మరొక కూడికకు మిమ్ములనందరిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గత వారంలో మనము కూడుకొన్నప్పుడు, మన జీవితాలను కమ్ముకొనగల ‘‘ఆందోళన మేఘం’’ గూర్చి మనం నేర్చుకున్నాము. ఇది మీరు కొన్నిసార్లు అనుభవించే అనుభూతిగా ఉంటుంది. కాని, ‘‘ఆ అనుభూతి ఏంటో, ఎందుకో, నీవు ఖచ్చితంగా చెప్పలేనిదై యుంటుంది’’ – నీలో ఉద్రిక్తతతో కూడిన ఏదో ఆందోళన, ‘‘ఈ రోజు ఏదో చెడు జరుగబోతుందనే’’ అనుభూతి కలుగుతుంది. ఔను, ఇలాంటి ఆందోళన మేఘం క్రైస్తవులను కూడ కమ్ముకొంటుంది. వాస్తవంగా చెప్పాలంటే, కొందరు క్రైస్తవులు ఇలాంటి ఆందోళనను ప్రతి రోజు ఎదుర్కొంటారు. గాని, క్రైస్తవులమైన మనం ఇలా ఆందోళన చెందాలా? మనలోని ఆందోళన అంతటిని పరిశుద్ధాత్మ పూర్తిగా తొలగించలేదా?
గత రోజుల్లో, ‘‘దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదని’’ పౌలు చెప్పిన విషయాన్ని మనం చూశాము (2 తిమోతి 1:7). అలాంటప్పుడు, అంతరంగములో పరిశుద్ధాత్మ నివసిస్తున్న ఏ క్రైస్తవుడైనా ఇలాంటి చింతలతో ఎందుకు ఆందోళన చెందాలి? మన పాడ్కాస్ట్ ప్రసారాలను చూస్తున్న ఎరిక్ అడుగుతున్న ప్రశ్న ఇదే. ‘‘హల్లో, పాస్టర్ జాన్‌గారూ, ‘‘దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యనప్పుడు’’ (2 తిమోతి 1:7), ఒక విశ్వాసిగా, నేను భయంతో యింకా ఎందుకు పోరాడుతున్నాను? పరిశుద్ధాత్మ నాలో నివసిస్తున్నాడు కాబట్టి నా భయాన్నంతటినీ ఆయన పూర్తిగా తొలగించాలి కదా?’’ అనంటున్నాడు.
ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలని నేను ఆసక్తి కలిగియుండడానికి ఒక ముఖ్య కారణముంది.
అదేమంటే, ఎరిక్ అడుగుతున్న ప్రశ్న భయం లేదా ఆందోళన లేదా చింతించుట గురించిందే అయినప్పటికిని, దీనికి సంబంధించిన సూత్రము దాదాపుగా క్రైస్తవ నీతిశాస్త్రం లేదా నైతిక ప్రవర్తన, క్రైస్తవ సుగుణం లేదా పవిత్రీకరణము యొక్క ప్రతి విషయంతో పోరాడుతున్నది.
ఇది, విశ్వాసమూలమున నీతిమంతులముగా తీర్చబడుట అనే దేవుని న్యాయవిధినిబట్టియు, తిరిగి జన్మించిన మనలో చేయబడిన దేవుని పరివర్తన చర్యనుబట్టియు, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మనుబట్టియు మనము క్రీస్తునందు నిర్ణయాత్మకంగా నూతన సృష్టిగా చేయబడినప్పటికిని, మన అనుదిన వాస్తవ జీవితంలో మనము యింకా పూర్తిగా నూతన సృష్టి కాలేదనియు, పూర్తిగా నూతన పరివర్తన చెందలేదనియు తెలిసికొనుట అనే సూత్రమై యున్నది. మనమందరము ఇటువంటి ఉద్రిక్తతతో జీవిస్తున్నాము. ఇదే, క్రైస్తవ జీవితంలోని వాస్తవము.
ఈ విషయాన్ని మనం మన ప్రసారాల్లో అనేకసార్లు చర్చించినప్పటికీ, నేర్చుకున్నప్పటికీ, క్రైస్తవ జీవితంలోని ప్రతి విషయానికి ఇది ఎంతో మౌలికమైనదియు ముఖ్యమైనదియునై యున్నది గనుక తరచుగా, చాలాసార్లు చర్చించడం కష్టమవుతుంది.
