కుమారుడై యున్నాడని మనము లోకానికి చూపిస్తున్నవారమవుతాము. ప్రేమ, శిష్యత్వాన్ని ధృవీకరిస్తుంది. ఐకమత్యం, క్రీస్తు దేవత్వాన్ని ధృవీకరిస్తుంది. ఇది ఎంత శక్తిమంతమైన సాక్ష్యం కదా! సువార్త ప్రకటించడానికి మనము చేసే ప్రయత్నాల గూర్చి నిర్దేశాలిస్తూ వాటికి రూపమునిచ్చేవి అనేక వాక్యభాగాలున్నాయి, గాని ఈ వచనాలు సంఘం సువార్త ప్రకటన సంస్కృతియై యుండాలని మనకు చూపిస్తున్న లేఖనానుసారమైన పునాదియై యున్నవి.
అనగా, స్థానిక సంఘం సువార్త కంటికి కనబడునట్లు చేస్తున్న చేసే ఒక సాధనమై యున్నదని అర్థం. మనము ఒకని యెడల ఒకరము కలిగియున్న ప్రేమ ద్వారా సువార్తను ఒక పటముగా వర్ణించవలసి యున్నట్లయితే, అది, సంఘమైయుందురని అందరు కలిసి ప్రేమపూర్వకంగా నిబంధన చేసికొనినవారితో కూడిన స్థానిక సంఘంలో జరగాల్సిన విషయమై యున్నది. అది కంటికి కనబడని ప్రేమ కాదు, గాని నిజమైన లోకంలోని నిజమైన మనుష్యుల యెడల కనుపర్చబడు ప్రేమయై యున్నది. సంఘమనేది వారికి విచిత్రంగా అగపడుతుంటుందని క్రైస్తవేతరులు అంటుంటే నేను ఎన్నోసార్లు విన్నాను, గాని వీరందరిని ఒక సహవాసంగా ఏర్పరచింది, సంఘ సభ్యుల మధ్య ఉండిన ప్రేమే.
అయితే సువార్త మన ప్రేమ ద్వారా మాత్రమే కనుపర్చబడదు. దేవుడు సంఘమనే వ్యవస్థను బైబిలులోని ఎన్నో ఆదేశాలతో నిర్మించాడనియు, సరిగా పాటింపబడినట్లయితే, అవన్నీ సువార్త ప్రకటనలుగా ప్రయోజనకరంగా పనికివస్తాయనియు మీరెప్పుడైనా ఆలోచించారా?
సువార్త ప్రకటన గూర్చిన ఆరోగ్యవంతమైన సంస్కృతిని అనుసరించునపుడు, దాని కోసమని మనము సంఘాన్ని మళ్లీ నిర్మించుకొనము. దానికి బదులుగా, దేవుడు ఇదివరకే దానిలో ఇమిడ్చిన బైబిలులోని ఆదేశాలు సువార్తను ప్రకటించునట్లు చేస్తాము. యేసు సంఘాన్ని కట్టినప్పుడు ఆయన సువార్తను మర్చిపోలేదు.
ఉదా॥ బాప్తిస్మము, యేసు యొక్క మరణాన్ని, ఆయన సమాధిచేయబడుటను, మరియు పున:రుత్థానాన్ని వర్ణిస్తుంది. ఆయన మరణం, మన మరణమై యున్నదనీ; ఆయన జీవం, మన జీవమై యున్నదనీ బాప్తిస్మము చూపిస్తుంది. ప్రభు భోజన సంస్కారము, ఆయన తిరిగి వచ్చు వరకు క్రీస్తు మరణాన్ని ప్రచురం చేస్తుంది; అదే సమయంలో మనము మన పాపములను ఒప్పుకొని తాజాగా క్షమాపణ పొందడానికి అవకాశమిస్తుంది. మనము ప్రార్థించేటప్పుడు, మనము దేవుని సత్యాలను పలుకుతుంటాము. మనము పాటలు పాడునప్పుడు, దేవుడు మనకు సువార్త ద్వారా చేసిన గొప్ప కార్యాల గూర్చి పాడుతుంటాము.
మనము కానుకలిచ్చినప్పుడు, మనము సువార్త వ్యాప్తి కోసం ఇస్తున్నాము. సహజంగానే, దేవుని వాక్యం బోధింపబడునప్పుడు, సువార్త బోధింపబడుతుంది.
వాస్తవానికి, సంఘం ఏర్పడటానికి దేవుని వాక్యం బోధింపబడుట మూలమై లేక ముఖ్య కారణమై యున్నది. సంఘం ఒకసారి ఏర్పడిందంటే, శిష్యులనుగా చేయాల్సిన కార్యభారం దానికి అప్పజెప్పబడుతుంది. తత్ఫలితంగా శిష్యులైనవారు మరొక చోటికి పంపబడినప్పుడు, వారు అక్కడ సువార్త ప్రకటించి క్రొత్త సంఘాన్ని నిర్మిస్తారు. యేసు పరలోకానికి ఆరోహణుడై వెళ్లిన నాటి నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది మరియు ఆయన మరల వచ్చు వరకు కొనసాగుతూనే ఉంటుంది.
