బైబిలు చదువుటకు నేను ఎక్కువ మక్కువగలవాడను ఎలా అవుతాను
‘‘హలో, పాస్టర్ జాన్‌గారూ, నా పేరు ఏంజల్. నాకు పదహారేళ్లు. నా చుట్టున్న వారందరికి యేసు గూర్చి చెప్పుతూ రక్షణ సువార్తను ప్రకటించడానికి నేను ప్రయాసపడుతుంటాను. గాని నా జీవితంలో ఒక ప్రధానమైన విషయం లోపిస్తుందని నేను తెలుసుకుంటున్నాను. ఇది నాకొక పెద్ద ఆటంకంగా ఉంది. అదేమంటే, నేను ప్రతి రోజూ బైబిలు చదవాలనే ఆశ నాలో కలగడం లేదు. బైబిలు చదవాలనే బలమైన కోరికతో కాకుండా, దాదాపుగా ప్రతిసారి నేను బలవంతంగా బైబిల్ చదువుతున్నాను. బైబిలు చదవాలనే బలమైన కోరికతో కూడిన భావోద్వేగం నాక్కావాలి. నేను క్రైస్తవురాలను కానే కాను గనుకనే ఇలా జరుగుతుందని నేను కొన్నిసార్లు అనుకుంటుంటాను. తిరిగి జన్మించిన వ్యక్తి బైబిలు చదవడాన్ని ఇలా నిర్లక్ష్యం చేస్తుందా? నేను తృప్తితో ఉండాలని ప్రార్థిస్తున్నాను. నూతన సంవత్సరంలో, నూతన బైబిలు పఠనా ప్రణాళిక నా ముందున్నది గనుక ఇప్పుడు నేనేంచేయాలి?
ఒక విషయం చెప్తాను వినండి: బైబిలు పరమైన చట్టం ఉంది కాబట్టి బైబిల్ చదవాల్సిందేనని జాన్ పైపర్ ప్రతి సంవత్సరం బైబిలంతటిని చదవడు. బైబిల్ చదవకపోతే, నా ఆత్మలో, హెచ్చరిక గంటలు మ్రోగించే స్వాభావికమైన లేదా ఆత్మసంబంధమైన నియమము వంటిదొకటి ఉన్నది కాబట్టి నేను బైబిల్ చదువుతున్నాను. అనగా, సజీవుడైన క్రీస్తుతో, నా దేవునితో, నా రక్షకునితో, నా ధననిధితో, నా స్నేహితునితో, ఆయన వాక్యములో మరియు ఆయన వాక్యము ద్వారా, అనగా లేఖనాల సంపూర్ణత ద్వారా నేను అనుదినం మాట్లాడకుండా, అనుదినం సహవాసం చేయకుండా ఉన్నట్లయితే, ఆయనను గూర్చిన నా దృష్టి మసకబారుతుందని నా మానసిక మరియు ఆత్మసంబంధమైన స్థితి నాకు గత సంవత్సరాలన్నిటిలోను నేర్పిందనేది నా భావం.
కృపతో కూడిన సామాన్య సాధనము
ఔను, ప్రియులారా, త్వరగా మసకబారుతుంది. ‘‘ఓ, అతడు ఒక నెల రోజులు చదవలేదు, కాబట్టి అతని దృష్టి మసకబారడం మొదలయ్యిందన్నట్టు’’ నేను చెప్పడం లేదు. అది అలా జరుగదు. దేవుని వాక్యం చదవడం కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు నిర్లక్ష్యంచేశానంటే, ఆయనను గూర్చిన నా దృష్టి మసకబారుతుంది, ఆయన యెడలగల నా అభిరుచి ఉత్సాహంలేనిదవుతుంది, కాబట్టి, నా జీవితం ద్వారా నేనాయనను ఇతరులకు చూపించడం కోసమే నేను బ్రతుకుతున్నప్పటికిని, ఆయన్ను చూపించడము తగ్గిపోతుంది. అనగా, దేవుని వాక్యాన్ని ఎడతెరిపిలేకుండా, అనుదినం స్వీకరించుట మనము ఆయనతో క్రీస్తునందలి ఆత్మ ద్వారా సహవాసం చేయడానికి, సామాన్య సాధనమని మరొక మాటలో చెప్పొచ్చని నేను నమ్ముతున్నాను. ఇది దేవుని రూపకల్పన, నాది కాదు.
