పేద ప్రజల మధ్య పరిచర్యలో సిద్ధాంతం ముఖ్యమా?

పేద ప్రజల మధ్య పరిచర్యలో సిద్ధాంతం ముఖ్యమా?

షేర్ చెయ్యండి:

కొన్ని సంవత్సరాల క్రితం నేను నా కళాశాల స్నేహితున్ని చాలా కాలం తరువాత కలుసుకున్నాను. కాబట్టి ఇద్దరం కలిసి కాఫీ త్రాగుతూ ముచ్చటించుకుంటూ ఉన్నాం. పనిలో పనిగా, పరిచర్యను గూర్చి విద్యార్థులంగా ఒకప్పుడున్న దృక్పథం ఇప్పుడు ఎంతో మారిపోయిందోనని అతడు నాకు వివరిస్తూవుంటే వింటూ ఉన్నాను. ఇప్పుడతను వేర్వేరు కళాశాల విద్యార్థుల మధ్య పరిచర్యలకు నాయకత్వం వహిస్తున్నాడు. మేమిద్దరం పదిహేను సంవత్సరాల క్రితం రక్షణ పొందిన కళాశాల విద్యార్థులు ‘‘సిలువ కేంద్రీకృతమైనవారుగా’’ ఉండాలి అని అనుకున్నాం. కానీ ఇప్పుడు తన ఆలోచనల్లో మార్పు వచ్చినట్టు నేను గమనించాను. తాను మాట్లాడుతూ, ‘‘చూడు మైక్‌, మేము సిద్ధాంతపరంగా  ఉండకూడదని ఇష్టపడతాము… సిద్ధాంతపరంగా. ఖచ్చితంగా చెప్పాలంటే, సిలువ ముఖ్యమే గాని, మేము ప్రాయశ్చిత్తం గూర్చిన పదహారవ శతాబ్దంనాటి వాదాల్లో చిక్కుకొనిపోకూడదని ఆశిస్తాం. యేసు ద్వారా లభించే, అనగా ఆయన అనుగ్రహించే రక్షణను  వివరించడానికి ఆయన ఆవగింజ వంటి అనేక ఉపమానాలను ఉపయోగించాడు, కదా. బీదలకు సువార్త మరియు చెరలో నున్న వారికి విడుదలను ప్రకటించుట ద్వారా దేవుని రాజ్యాన్ని వ్యాపింపజేయాలని మేం ఆశిస్తాం. చేయబడవలసిన పని ఎంతో ఉంది, గనుక మేము వేదాంతశాస్త్రం యొక్క లోతుల్లోనే చిక్కుకొనిపోయి ఉండలేం’’ అన్నాడు.

అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ. 2:2లో వారి మధ్య దేవుని రాజ్యము ఆవగింజవలె విస్తరించుట తప్ప, మరి దేనినైనను ఎరుగకుండునని అని అనలేదు… కానీ “సిలువవేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనినైనను ఎరుగకుండునని ప్రకటించాడు” కదా. నా స్నేహితుని ప్రాధాన్యతలతో పౌలు ఏకీభవిస్తాడో లేదో అనే విషయాన్ని కొంతసేపు ప్రక్కనబెట్టినా, పౌలు చెప్పిన ముఖ్య విషయం సంగతేంటి? ఆయన దృక్పథం సరియైనదే కదా!  

ఒక ఉదాహరణ తీసుకుందాము. చాలా దూరంలో ఉన్న ఒక పట్టణంలోని ప్రజలకు పొంచియున్న నాశనం గురించి హెచ్చరించాలని మీరు ఓడలో ప్రయాణమయ్యారు. మీరక్కడికి సమయానికి చేరుకోనట్లయితే, వారంతా నాశనమవుతారు. గనుక మీరు పయనిస్తున్న ఓడ సాధ్యమైనంత వేగంగా వెళ్లాలని మీరాశిస్తారని, వేరుగా చెప్పనక్కర్లేదు. మీకు ఆటంకంగా ఉండే బరువైన సామానును తీసికొని వెళ్లకుండా జాగ్రత్తపడతారు. ఆ ఓడలోని వసతులు శుభ్రంగా ఉన్నాయా లేవా అనే విషయం గూర్చి చింతించుటకు మీ సమయాన్ని వృథా చేయరు. చేయాల్సిన పని అత్యవరసమైంది గనుక తక్కువ వనరులతో ఎక్కువ పని చేసే విధానంలో పనులు చేయాల్సి వుంటుంది.

