నిజమైన క్రైస్తవ జీవితాన్ని నేను ఎలా గడపగలను?
పాస్టర్ జాన్ గారు, మీరు మీ పుస్తకాలు, ప్రసంగాలు మరియు తరగతులలో ఎ.పి.టి.ఎ.టి అనే సంక్షిప్త పదాన్నిచాలాసార్లు ప్రస్తావించారు. ప్రతిరోజూ క్రైస్తవ జీవితాన్ని ఎలా గడపాలనే ప్రశ్నకు ఆ సంక్షిప్త పదం కేంద్రబిందువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎ.పి.టి.ఎ.టి. గురించి మరియు ఇది ఎందుకు అంత ముఖ్యమైనదో అన్న దాని గురించి మీ వివరణ మా శ్రోతల్లో చాలా మంది బహుశా ఎప్పుడూ వినలేదని నాకు తెలుసు. కాబట్టి దాని గురించి మాకు పరిచయం చేసి అది పరిష్కరించే పెద్ద సమస్యను వివరించగలరని మా విన్నపం.
క్రీస్తులో జీవించడం:
అతిపెద్ద సవాలు ఇదే: యధార్ధముగా నిర్ణయాలు తీసుకునేది, కార్యాలు జరిగించేది, క్రైస్తవ జీవితాన్ని జీవించేది మీరే అయితే మీ నిర్ణయాలలో, మీ పనులలో, మీ జీవితంలో నిజంగా మీకు మార్గనిర్దేశం చేసి కార్యమును జరిగించేది క్రీస్తే లేదా పరిశుద్ధాత్ముడే. క్రైస్తవ జీవితమును ఇలా జీవించడం ఎలా?
“నేనే కష్టపడి పనిచేస్తూ, పూర్తయిన తర్వాత ‘దేవుని కృప నాలో మరియు నా ద్వారా పనిచేసింది‘ అని ఎలా చెప్పగలను?”
క్రైస్తవ జీవితంలో ఇదే ప్రాముఖ్యమైన అంశమని నాకనిపిస్తుంది. తాను అలా జీవించానని పౌలు చెబుతున్నాడు. మనం అలా బతకాలని ఆయన అర్థం. పౌలు 1కొరింథి. 15:10లో ఇలా చెబుతున్నాడు, “అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని.”
ఇప్పుడు నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ “అది నేనెలా చెయ్యగలను?” అని అడగాలి. నేను కష్టపడి పనిచేసి, అది పూర్తయిన తర్వాత “దేవుని కృప నాలో మరియు నా ద్వారా పనిచేసింది” అని ఎలా చెప్పగలను?
ఆత్మ మీద ఆధారపడటం:
పై ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి సంక్షిప్త రూపమైన ఎ.పి.టి.ఎ.టి. ఉద్దేశించబడింది లేదా మరో రకంగా చెప్పాలంటే, ఫిలిప్పీ 2:12-13 “భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీలో కార్య సిద్ధి కలుగజేయువాడు దేవుడే” అనే వచనానికి మీరు ఎలా విధేయులవుతారు?
మన క్రైస్తవ జీవితం గురించి యథార్ధంగా చెప్పగలిగేందుకు మనం తీసుకునే వ్యూహాలు ఏమిటి? మరో రకంగా చెప్పాలంటే, మీది కాని శక్తితో మీరు ఇతరులకు ఎలా సేవ చేస్తారు? 1 పేతురు 4:11 ఇలా చెబుతోంది, “ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను.” అది ఎలా చేస్తారు?
లేదా రోమా 8:13: “మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు.” అలాంటప్పుడు శరీర క్రియలను ఎలా చంపుతారు? (అవును, మీరు శరీర క్రియలను చంపాలి.) పరిశుద్ధాత్మ ద్వారా మీరు చేయగలుగుతారు. దాని అర్థం ఏమిటి? మీరు దీన్ని ఎలా చేస్తారు? దాని గురించే ఇక్కడ నేను మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను. గలతీ పత్రికలో ఈ వాక్యాలను గమనించండి. గలతీ 5:16: “ఆత్మానుసారముగా నడుచుకొనుడి.”
