తిరిగి జన్మించిన క్రైస్తవుడు తాను పొందిన రక్షణను పోగొట్టుకుంటాడా?
ఈ ప్రశ్నకు అద్భుతమైన, స్పష్టమైన, నొక్కిచెప్పబడుతున్న, సంతోషకరమైన, బైబిలు ప్రకారమైన మహిమగల జవాబు, ‘‘లేదు, పోగొట్టుకోడు.’’ తిరిగి జన్మించిన వ్యక్తి, చచ్చినవ్యక్తి కాదు, తిరిగి జన్మించిన వ్యక్తి జన్మించని వ్యక్తిగా మళ్లీ అవ్వలేదు. కేవలం, వేదాంతపరంగా కాకుండా, వీలైనంత వరకు వాక్యానుసారంగా ఉండటానికి ప్రయత్నిస్తూ, లేఖనానుసారమైన కొన్ని ఆలోచనలను మీముందుంచుతాను.
ఎవరు కూడా విడిచిపెట్టబడరు
ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు అనుగ్రహింపబడిన జీవం ఖచ్చితంగా నిత్యజీవమే. ‘‘ఆ సాక్ష్యమేమనగాదేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందున్నది’’ (1 యోహాను 5:10). ఈ లెక్కచొప్పున ఆయన మనకు తాత్కాలిక జీవము నియ్యలేదు. ఆయన మనకు నిత్యజీవమునిచ్చాడు. రాబోయే యుగం, నిత్య జీవంలో మనమిదివరకే పాల్గొంటున్నాము.
‘‘నీవు పిలువబడియున్నట్లయితే, నీవు నీ రక్షణను పోగొట్టుకొనవు.’’
మరొక అతిప్రధానమైన మాట – ‘‘ఎవరిని ముందుగా నిర్ణయించెనో.’’ ఇది రోమా 8:30 నుండి తీసుకోబడింది, ‘‘మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను’’ అని చదువుతాం. రక్షణ యొక్క శాశ్వతమైన చివరి స్థితి, మహిమపరచబడడం. ఈ వచనం, పిలువబడిన వారందరు – ఒక్కరు కూడ విడిచిపెట్టబడకుండా – నీతిమంతులుగా తీర్చబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడినవారందరు – ఒక్కరు కూడ విడిచిపెట్టబడకుండా – మహిమపరచబడ్డారు.
కాబట్టి, జవాబేమంటే, నీవు పిలువబడినట్లయితే, నీవు నీ రక్షణను పోగొట్టుకోవు. పిలవబడడం, తిరిగి జన్మించబడడం, ఈ రెండు కూడా, బైబిలుకు సంబంధించినంత వరకు ఒకే విధమైన వర్గానికి చెందినవని నేను వాదించబోతున్నాను. మనం నీతిమంతులముగా తీర్చబడతాం మరియు మనం మహిమపరచబడతాం, ఎందుకంటే మనము పిలువబడ్డాము – అంటే, మనము తిరిగి జన్మించబడ్డాము.
బ్రతికియుండడానికి పిలువబడ్డాము
పౌలు, రోమా 8:30లో చెబుతున్న పిలుపు, చనిపోయి పాతిపెట్టబడిన లాజరు, సమాధిలో నుండి లేచిరావాలని యేసు అతనికిచ్చిన పిలుపువంటిదైయుంది : ‘‘లాజరూ, నీవు చనిపోయావని నాకు తెలుసు. కాని ఇప్పుడు లేచి బయటికి రా’’ (యోహాను 11:43 చూడుము). పిలుపు, జీవాన్ని సృష్టిస్తుంది, ప్రాణము నిస్తుంది, గనుక క్రైస్తవుడైన ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇదే జరిగింది : దేవుని సార్వభౌమ పిలుపు జీవమును సృష్టించింది. అనగా, ఈ పిలుపుకు ఒక వాగ్దానం జోడింపబడియున్నదని అర్థం.
ఈ సంబందాన్ని చూపించే మరి కొన్ని వాక్యభాగాలున్నాయి. 1 థెస్స 5:23-24, ‘‘సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయునని’’ సెలవిస్తున్నది. కాబట్టి దీనికి సంబంధించిన విషయం ఇలా సారాంశంగా చెప్పొచ్చు : నీవు పిలువబడినట్లయితే, దేవుడు నమ్మకమైనవాడు, గనుక నీవు అంత్యదినము వరకును కాపాడబడతావు.
ఇంకొక వాక్యభాగం. 1 కొరింథీ 1:8-9, ‘‘ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.’’ గనుక ఇప్పుడు వెనక్కి వెళ్లి, (రోమా 8:30లో) పిలువబడినవారందరు ఎందుకు నీతిమంతులుగా తీర్చబడ్డారో, నీతిమంతులుగా తీర్చబడినవారందరు ఎందుకు మహిమపరచబడ్డారో చూడు – ఎందుకంటే, దేవుడు నమ్మతగినవాడు. దానంతట అదే జరిగేది ఏదీ లేదు.