క్రైస్తవ సువార్త ప్రచారోద్యమమం అత్యవసరమై ఉంది గనుక మనం వేదాంతశాస్త్ర సంబంధమైన పట్టింపులను పక్కన పెట్టి సిద్ధాంతపరమైన విషయాలను తొలగించాల్సి ఉంటుందని నా స్నేహితునివంటివారు వాదిస్తుంటారు. ఇలాంటి విషయాల వలన కలిసికట్టుగా పనిచేయాల్సినవారి మధ్య గొడవలు మరియు అంతర్‌కలహాలు తలెత్తుతుంటాయి. ప్రజలు ఇబ్బందుల పాలవతుంటే, బీదలు అణగద్రొక్కబడుతుంటే, చెరలోనున్నవారు బందీలుగానే బంధింపబడిఉంటే, పుస్తకాలు వ్రాయడం, సమావేశాలు జరిపించడం, అలాగే కొన్ని మాటల అర్థాల గూర్చి వాదించాల్సిన అవసరమేముంది?

నిజమే, ఇందులో కొంచెం సత్యముంది. మానవుడు పతనమైన తరువాతే దేవుడు వారిని రక్షించుట గురించి ఆలోచించాడని క్రైస్తవులు వివిధ సిద్ధాంతపరమైన విషయాల్లో ఇంటర్నెట్లో గొడవలు పడటంలో తక్కువ సమయం గడుపుచు, వారి పొరుగువారికి యేసు గూర్చి తెలియజెప్పడములో ఎక్కువ సమయం గడిపినట్లయితే, సంఘం యింకా మెరుగైన స్థితిలో ఉంటుంది. అలాగని, బీదలకు మరియు అవసరములో ఉన్నవారికి సువార్త చెప్పడానికి ఆశపడే సంఘాలు వేదాంతశాస్త్రం గూర్చిన వారి ఒప్పింపులను మరియు చర్చలను పట్టించుకోవద్దని అర్థం కాదు.

సిద్ధాంతం ఓడలోని సరుకువంటిది కాదు. అది ఓడ యొక్క ప్రధాన భాగము మరియు తెరచాప కొయ్య లాటింది. సంఘం యొక్క సిద్ధాంతము, దాని సాక్ష్యం యొక్క స్వభావమును మరియు నాణ్యతను నిర్ధారిస్తుంది. ఆ సంఘ వేదాంతశాస్త్రం, దాని లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నించే పద్ధతులను రూపొందిస్తుంది.

గనుక మనముందున్న ప్రశ్న ఏమిటంటే: విశ్వాసులను శిష్యులనుగా చేయడానికి సంఘాలకు సిద్ధాంతం తెలిసియుండాలా, దానిని బోధించాల్సిన అవసరముందా? మనం ఈ రెండు లక్ష్యాలను కేవలం క్రీస్తు ప్రేమను కనుపరుస్తూ, సేవాచర్యలు చేపట్టుట ద్వారా మన సమాజాలను నూతనపర్చడానికి ప్రయాసపడుతూ సాధించగలమా? ఇది ఖచ్చితంగా అసంభవమనిపిస్తుంది. దీనికి బదులుగా, సంఘజీవితంలోని ప్రతి విషయానికి వేదాంతశాస్త్రం అవసరమైయున్నదని మనం క్రొత్త నిబంధనలో చూస్తున్నాము. ఇక్కడ రెండు విషయాల గూర్చి ఆలోచిద్దాం: రక్షణ మరియు పరిశుద్ధపరచబడుట.

