నేను జీవగ్రంథంలో నుండి తుడిపివేయబడగలనా?

నేను జీవగ్రంథంలో నుండి తుడిపివేయబడగలనా?

షేర్ చెయ్యండి:

దక్షిణ ఆఫ్రికా నుండి చార్ల్స్ అనే సహోదరుడు ఇలా వ్రాశారు. ‘‘పాస్టర్‌ జాన్‌ గారూ, మీ ప్రసారాలు నాకు చాలా ఇష్టం, నేను ప్రతి రోజు వాటిని వింటుంటాను. వందనాలు. నాకు తెలిసినంతమట్టుకు, ‘జీవ గ్రంథము’ అనే పదం బైబిలులో 14 సార్లు పేర్కొనబడింది. ‘ఒకని పేరు జీవ గ్రంథములో నుండి తుడిచివేయబడడం’ గూర్చి కూడ కొన్ని వాక్యభాగాలు పేర్కొంటున్నాయి. ‘తుడిచివేయబడడం’ అనంటే, ఒకడు పొందుకొన్న రక్షణను పోగొట్టుకొన్నట్టే కాదా?  పాస్టర్‌ జాన్‌ గారూ దీనిపై మీరేమంటారు’?

ఎన్నటికినీ తుడుపుపెట్టబడదు

నిత్య భద్రత లేదా పరిశుద్ధుల పదిలతకు సంబంధించిన సిద్ధాంతం పేర్కొనబడినప్పుడు, మనము ఖచ్చితత్వంతో మాటలాడాల్సి వుంటుంది. ఒకని పేరు జీవగ్రంథంలో నుండి తుడుపు పెట్టబడగలదని కొన్ని లేఖన భాగాల్లో పేర్కొనబడిందని చార్లెస్‌ అనడం, ఖచ్చితమైనదిగా లేదని నేను భావిస్తున్నాను. ఒకని పేరు జీవగ్రంథంలో నుండి తుడుపుపెట్టబడుతుందని బైబిలు చెబుతుందని, కొన్నిసార్లు దేవుడు చేస్తాడనే అర్థంతో చెబుతుందని నేననుకోవడం లేదు. మనము కొన్ని షరతులను నెరవేర్చనప్పుడు, కొన్ని షరతులకు అనుగుణంగా జీవించనప్పుడు లేదా ప్రవర్తించనప్పుడు జీవ గ్రంథంలో నుండి మన పేర్లు తుడుపుపెట్టబడునని బైబిలు చెబుతుంది. అయితే ఇలా ఎప్పుడైనా జరుగుతుందా లేదా దేవుని సార్వభౌమాధికారంలో ఎప్పుడైనా జరుగగలదా అనేది, ఇక్కడ మరొక విషయం. అలా జరుగుతుందని నేననుకోవడం లేదు, ఎందుకనుకుంటున్నానో చెప్పుతాను, వినండి.

‘‘నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడి యుండుట, నీవు దేనిని చేసినట్లయితే నీ పేరు దానిలో నుండి తుడిపివేయబడునో దానిని చేయకుండునట్లు నిన్ను కాపాడుతుంది.’’

ఈ విషయాన్ని అతి తరచుగా ప్రస్తావిస్తున్న పుస్తకం, ప్రకటన గ్రంథం. మరియు, దీనికి సంబంధించిన వాక్యభాగం సమస్యాత్మకంగా ఉన్నట్టు అనిపించే పుస్తకం కూడా ఇదేనని నేననుకుంటున్నాను. ప్రకటన 3:5లో ఇలా వ్రాయబడింది. ‘‘జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరెంతమాత్రమును తుడుపుపెట్టక, నా తండ్రి యెదుట ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.’’