నూతన సృష్టే అయినప్పటికిని నూతన సృష్టి కాదు
ఎరిక్ ఒక్కడే కాదు, మనమందరం మన అనుదిన క్రైస్తవ జీవితంలో ఈ విషయంతో వ్యవహరిస్తుంటాము. క్రీస్తునందు మనము నిర్ణయాత్మకంగా నూతన సృష్టియై యున్నాము – అయినప్పటికిని పూర్తిగా నూతన సృష్టి కాలేదు. ఇది వాస్తవం. నూతన సృష్టిగా ఎలా బ్రతకాలో నేర్చుకోవడమే క్రైస్తవ జీవితానికి కీలకమై యున్నది.
నిర్ణయాత్మకంగా అని అన్నప్పుడు – ఈ మాట నాకు చాల ఇష్టం, నిజంగా ఎంతో సహాయకరంగా ఉండే మాట ఇది – దేవుడు (క్రైస్తవులమైన) మన కొరకు ఏదో ఒక కార్యం చేశాడు, మనలో నుండి ఎన్నటికినీ, ఎప్పటికినీ తీసివేయబడజాలని ఏదో ఒక కార్యం చేశాడు. దానిని దేవుడు చేశాడు, కాబట్టి అది నిర్ణయాత్మకమైనదే. మనలో రక్షణార్థమైన కార్యాన్ని ఆయన మొదలుపెట్టాడు, కాబట్టి ఆయనే దానిని కొనసాగిస్తాడు, పూర్తిచేస్తాడు (ఫిలిప్పీ 1:6). నిర్ణయాత్మకమైనది అనంటే, నా భావం ఇదే.
అయినప్పటికిని, ఈ రక్షణార్థమైన కార్యం, ఈ నూతనత్వం, కొంత మేరకు, యింకా పూర్తికాలేదు.
మనల్ని నీతిమంతులనుగా తీర్చుట ద్వారా దేవుడు మన కొరకు చేసిన కార్యాన్ని, నూతన సృష్టిగా చేయడంలో ఆయన మనలో చేసిన కార్యాన్ని, ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనలో చేస్తున్న కార్యాన్ని, మరియు చివరకు పున:రుత్థానమందు మన నూతనత్వము పూర్తికానైయున్నప్పుడు ఆయన మన కొరకు చేయనైయున్న కార్యాన్ని మనం గ్రహించడం చాలా కీలకమైన విషయం. ఇది కీలకమైయున్నది, చివరకు బయటపడుతున్న ప్రశ్న కూడ దీని గూర్చినదే.
ఎరిక్, ఒక ప్రక్క, తన అంతరంగంలో పిరికితనములేని దేవుని ఆత్మను కలిగియుంటూనే, మరొక ప్రక్క, పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ, తన అనుదిన జీవితంలో భయాన్ని జయించడానికి పోరాడుతున్నాడు, కదా! ` ఔను, సాధారణ క్రైస్తవ జీవితంలో ఇలాగే అనిపిస్తుందని నేను మీకు చూపించాలని ప్రయత్నిస్తున్నాను. ఈ విషయాన్ని యింకా కొంచెం స్పష్టంగా తెలిసికొందాం. ఎందుకంటే, మనుష్యులు రక్షణ యొక్క ఈ మౌలిక నిర్మాణాన్ని అర్థం చేసికోగలిగినట్లయితే, దాని ద్వారా వారి అనుభవమేమై యున్నదో తెలిసికోగలరని నేననుకుంటున్నాను.
రక్షణ, మూడు కాలాలకు సంబంధించినదై యున్నది
దేవుడు మనకు అపరాధము (దోషము, తప్పు), పాపము, ఉగ్రత, మరణము, బాధ మరియు నరకము నుండి రక్షణ అనుగ్రహిస్తాడు. ఇది నిరంతరం నిలిచియుండు సంతోషంలోనికి ఒక్కసారిగా కాకుండా, దశలవారీగా జరిగే సంపూర్ణ రక్షణగా ఉంది. దీని గూర్చి స్పష్టంగా తెలిసికొందాము. ఈ రక్షణ కొన్ని విధాలలో (భావాలలో, అర్థములలో) జరిగిపోయింది (భూతకాలము). కొన్ని విధాలలో (భావాలలో, అర్థములలో) జరుగుతున్నది (వర్తమానకాలము). మరియు కొన్ని విధాలలో (భావాలలో, అర్థములలో) భవిష్యత్తులో జరుగనైయుంది (భవిష్యత్‌కాలము). ఈ ఒక్కొక్క దానిని తెలియజెప్పు వాక్యభాగాలున్నాయి.