గలతీ 5:18: ” మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల” గలతీ 5:22: “ఆత్మ ఫలము.” గలతీ 5:25: “ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.”
కాబట్టి వీటన్నింటికీ నా సమాధానం ఎ.పి.టి.ఎ.టి. నేను ప్రసంగించడానికి రెండు నిమిషాల ముందు చర్చి హాల్ ముందు వరసలో కూర్చొని వందల సార్లు ఎ.పి.టి.ఎ.టి ని అనుసరించాను. నేను నా హృదయంలో ఎ.పి.టి.ఎ.టి గురించి ఆలోచించాను. ఎందుకంటే నేను ఆ ప్రసంగ వేదిక వెనుక నిలబడినప్పుడు, నేను ఆత్మ ద్వారా బోధించాలనుకున్నాను.
దేవుని శక్తితో బోధించాలనుకున్నాను. “నేను కాదు, నాతో ఉన్న దేవుని కృప” (1 కొరింథీ 15:10) అని నేను చెప్పగలిగే విధంగా బోధించాలనుకున్నాను. నేను లేచి మౌనంగా ఉండాలని కోరుకోలేదు. నేను చేయవలిసింది నేను చేయాలి. అది నా పని. నేను బోధించాలి. నేను బోధించి తీరాలి. అయితే దెయ్యం కూడా బోధించగలదు. పరిశుద్ధాత్మ లేకుండా ప్రజలు బోధించగలరు. కానీ అది క్రైస్తవ జీవితం కాదు.
ఐదు కార్యాలు:
కాబట్టి ఎ.పి.టి.ఎ.టి. లో ప్రతి అక్షరం నేను చేయబోయే కార్యమును సూచిస్తుంది. మరియు మీరు ఏదైనా సవాలును ఎదుర్కోవటానికి ముందు ఒకే ఒక నిమిషంలో దీన్ని చేయవచ్చు.
ఎ – అడ్మిట్. క్రీస్తు లేకుండా ఏమీ చేయలేనని నేను అంగీకరిస్తున్నాను. యోహాను 15:5 ఇలా చెబుతోంది, “ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.”
జాన్ పైపర్, నువ్వు “ఏమీ చేయలేవు.” నేను దానిని అంగీకరిస్తున్నాను. ఆ విధంగా నాకు నేను చెప్పుకుంటాను. నేను దానిని పూర్తిగా నమ్ముతాను. క్రీస్తు లేకుండా నా అంతట నేను ఏదైనా అర్థవంతమైన, శాశ్వతమైన, లేదా ఆధ్యాత్మికంగా విలువైనదానిని చేయలేను.
పి – ప్రేయర్. నేను ప్రార్థిస్తాను. మీరు ఏమీ చేయలేరని అంగీకరిస్తే, “ఓ దేవా, నాకు సహాయం చేయండి” అని మీరు అడగగలుగుతారు. “అడుగుడి, మీకు దొరకును” అని యేసు ప్రభువుల వారు అన్నారు (యోహాను 16:24). “అడుగనందున మీకేమియు దొరకదు.” (యాకోబు 4:2). “ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము” (కీర్తన 50:15).