‘‘ఇది పరిశుద్ధుల నిత్య భద్రత లేదా పదిలత అనే సిద్ధాంతానికి విరోధంగా పొరపాటుకు కూడా వీల్లేని  వాక్యభాగమై యున్నదని’’ కొందరంటారు. గాని జీవగ్రంథములో నుండి ఒకని పేరును దేవుడు తుడిపివేయడని ప్రకటన 3:5 చెప్పుతున్నప్పుడు, ఆయన కొందరి పేర్లను తుడిపివేస్తాడనేది దాని అంతరార్థమై యున్నదని, వీరు తిరిగి జన్మించినప్పుడు, నీతిమంతులుగా తీర్చబడి రక్షింపబడినప్పటికీ, చివరకు శిక్ష విధింపబడినవారై, నశిస్తారని వారు భావిస్తారు. అనగా, వారు తమ రక్షణను కోల్పోతారని ఈ వచనాన్ని చదవడం ద్వారా తెలుస్తుందని మరొక మాటలో చెప్పుకొనవచ్చు.

సరే, గాని, ఇదొక నిజమైనదేనా?

‘‘నేను వాని పేరును జీవగ్రంథములో నుండి తుడిచివేయను’’ అనే వాగ్దానం, కొందరి పేర్లు తుడిపివేయబడతాయని అర్థమివాల్సిన అవసరం లేదు. జీవగ్రంథంలో పేరు వ్రాయబడియున్న వ్యక్తి, విశ్వాసముతో జయించు వ్యక్తి పేరును నేనెన్నడును తుడిపివేయనని అది సరళంగా, మామూలు మాటల్లో చెప్పుతున్నది. అనగా, తుడిపివేయబడుట అనేది ఒక భయంకరమైన భవిష్యత్‌ ఆలోచన. పట్టుదలతో జయిస్తూ ముందుకు వెళ్లువారి విషయంలో ఇది నేను జరగనివ్వను అని చెప్పుతున్నాడని మరొక మాటలో చెప్పుకొనవచ్చు. వాస్తవానికి, నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడిందంటే, నీవు ఖచ్చితంగా పట్టుదలతో ముందుకు సాగుతూ  జయిస్తుంటావు గనుక నీ పేరు తుడిపివేయబడకుండుటకు నీవు నెరవేర్చవలసిన షరతులను నీవు నెరవేరుస్తావని అర్థమిచ్చే ప్రకటన గ్రంథంలో యింకా రెండు వాక్యభాగాలున్నాయి.

మృగమును ఆరాధించువారెవరు?

ప్రకటన 13:8 లో ఇలా వ్రాయబడి యుంది: ‘‘భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు’’. జీవగ్రంథములో పేర్లు వ్రాయబడినవారు మృగాన్ని ఖచ్చితంగా ఆరాధించరని ఈ వచనం బోధిస్తున్నది. ఈ వచనము చెప్పుతున్నది ఇదే. అనగా, జగదుత్పత్తి నుంచే నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడి యున్నదంటే, దేవుడు పడిపోకుండా కాపాడుననే అర్థమిస్తున్నదని మరొక మాటలో చెప్పుకొనవచ్చు. నీవు దేవుణ్ణి హత్తుకొని పట్టుదలతో ముందుకు సాగునట్లు ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడిందంటే, నీవు విశ్వాసభ్రష్టుడవు కానేరవు. ప్రభువునందలి నీ విశ్వాసమును నీవు వదిలిపెట్టవు.

ప్రకటన 17:8లో ఇలా వ్రాయబడి యున్నది, ‘‘నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు. అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు.’’ అనగా, నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడియున్నదంటే నీవు ఆ మృగము విషయంలో ఆశ్చర్యపడకుండ కాపాడబడుదువని అర్థం. వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడనివారు మృగమును చూసి ఆశ్చర్యపడుదురు, మరియు జీవగ్రంథములో వారి పేర్లు వ్రాయబడినవారు మృగమును చూసి ఆశ్చర్యపడరు. ఈ రచయిత వాదిస్తున్న విధానం ఏవిధంగానూ తప్పుపట్టబడలేనిదై యున్నది. నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడిందంటే, నీవు మృగమును ఆరాధించవు, దానిని చూసి ఆశ్చర్యపడవని అర్థం.