‘‘దేవుని వాక్యాన్ని ఎడతెరిపిలేకుండా, అనుదినం స్వీకరించుట మనము ఆయనతో సహవాసం చేయడానికి సామాన్య సాధనమై యున్నది.’’
నా ఆత్మలో ఒక నియమం ఉందని నేనన్నప్పుడు, నా మట్టుకైతే, పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన వాక్యం ద్వారా, దేవునితో అనుదినం సహవాసం చేస్తూ, ఆయనను గూర్చిన నా దృష్టిని, నా అభిరుచిని మరియు కొనసాగించాలనే నియమమున్నదని నేను కనుగొన్నాననేదే, నా భావమంతాను. ఇదంతా కూడ బైబిలంతటిని సంవత్సరము వెంబడి సంవత్సరం – రోజుకు నాలుగు లేదా ఐదు అధ్యాయాల చొప్పున – చదవడం ద్వారా చక్కగా జరుగుతుంది. ఇలా చేయడానికి కొందరు సుముఖంగా లేరు, ఇష్టపడుట లేదు, ఎందుకంటే వారు వెనుకబడిపోతున్నారు కాబట్టి మానేస్తున్నారు. అందుకే, discipleship journal reading plan శిష్యత్వపు పఠనా ప్రణాళిక నాకెంతో ఇష్టం. ఈ ప్రణాళిక ప్రకారం నీవు ప్రతి నెలా 25 రోజులు మాత్రమే చదువుతావు గనుక మిగిలియున్న దానిని పూర్తి చేయడానికి నీకు యింకా ఐదారు రోజులుంటాయి, ఇది చాలా మంచిది.
దేవుడు తన వాక్యమును ఉపయోగించే మూడు విధాలు
తరువాతి కొన్ని నిమిషాల్లో నేను చెప్పదల్చుకున్నదేమంటే, మనమిప్పుడు నూతన సంవత్సర ఆరంభంలో ఉన్నాము గనుక, విశ్వాసులను ఏదైన ఒక నిర్దిష్ట ప్రణాళిక గూర్చి ఒప్పించాలని కాదు, గాని నిన్ను రక్షించడానికి దేవుని విధానములో, ప్రతి రోజు దేవుని వాక్యమనే మన్నాతో నిన్ను నీవు పోషించుకోవడం ఇమిడియుందనే గంభీరమైన బైబిలు సత్యాన్ని మరియు వాస్తవికతను తెలపాలని ఆశిస్తున్నాను. అనగా, బైబిలు చదవడము గూర్చి మేము చెప్పుతున్నప్పుడు, మరింత మధురమైన రుచి కోసం కేకు మీద ఐసింగ్ అద్దబడినట్టు, మేము క్రైస్తవ్యమనే కేకు మీద ఐసింగ్‌ను అద్దడంలేదని మరొక మాటలో చెప్పుకొనవచ్చు. దేవుని వాక్యం ద్వారా మాత్రమే, పరిశుద్ధాత్మ కలిగించగల అవసరమైన పరిశుద్ధత అంతటితో, నిన్ను పదిలంగా క్షేమంగా పరలోకానికి తెచ్చుటకు దేవుడు రూపకల్పన చేసిన ఆధ్యాత్మిక ప్రణాళిక అనే కేకు గూర్చి మేము చెప్పుతున్నాము.
కాబట్టి, ప్రతి రోజు దేవుని వాక్యాన్ని భుజించుట గూర్చి ఇక్కడ లేఖనములలోని మూడు వాక్యభాగాలున్నాయి. ఇవి తీవ్రమైనవి, ఆశ్చర్యకరమైన అంతర్భావాలతో కూడినవై, శక్తివంతమైనవిగా యింకా అనేక విషయాలను తెలియజేసేవై ఉన్నాయి. ఈ మూడు వాక్యభాగాలు ఏంజల్ అడిగిన ప్రశ్నకు, ప్రత్యేకంగా తిరిగి జన్మించడానికి, బైబిలు చదవడానికిని మధ్య గల సంబంధం గూర్చి, జవాబిస్తాయని నేను ఆశిస్తున్నాను.
