నేను రక్షింపబడ్డానని నాకెలా తెలుస్తుంది?
‘‘పాస్టర్ జాన్ గారూ, నేను రక్షింపబడ్డానని నాకెలా తెలుస్తుందండి?’’
జాశ్, ‘‘ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు రక్షింపబడుదువు’’ (అపొ 16:31).
‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’’ (యోహాను 3:16).
‘‘కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము’’ (రోమా 3:28).
యోహాను 20:31 ప్రకారం, యోహాను వ్రాసిన సువార్త మొత్తం, ‘‘యేసు, దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన యందు జీవము పొందునట్లును’’ వ్రాయబడింది.
నీవు చూసేదే చెప్పాలి
యేసునందు విశ్వాసముంచుట ద్వారా మనము రక్షింపబడతామనేది క్రొత్త నిబంధన మొత్తంలోగల పొరపాటుపడలేని, స్పష్టమైన సందేశమై (వర్తమానమై, వార్తయై) యుంది. కాబట్టి, నీ శ్రద్ధ అంతటిని యోహాను, మత్తయి, మార్కు, లూకా అనే సువార్తల మీద మరియు బైబిలంతటిలో గల క్రీస్తు మీద స్థిరంగా నిలిపి (కేంద్రీకరించి) యుంచు. నీ మనస్సంతటిని క్రీస్తు మీదనే స్థిరంగా ఉంచి, నువ్వేం చూస్తున్నావో దానిని బయటికి చెప్పు: ‘‘యేసు, ప్రభువైయున్నాడని మనము మన నోటితో ఒప్పుకొందుము’’ (రోమా 10:9). దీని గూర్చిన నీ ఆనందానుభూతిని బయటికి చెప్పు: ‘‘నేనాయనను అంగీకరిస్తున్నాను. నేనాయనను ప్రేమిస్తున్నాను. ఆయనే నా దేవుడు. ఆయనే నా ప్రభువు. ఆయనే నా నిధి’’ అని చెప్పు. ఇదంతా ఒప్పుకో. నీకు నీవే, నీలో నీవే ఈ మాటలు చెప్పుకొంటు, విను. ఇంతేగాక, ఈ విషయాన్ని ఇతరులకు కూడ చెప్పు. నీ భార్యకు చెప్పు. నీ పిల్లలకు చెప్పు. నీ స్నేహితునికి చెప్పు – ‘‘యేసు నా ప్రభువై యున్నాడని’’ చెప్పు.
పరిశుద్ధాత్మ లేకుండ ఎవరూకూడా ‘‘యేసు, ప్రభువై యున్నాడని’’ చెప్పజాలడని బైబిలుచెబుతుంది. ఇది ఆశ్చర్యకరమైన విషయం కాదా? ‘‘యేసు, ప్రభువై యున్నాడని’’ ఎవడును చెప్పలేడు. అందువల్ల, నీవీమాటలు అర్థవంతంగా పలికినట్లయితే, దేవుడు నీ జీవితంలో తన కార్యమును చేస్తున్నాడని అర్థం. నీవు పరిశుద్ధాత్మ గలవాడవై యున్నావు.
అంగీకరించడము మరియు నమ్మడము
అసలు, విశ్వాసం, నమ్మడం అంటే ఏంటి? యోహాను 1:11-12 ఇలా చెబుతుంది, ‘‘ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన్ను ఎందరింగీకరించిరో వారికందరికి, అనగా తన నామము నందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.’’ అందువల్ల, అంగీకరించడం మరియు నమ్మడం ఈ రెండు పదాలు, పరస్పర అర్థవివరణ చెప్పుతున్నాయి. ‘‘అంగీకరించుట’’ అనగా, ఆయన తనను తాను నీ రక్షకునిగా, ప్రభువుగా, నిధిగా, ఆలోచనకర్తగా, ప్రత్యక్షపర్చుకున్నపుడు, నీవు ఆయనను అంగీకరిస్తావు, తృణీకరించవు. అప్పుడు క్రీస్తునందున్న దేవునిలోని సమస్తమును నీవు పొందుకుంటావు. అందువల్ల, అంగీకరించడమనగా, ఆహ్వానించడం మరియు ఆలింగనం చేసుకోవడం అని అర్థం.