రక్షింపబడుటకు సిద్ధాంతం అవసరం:

సరైన సిద్ధాంత సత్యాలు విశ్వాసుల బుర్ర లోపల ఉన్నాయని నిర్ధారించుకోడానికి దేవుడు తీర్పు దినాన వారి బుర్రలను తెరిచి చూడడని సిద్ధాంతపరమైన ఆవశ్యకతపై విమర్శకులు కొన్నిసార్లు చులకనగా వ్యాఖ్యానిస్తారు. దేవుడు అలా చేయడు గాని ఆయన వారిని, ‘‘మీరు నన్ను నమ్ముతున్నారా? నన్ను గూర్చి కల్పించబడిన కథలు కాదు, గాని నిజముగా వాక్యంలో ఉన్న వాస్తవమైన నన్ను మీరు నమ్ముతున్నారా?’’ అని అడుగుతాడు. అనగా, మనం కొన్ని నిర్దిష్టమైన సత్యాలను నమ్ముతున్నామో లేదో అని తెలిసికోడానికి దేవుడు అత్యంత ఆసక్తిపరుడై యున్నాడని మరొక మాటలో చెప్పొచ్చు, ఎందుకంటె దేవుని దృష్టిలో సిద్ధాంతపరమైన సత్యమంటే అది వ్యక్తిగత సత్యమై ఉంది. క్రీస్తు అనుగ్రహించే రక్షణను పొందడానికి, ఒకడు వాస్తవంగా నిజమైన దేవుని గురించి ఒప్పింపబడిన సత్యాన్ని నమ్ముతూ, ఈ సత్యానికి సంబంధించిన ఆయన యందు పూర్తిగా ఆధారపడుతూ ఆయన్ని నమ్మాలి. అతని పూర్ణ హృదయంతో దేవుని వైపు మరలి ఆయన యందు నమ్మకముంచనివాడు రక్షింపబడజాలడు (రోమా 10:13-17). రక్షణ కొరకు సిద్ధాంతం అవసరమైయున్నది!

ఈ కారణాన్నిబట్టే, సువర్తమానమును ప్రకటిస్తూ శిష్యులనుగా చేయుటకు బయల్దేరిన అపొస్తలులు, సిద్ధాంతములతో కూడిన సందేశాలను బోధింపకుండా ఉండలేదు. బైబిలులోని అపొస్తలుల కార్యముల పుస్తకమును చదివినట్లయితే వారు మరియు ఇతరులు అవిశ్వాసులైన జనాలకు బోధించిన సిద్ధాంతములతో కూడిన బోధల వివరాలు దొరకుతాయి: 

–  పరిశుద్ధాత్మ (అపొ. 2:14`21)  

–  దేవుని సార్వభౌమమైన ముందాలోచన (అపొ 2:23; 17:26) 

–  క్రీస్తు పున:రుత్థానము (అపొ 2:24-32; 3:15) 

–  క్రీస్తు సిలువవేయబడుట (అపొ 8:32-35; 13:28-29) 

–  పాత నిబంధన యేసును సూచిస్తున్న తీరు (అపొ 3:22-24; 7:2-53; 28:23) 

–  రానున్న తీర్పు వాస్తవమైనది (అపొ 10:42; 17:31; 24:25) 

–  క్రీస్తు యొక్క ప్రత్యేకత, అసమానత (అపొ 4:12; 19:26) 

–  సృష్టికర్తయైన దేవుడు (అపొ 14:15-17; 17:24) 

– దేవుని స్వయం సమృద్ధి  (అపొ 17:24-25) 

–  దేవుని రాజ్యము (అపొ 19:8; 28:23) 

అవిశ్వాసులు మారుమనస్సు పొంది క్రీస్తునందు విశ్వాసముంచడానికి వారు దేవుని గూర్చిన సత్యాలు మరియు క్రీస్తు ద్వారా ఆయన అనుగ్రహించే రక్షణను గూర్చిన కొన్ని నిశ్చయమైన సత్యములు అర్థంచేసుకోవలసి యుంటుందనే విషయాన్ని అపొస్తలులు గ్రహించారు.

వాస్తవానికి, నిరుత్సాహంతోను నిరాశతోను నిండుకొనిన పౌలుకు స్వప్నములో కనబడిన యేసు, ‘‘ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగుననే రోమాలో కూడ సాక్ష్యమియ్యవలసి యున్నదని’’ చెప్పెను (అపొ 23:11). పౌలు యూదులకైతేనేమి అన్యజనుల మధ్యనైతేనేమి చేసిన సువార్త ప్రకటన పరిచర్య అంతయు ఆయనను గూర్చిన వాస్తవములను సాక్ష్యమిచ్చుచుండినట్టు ఉండిందని యేసు సంక్షిప్తంగా చెప్పుతున్నాడు. పౌలు అదే చేశాడు; అతడు ఒక పట్టణము తరువాత మరొక పట్టణానికి వెళ్తూ యేసును గూర్చి మరియు ఆయన చేసిన కార్యముల గూర్చిన వాస్తవములను తెలియజేస్తూ వచ్చాడు.

