‘దయచేసి నాకు సహాయం చెయ్యండి! నేను దేవునికి దూరంగా గురి, దరి లేకుండా తిరుగులాడుతున్నాను’
మన ప్రసారాలు వింటున్న శ్రోత, బెక్కి, చాల నిరాశతో ఇలా వ్రాసింది: ‘‘పాస్టర్ జాన్‌గారూ, నేను క్రీస్తును అంగీకరించిన తొలి రోజుల్లో నా మనస్సు నిండా ఆయనే ఉండేవాడు, ఆయన గూర్చిన ఆలోచనలే నా మనస్సు నిండా ఉండేవి. నేనాయన కొరకు చాలా ఆసక్తి కలిగి ఎంతో ప్రేమించేదాన్ని. రోజులు గడుస్తున్న కొద్దీ, రాను రాను, ఆయనను నేనెంతగానో కోరుకున్నప్పటికీ, ఈ ఆలోచనలు ఆవిరైపోయాయి, మంట చల్లారిపోయింది, ప్రేమ తగ్గిపోయింది. నా భర్త ఆరు నెలల వరకు వేరొక చోటికి సైనికపరమైన బాధ్యతల వల్ల మార్చబడ్డాడు (మా వైవాహిక జీవితం దెబ్బతిన్నది). నా పరిస్థితి, నేను ప్రభువును ఎన్నడును ఎరుగనట్టే ఉంది – వ్యభిచారం చేశాను, అశ్లీల చిత్రాలవైపు మళ్లాను, మాదక ద్రవ్యాలు సేవించడం మొదలుపెట్టాను, మద్యపానీయానికి బానిసనయ్యాను, బైబిలు చదవడం మరియు ప్రార్థన చేసుకోవడం ఆపేశాను. దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షించాడు, ఆరు నెలలు నేను బహు ఘోరంగా ఓటమిపాలయ్యాను.
‘‘నేను దేవుని సన్నిధిని ఏమాత్రము అనుభవించకుండా ఇప్పటికి దాదాపు ఒక సంవత్సరం గడిచిపోయింది. నేను నా ఆలోచనలను, అనుభూతులను వ్రాసుకోలేకపోతున్నాను లేదా వాటిగూర్చి ప్రార్థించలేకపోతున్నాను, నా బైబిలు చదవలేకపోతున్నాను. నేనేమీ చేయలేకపోతున్నాను, నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు. నేను నిజంగా రక్షింపబడితే, నా పాపము అంతకంతకు తగ్గిపోయేది, దాని కోరికలు కూడా తగ్గిపోయేవే, కాబట్టి నేను యేసును ఎక్కువగా కోరుకొనగలిగేదానినని అనుకుంటున్నాను. కాని అది అలా జరుగలేదు. యేసు అలా చేయలేదు. నేను యేసును ఎంతో ప్రేమించానని మాత్రం నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు, నేను ఆయనకు దూరంగా, వేరుగా ఎక్కడో ఉంటున్నట్టున్నది. నేను చేసిన పనుల విషయంలో నాకు అపరాధభావం కలుగడం లేదు, కొంచెమైనా కలుగడం లేదు.
‘‘నాకిప్పుడు దేవుడంటే భయమేస్తుంది. నా రక్షణ గూర్చి నాకు భయంగా ఉన్నది. నాకు యేసయ్య కావాలి. నేను ఆయన లేకుండా ఉంటున్నాను. నన్ను ఎవరూ, ఏ ఒక్కరైనా, అర్థం చేసుకోవడం లేదు. నేను రక్షింపబడాలని ఎంతో ఆశిస్తున్నాను. నేను రక్షించ బడ్డానని అనుకోవడం లేదు. నాకు అత్యవసరంగా సహాయం కావాలి. నా హృదయం ఎందుకింతగా కఠినమయ్యింది? దేవుడు నన్ను ఎందుకు మళ్లీ తన దగ్గరికి చేర్చు కోవడం లేదు? మీరు నాకు సహాయం చేయగలరా?’’