- ఎఫెసీ 2:8 – ‘‘మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు., ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే.’’ ఈ (రక్షణ) కార్యము చేయబడింది. నీవు రక్షింపబడ్డావు.
- 1 కొరింథీ 1:18 – ‘‘సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.’’
- రోమా 13:11 – ‘‘మరియు మీరు కాలము నెరిగి, నిద్రమేల్కోను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా (యింకా ఇక్కడ లేనట్టుగా) ఉన్నది.’’
నిరంతరము నిలిచియుండు సంతోషములోనికి సంపూర్ణ రక్షణ ఒక్కసారిగా గాక దశలవారీగా జరుగుతుంది.
ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదా. పైన పేర్కొనబడ్డ ప్రతి ఒక్క రక్షణ దశకు సంబంధించిన ఇతర రిఫరెన్సులను కూడా వీటితో మీరు కలుపవచ్చు. రక్షణ కార్యం చేయబడింది., అది చేయబడుతున్నది., అది భవిష్యత్తులో చేయబడనై యున్నది.
భూతకాలము
ఉదా॥ ఇదివరకే జరిగిన కార్యమేంటి? ఏది నిర్ణయాత్మకమైనది? దేవుడు మనలను నీతిమంతులనుగా తీర్చే కార్యం ఇదివరకే చేయబడింది. ఇది గత కాలానికి సంబంధించింది మరియు సంపూర్ణమైనది. దీనికి ఒక ప్రత్యేక ప్రక్రియ లేదు ఎందుకంటే, ఇది మనం క్రీస్తును, మన అమూల్యమైన రక్షకునిగా ప్రభువుగా స్వీకరించి మార్పునొందిన సమయంలో ఒక్కసారే జరిగే ఒక చట్టపరమైన ప్రకటనగా (ఘోషణయై) ఉంది. మనం ఆయన దృష్టికి నీతిమంతులమని దేవుడు ప్రకటిస్తాడు. రోమా 5:1 – ‘‘విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.’’ ఇది చేయబడింది – సంబంధిత ప్రక్రియ అంటూ ఏమీ లేదు. కోర్టు విచారణ అయిపోయింది. రెండవసారి పట్టబడి శిక్ష విధింపబడటమనేది లేదు. ఇదే విషయమై (నేరారోపణ) మళ్లీ కోర్టుకు ఎప్పుడైనా గాని వెళ్లనవసరం కూడా లేదు.
చట్టపరంగా ఒక్కసారే చేసి ముగించబడిన ఈ చర్యకు అనుగుణంగా, సమానంగా, తిరిగి జన్మించుట లేదా నూతన జన్మ అని పిలువబడే చర్య కూడా ఒకటుంది . నీతిమంతులంగా తీర్చబడుట వలె గాక, ఈ నూతన జన్మ అనే చర్య చట్టపరంగా న్యాయస్థానంలో జరుగదు., ఇది మన అంతరంగంలో జరుగుతుంది, అయితే ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. శిశువులు ఒక్కసారే జన్మిస్తారు (పుట్టిన అదే శిశువు మళ్లీ పుట్టదు). 1 పేతురు 1:22-23 – ‘‘మీరు క్షయబీజము నుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు” అంటాడు. ఈ కార్యము ఒక్కసారే చేయబడింది. అది మళ్లీ జరుగదు. అదొక ప్రక్రియ కాదు.