1. లేఖనముల ద్వారా, దేవుడు మనలను రక్షణలోనికి ఎదిగింపజేస్తాడు.
మొదటి లేఖన భాగం – 1 పేతురు 1:22-2:3లో ఇలా వ్రాయబడి యున్నది:
మీరు క్షయబీజము నుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడినవారు. … ఏలయనగా, ‘‘సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలు, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.’’
మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణమాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.
ఈ వాక్యభాగంలో నుండి ఎవరైనాగాని పొందుకునే నాలుగు సామాన్య పరిశీలనా వాక్యాలున్నాయి.
1. క్రొత్తగా జన్మించిన అద్భుతకార్యం – దేవుని వాక్యం ద్వారా దేవుని బిడ్డగా ఒక క్రైస్తవుడవడం జరుగుతుంది.
2. ఈ అద్భుతకార్యము యొక్క మన అనుభవం, దేవుడు ఉత్తముడని, దయాళుడని రుచిచూచుటగా వర్ణింపబడింది. మనము తిరిగి జన్మింపక ముందు, మనకు దేవుడు రుచికరంగాలేడు. ఆయన, బోరింగ్‌గా, విసుగుపుట్టించేవాడుగా ఉన్నాడు. దేవుని వాక్యం, బోరింగ్‌గా ఉండింది. ఆయన సిలువ, వెఱ్ఱితనముగా ఉండింది. పరలోకం, వాస్తవమై యుండలేదు. ఈ విశ్వాసమును గూర్చినది ఏదీ కూడా తృప్తినీయలేదు లేదా వాస్తవమైనదై యుండలేదు. కానీ ఇప్పుడు, క్రొత్తగా జన్మించిన తరువాత, మనము రుచి చూశాము. ఏదో ఒక విషయం సజీవంగా మన ముందు నిలిచింది. మన ఆత్మ అనే నాలుక మీద ఇప్పుడు స్వాదముకుళములు అంటే రుచిని తెలిపే చిన్న కణుతులు ఉన్నాయి, గనుక దేవుడు మరియు దేవుని వాక్యం చాలా మధురంగా ఉంది.
3. దేవుడు మరియు దేవుని వాక్యం మధురాతిమధురంగా ఉన్నప్పటికీ, ఆత్మసంబంధమైన ఈ ఆహారాన్ని మనము అపేక్షించాలని హెచ్చరింపబడుతున్నాము. అనగా, తినడం అనేది దానంతట అదే జరగదని మరొక మాటలో చెప్పొచ్చు. అది దానంతట అదే జరిగే పనైతే, మనము అపేక్షించాలని పేతురు చెప్పడు. మన కోరికల్లో హెచ్చుతగ్గులుంటాయి. ఒక రోజు ఎక్కువగా, గాఢంగా ఉంటాయి, మరుసటి రోజు తగ్గిపోతాయి లేదా నులివెచ్చగా ఉంటాయి. పేతురు మనకు, ‘‘దానిని అపేక్షించండి, దానిని కోరుకొనండి, దానిని కోరుకొనండి’’ అని ఆజ్ఞాపించలేదు, ఎందుకంటే మనకు ఈ ఆజ్ఞ అవసరం లేదు. మనము కోరుకోవడం అత్యవసరం, కీలకమైనదై ఉందని మనకు చెప్పబడాల్సివున్నది. మీకు నూతన జీవమును ఇచ్చిన దేవుని వాక్యములో ఆత్మీయంగా పోషించబడడానికి మీ కోరికకు ఆజ్యం పోయుటకు మీరు చేయాల్సింది చేయండి.