సువార్త ప్రకటించే సంఘం, పౌలు చేసినట్టే సాక్ష్యమియ్యవలసి యుండగా, మన సాక్ష్యం ప్రాథమికంగా అవసరములో ఉన్నవారికి ప్రేమ మరియు కనికరముగల సహాయము నందించునదై యుండాలని మనం చెప్పడముతో రాజీపడటం కష్టంగా ఉంటుంది. వాస్తవ పరిస్థితి ఏంటంటే, క్రైస్తవులు ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, బట్టలులేనివారికి బట్టలివ్వడం వంటి పరోపకార పనులు చేయుచుండుటను లోకం యింకా వెయ్యేళ్ల కాలం గమనించినప్పటికీ యేసు వారి పాపముల కొరకు చనిపోయాడని, మరల లేచాడనే విశ్వాసంలోనికి ప్రజలు ఎన్నటికి రాలేరు. మనం నోరు తెరచి సువార్తను ప్రజలకు చెప్పనట్లయితే, ఒక్కరు కూడ రక్షింపబడరు.

పరిశుద్ధతలో ఎదుగుటకు సిద్ధాంతం అవసరం:

ఒకడు క్రైస్తవుడగుటకు ప్రాథమిక సిద్ధాంతం ఎంతో కొంత అవసరమవుతుంది, గాని క్రైస్తవుడుగా ఎదుగుటకు అధిక శాతం ‘‘సిద్ధాంతం’’ అనవసరమని నమ్మడానికి కొందరు శోధింపబడవచ్చు. దానికి బదులుగా, మనం మన సమాజాల్లో యేసువలె జీవించుటపై శ్రద్ధ పెట్టాలి అని అనుకునే వారు కూడా ఉన్నారు.

అయితే బైబిలు గ్రంథకర్తలు ఈ దృక్పథాన్ని నమ్మినట్టు మనం చూడము. తరచుగా బైబిలు దేవుని ప్రజలకు సరైన క్రియలు, సరైన ప్రవర్తన మరియు సరైన వైఖరి కలిగి ఉండాలంటే సరైన సిద్ధాంతంపై బలంగా ఆధారపడి ఉండాలనే విషయం వాక్యంలో చూస్తాం.

ఈ క్రింది ఉదాహరణలు గమనించండి: 

–  పది ఆజ్ఞలు. సకల విషయాలకు మూలాధారం ఇవే – ‘ఎలా జీవించాలి’ అని తెలియజెప్పే ప్రాముఖ్యమైన జాబితా. అయినప్పటికిని, దైవభక్తిగల జీవితానికి సంబంధించిన ఈ జాబితాలో ముందు వచ్చేది ఏంటి? సిద్ధాంతం: ‘‘నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని’’ (నిర్గమ 20:2). ఇశ్రాయేలీయులకు ఇతర దేవుళ్లు ఎందుకుండకూడదు? ఎందుకంటె, వారిని బానిసత్వంలో నుండి విడిపించినవాడు, దేవుడే.

–  నీ శత్రువులను ప్రేమించుము. ఈ ఆజ్ఞ, సువార్త ద్వారా మనలో కలిగిన మార్పు వలన దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనే ప్రేరణ పొందేట్టు చేస్తుంది. గాని ఈ విధంగా క్రియారూపం దాల్చే ప్రేమకు యేసు సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకుంటున్నాడు: ‘‘మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు’’ (మత్తయి 5:44-45). మనం మన శత్రువులను ఎందుకు ప్రేమించాలి? ఎందుకంటె, మన తండ్రియైన దేవుడు, శత్రువులను ప్రేమించే దేవుడై యున్నాడు!

–  పరిశుద్ధులై యుండుడి. క్రైస్తవులు పరిశుద్ధంగా ఎందుకు ఉండాలి? ఇంకో సారి ఒక అపొస్తలుడు ఒక సిద్ధాంతాన్ని మనముందుంచుతున్నాడు: ‘‘కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి’’ (1 పేతురు 1:14-16). దేవుని పరిశుద్ధతనుబట్టి ఒకప్పుడు మనలను ఏలిన ఆశలను అనుసరించి ప్రవర్తించము.