కాబట్టి, నీతిమంతులముగా తీర్చబడుట (క్రీస్తునందు నీతిమంతులముగా లెక్కింపబడుట) మరియు తిరిగి జన్మించుట (నూతన జన్మ), సంపూర్తిగా ముగించబడ్డ రక్షణ కార్యములై యున్నవి – ఒక్కసారే, నిర్ణయాత్మకంగా, మార్పుచేయబడజాలకుండ పూర్తయ్యాయి. ఈ కార్యాలను దేవుడు ఎన్నడునూ తలక్రిందులు చేయడు, త్రిప్పికొట్టడు, రద్దుచేయడు. ‘‘మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులనుగా తీర్చెనో వారిని మహిమపరచెను’’ (రోమా 8:30). సఫలము కాకపోవడమనేది లేదు, తొలగించడమనేది లేదు, త్రిప్పికొట్టడమనేది లేదు – ఒక్కసారే, నిర్ణయాత్మకంగా నీతిమంతులముగా తీర్చబడ్డాము, తిరిగి జన్మించాము. మనకు బలమైన మూలాధారం ఇదే కాబట్టి నేను ఈ విషయాన్ని ఇంత నొక్కి చెప్తున్నాను. మనము ఆందోళన లేదా చింతను జయించడానికి పోరాడేటప్పుడు,ఈ సంగతులనే ఆధారంగా చేసుకొంటాము.
వర్తమానకాలము
ఆ తర్వాత దేవుడు రక్షణను కొనసాగిస్తున్న ప్రక్రియ కూడా ఉన్నది. ఇక్కడ, పరిశుద్ధులంగా చేయబడుతున్నాం అనేది కీలక పదంగా ఉంది. హెబ్రీ 10:14 – ‘‘ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడువారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.’’ కాబట్టి మనం పాపాన్ని చంపేసి నీతి మార్గములో నడుచునట్టు మనకు సహాయం చేస్తూ, మన జీవితాల్లో పరిశుద్ధాత్మ చేస్తున్న కార్యం చేత మనము రక్షింపబడుతున్నాము.
భవిష్యత్తులో
ఆ తరువాత, చివరగా, మన రక్షణ సంపూర్ణం చేయబడు భవిష్యత్తు ఉంది. 1 పేతురు 1:5 లో పేతురు ఇలా చెబుతున్నాడు, ‘‘కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా నున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి యున్నది.’’ ఈ ప్రకారంగా, భవిష్యత్ రక్షణ గురించిన ఒక కోణం ఏమిటంటే, దేవుని కడపటి ఉగ్రత నుండి తప్పించబడి కాపాడబడుట. రోమా 5:9 – ‘‘కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షింపబడుదుము.’’ ఇది భవిష్యత్తులో జరుగనైయుంది.
మరొక కోణం ఏమిటంటే, మనం సంపూర్ణముగా మహిమపరచబడుట. ‘‘ఎవరిని నీతిమంతులనుగా తీర్చెనో వారిని మహిమపరచెను’’ (రోమా 8:30). వాస్తవానికి, ఇది పాపము లేని మహిమలోనికి సంపూర్ణమైన మరియు అంతిమమైన శారీరక పునరుత్థానము వలె మంచిదైన సంగతి. ఇది ఇప్పుడే జరుగలేదు, ఇక ముందు జరుగబోతుంది.
ఉద్రిక్తతమయమైన జీవితం
ఎరిక్ అడుగుతున్న ప్రశ్నలోని విషయమేమంటే, మనము నిర్ణయాత్మకంగా నీతిమంతులముగా తీర్చబడి తిరిగి జన్మించుటడానికి (అనగా, ఒకని క్రైస్తవ జీవితం మొదలైప్పుడు) పాపరహితులముగా మహిమపరచబడడానికి (ఈ యుగాంతమందు) మధ్య, పరిశుద్ధపరచబడుతున్న ప్రస్తుత జీవితం పాపము లేకుండా పరిపూర్ణమైనదై లేదు, గాని పాపమునకు విరోధంగా పరిశుద్ధాత్మ శక్తితో కొనసాగుతున్న పోరాటమై యున్నది. దీనికి సంబంధించిన దేవుని కారణాలు దేవుని యొద్ద ఉన్నాయి. నా జీవితకాలమంతటిలో నేను ఆశ్చర్యముతో ఆలోచిస్తున్న విషయాల్లో ఇదొకటి. మనము ఎన్నటికినీ మరలా పాపము చేయకుండా, క్రీస్తును స్వరక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన తక్షణమే దేవుడు మనల్ని ఎందుకు సంపూర్ణంగా పరిపూర్ణులుగా చేయడో నాకు తెలియడం లేదు. కారణాలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన దీనిని పున:రుత్థానమందు చేయబోతున్నాడు – అప్పుడు ఎన్నటికినీ మనం పాపము చేయము. అయితే ఇదే పని ఆయన ఇప్పుడెందుకు చేయడంలేదు? ఆయన అలా చేయడు. ఎందుకని? ఆత్మ ద్వారా, దేవుని నీతిమంతులైన పిల్లలుగా పాపముతో పోరాడుటకు, తన వాగ్దానములలో విశ్వాసము కలుగజేసి, బలపరచుట ద్వారా మనలను రక్షించడానికి ఆయన ఎన్నుకున్నాడు.