గతాన్ని గ్రహించడం
బెక్కీ, సహాయం కోసం నీ ఆక్రందనలో , నిరీక్షణతో కూరిన రుజువులున్నాయి. ఉదా॥ ‘‘నేను రక్షింపబడాలని ఆశిస్తున్నాను “ అంటున్నావు. అదే సమయంలో, నీ కేకలో నిస్సహాయత గూర్చిన భయాలు కూడా ఉన్నాయి. ఉదా॥ ‘‘నేను అంతకంతకు దేవునికి మరి ఎక్కువగా దూరమవుతున్నా’’ నంటున్నావు – లోకము యొక్క చివరి అంచు వైపుగా, సముద్రములో వెళ్తున్న ఒక ఓడ వలె లేదా జలపాతం మీద వెళ్తూ క్రిందికి పడిపోబోతున్న ఒక నావ వలె నీ మాటలున్నాయి.
‘‘భయంకరమైన మరియు అద్భుతకరమైన గతము యొక్క వాస్తవికతను లేదా యథార్థతను విశ్లేశించడానికి ప్రయత్నిస్తూ నిన్ను నీవు వెఱ్ఱిదానిగా చేసుకోకు. నీవు దానిని ఎన్నటికిని గుర్తించలేవు.’’
నీవు నాకు చాల దూరంలో ఉన్నందున, నీవు తిరిగి జన్మించావో లేదో నాకు స్పష్టమైన అవగాహన లేదు గాని, నీవు చెప్పినట్టు, నీవొకప్పుడు క్రీస్తును ఎంతో ప్రేమించావనే నీ సొంత సాక్ష్యాన్నిబట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను.
నీ సాక్ష్యం చాలా ప్రోత్సాహకరంగా ఉంది అయితే, ఇది నిజమో కాదో అనే విషయం ఎలా ఉన్నా – ప్రస్తుతానికి దాన్ని పక్కన పెడదాం. నీకు కూడ ఈ విషయం తెలుసు – ఇప్పుడు విషయం (సమస్య) ఇది కాదు. నేను నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు సమస్య ఇది కాదు. ఇప్పుడు సమస్య, గతాన్ని గూర్చినది కాదు. సమస్య వర్తమానకాలానికి, భవిష్యత్‌కాలానికి సంబంధించింది – ఇప్పుడేం చేయాలి, అటుతరువాత ఏం చేయాలన్నదే ఇప్పుడు ప్రాముఖ్యమైన సంగతి. నీవు ఎన్నడూ దీనిని గుర్తించలేవు. నీకు అభయం దొరికేది అక్కడ కాదు.
వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట దేవుని గూర్చిన వాక్యము వలన కలుగుతుంది (రోమా 10:17 చూడండి). విశ్వాసం, తరచుగా దేవుడు ఇతరుల జీవితాల్లో చేసే కార్యాలను గమనించడం ద్వారా కలుగుతుంది.
కాబట్టి, నీకు దేవుని వాక్యంలోగల చక్కని సత్యాన్ని కొంత మరియు నీవంటి వారి పట్ల గల దేవుని నమ్మకత్వానికి సంబంధించిన కొన్ని కథలు చెబుతాను, విను. నీకు ఈ జవాబు యోగ్యమైనదని లేదా నేను ఈ పని చక్కగా చేయగలిగే వాడనని కాదు గాని, నీలో నూతనమైన, ఖచ్చితమైన విశ్వాసాన్ని మేల్కొల్పడానికి, దేవుడు నా జవాబును అద్భుతరీతిగా ఉపయోగించాలని నేనిప్పుడే, ఇక్కడే, ప్రార్థిస్తున్నాను.
విడుదలను కలుగజేసి స్వేచ్ఛనిచ్చు కృప
దేవుడు ఈ వాక్యాలను నీకు వినసొంపైనవిగా, అనుసరించుటకు ఆనందదాయకమైనవిగా చేయునట్టు నేను నీకు ప్రార్థనాపూర్వకంగా చదివి వినిపిస్తాను. నీవు కూడా ప్రార్థనాపూర్వకంగా వినమని మనవి చేస్తున్నాను.
ప్రవక్తయైన మీకా ఇలా చెబుతున్నాడు. ఈ వాక్యభాగం ఆధారంగా వ్రాయబడిన ఒక పాట నిన్నటి దినాన నేను పాడాను.
నీవు క్షమించినట్టు క్షమించు దేవుడెవడున్నాడు?
ఇంత గొప్ప కృపగల విడుదలనిచ్చు నీవంటివాడెవడున్నాడు?
