మార్గాన్ని సిద్ధం చేయండి

షేర్ చెయ్యండి:

“ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును”. (లూకా 1:16–17)

బాప్తిస్మమిచ్చు యోహాను ఇశ్రాయేలు కోసం ఏదైతే చేశాడో, యేసుక్రీస్తు రాక మన కోసం అదే చేయగలదు. క్రిస్మస్ విషయంలో సిద్దపడని వారుగా ఉండొద్దు. నా ఉద్దేశ్యం ఆధ్యాత్మిక సిద్ధపాటు. మీరు సిద్ధంగా ఉంటే దాని ఆనందం మరియు ప్రభావం మీలో చాలా ఎక్కువగా ఉంటుంది!

కాబట్టి, మీరు సిద్ధంగా ఉండడానికి. . .

మొదట, మనకు రక్షకుడు అవసరమనే వాస్తవాన్ని ధ్యానించండి. క్రిస్మస్ అనేది ఆనందంగా మారడానికి ముందు మన మీద ఒక ఆరోపణ చేస్తుంది. “దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు” (లూకా 2:11). మీకు రక్షకుని అవసరం లేకపోతే, మీకు క్రిస్మస్ అవసరం లేదు. రక్షకుని అవసరం మనకు అత్యవసరమని గుర్తించనంత వరకు క్రిస్మస్ ప్రభావం మన మీద ఉండదు. ఆగమనానికి సంబంధించిన ఈ సంక్షిప్త ధ్యానాలు మీలో రక్షకుని అవసరం అనే చేదైన తీపి ఆలోచనను మేల్కొల్పడంలో సహాయపడతాయి.

రెండవది, స్వస్థబుద్ది గలవారై స్వీయ పరిశీలన చేసుకోండి. ఈస్టర్‌కి లెంట్ ఎలాగో క్రిస్మస్‌కు ఆగమనం అలాంటిది. “దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.” (కీర్తన 139:23-24). హృదయమనే ఇంటిని శుభ్రపరచడం ద్వారా ప్రతి హృదయం ఆయనకి గదిని సిద్ధం చేయనివ్వండి.

మూడవది, మీ ఇంట్లో-ముఖ్యంగా పిల్లల కోసం దేవుని గూర్చిన ఎదురుచూపులు, ఉత్కంఠ మరియు ఉత్సాహాం ఉండేలా చూడండి. మీరు క్రీస్తు గురించి ఉత్సాహంగా ఉంటే, పిల్లలు కూడా ఉంటారు. మీరు భౌతికమైన వాటితో మాత్రమే క్రిస్మస్‌ను నింపితే, పిల్లలకు దేవుని పట్ల దాహం ఎలా కలుగుతుంది? క్రీస్తురాజు రాక యొక్క అద్భుతాన్ని పిల్లలకు కనిపించేలా చేయడానికి మీ ఆలోచనలను వాడండి.

నాల్గవది, లేఖనాలను ఎక్కువగా చదవండి. అలాగే ముఖ్యమైన వాక్య భాగాలను గుర్తుంచుకోండి! “నా మాట అగ్నివంటిదికాదా? బండను బద్దలుచేయు సుత్తెవంటిది కాదా?” (యిర్మీయా 23:29). ఈ అడ్వెంట్ సీజన్‌లో ఆ అగ్గి మంట చుట్టూ చేరండి. అది వెచ్చగా ఉంటుంది. అది కృప యొక్క రంగులతో మెరిసిపోతుంది. అది అనేక బాధలకు మందు. అది చీకటి రాత్రులకు గొప్ప వెలుగు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...