–  చివరగా, పౌలు పత్రికలు. పౌలు పత్రికల నిర్మాణ క్రమం, ఈ ఆజ్ఞలకు సత్యములను ఆధారంగా చేసుకుంటుంది. తన పత్రికలు చదివేవారు, తమ శరీరాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలనీ (రోమా 12:1), నవీన స్వభావము ధరించుకోవాలనీ (ఎఫెసీ. 4:24), క్రీస్తునందుండి నడుచుకొనవలెననీ (కొలస్స. 2:6-7) కోరుతున్నాడు. గాని ఇలాంటి ఆజ్ఞలు సిద్ధాంతాల గూర్చి లోతుగా చర్చించిన తరువాతే పుట్టుకొస్తాయి. పౌలు ఈ సంఘాలకు నీతిమంతులుగా తీర్చబడుట మరియు మహిమపర్చబడుట, చిహ్నాత్మక శాస్త్రము (టైపాలజి) మరియు క్రీస్తు ప్రధాన శిరస్సు (రోమా 5:12-17; 8:30), ఎన్నిక మరియు ముందుగా నిర్ణయింపబడుట (ఎఫెసీ 1:4-6), మానవుని సంపూర్ణ భ్రష్టత్వము (ఎఫెసీ 2:1-3), మరియు క్రీస్తు శాస్త్రము (కొలస్స. 1:15-20) వంటి విషయాలు ఉపదేశిస్తున్నాడు.

అవసరతలో ఉన్నవారిని త్యాగసహితంగా ఆదుకొనుటతో పాటు క్రైస్తవ విధేయత, దేవుని గుణలక్షణాలు  మరియు పనులతో లంగరువేసినట్టుగా కదలకుండా కట్టివేయబడినట్లుండాలి మరియు వాటి చేత ప్రేరణ కలిగించబడాలి. లంగరు తొలగిస్తే, నీవున్న చోటే కొద్దిసేపుండవచ్చును, కానీ గాలి మరియు అలల చేత దూరంగా నెట్టివేయబడతావు. ఇలాంటి త్యాగంతో కూడిన కార్యాలు త్వరగా ఆగిపోతాయి.

దేవుని గురించి మనకు ఎంత ఎక్కువగా తెలిసియుంటే, మనం దేవునికి అంత ఎక్కువగా విధేయులమవుతాము. ఒక సంఘంలో లేదా ఒక మిషన్‌ హాలులో ఎంతో మంది ప్రార్థన చేశారు గాని వారికి నిజమైన, సిద్ధాంతపరమైన విశ్వాసంతో కూడిన బోధలు చేయబడనందున వారు మిషన్స్ కోసం ఎన్నడూ బయటికి వెళ్లలేదు? దేవుని లక్షణాలు మరియు వారి జీవితాలకు వర్తించే సత్యాల గురించి ఒకసారి ఆలోచించాలని వారు ఎన్నడునూ సవాలు చేయబడనందున స్వార్థం మరియు సోమరితనం మరియు పాపపు జీవితాల్లో ఎంత మంది క్రైస్తవులు చిక్కుకొనిపోలేదు?

కానీ, ఒక్కనిమిషమాగండి …

ఎప్పటికప్పుడు నాకొక అభ్యంతరం వినబడుతూ ఉంటుంది. అదేంటంటే పేద సమాజాల్లోని వారికి సామాన్యంగా మంచి విద్యాభ్యాసం దొరకడం లేదు. అనగా, ఈ సమాజాల్లోని ప్రజలు సిద్ధాంతాలను నేర్చుకోడానికి అవసరమైన సాధనాలు వారికి లేవని అర్థమవుతుంది. ప్రజలు చదువుకున్న  వాతావరణంలో నివసించనట్లయితే, లేదా చాలా మంది నిరక్షరాస్యులైతే, దేవశాస్త్ర సంబంధమైన కష్టమైన వాక్య సత్యాలు నీవు వారికి నేర్పించలేవు. నేర్పించడానికి నీవు ప్రయత్నించినట్లయితే, అది వారికి అర్థం కాదు గనుక వారు తమ ఆసక్తిని కోల్పోతారు అనేదే ఆ అభ్యంతరం.

