తిరస్కరించబడిన మరియు అందించబడిన కృప

షేర్ చెయ్యండి:

అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి”.
(అపొ. కార్య 14:22)

మన అంతర్గత బలం యొక్క అవసరం రోజువారీ ఒత్తిడి తగ్గడం వల్ల మాత్రమే కాకుండా, ఎప్పటికప్పుడు వచ్చే శ్రమలు మరియు బాధల నుండి కూడా పుడుతుంది. అవి తప్పకుండ వస్తూనే ఉంటాయి.

శ్రమలు (లేక బాధలు) అనేవి పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో వేసారిపోయిన హృదయానికి జతపరచబడుతుంటాయి. అవి వచ్చినప్పుడు హృదయం అలసిపోవచ్చు, జీవానికి దారితీసే ఇరుకైన మార్గం కాస్త అసాధ్యమైన కఠిన మార్గంగా కనుపించవచ్చు. పాత కారు యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఇరుకైన రోడ్డును, నిటారుగా ఉండే కొండలను కలిగియుండడం చాలా కష్టం. అయితే, ఉన్నపళంగా కారు పాడైనప్పుడు మనమేమి చేయాలి?

పౌలు గారు తన జీవితంలో పొందిన కొన్ని బాధలవలన ఈ పైన చెప్పిన ప్రశ్నను వేసుకొని మూడు సార్లు ఏడ్చాడు. ఆయన తన శరీరంలో ఉండే ముల్లును తీసివేయమని అడిగాడు. అయితే, ఆయన అడిగిన విధానంలో దేవుని కృప రాలేదు గాని మరొక విధానంలో ఆ దేవుని కృప వచ్చింది. “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది” అని (2కొరింథీ 12:9) క్రీస్తు జవాబిచ్చాడు.

ఎడతెగని బాధలో క్రీస్తు రక్షించు శక్తి రూపంలో కృప ఇవ్వబడినట్లుగా మనమిక్కడ చూస్తున్నాం, అంటే ఒక కృప తిరస్కరించబడిన చోటే మరొక కృప ఇవ్వబడిందని మనం చెప్పవచ్చు. “కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును” (2కొరింథీ 12:9) అని భవిష్యత్తులో కలగబోయే ఈ కృపా సమృద్ధిలో విశ్వాసంతో పౌలు స్పందించాడు.

దేవుడు అనేకమార్లు “తిరస్కరించబడిన కృప” చోటనే “అందించబడిన కృపతో” మనల్ని ఆశీర్వదిస్తాడు.

ఉదాహరణకు, జూలై నెలలో ఎక్కువ ఎండ ఉన్నటువంటి రోజున కారులో వాటర్ పంప్ పనిచేయడం ఆగిపోయింది, ఏ పట్టాణానికైనా దరిదాపు ముప్పై రెండు కిలో మీటర్ల దూరంలో మేము టేనస్సీలోని హైవేపై చిక్కుకుపోయాం.

ఆ కారు బాగా పనిచేయాలని, మేము చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరాలని ఆ రోజు ఉదయం నేను ప్రార్థించాను. ఇప్పుడు ఆ కారు ఆగిపోయింది. ఎటువంటి సమస్య లేకుండ ప్రయాణం చేయవలసిన కృప ఇప్పుడు తిరస్కరించబడింది. మా కారు ప్రక్కన మేము నిలుచున్నాం గాని రోడ్డున వస్తున్నవారు ఏ ఒక్కరు కూడా తమ కార్లను ఆపట్లేదు. అప్పుడు, “డాడీ, మనం ప్రార్థన చేద్దాం” అని నా కుమారుడు అబ్రహాం (నా కొడుకికి బహుశా పదకొండు సంవత్సరాలు ఉంటాయి) అన్నాడు. అప్పుడు వెంటనే మేము కారు వెనకాల మోకరించి, భవిష్యత్తుకు సంబంధించిన కృప కోసం దేవుణ్ణి వేడుకున్నాం, అంటే ఆ సమయానికి కావాల్సిన సహాయం కోసం దేవుణ్ణి వేడుకున్నాం. మేము ప్రార్థించిన తరువాత లేచి చూస్తే, ఒక పికప్ ట్రక్ అక్కడికి వచ్చి ఆగింది.

ఆ ట్రక్ డ్రైవర్ ముప్పై రెండు కిలో మీటర్ల దూరంలో పని చేసే ఒక మెకానిక్. కారుకు అవసరమైనవాటిని తీసుకొచ్చి, కారును రిపేర్ చేస్తానని అతను ఇష్టపూర్వకంగా చెప్పాడు. అతనితోపాటు నేను కూడా టౌనుకు వెళ్ళేటప్పుడు అతనితో నేను సువార్తను పంచుకున్నాను. ఐదు గంటలలోపు పని పూర్తయ్యి మా ప్రయాణంలో మేము ముందుకు కొనసాగం. 

ఇప్పుడు మేము చేసిన ప్రార్థనకు వచ్చిన జవాబును గురించి చెప్పుకోదగిన ఒక విషయం ఏంటంటే తిరస్కరించబడిన ప్రార్థన చోటుకే ఆ జవాబు రావడం. సమస్యలేని ప్రయాణం కోసం మేము అడిగాం. దేవుడు ఒక సమస్యను పంపించాడు. అయితే, తిరస్కరించబడిన కృపలోనే మరలా మేము వేరొక విధంగా కృపను పొందుకున్నాం. నా కోసం, అవిశ్వాసులైన మెకానిక్కుల కోసం, పదకొండేళ్ల అబ్బాయిల విశ్వాసం కోసం ఉంచబడిన ఉత్తమ కృపలోనే దేవుని జ్ఞానాన్ని నమ్ముటకు నేను నేర్చుకుంటున్నాను.

మనల్ని రక్షించమని అడిగిన బాధల మధ్యలోనే దేవుడు మనకు అద్భుతమైన కృపలను ఇస్తాడని మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆయన మహిమ కోసం, మన మంచి కోసం ఆయన కృపను ఎలా అందించాలనే విషయం దేవునికి బాగా తెలుసు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...