కాబట్టి నేను ప్రభువును అడిగాను. నేను అక్కడ ముందు వరుసలో కూర్చున్నాను, మరియు నా గురించి నేను ఎక్కువగా ఆలోచించడం నుండి నాకు విముక్తి దయచేయమని నేను దేవున్ని అడిగాను. నాకు స్వేచ్ఛ ఇవ్వండి. నాకు జ్ఞాపక శక్తిని ఇవ్వండి. నాకు నిజమైన భావోద్వేగాన్ని ఇవ్వండి. తప్పుల నుండి నన్ను రక్షించండి. వారిని తప్పుదోవ పట్టించాలని నాకు లేదు. అద్భుతమైన రీతిలో చొచ్చుకుపోయి, విముక్తి కలిగించే, రక్షించే, శుద్ధి చేసే, ప్రజలకు ధైర్యాన్నిచ్చే మాటలు నా మదిలోకి వచ్చేలా ఒక ప్రవచనాత్మక అభిషేకం నాకు ఇవ్వండి. ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా జరగాలని నేను కోరుకున్నాను. అందుకే అడుగుతున్నాను.
టి – ట్రస్ట్. నేను దేవుని ప్రత్యేక వాగ్దానంపై ఆధారపడుతున్నాను. ఇది చాలా కీలకమైనది. ఇది కేవలం బోధించినప్పుడు మాత్రమే కాదు. ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేదా లైంగిక ప్రలోభాలు కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు. ఆ క్షణానికి నేను ఆశ్రయించడానికి ఒక ప్రత్యేకమైన వాగ్దానం నాకు అవసరం ఎందుకంటే నేను దేవున్ని నిజమైన, వ్యక్తిగతమైన రూపంలో నమ్మాలనుకుంటున్నాను. అస్పష్టంగా కాదు. నేను ఎదుర్కొంటున్న సమస్యకు ఆయన సహాయం చేస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని నేను నమ్మాలని అనుకుంటున్నాను.
“నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును” అని యెషయా 41:10లో వ్రాయబడి ఉంది.
ఈ వాగ్ధానాన్ని నేను చాలాసార్లు గుర్తుకు తెచ్చుకున్నాను. గత నలభై ఏళ్లలో, నా జీవితంలో సవాళ్లను ఎదుర్కున్నప్పుడు నేను కొన్ని వేల సార్లు ఉపయోగించిన మాటలు “నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే.”
“దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.” (2 కొరింథీ 9:8 చూడండి). “నేను నీ దేవుడను” (యెషయా 41:10). “మీ ప్రతి అవసరమును తీర్చును ” (ఫిలిప్పీ. 4:19 చూడండి). లేదా బోధించినప్పుడు నేను ఇలా చెప్పుకుంటాను, “జాన్ పైపర్, నా వాక్యం నిష్ఫలముగా తిరిగి రాదు” (యెషయా 55:11 చూడండి). “మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు” (మత్తయి 10:20 చూడండి). కాబట్టి నేను ఒక వాగ్దానం తీసుకుని దానిని నమ్ముతాను. నేను దానిని నాకు నేను బోధించుకుని దానిపైన కూడా నమ్మకాన్ని ఉంచుతాను.
ఎ– యాక్ట్. నేను దేవుని వాక్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తాను. నా చర్యల ద్వారా దేవుడు పనిచేస్తాడని నమ్ముతాను, ఆ ఫలితాలు చివరికి ఆయన కార్యమని స్పష్టం చేస్తాయి. మేము ఆ అద్భుతంలో భాగం అవుతాము. ఈ విషయంపై మేము ఒక సంపూర్ణ సదస్సును నిర్వహించాము మరియు యాక్ట్ ది మిరాకిల్ అనే పుస్తకాన్ని కూడా రాశాము.
వాస్తవానికి, నేను ఫ్యూచర్ గ్రేస్ అనే పుస్తకాన్ని ఎ.పి.టి.ఎ.టి. ని వివరించడానికే వ్రాసాను. కాబట్టి మీరు వాక్యానికి అనుగుణంగా ప్రవర్తించండి. “మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి” (ఫిలిప్పీయులు 2:12).
“నేను వారందరి కంటె ఎక్కువగా ప్రయాసపడితిని” (1 కొరింథీయులు 15:10). “నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. . . దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.” (గలతీయులు 2:20). ” ఆత్మచేత శారీర క్రియలను చంపిన యెడల జీవించెదరు” (రోమా 8:13).