సువార్త ప్రకటన సంస్కృతి కూకటివేర్లై యున్నది. సువార్త ప్రకటన సంస్కృతిలో, సంఘమనేది సంఘముగా నిలిచియుండటమే దాని ముఖ్యమైన పనైయున్నదని సభ్యులు అర్థం చేసుకుంటారు. సంఘం అనుసరించే పద్ధతుల్లోనే సాక్ష్యమున్న, ఆ పద్ధతులే సాక్ష్యమై ఉన్నాయనే విషయాన్ని మనము గమనించవచ్చు. దూర ప్రాంతాల్లో సువార్త ప్రకటింపబడుటను సంఘం ఖచ్చితంగా ఆదుకుంటుంది, ప్రార్థిస్తుంటుంది మరియు సువార్త ప్రకటనకు గల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. సువార్త ప్రకటన కార్యక్రమాలు జరిపించడం సంఘం పని కాదు. సంఘం సువార్తను ప్రకటించే సంస్కృతిని పెంపొందించుకోవాలి. సువార్త ప్రకటించడానికి సభ్యులు పంపబడుతుండాలి. ఈ విషయం అందరికీ ఇష్టముండకపోవచ్చు, గాని ఇది నిజముగా ముఖ్యమైన విషయమై యున్నది. దీన్ని మీరు సరిగా అమలుచేయనట్లయితే, మీరు సంఘాన్ని విధ్వంసం చేయగలరు మరియు సంఘ నాయకత్వంపై తప్పుడు అవగాహనతో కోపగించుకొనగలరు.
కాబట్టి, సువార్త ప్రకటించాలనెడి ఆరోగ్యవంతమైన సంస్కృతిలో, సంఘానికి మరియు సంఘ సభ్యునికి కూడ భిన్నమైన ఒక ప్రాధాన్యత ఉంటుందని అర్థమవుతున్నది. సువార్తకు అనుగుణంగా నున్న లేదా బైబిలు వర్ణిస్తున్నట్టున్న జీవితం జీవించే సంఘాలు మనకు కావలసి యున్నది, జీవితంలో దారి తప్పిపోయి క్రీస్తు కొరకు వెదకుతున్నవారితో స్నేహంచేస్తూ వారిని చేరదీసే క్రైస్తవులు మనకు అవసరమై యున్నారు, వారిని తరిమేవారు కాదు. అనగా, సువార్త ప్రకటన విషయంలో నీవు వ్యక్తిగతంగా చేయవలసింది సంఘమంతా కలిసి చేయడం యుక్తమైనదై యుండకపోవచ్చునని అర్థం.
సువార్త ప్రకటన సంస్కృతిలో, ప్రతి ఒక్కరు పంచుకొనడం, ప్రార్థించడం, మరియు అందుబాటులో నుండు అవకాశాలను సద్వినియోగం చేసికొనడమనేది సమిష్టి లక్ష్యమై యున్నది, అంతే గాని అది కేవలము పాస్టర్‌గారు మరియు సంఘ పరిచారకులు మాత్రమే చేయాల్సిన పని కాదు. మనమందరము కలిసి నమ్మకమైన సాక్షులముగా ఉండుట మన బాధ్యతయై యున్నది.
సంఘ సభ్యులు సువార్త సభల కొరకు గడిపే సమయంలో, సగం సమయాన్ని స్నేహపూర్వకమైన సువార్త ప్రకటన సంభాషణల్లో పొరుగువారితో, సహోద్యోగులతో, లేదా తోటి విద్యార్థులతో గడిపినట్లయితే, సువార్తకు మంచి స్పందన వస్తున్నట్టు వారు చూడగలరనియు, గనుక అదే ప్రోత్సాహంతో యింకా ఎక్కువ మందితో పంచుకొనగలరనియు నేను నమ్ముతున్నాను. మీరు దీని గూర్చి ఆలోచించినట్లయితే, మీ సంఘ సభ్యులు వారానికొకమారు సువార్త వినిపించిన క్రైస్తవేతరులందరు వచ్చి మీ చర్చ్ బిల్డింగులో కూర్చోడానికి, అది ఎంత పెద్దదైనా సరే, మీరు ఎప్పుడైనాగాని స్థలం చూపించే గలిగేటంత స్థలం ఉండదు.
వాస్తవ విషయమేమిటంటే, కుటుంబ సభ్యుల ప్రభావం వలన, చిన్న చిన్న గుంపులుగా చేయబడే బైబిలు స్టడీల ఫలితంగా, లేదా సంఘారాధన ముగిసిన తరువాత ఒక స్నేహితునితో చేసిన సంభాషణ ద్వారా ఎక్కువ మంది క్రీస్తునంగీకరిస్తున్నారు: ఎందుకంటె, క్రైస్తవులు బుద్ధిపూర్వకంగా సువార్తను ప్రకటిస్తున్నారు.
జె. మ్యాక్ స్టైల్స్
మాక్ స్టైల్స్ మెసెంజర్ మినిస్ట్రీస్ డైరెక్టర్, ఆరోగ్యకరమైన మిషన్‌లను అభివృద్ధి చేయడానికి పనిచేస్తున్న పరిచర్య. అతను మరియు అతని భార్య, లీయన్, జూలై 2017లో ఇరాక్‌లోని ఎర్బిల్‌లో దిగడానికి ముందు అనేక ప్రదేశాలు ప్రయాణించారు మరియు నివసించారు, ఇందులో 15 సంవత్సరాలు UAEలోని దుబాయ్‌లో ఉన్నారు. ఇదివరకు, అతను ఎర్బిల్ ఇంటర్నేషనల్ బాప్టిస్ట్ చర్చి యొక్క పాస్టర్. మాక్ ఇప్పుడు లూయివిల్లో నివసిస్తున్నాడు మరియు థర్డ్ అవెన్యూ బాప్టిస్ట్ చర్చిలో సభ్యుడు
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web