‘‘పరిశుద్ధపరచబడుతున్న ప్రస్తుత జీవితం పాపము లేకుండా పరిపూర్ణమైనదై యుండుటలేదు, గాని పాపమునకు విరోధముగా పరిశుద్ధాత్మ శక్తితో కొనసాగుతున్న పోరాటమై యుంటున్నది.’’
బహుశా దేవుడు ఈ విధంగా చేయడానికి ఒక కారణం, మన జీవితాల్లో ఎదురయ్యే, పాపముతో కూడిన శోధనను (భయపడాలనే శోధన వంటి దానిని) జయించిన ప్రతిసారీ, దేవుని వాగ్దానాలపై నమ్మకముంచుతూ, పాపాన్ని చంపేసిన ప్రతిసారి, పాపం మనకు చేయగల ఏ వాగ్దానం కంటే కూడా యేసు చాలా విలువైనవాడని అపవాదికీ మరియు లోకానికీ, మన స్వంత మనస్సాక్షిని చూపించాలనేది అయ్యుంటుంది. దేవుడు ఈ లోకంలో చేయాలని కోరుతున్నది కూడ ఇదే : అదేంటంటే, క్రీస్తు మహిమగలవాడై యున్నాడని బాహాటంగా ప్రదర్శింపబడాలి. ఆయన అన్నిటికంటె ఎక్కువగా ఆయనే కోరదగినవాడై యున్నాడు.
కాబట్టి, నేను ఎరిక్‌కు చివరగా చెప్పదలచినదేమంటే, ఔను, దేవుడు నీకు శక్తిని, ప్రేమను, ఇంద్రియనిగ్రహముగల ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు. అలాగని, నీవు భయపడే శోధన ఎదుర్కోవు అని అర్థం కాదు. రేపు చేయాల్సిన ఐదు విషయాల గూర్చి తెలియని ఆందోళనతో కూడిన ఆలోచనలతో, నేనీమధ్య మేల్కొన్నట్టు, నీవు మధ్య రాత్రిలో అకస్మాత్తుగా మేల్కొనవని కూడా అర్థం కాదు. గాని, నీవు ఈ భయంతో, భయాందోళనతో పోరాడడానికి దేవుడు నీకు వనరులను ఇచ్చాడనేదే దీని భావం.
ఆయన నిన్ను నీతిమంతునిగా తీర్చాడు: నీవు క్షమింపబడ్డావు, అంగీకరింపబడ్డావు, ప్రేమింపబడ్డావు. ఆయన నిన్ను తిరిగి జన్మింపజేశాడు కాబట్టి నీవొక నూతన సృష్టివై యున్నావు, క్రీస్తునందు ఒక నూతన వ్యక్తివై ఉన్నావు, దేవుని బిడ్డవై యున్నావు. నిన్నుపరిశుద్ధపరచు ఆత్మను ఆయన నీకనుగ్రహించి యున్నాడు. ‘‘నేను నిన్ను ఎన్నడును ఎడబాయను, ఎరిక్. నేను నిన్ను ఎన్నడును విడువను’ అని హెబ్రీ 13:5-6 వచనాల్లోగల వాగ్దానాలను ఆయన నీకిచ్చాడు. అందువల్లే, ‘ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను., నరమాత్రులు నాకేమి చేయగలరు?’’ అని మనం ధైర్యంగా చెప్పగలము. మరియు నీవు మహిమలో ప్రవేశిస్తావనే వాగ్దానము కూడ ఆయన నీకిచ్చాడు. కాబట్టి ‘‘మంచి పోరాటము పోరాడితిని. నా పరుగు కడముట్టించితిని. నా విశ్వాసమును కాపాడుకొంటినని’’ నీ జీవితాంతమందు నీవు పౌలుతో కలిసి నీవు చెప్పగలుగునట్టు పోరాడుతూనే ఉండు (2 తిమోతి 4:7).