ముందుగా నిర్ణయింపబడినవారు పదిలపరచబడుదురు
నిత్య భద్రత, ఒక వ్యాక్సినేషన్ (వ్యాధి నిరోధక సూదిమందు) వంటిదని చాలా మంది అనుకుంటారు. వారు, ‘‘ ఆరేళ్ల వయస్సులో, నేను ప్రార్థించాను, గనుక దేవుడు నా చేతికి వ్యాక్సినేషన్ వేశాడు. కాబట్టి, నరకదండన అనే వ్యాధి నాకు రాదు’’ అని అనుకుంటారు. అసలు విషయం ఇలాగ లేదు. గాని, విశేషంగా, ‘‘నీవు నా రోగివి. నేను చెప్పినట్లు నీవు చేయు, అప్పుడు నేను నిన్ను అంతము వరకు తీసికొని వెళ్తాను, అంత్యదినమందు నీవు ఆరోగ్యవంతుడవుగా ఉంటావని’’ చెప్పుతున్న వైద్యుని దగ్గర జీవితాంతము లభించే చికిత్సలో ప్రవేశించుట వంటిదై యున్నది.
విశ్వాసంలో పట్టుదలకు, నిలకడకు సంబంధించిన వచనాల్లో నేనెల్లప్పుడు ఇష్టపడే వాక్యం, యిర్మీయా 32:40 – ‘‘నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.’’ కాబట్టి యేసు తన స్వరక్తమిచ్చి ప్రవేశపెట్టిన క్రొత్త నిబంధన, సంరక్షణ, భద్రత యొక్క ఒడంబడికయై (నిబంధన) యున్నది. ఇది కేవలము యాంత్రికమైన ఏదో ఒక భద్రత కాదు. ఇది క్రియాశీలకంగా పదిలపర్చు, భద్రతనిచ్చు విధానమై యున్నది. నా జీవితంలో దేవుడు క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు.
‘‘విశ్వాసముతో కూడిన పట్టుదల మనము క్రీస్తునందు పాలివారముగా చేయబడినామనుటకు రుజువై యున్నది.’’
‘‘నీవు మరుసటి రోజు పొద్దున్నే నిద్ర లేచినప్పుడు క్రైస్తవుడవై యుంటావని నీకెలా తెలుసు?’’ అని నేను అడిగినప్పుడు, చాలా మంది ఈ ప్రశ్న పట్ల ఆశ్చర్యపోతారు. వారు, ‘‘ఓ, అందులో ఏముంది, మనము మనుషులమై యున్నాము కదా’’ అని జవాబిస్తారు. కాదు, మనము మనుషులమై యున్నందుకు కాదు. మరుసటి రోజు పొద్దున్నే నీవు క్రైస్తవుడవుగా మేల్కొంటావు, ఎందుకంటే దేవుడు నమ్మతగినవాడై యున్నాడు. దేవుడు నిన్ను మేల్కొల్పి ఆయన యందలి విశ్వాసములో నీకు మెలకువను కలుగజేస్తాడు.
ఆయన నమ్మకంగా కాపాడును
దేవుని నమ్మకత్వాన్ని, విశ్వసనీయతను ప్రముఖంగా తెలిపే యింకా కొన్ని వచనాలు చూద్దాము. ‘‘మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను’’ (ఫిలిప్పీ 1:3-6). దేవుని నమ్మకత్వం, తన పిలుపుతో, ఆయన అనుగ్రహించు నూతన జన్మతో సంబంధం కల్పించే విధానాన్నిబట్టి పౌలు ఇలా మాటలాడుతున్నాడు.
యూదా 23-24 వచనాలు చూడండి: ‘‘తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి.’’ కొంత కాలం క్రితం, నేను ఈ వచనం మీద ప్రసంగించాను, అప్పుడు నా వయస్సు 67 సంవత్సరాలు, నేను కాపరిగా నా పరిచర్యను ముగించబోతున్నాను. దేవుడు నన్ను కాపాడాడనే వాస్తవాన్నిబట్టి నేను అప్పుడు ఆనందభరితుడనయ్యాను.
ఆయన నన్ను భద్రపరిచాడు. ఆయన నన్ను పడిపోనీయలేదు, ఆయన నామానికి నింద రానీయలేదు, సంఘాన్ని నాశనం చేయలేదు. ఈ విషయం గూర్చి నేను గతాన్ని తలంచుకుంటూ, గర్వంగా, ‘‘ఆహా, నేనెంత మంచి పనివాడను కదా’’ అని అనను. గాని, ‘‘ఆహా, ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా ! చాలా ఆశ్చర్యమేస్తున్నది! ఈ ఘనత అంతా తొట్రిల్లకుండ నన్ను కాపాడిన, కాపాడనైయున్న ఆయనకే కలుగును గాక! ఆయనకే ఆపాదింపబడును గాక!’’ అని అంటాను.