యేసు, ‘‘జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడని’’ చెప్పాడు (యోహాను 6:35). కాబట్టి విశ్వాసముంచడం, నమ్మడం అంటే, నీ దాహమును తీర్చుకోడానికి నీవు యేసు యొద్దకు రావడం అని అర్థం. ఇది సిలువపై యేసుక్రీస్తు బలి నుండి వచ్చే ఆశీర్వాదాలను మరియు క్షమాపణను అంగీకరించడం లేదా స్వీకరించడాన్ని సూచిస్తుంది, ఎందుకంటే ఇది మన లోతైన అవసరాలు మరియు కోరికలను నిజంగా సంతృప్తి పరచగల ఏకైక విషయంగా కనిపిస్తుంది.
‘‘నిన్ను సమర్థించేది ఫలము కాదు. విశ్వాసముతో కూడిన చెట్టు మంచి చెట్టై యున్నది. చెట్టు మంచిదనుటకు దాని ఫలము రుజువై యున్నది.’’
‘‘దేవుని స్వరూపమైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను’’ (2 కొరింథీ 4:4). కాబట్టి, ఆయన మన కన్నులు తెరచినప్పుడు మనము మహిమగల క్రీస్తును చూస్తాము. క్రీస్తు, ‘‘అదృశ్యదేవుని స్వరూపియై యున్నాడు’’ (కొలొ 1:15). క్రీస్తు, ఏ తరంలో ఉండినవారిలో అయినా, అతిగొప్ప వ్యక్తియై, అతిగొప్ప రక్షకుడు, అతిగొప్ప ప్రభువు, అతిగొప్ప బోధకుడు, అతిగొప్ప ఆలోచనకర్త, అతిగొప్ప స్నేహితుడై యున్నాడు. క్రీస్తునందు నమ్మకముంచడం వలన విశ్వాసము పొందుకొనేది ఇదే, ఈ భాగ్యమే.
ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి, మన జీవితాల్లో విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలకు సంబంధించిన విషయాలను తెలియజెప్పే వాక్యభాగాల గూర్చి ఆలోచిస్తున్నాడేమో! మంచిదే, అయితే, ఈ అంశం గూర్చి యింకెప్పుడైనా నేర్చుకుందాం. అయితే నేను ఒక్క విషయం చెప్తాను. ఏమంటే, యోహాను వ్రాసిన మొదటి పత్రికలో ఈ పరీక్షల గూర్చి చాల విషయాలున్నాయి. కానీ, వాటన్నిటి సారాంశమేమంటే, నీ జీవితం, నీవు నీ రక్షకునిగా అంగీకరించిన క్రీస్తు యొక్క ప్రశస్తతను, అమూల్యతను ప్రదర్శిస్తున్నదా, ప్రతిబింబిస్తున్నదా? నిన్ను నీతిమంతునిగా సమర్థించేది నీ ఫలం కాదు. విశ్వాసముతో కూడిన చెట్టే. చెట్టు మంచిదనడానికి దాని ఫలమే రుజువైయుంది.