4. ఇప్పుడు అసలైన, గంభీరమైన విషయం : రక్షణ విషయములో ఎదుగునట్లు మీరు దానిని కోరుకొండి. అనగా, దీనర్థము, మీ నూతన జన్మ యొక్క రుజువు, దేవుని వాక్యము నుండి మీరు పోషించబడడంలో కనిపిస్తుంది. ఈ వాక్యము మిమ్మల్ని జీవము మరియు అంతిమ రక్షణ వైపు ఇరుకైన మార్గంలో ఉంచే మార్గాల్లో చురుకుగా ఉంచుతుంది. ఇది చులకనగా చూడాల్సిన చిన్న విషయం కాదు.
కాబట్టి, మీకు మీరే ఈ ప్రశ్న వేసుకొండి : ప్రతి రోజు దేవుని వాక్యాన్ని భుజించాల్సిన వ్యూహమును, ప్రణాళికలను మీరు అనుసరించనట్లయితే, రక్షణలో ఎదుగడానికి, మీ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ వ్యూహమేమిటి? మనము పైన చెప్పుకొనిన విషయాలు పేతురు చెప్పుతున్నాడు, నేను కాదు. దేవుని వాక్యం మనము రక్షణలో ఎదగడం కోసం దేవుని చేత రూపింపబడింది. పగలైనా, రాత్రైనా, నీవు దానిని ఈ విధంగా ఉపయోగించుకోనట్లయితే, నిన్ను పరమపురికి నడిపించు ప్రత్యామ్నాయ వ్యూహం ఏముంది?
2. బైబిలు ద్వారా, దేవుడు మనలను ఇంటికి చేరుస్తాడు.
రెండవ వాక్యభాగం: యాకోబు 1:18,21లో ఇలా వ్రాయబడి యున్నది:
ఆయన (దేవుడు) తాను సృష్టించినవాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను (తిరిగి జన్మించినట్టు). … అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.
ఇది ఆశ్చర్యపరిచే అద్భుత విషయం కాదా? పేతురు మరియు యాకోబు, ఒకరినొకరు కోట్ చేసుకోవట్లేదు అంటే పరస్పరం ఉల్లేఖించుకొనడం లేదు (భాష చాలా భిన్నంగా ఉన్నది కాబట్టి దీనిని మనము తెలుసుకుంటున్నాము), అయినప్పటికి ఇద్దరూ ఒకే విషయం గూర్చి చెప్పుతున్నారు.
‘‘సత్యవాక్యము వలన మనలను కనెనని’’ యాకోబు చెప్పుతున్నాడు. వాక్యము వలన మనము ‘‘క్రొత్తగా జన్మించామని’’ పేతురు చెప్పుతున్నాడు.
వాక్యమను పాలను ‘‘అపేక్షించుడని’’ పేతురు చెప్పుతుండగా, ‘‘లోపల నాటబడి … వాక్యమును సాత్వికముతో అంగీకరించుడని’’ యాకోబు చెప్పుతున్నాడు. వాక్యం ఇదివరకే మీలో ఉన్నది. ఇప్పుడు దానిని అంగీకరించండి. మీరు దాని వలన తిరిగి జన్మించబడ్డారు. ఇప్పుడు మీరు ప్రతి దినము, సాత్వికముతో దానిని ఆలింగనము చేసుకుంటూ, అంగీకరిస్తూ, ధ్యానిస్తూ, దాని గూర్చి ప్రార్థిస్తూ, దానిని భుజిస్తూ, దానిని వినయముతో, దీనమనస్సుతో ఆస్వాదించండి.
‘‘రక్షణ విషయములో ఎదుగు నిమిత్తమని’’ పేతురు చెప్పుతుండగా, ‘‘మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగలదని’’ యాకోబు చెప్పుతున్నాడు.