మన హామీ, అభయము యొక్క లంగరు
ఇక మిగిలిందల్లా, అందరి మనస్సుల్లో ఎల్లప్పుడు ఉండే ఈ కీలకమైన ప్రశ్న: ‘‘ఔను గాని, సంఘంలో ఉన్నవారి సంగతేంటి? వారు డీకన్లు లేదా సంఘపెద్దలుగా ఉంటూ వచ్చారు, వారు తమ కళాశాల విద్యాభ్యాస సమయంలో రక్షింపబడినట్టున్నారు. ఈ సంఘంలో వారి సభ్యత్వం ఐదేళ్ల కంటే ఎక్కువే అయ్యింది. కాని వారిప్పుడు మునుపటిలాగ లేరు. అంతా తలకిందులై, గాలికి వదిలేసినట్టున్నది. కొందరు ఇదే స్థితిలో మరణిస్తున్నారు. వారి సంగతేంటి?’’ అనే ప్రశ్నలు.
విశ్వాసులు, వీటి గూర్చి సుదీర్ఘంగా, తీవ్రంగా ఆలోచించాల్సిన రెండు కీలకమైన వచనాలున్నాయని నేననుకుంటున్నాను. 1 యోహాను 2:19, ‘‘వారు మనలో నుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు., వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు. అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడునట్లు వారు బయలువెళ్లిరి.’’ ఈ వచనంలోని మనతో అనే మాటలు ‘‘మనతో తిరిగి జన్మించినవారు,మనతో క్రీస్తుతో కూడ అంటుకట్టబడినవారు’’ అని ఖచ్చితంగా అర్థమిస్తున్నాయి – గాని బయలువెళ్లిన వారు మనతో ఉన్నవారు కారు. అలా జన్మించినవారి వలె వారగపడ్డారు. వారు కొన్ని మంచి విషయాలు మాటలాడారు. వారు, ‘‘రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించినవారు (రుచిచూచినవారు)’’ (హెబ్రీ 6:5-6). కానీ, వారు దేవుని మూలముగా పుట్టినవారు కారు.
‘‘మరుసటి రోజు పొద్దున్నే నీవు క్రైస్తవుడవుగా మేల్కొంటావు, ఎందుకంటే దేవుడు నమ్మతగినవాడై యున్నాడు.’’
ఇంకా చెప్పాలంటే, నానా విధములైన ఆధ్యాత్మిక అనుభవాలు అనుభవించి కూడ నశించు మనుష్యులకు హెబ్రీ 6 ఒక పెద్ద అడ్డుబండగా ఉంటున్నది. గాని హెబ్రీ 3:13-15, ఈ పత్రికలో ఒక సంపూర్ణమైన, సమగ్రమైన కీలక వచనమై యున్నదని నేను భావిస్తున్నాను: ‘‘ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢవిశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన యెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.’’
హెబ్రీ పత్రిక రచయిత, ‘‘నీవు నీ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన యెడలనే, నీవు క్రీస్తులో పాలివాడవై యుంటావని’’ చెప్పడం లేదు. గాని, ‘‘మనకు క్రీస్తులో భాగస్వామ్యమున్నదని – అది మనము క్రీస్తుతో మన జీవితాలను మొదలుపెట్టినప్పటి నుండి ఉన్నదని మనమెరుగుదుము, ఎందుకంటే మనము అంతము మట్టుకు సహిస్తామని’’ చెప్తున్నాడు. అనగా, మనము క్రీస్తులో పాలివారముగా చేయబడి యున్నామనడానికి, విశ్వాసముతో కూడిన పట్టుదల రుజువై యున్నదని అర్థం.
ఈ పట్టుదల లేనప్పుడు, మనకెన్నడును ఈ నిశ్చయత కూడా లేనట్లే. కీలకమైన అంశం ఏమిటంటే : కాబట్టి, రక్షణ నిశ్చయత దానంతట అదే కలుగదు. ఇది సంపూర్ణంగా సార్వభౌముడైన, నిబంధనను కాపాడే దేవుని నుండి కలుగుతుంది. మనము ఆయన వైపు చూచునప్పుడు, మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చునట్లు పాపుల పక్షాన తన కుమారుని అనుగ్రహించిన (అప్పగించిన) దేవునిలోగల మన ధైర్యములో వేరుపారిన నిశ్చయతయై యున్నది (రోమా 8:16).
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web
One comment
Dear sir faithfull message thank you a lot 👍, what’s about revelation 2&3 chapters