వెలుగులో నడుచుకొనుము
ఈ సందర్భంలో మనం ‘మంచి’ గూర్చి మాట్లాడుతున్నాం, కదా. ‘మంచి’ అనంటే, పరిపూర్ణత ( ఏ లోపమూ లేకపోవడం) అని అర్థం కాదు. ‘‘నేను రక్షింపబడ్డానా?’’ అనే సందేహపూరితమైన ప్రశ్నతో చాలా మంది సతమతమవుతున్నట్టు నాకనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, క్రైస్తవ ఎదుగుదల మరియు పాపము పనిచేసే తీరు గూర్చి వారికి స్పష్టమైన, సరైన అవగాహన, గ్రహింపు లేదు. వారిలో వాస్తవముకాని ఆలోచనలు, గ్రహింపులున్నాయి. 1 యోహాను 1:7-9 చదివి, ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తాను – ‘‘ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల, మనము అన్యోన్య సహవాసముగలవారమై యుందుము., అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును.’’ కాబట్టి వెలుగులో నడుచుకోవడం ఆవశ్యకమై యున్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అలాగైతే, వెలుగులో నడుచుకోవడం, పరిపూర్ణత అయ్యుందా ? లేదు, కాదు. ఎందుకంటే, మనం వెలుగులో నడుచుకోవడం పరిపూర్ణత అయితే, పవిత్రులుగా చేయడానికి ఏ పాపమూ మిగిలియుండదు. గనుక వెలుగులో నడుచుకోవడం అంటే, ఏదో మరొక అర్థమున్నది.
కాబట్టి, ఇంకాస్త చదువుదాం : ‘‘మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము.’’ అనగా, మనము వెలుగులో నడుచుకోవడం లేదని మరొక మాటలో చెప్పొచ్చు. వెలుగులో, నీవు మోసపరచబడవు. వెలుగులో, నీవు సమస్తాన్ని స్పష్టంగా చూస్తావు. ఏంచూస్తావు? నీవు చేసిన పాపమును చూస్తావు? దానితో నీవేంచేస్తావు? 9వ వచనం ఇలా చెబుతుంది, ‘‘మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడునై యున్నాడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును.’’
ఈ లెక్కచొప్పున, వెలుగులో నడుచుకోవడమంటే, ‘‘అయ్యో, నేను వెలుగులో నడుచుకోలేను. నేను పాపము చేయకుండా ఉండలేనని’’ కొందరు అభిప్రాయపడవచ్చు. అలా కాదు. వెలుగులో నడుచుకోవడమంటే అది కాదు. వెలుగులో నడుచుకోవడమంటే, సువార్త నీకు స్పష్టంగా ఉండడం, దేవుని పరిశుద్ధత స్పష్టంగా తెలుసుకోవడం, పాపము ఎంత భయంకరమైనదో స్పష్టంగా తెలుసుకోవడం అని అర్థం. కాబట్టి, నీవు పాపములో పడినప్పుడు, ‘‘తండ్రీ, నేను దీనిని అసహ్యించుకుంటున్నాను. నేను దీని గూర్చి దు:ఖిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించుమనే ప్రార్థన’’ నీ ప్రతిచర్య అవుతుంది. నీవు ఈ విషయాన్ని ఒప్పుకుంటావు. నీకు క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ప్రభువు మీకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన ఐశ్వర్యము గొప్పదిగా ఉన్న ప్రభువుతో మీరు ముందుకు సాగుతారు.
అభయము గూర్చి పరిశుద్ధాత్మ అనుగ్రహించు వరము
ముగింపులో, జాశ్, రక్షణ గూర్చిన నిశ్చయత, పరిశుద్ధాత్మ అనుగ్రహించు వరమై యున్నదని నీకు చెప్పాలని ఆశపడుతున్నాను. రోమా 8:15-16లో ఇలా వ్రాయబడియుంది, ‘‘ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము, ‘అబ్బా! తండ్రీ! అని మొఱ్ఱపెట్టుచున్నాము.’’ ‘‘మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.’’ నీవు, ‘‘అబ్బా! తండ్రీ! యేసూ! ప్రభువా!’’ అని మొఱ్ఱపెట్టునప్పుడు, నీవు దేవుని పిల్లవని పరిశుద్ధాత్మ తానే నీ ఆత్మతో కూడ సాక్ష్యమిస్తున్నాడు. కాబట్టి ఈ వరము కోసం ఆయనను అడుగు. నీవు ఆయన బిడ్డవైయున్నావనే తన వ్యక్తిగత సాక్ష్యముతో కూడిన వరము కోసం ఆయనను అడుగుము.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web