కాబట్టి, ఒకని పేరు జీవగ్రంథములో వ్రాయబడుట కార్యసార్థకమైనదై, ప్రభావవంతమైనదై ఉండుననేది అసలు విషయం. నీ విశ్వాసము బ్రద్దలుకాకుండా అది నిన్ను కాపాడుతుంది. యోహాను, ‘నీవు మృగాన్ని ఆరాధిస్తే, నీ పేరు తుడిపివేయబడుతుందని’ చెప్పడం లేదు. గాని, ‘నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడి యున్నట్లయితే, నీవు మృగాన్ని ఆరాధించవని’ చెప్పుతున్నాడు. మరొకసారి ప్రకటన 3:5ను చూద్దాము: ‘‘జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరెంతమాత్రమును తుడుపుపెట్టను.’’

నిజమైన హెచ్చరికలు

దేవుడు కొందరి పేర్లను జీవగ్రంథములో నుండి తుడిపివేస్తాడని దీనర్థమా? లేదు. నీ పేరు జీవగ్రంథములో ఉండటం వలన మీరు మరచిపోబడరని గ్యారెంటీ ఇవ్వబడుతుంది.  ప్రకటన 13:8 మరియు ప్రకటన 17:8 తెలియజెప్పుతున్న విషయం ఇదే. జీవగ్రంథంలో నీ పేరుండుట అనేది, నీవు దేనిని చేస్తే నీ పేరు ఆ గ్రంథంలో నుండి తుడిపివేయబడుతుందో, దానిని చేయకుండా నిన్ను కాపాడుతుంది.

‘‘నీ పట్టుదల గూర్చి ఎన్నడును పట్టింపులేనివాడవై, అజాగ్రత్తగా యుండవద్దు. మనలను మెలకువగా, అప్రమత్తంగా ఉంచుటకు దేవుడు నిజమైన హెచ్చరికలను ఉపయోగిస్తాడు.’’

మరొకసారి చెప్పనివ్వండి. జీవగ్రంథంలో నీ పేరుండుట అనేది, నీవు దేనిని చేస్తే నీ పేరు ఆ గ్రంథంలో నుండి తుడిపివేయబడుతుందో, దానిని చేయకుండా అంటే మృగాన్ని ఆరాధించకుండా నిన్ను కాపాడుతుంది. ఇది, ‘‘కాగా ప్రియులారా, భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే’’ అని పౌలు చెప్పినదానికంటే ఎక్కువైన వైరుధ్యమేమీ కాదు (ఫిలిప్పీ 2:12-13).

నీవు జయించినట్లయితే, దేవుడు నీ పేరును తుడిపివేయడనే షరతును, ఆ తరువాత, నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడియున్నట్లయితే, నీవు జయిస్తావనే హామీని, అభయవాక్కును చెప్పడం అర్థంపర్థంలేనిదేమీ కాదు. ఇదొక పరస్పర వైరుధ్యమైన సంగతి కాదు. దేవుడు జీవగ్రంథంలో ఎవరి పేర్లను వ్రాసాడో వారు నిజముగా తప్పక జయించాల్సి ఉంటుంది, జయిస్తారు కూడ. అది జరగక మానదు, వారు తప్పక విజయం సాధిస్తారు. ఇది నీవు తప్పక జయించాలి అని ఒక ప్రక్క నీ బాధ్యతను గట్టిగా చెబుతుంది. మరొక ప్రక్క, నీవు తప్పక జయిస్తావు అని   దేవుని సార్వభౌమాధికారమును స్పష్టంగా ప్రకటిస్తుంది.

కాబట్టి, ఇక్కడ మనకు లభించే ఉపదేశమేమంటే: నీ పట్టుదల పట్ల నీవు ఎన్నడే గాని, ఎన్నడును, అజాగ్రత్తగా, అశ్రద్ధగా ఉండవద్దు లేదా దానినొక అల్పమైన విషయంగా ఎంచవద్దు. మనలను హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతూ మనము పట్టుదలతో ముందుకు సాగునట్లు దేవుడు నిజమైన హెచ్చరికలను ఉపయోగిస్తుంటాడు. మనము సురక్షితంగా ఉంటాము. అజాగ్రత్తగా ఉండము. విషయం ఇదే. పౌలు చెప్పుతున్నట్టు, మీ సొంత రక్షణను కొనసాగిస్తూ ఉండండి, ఎందుకంటే క్రీస్తు మిమ్ములను తన సొంత ప్రజలుగా చేసికొన్నాడు (ఫిలిప్పీ 3:10-12).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...