ప్రియులారా, ఇది ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఒకడు క్రైస్తవుడై యుండడం అంటే ఏమిటో అనే విషయాన్ని తెలుపడానికి, చక్కగా కూర్చబడి, దాని సారాంశమును భిన్నమైన భాషలోనే అయినప్పటికిని, ఒకే విషయాన్ని ఈ ఇద్దరు రచయితలు ఇక్కడ చెప్పుతున్నారు గనుక ఇది నిజముగా గంభీరమైనదై యున్నది. ఇది నిజముగా గంభీరమైనదై యున్నది: క్రైస్తవ జీవితం, దేవుని వాక్యం వలన కలిగించబడు నూతన జన్మతో మొదలవుతుందని పేతురు మరియు యాకోబు చెప్పుతున్నారు. మనము అంతిమ రక్షణ కొరకు పరమపురికి చేరుకొనునట్లు, మనము దేవుని వాక్యమును సాత్వికముతో అంగీకరించాలని ఇద్దరూ నొక్కివక్కాణిస్తున్నారు. వాక్యమనెడి పాలను మనము అనుదినం త్రాగుచుండాలి, ఎందుకంటే మనము దాని వలన రక్షణ విషయములో ఎదుగుతుంటాము. ఇది మనలను యేసుతో కూడ అత్యంత ప్రాముఖ్యమైన, సంతోషకరమైన సహవాసంలో ఉంచుతూ క్షేమంగా పరలోకమునకు చేర్చుతుంది.
3. దేవుడు తన మాటల వలన, జీవమునిస్తాడు.
ఇంకొక్క వాక్యభాగాన్ని త్వరగా చెప్తాను వినండి. యోహాను 6:63 చూడండి. అక్కడ ఇలా వ్రాయబడి యున్నది,
ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి.
గమనించండి: ‘‘మాటలు’’ ` మాటలు, మాటలు – ‘‘నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి.’’ అప్పుడు పేతురు, ‘‘ప్రభువా, యెవని యొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలుగలవాడువు’’ (యోహాను 6:68). యేసు మాటలు జీవమై యున్నవి.
‘‘దేవుని వాక్యమును భుజించుటను కొనసాగించుట ద్వారా మీరు తిరిగి జన్మించారనే రుజువు చూపింపబడుతుంది.’’
క్రైస్తవ జీవితాన్ని, స్వాభావికమైనది లేదా దానంతట అదే ఆటోమేటిక్‌గా జరిగే విషయమైనట్టు, ఈ రోజు బ్రతికున్నారు కాబట్టి రేపు కూడ బ్రతికుంటామన్నట్టు, అనేకులు ఎంచుతుంటారు. అది దానంతట అదే ఆటోమేటిక్‌గా జరుగదు. దేవుని చేత ఏర్పరచబడినవారు రేపు బ్రతికుంటారనేది ఖచ్చితంగా జరుగుతుంది. వారు పరలోకం చేరేట్టు దేవుడు చూస్తాడు. గాని వారిని సంరక్షిస్తూ, ‘‘నేను మీతో చెప్పియున్న మాటలు మీ జీవమై యున్నవని’’ పలుకుట వలన, అనుదినం వాటిని భుజింపజేస్తూ, క్రీస్తుతో సహవాసంలో ఉంచుతూ వారిని ఇంటికి చేర్చుట దేవుని విధానమైయున్నదని ఏర్పరచబడినవారు, నిజ క్రైస్తవులు తెలుసుకుంటారు.
కాబట్టి, నూతన సంవత్సర ఆరంభంలో, ఈ మాటలు వింటున్న చాలా మంది ప్రజల హృదయాలు భారంగా కాకుండా జీవమని నేను చెప్పుతున్న మాటలు స్వీకరించాలని ఆ విధంగా పరిశుద్ధాత్మ వారి హృదయాల్లో పనిచేయాలని ప్రార్థించాలని నేనెంతగానో కోరుకుంటున్నాను. నూతన సంవత్సర ఆరంభంలో, నేను చెప్పదలచిన నా సాక్ష్యమేమంటే: వేకువ జాముననే లేచి, చలికాలంలో ఒక కప్పు చాయ్ త్రాగి, ఒక గంటసేపు కుర్చీలో కూర్చోని, ఈ విశాల విశ్వమంతటికి రాజైన యేసుతో, బైబిలులోని వేర్వేరు నాలుగు పుస్తకాల్లో సహవాసం చేయాలని నేనెంతో ఇష్టపడతాను. ఇదే నా జీవితం.
మళ్లీ చెప్పేదా? ఇదే నా జీవితం. ఓ, మీరు కూడ ఆయన వాక్యమును జీవముగా అనుభవించునట్లు దేవుడు అనుగ్రహించునుగాక.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web