కాబట్టి ఈ విధంగా మనం ప్రవర్తిస్తున్నాము. మనం కార్యం చేయడానికి ముందుకు వస్తాము, దేవుడే అద్భుతం చేసేవాడు.
టి – థాంక్. చివరిది, నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఏ మంచి జరిగినా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నేను ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతాను మరియు మహిమపరుస్తాను. “ఎల్లప్పుడును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు” (ఎఫెసీయులు 5:20) అని వ్రాయబడి ఉంది.
తనను తాను కాకుండా దేవుణ్ణి నమ్మడం
విశ్వసించడం నేర్చుకోవడం అనేది ఇక్కడ ప్రధానమైన ఆలోచన. దాని మీద అన్నీ ఆధారపడి ఉంటాయి. దేవుడు సహాయం చేస్తాడని ఆయన వాగ్దానంపై నమ్మకం ఉంచడం – రాబోయే ఐదు సెకన్లు కావచ్చు లేదా ఐదు నిమిషాలు కావచ్చు లేదా ఐదు గంటలు కూడా కావచ్చు. దేవుని భవిష్యత్ కృపపై విశ్వాసంతో జీవించడం అంటే దేవుడు మీకు సహాయం చేస్తాడని నమ్మడమే.
“నేను నీకు సహాయం చేస్తాను. నిన్ను నేను బలపరుస్తాను. నేను నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాను.” ఆ విషయంలో ఆయనను నమ్మండి. అదే ఎ.పి.టి.ఎ.టి. ఆత్మ చేత జీవించడం, ఆత్మ చేత విశ్వాసంతో జీవించడం, మీ రక్షణను కొనసాగించడం మరియు అద్భుతమైన క్రైస్తవ జీవితమును జీవించడం అంటే ఇదే అని నేను అనుకుంటున్నాను.
నేను చివరిగా ఒక విషయం చెబుతాను. నేను ఒక విషయంలో చాలా పులకరింతకు గురయ్యాను – ఇది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందో నాకు తెలియదు, బహుశా 15 సంవత్సరాల క్రితం జరిగి ఉండవచ్చు. ఎందుకంటే నేను గత 35 సంవత్సరాలుగా లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఎ.పి.టి.ఎ.టి ని ఉపయోగిస్తున్నాను. జె.ఐ. ప్యాకర్ వ్రాసిన కీప్ ఇన్ స్టెప్ విత్ ది స్పిరిట్ అనే పుస్తకం, 126 వ పేజీలో ఎ.పి.టి.ఎ.టి ని కనుగొనినప్పుడు నేను చాలా ఆశ్చర్య పోయాను. అది చాలా వింతగా అనిపించింది. 126వ పేజీలోని పైభాగానికి వెళ్లి అగస్టీనియన్ పవిత్రపరచబడడం గురించి ఆయన ఎలా వర్ణిస్తాడో చూడండి. అంటే, అతను కూడా ఎ.పి.టి.ఎ.టి నే అక్కడ సిఫారసు చేస్తాడు.
అప్పుడే కుర్చీలోంచి లేచాను. అతను ఎ.పి.టి.ఎ.టి అనే సంక్షిప్త పదాన్ని ఉపయోగించడు, కానీ అన్నీ వరుస క్రమంలో గమనిస్తే ఎ.పి.టి.ఎ.టి లానే ఉంటాయి. కాబట్టి ఇది కేవలం పైపర్ యొక్క అసాధారణమైన ఆలోచన అని ఎవరూ అనుకోకుండా ఉండేలా నేను చివరిలో దీనిని ప్రస్తావిస్తున్నాను. ఇది వాక్యానుసారమైన బోధ అని నేను అనుకుంటున్నాను మరియు ఇది నేను చేసిన అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలలో ఒకటి. ఆత్మానుసారంగా మీరు ఎలా నడుస్తారు?

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web