నాకు చాల ఇష్టమైన ఈ పాట ఈ వాక్యభాగంలో నుండి పుట్టుకొచ్చింది. అదేంటంటే, ‘‘అతిక్రమముల విషయమై క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా?’’ (మీకా 7:18). అనగా, ఈ దేవుని వంటి దేవుడు లేడని మరొక మాటలో చెప్పొచ్చు. ఆయన మన దోషములను క్షమిస్తాడు. ‘‘తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, . . . ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు’’ (మీకా 7:18).
నేను తీర్పును మించిన విషయాన్ని ఇక్కడ కలుపుతున్నాను. క్షమించు విషయంలో ఆయన సంతోషిస్తాడు. ఆయన మొట్టమొదట క్షమించడాన్నే ఎన్నుకుంటాడు. ‘‘ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును’’ (మీకా 7:19). బెక్కీ, విన్నావా? ఆయన నిన్ను అణచివేయడు.
‘‘ఆయన మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు (మీకా 7:19-20). కాబట్టి, క్రీస్తునందు ఈ వాగ్దానము నీది కూడా. నీవు క్షమించినట్టు క్షమించు దేవుడెవడున్నాడు? ఇంత గొప్ప కృపగల విడుదలనిచ్చు నీవంటివాడెవడున్నాడు?
క్రీస్తు సహనము
ఇంకొక వాక్యభాగం చదువుతున్నాను, విను! – 1 తిమోతి 1:15. పౌలు ఇలా చెప్తున్నాడు, ‘‘పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై యున్నది. అట్టివారిలో నేను ప్రధానుడను.’’
‘‘క్రీస్తు మృతులలో నుండి లేపబడి యున్నాడు గనుక సమస్తము మారుతుంది.’’
బెక్కీ, ఈ మాటలు పౌలు నీకే చెబుతున్నాడు. ఇక్కడ ప్రధానమైన వ్యక్తివి నీవు కాదు. నేను అంటున్నాడు. పౌలుతో పోటీపడవద్దు. అతడు ప్రధానుడు గనుక, అతని యెడల చూపింపబడిన కనికరము, కృప నీకు కూడ చూపింపబడగలదు అని రుజువుచేసే వ్యాజ్యాన్ని మనముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు.
పౌలు ఇంకా ఇలా చెప్తున్నాడు: ‘‘అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి – అంటే బెక్కి వంటి వారికి – నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని’’ (1 తిమోతి 1:16). ‘‘సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్’’ (1 తిమోతి 1:17). నిజముగా, ఇంత గొప్ప దీర్ఘశాంతమునకు ఘనతయు, మహిమయు యుగయుగములు కలుగును గాక. కాబట్టి, ఈ రెండు వాక్యభాగాలు: మీకా 7:18-20 మరియు 1 తిమోతి 1:15-17 నీ ముందుంచాను. వాటిని కష్టపడి ఎక్కువగా ధ్యానించు.
మ్యూనిక్, జర్మనీ
అది 1975. స్థలం – మ్యూనిక్, జర్మనీ. జాన్ పైపర్ ఒక జర్మన్ దేవాలయములో కూర్చోని జర్మన్ భాష నేర్చుకుంటున్నాడు. వినడానికిది చాల సంతృప్తికరంగా ఉంది. ఈ కథ నాకు చాల ఇష్టం. నేను దీనిని ఎన్నడూ మర్చిపోలేదు. బాప్తిస్మము తీసుకోవడానికి తెల్లని బట్టలు ధరించుకొని వచ్చిన ఒక స్త్రీ, ముందుగా తన సాక్ష్యాన్ని పంచుకున్నది. ఆమె సాక్ష్యమేమంటే, ఆమె తన జీవితకాలమంతా “యెహోవా సాక్షిగా” జీవించింది. కాబట్టి ఆమె రక్షింపబడిందో లేదో ఆమెకు ఎన్నడూ అర్థం కాలేదు. ఆమెకు పిచ్చెక్కిపోతుండేది. ఆమె రక్షించబడింది అనే నిశ్చయత, హామీ ఆమెకు కలుగడం లేదు.
