రండి, మనం గొర్రెపిల్లను ఆరాధిద్దాం!
“ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా..” (ప్రకటన 5:4)
మీ ప్రార్థనలు పరలోకపు సువాసనగా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ప్రకటన 5వ అధ్యాయాన్ని చదివినప్పుడు, పరలోకంలో మన జీవితం ఎలా ఉంటుందనడానికి అక్కడొక మచ్చుతునక ఉంది.
ప్రకటన 5వ అధ్యాయంలో సర్వశక్తిమంతుడైన దేవుడు తన చేతిలో గ్రంథాన్ని పట్టుకొని సింహాసనం మీద కూర్చున్నట్లుగా మనం చూస్తాం. ఆ గ్రంథానికి ఏడు ముద్రలున్నాయి. దాన్ని తెరచుటకు ముందుగా ఆ ముద్రలన్నిటిని విప్పాల్సి ఉంటుంది.
గ్రంథాన్ని తెరచుట అనేది చరిత్రకు సంబంధించిన చివరి రోజులను మరియు ఆ ఏడు ముద్రలను విప్పుట ఆ చివరి రోజులను సమీపిస్తున్న కొలది వాటి ప్రకారం జీవించాలన్న విషయాలను గురించి చెప్తుందని నేను భావిస్తున్నాను.
మొట్టమొదటిగా, ఆ గ్రంథమును విప్పుటకు ఏ ఒక్కరు యోగ్యులు కాదని చూసినప్పుడు యోహాను ఏడ్చాడు (ప్రకటన 5:4). అయితే, ఆ తర్వాత పరలోకమందున్న పెద్దలలో ఒకడు, “ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెను” (ప్రకటన 5:5) అని చెప్పాడు.
యేసు సిలువలో మరణించుట ద్వారా, మిగిలిన విమోచనా చరిత్రను తెరవడానికి మరియు తన ప్రజలను విమోచనా చరిత్రలో విజయవంతంగా నడిపించడానికి ఆయన హక్కును సంపాదించుకున్నాడు.
ఆ తర్వాత వచనంలో, సింహం గొర్రెపిల్లగా కనిపించింది, “…వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని” (ప్రకటన 5:6). సిలువలో యేసు విజయానికి సంబంధించిన అందమైన చిత్రం ఇది కాదా? ఆ గొర్రెపిల్ల పడుకొని లేదు గానీ వధించబడి నిల్చొనియుంది!
సింహం శత్రువును మింగివేసినట్లుగా మనం చూడొచ్చు; కానీ అది ఎలా జరిగిందంటే గొర్రెపిల్లను వధించినట్లుగా, శత్రువు ఆయనను వధించడానికి అనుమతించుట ద్వారా, ఆయన విజయం సాధించాడు.
అందుచేత, ఇప్పుడు గొర్రెపిల్ల దేవుని చేతిలోని విమోచనాత్మక చరిత్రను కలిగిన గ్రంథాన్ని తీసుకొని, దానిని విప్పడానికి అర్హుడు.
పరలోకంలో ఉండే ఇరవై నాలుగు మంది పెద్దలు (దేవుని ఆరాధించే గుంపు) ఆరాధించడానికి గొర్రెపిల్ల ఎదుట సాగిలపడడమనేది ఘనమైన చర్య.
ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలంటే ఏమిటో మీకు తెలుసా? “ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు” అని ప్రకటన 5:8వ వచనం చెప్తోంది. ఈ మాటకు గొర్రెపిల్ల ఎదుటను, దేవుని సింహాసనం ఎదుటను మన ప్రార్థనలు పరిమళ సువాసనగా, పరలోకపు సువాసనగా ఉన్నాయన్న అర్థాన్ని ఇవ్వట్లేదా?
నేను చేసే ప్రార్థనలన్నీ పరలోకంలో ఒక దగ్గర సమకూర్చబడి పరలోకపు ఆరాధనా విధానాలలో పదేపదే క్రీస్తుకు సమర్పించబడుతున్నాయని నేను ఆలోచించినప్పుడు మరింత తరచుగా, మరింత బలంగా ప్రార్థించడానికి నేను ఎంతగానో ప్రోత్సహించబడ్డాను.
రండి, మనమందరం ఈ భూమి మీద మన ప్రార్థనలతో క్రీస్తును ఆరాధన చేద్దాం, గౌరవిద్దాం, మహిమపరుద్దాం. అంతే కాకుండా పరలోకంలో ఉన్నటువంటి ప్రభువుని ఆరాధించే గుంపు మన ప్రార్థనలను పరిమళ సువాసన ధూపంగా, వధింపబడిన గొర్రెపిల్ల ఎదుట అర్పిస్తారు గనుక దాన్ని బట్టి మరి ఎక్కువగా ఆనందపడదాం.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web