నిజం చెప్పాలంటే, నామట్టుకైతే, ఇలాంటి వైఖరులు ఒకడు తన సొంతగా నిర్ణయం తీసుకోనివ్వకుండా నీవే అతని కొరకు నిర్ణయం తీసుకొంటూ ఎదుటి వ్యక్తిని పనికిమాలిన వారిగా చేస్తున్నట్టు ఉంటుంది. పేదవారు, నిజంగా పేదవారే గాని వారు బుద్ధిహీనులు కారు. దేవుని లక్షణాలని మరియు మార్గాలను ఇతరులు అర్థం చేసుకోగలిగినట్టే వారు కూడ అర్థం చేసుకోగలరు. అపొస్తలుడైన పౌలు తన పత్రికలను బైబిలు కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్కి వ్రాయలేదు. పౌలు పాఠకులు సామాన్యంగా ధనవంతులు, పలుకుబడిగలవారు, లేదా బాగా చదువుకున్నవారు కారు. ఐగుప్తు దేశాన్ని వదిలి వెళ్తున్న ఇశ్రాయేలీయులకు వేదాంతశాస్త్రంలో డిగ్రీలేవీ లేవు. గాని ఆయన వారికి ఆయనను గూర్చిన లోతైన మరియు కష్టతరమైన సకల విధాలైన విషయాలు తెలియజెప్పడానికి దేవుడు ఏమాత్రం సంకోచించలేదు.

బీదవారు లోతైన సత్యాలను సైతం అర్థంచేసుకోగలరు. ఈ విషయం నిజమని నేను అమెరికాలో సేవచేస్తున్న సంఘంలో గమనించాను మరియు ఎడిన్బర్గ్లోని పాస్టర్‌ మెజ్‌ మెక్‌కన్నెల్‌ సేవచేస్తున్న మరొక సంఘంలో కూడ చూశాను.

రమేష్ గూర్చి ఒకసారి ఆలోచిద్దాం. అతనికి 40-44 సంవత్సరాలుంటాయి. అతడు క్రీస్తునంగీకరించక ముందు ఉన్నత పాఠశాల విద్యాభ్యాసాన్నైనా పూర్తి చేయలేదు, ఎన్నడూ ఒక పుస్తకం చదవలేదు. సంఘమంటే ఏంటో, క్రైస్తవ్యమంటే ఏంటో అతనికి అంతకు ముందు తెలియదు. అతనికి వార్తాపత్రిక చదవగలిగే జ్ఞానముంది అంతే. రమేష్, పాస్టర్‌ మెజ్‌గారి సంఘానికి వచ్చినప్పుడు, ఆ బోధలు అతనికి ఎమీ అర్థం కావడం లేదని అన్నాడు. అతని సొంత మాటలు ఇలా ఉన్నాయి: 

నేను రక్షింపబడక ముందు, బైబిలులో చెప్పబడిన విషయాలు నాకేమీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడెలా ఉందంటే, అది నా పేరు పెట్టి నన్ను పిలుస్తూ నన్ను తన యొద్దకు ఆకర్షించుకుంటుంది. ఇదంతా పరిశుద్ధాత్మ పని అని నేననుకుంటాను. జీవితానికి సంబంధించిన ప్రశ్నల గూర్చి నేనిప్పుడు ఇదివరకెన్నడునూ ఆలోచించనంత లోతుగా ఆలోచిస్తున్నాను. ఎప్పుడూ బైబిలు చదవాలని ఆశిస్తుంటాను. వేదాంత శాస్త్రమునకు సంబంధించిన పెద్ద పెద్ద మాటలు నాకు అర్థం కాకపోయినప్పటికినీ, వాటిని ఎలాగైనా సరే నేర్చుకోవలసిందేనని నేను నిశ్చయించుకున్నాను. నేను దేవున్ని యింకా ఎక్కువగా ప్రేమించాలని ఆశపడుతున్నాను. ఆయనను యింకా ఎక్కువగా తెలిసికోవాలని ఆశపడుతున్నాను. నా చుట్టూ ఉన్న మంచివారంతా నన్ను ఏమాత్రమును తెలివితక్కువవానిగా లేదా పట్టించుకోదగనివానిగా ఎంచక నాకు అన్ని విషయాలను చక్కగా వివరించడం నాకు ఎంతో సహాయకరంగా ఉండింది. బడిలోనైతే, నాకేదైనా కష్టంగా అనిపిస్తే, దాన్ని వదిలిపెట్టేసేవాన్ని. ఇప్పుడైతే, ఈ విషయాలను నేర్చుకొనడం నా తలకెక్కకపోయినప్పటికిని, నేను పట్టుదలగలవాడనై నా పట్ల నేను సహనముతో మెలగాలని నేర్చుకున్నాను.