ఏదో ఒక నిర్ణయానికి రావలసిన సమయం రానేవచ్చింది: నేనిలాగే కొనసాగలేను. నేను ఆత్మహత్య చేసికోబోతున్నాను. ఇది ఇలా ఉండగా, అనుకోని విధంగా, దేవుడామె హృదయంలో ఒక తలంపు ఉంచాడు. ఆమె ఆత్మహత్య చేసికొనక ముందు, మోకాళ్లూని, బైబిలు తెరచి, లూకా వ్రాసిన సువార్తనంతటిని మరొకసారి క్షుణ్ణంగా చదవమన్నాడు. ఆ తరువాత ఆమె ఆత్మహత్య చేసికోవచ్చు.
ఆమె చదవడం మొదలుపెట్టింది. అధ్యాయం తరువాత అధ్యాయం అయిపోతున్నాయి. ముగింపుకు వచ్చింది. 22వ అధ్యాయం చదువుతుండగా, గెత్సెమనే తోటలో యేసు పాపుల కొరకు ప్రార్థిస్తూ, వారి రక్షణార్థమై పూర్తి విమోచన క్రయధనమును చెల్లించుటకు వేదనపడుచు, మరింత ఆతురముగా ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన చెమట, నేల పడుతున్న గొప్ప రక్తబిందువులవలె ఆయెను అనే మాటలు చదివింది (లూకా 22:44). అంతే, దేవుడు ఆమె ఆత్మను రక్షించాడు. ఆమెలో ఉండిన అనుమానాలన్నిటినీ తొలగించాడు. ఆమెకు, యేసు నిజమైన వ్యక్తి అని, ఆమె పాపములను ఆయన తన రక్తముతో కడిగివేశాడనే నిశ్చయతతో కూడిన రక్షణ వరాన్ని ఆమెకిచ్చాడు. రెండు రోజుల తరువాత, ఆమె బాప్తిస్మము పొందడానికి అక్కడ సిద్ధంగా నిలబడి ఉండింది. ఆహా, ఎంత అద్భుతకరంగా కాపాడి రక్షింపబడింది కదా! అని నేననుకొన్నాను. బెక్కీ, నీ విషయంలో కూడ దేవుడు తన కార్యాన్ని చేయగలడు.
పున:రుత్థానము
ఇదే వారంలో నేనొకరితో మాట్లాడుతూ ఉన్నాను. అతడు వేదాంతశాస్త్రంలో పి.హెచ్‌డి చేశాడు. అతని జీవిత కథను చెప్పమని అడిగాను. అతడు ఇలా చెప్పుకొచ్చాడు: అతడు క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాడు. చక్కగా చదువుకుంటున్నాడు. విశ్వవిద్యాలయ విద్యాభ్యాస లెవెల్‌కు వచ్చినప్పుడు, క్రీస్తునందు అతనికున్న నమ్మకమంతా పూర్తిగా మారిపోయింది. ఉన్న కొంత విశ్వాసం కూడ వీగిపోయింది. సాపేక్షవాదం లోనికి దిగిపోయాడు. అంటే ఏ దేవుడైతే ఏముంది, అందరమూ అక్కడికేగా పోయేది అనుకున్నాడు. ఆధునికానంతర వాదము – అంటే ఏదీ సత్యం కాదు, అంతా ఒకరి దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది అనే నిర్ణయానికి వచ్చాడు. ఇదే దృష్టికోణంతో 5 సం॥ జీవించాడు.
‘‘కొన్నిసార్లు నీవు 999 సార్లు చేసినా జవాబు రాని ప్రార్థనకు, 1000వ సారి చేసినప్పుడు వస్తుంది. కాబట్టి పట్టుదలను సడలించకు, ప్రార్థించుట మానకు.’’
ఆ తరువాత అతడు ఒక పుస్తకం చదవడం ప్రారంభించాడు. అనుకోకుండా, క్రీస్తు పున:రుత్థానము గూర్చి వ్రాయబడిన పుస్తకమును చదివేట్టు దేవుడు చేశాడు. యేసు నిజంగా మృతులలో నుండి సజీవుడుగా లేచాడని దేవుడతన్ని ఒప్పించాడు. ఈ విషయాన్ని నేను ఒక్కోకుండా ఉండలేను. క్రీస్తు లేపయబడియున్నాడు గనుక, సమస్తము మారిపోతుంది. అతనిలో సరిగ్గా అదే జరిగింది.
‘‘ఇలా జరిగింది కదా, ఇప్పుడేమంటావు? దీనిని నీవెలా చూస్తావు?’’ అనడిగాను. చాలా సేపు వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతగా దు:ఖపడతాడని నేననుకోలేదు. అలా ఏడ్చే వ్యక్తిగా అతడు అగపడలేదు. కానీ ఏడ్చాడు. అది కేవలము దేవుడు తన మహా కృప చేత కల్పించుకోవడం తప్ప మరేదీ కాదని ఒప్పుకోవడం తప్ప, అతడు యింకేమీ చెప్పలేకపోయాడు.
జవాబు వచ్చిన ప్రార్థన
అది 1982వ సంవత్సరం. ఒక సంఘానికి కాపరిగా సేవలందించడం మొదలుపెట్టి రెండు సంవత్సరాలయ్యింది. ‘నాయకత్వ మాసపత్రిక’ లోని ఒక వ్యాసాన్ని చదువుతున్నాను. చాలా ప్రఖ్యాతిగాంచిన వ్యాసం అది – ‘‘ది వార్ వితిన్’’ (అంతరంగంలోని పోరాటం). అదొక పాస్టర్‌గారిని గురించి రాయబడింది. ఈయన లైంగిక పాపానికి బానిసయ్యాడు. దాదాపు పది సంవత్సరాలు పూర్తిగా వేషధారిగా ఉన్నాడు.
ఈయన ఆధ్యాత్మిక సమావేశాలు జరిపించడానికి వెళ్లేవాడు. కూడికల మధ్యలో దొంగతనంగా నగ్న నృత్యాలు చేయబడే క్లబ్బులకు వెళ్తుండేవాడు. లైంగిక పాపాలకు అతడు ఇంత తీవ్రంగా బానిసయ్యాడు. అయితే అతడొక నవల చదివాడనీ, చదువుతున్నప్పుడు, దేవుడు మంచి చెడులకు మధ్యగల తేడాను అతడు స్పష్టంగా గ్రహించునట్లు, అతడు ఇదివరకెన్నడు ఎరుగనంతగా పవిత్రత కోసం తపించిపోయేలా, దేవుడతని మనోనేత్రాలను ఎలా తెరిచాడో ఆ వ్యాసంలో వ్రాయబడింది.
ఆ వ్యాసంలోని ఒక వాక్యం నాకు యింకా గుర్తుంది. ఇది మిమ్ములను కొంత మేరకు ప్రోత్సాహపరుస్తుంది. అతడు ఇలా వ్రాశాడు: ‘‘10 సంవత్సరములుగా చేసిన ప్రార్థనను దేవుడు 999 సార్లు విని మౌనంగా ఉండి, 1000వ సారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు ఆ ప్రార్థనకు జవాబిచ్చాడో, నేను మీకు చెప్పలేను.’’
బెక్కీ, వింటున్నావా! దేవుడు నీ ప్రార్థన విని నీకు ఆశ్చర్యాన్ని కలిగించగలడు. నీవు 1000 సార్లు చేసిన ప్రార్థనకు రాని జవాబు, నీవు 1001వ సారి చేసినప్పుడు నీకు జవాబివ్వడం ద్వారా దేవుడు నిన్ను అత్యంతానందంతో కూడిన ఆశ్చర్యంలో ముంచెత్తాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడో నాకు తెలియదు, బెక్కీ. దేవుడు నీకు ఎంతో దూరంలో ఉంటున్నట్టున్న అనుభూతి నీకు కలుగుతున్న కారణానికి నా దగ్గర జవాబు లేదు.
దేవుని సమయం మనమనుకున్నట్టు కాకుండా, ఆయన తలంపుల ప్రకారం ఎందుకలా ఉంటుందో నాకు తెలియదు. అయితే, ఇలాంటి అనుభూతిని అనుభవిస్తున్న వారిలో నీవు మొదటిదానవు కావని నాకు తెలుసు. నీవొక్కదానివే కావు. వాస్తవానికి, దీని గూర్చి యేసు నీకొక ఉపమానము చెప్పాడు. లూకా 18:1లో ఇలా వ్రాయబడి ఉంది: ‘‘వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.’’
కాబట్టి బెక్కీ, పట్టుదలతో ప్రార్థించుట మానవద్దు. నీవు చేసే ప్రార్థనకు జవాబు అతి సమీపంలో ఉండవచ్చు.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web