రమేష్ క్రీస్తునంగీకరించక మునుపు, పూర్తికాల ఉద్యోగమేది కూడ ఎంతో కాలం చేయలేకపోయాడు. మాదకద్రవ్యాలకు బానిసయై, అస్తవ్యస్తమైన జీవితం జీవించుచుండెను. రెండు నిమిషాలైనా ఊరకనే కూర్చుండలేకపోయేవాడని అతడు చెప్తున్నాడు. ఇప్పుడైతే 40 నిమిషాలైనాగాని, ఎలాంటి ఇబ్బంది లేకుండా సందేశాన్ని ప్రశాంతంగా వింటున్నాడు. తరుణం దొరికితే చాలు, బైబిలు అధ్యయనంలో పాల్గొనడానికి పరుగెత్తుతుంటాడు.

ఒకరు బాగా చదవడం, రాయడం రానంత మాత్రాన లేదా బాగా చదువుకోనంత మాత్రాన మనం వారిని తక్కువగా అంచానవేస్తూ కించపరచకూడదు. నిజమే, పూర్తిగా నిరక్షరాస్యులైనవారికి లేదా మానసిక మాంద్యంగలవారికి నేర్పించాలంటే అనుభవపూర్వకమైన బోధన పద్ధతులను ఉపయోగించాల్సిన అవసరం వస్తుంది. గాని మంచి ఉపాధ్యాయులందరు వారు చెప్పే పాఠాలను వినే వారి స్థాయికి తగినట్టు బోధించడానికి సర్దుబాటు చేసుకుంటారు. మా అనుభవంలో, అవసరములో ఉన్నవారు అర్థంచేసికోడానికి సిద్ధాంతపరమైన ఒక అంశం మరి ఎక్కువ కష్టతరమైనదై యుండినట్టు ఇంత వరకు మేము చూడలేదు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ, సిద్ధాంతాలను స్పష్టంగాను, చక్కగాను నేర్పించినట్లయితే, దేవుని ప్రజలు దానిని యింకా ఎక్కువగా నేర్చుకోవాలని, ఎదగాలని ఆశిస్తారు.

ముగింపు

సిద్ధాంతాన్ని నేర్పించడానికి మరియు నమ్మడానికి నిబద్ధతగలవారమై యున్నప్పుడు, కష్టమైన చోట్ల సువార్తను వ్యాపింపజేయడానికి అది ఆటంకంగా ఉంటుందా? ఇది అరుదుగా జరుగుతుంది. వాస్తవానికి, ఇలాంటి నిబద్ధత, సమర్పణ లేకుండా, సకల జనులను శిష్యులనుగా చేస్తూ వారు లోబడవలెనని నేర్పించాలని ప్రభువైన యేసు సెలవిచ్చిన గొప్ప ఆజ్ఞ నెరవేర్చబడదు. అవసరంలో ఉన్న ఒక గుంపుకి యేసు ప్రేమను చూపించుట మాత్రమే చాలదు. సమాజం నూతనపర్చబడుతూ బాగుచేయబడాలని కష్టపడి పనిచేయడం చాలదు. మనం సువార్త సత్యాలను నోరు తెరచి చెప్పాల్సి ఉంది. లేదంటే మనం మనకు మంచి పేరు తెచ్చుకుంటాము గాని వినేవారిని పాపం మరియు అపరాధ భావంలోనే విడిచిపెట్టినవారమవుతాము.

మెజ్‌ మెక్‌కాన్నెల్‌

మెజ్‌ మెక్‌కాన్నెల్‌

మెజ్ మెక్‌కానెల్ స్కాట్‌లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లోని నిడ్రీ కమ్యూనిటీ చర్చికి సీనియర్ పాస్టర్. అతను 20స్కీమ్స్ స్థాపకుడు, ఇది స్కాట్లాండ్‌లోని కొన్ని పేద వర్గాల మధ్య చర్చిలను స్థాపించడానికి ప్రయత్నిస్తున్న పరిచర్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...