సాతాను మన తలంపుల్లోనికి ఆలోచనలను పుట్టించగలడా?
ఈ మధ్య కాలంలో మనం ఆలోచనల గురించి, ఆలోచనలమయమైన మన జీవితాల గూర్చి చెప్పుకుంటున్నాం. ‘దేవుడు మన ఆలోచనలను తెలిసికొనగలడా?’ అని ఇంతకు ముందు మనం ప్రశ్నించుకున్నాం. ఈ ప్రశ్నకు, ఔను, దేవుడు మన ఆలోచనలను తెలిసికోగలడనేది అద్భుతకరమైన జవాబై యున్నది, మన ఆలోచనలు మాత్రమే కాదు గాని మన హృదయంలోని తాత్పర్యాలను కూడ అర్థంచేసికోగలడు. ఈ వాస్తవం మనలో ప్రతి ఒక్కరి విషయంలో విస్తారమైన అంతర్భావాలను కలిగి వుంటుంది. మనం చెప్పాలనుకొనేదానికి, మనం వాస్తవంగా చెప్పుతున్నదానికి మధ్య ఉన్న తేడాను దేవుడు తెలిసికోగలడనేది దీని భావం. ఈ వ్యత్యాసం ఎంత గంభీరమైనదో ఆయన గ్రహించగలడు. కాబట్టి మనం పాపపు మాటలు పలుకుట మానివేయడం ద్వారా దేవుని మహిమపరచగలం. మనం ఇంతకు మునుపు నేర్చుకొనిన మనోహరమైన అంతర్భావాల్లో ఇదొకటి.
ఇప్పుడు మన ఆలోచనలమయమైన జీవితాలకు సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్న గూర్చి ఆలోచించుదాం. గ్యార్రిక్ ఇలా అడుగుతున్నాడు: ‘‘పాస్టర్ జాన్, సాతానే మన తలంపుల్లోనికి ఆలోచనలను దూర్చగలడా?
“ఔను, పుట్టించగలడు, వాడు పుట్టిస్తాడు. అలాగైతే, ‘వాటిని మనమెలా గుర్తిస్తాం? వాటిని ఎలా ఎదిరిస్తాం? వాటి అధీనంలో ఉండకుండా ఎలా చూచుకోగలము? మొ॥ ప్రశ్నలు సహజంగానే వెంటనే తలెత్తుతాయి. దీనికి సంబంధించిన కొన్ని బైబిలు ఉదాహరణలు నేను చెప్పక మునుపు, సాతాను మన మనస్సుల్లోనికి ఆలోచనలను, మన హృదయాల్లోనికి లేదా శరీరాల్లోనికి కోరికలను చొప్పించడము ఒకదానితో మరొకటి చాలా దగ్గరి సంబంధంగల విషయాలై ఉన్నాయనే సంగతిని మనం గుర్తుకు తెచ్చుకొనడం మంచిది.
కొన్నిసార్లు వాడు పాపపు కోరికలను సూటిగా మన హృదయంలో పుట్టించి, ఆ పాపపు కోరికలను సమర్థించు ఆలోచనలు కూడ పుట్టించవచ్చు. కొన్నిసార్లు, ఈ పద్ధతిని తలకిందులు చేసి, పాపపు కోరికలకు దారితీసే మోసపూరితమైన ఆలోచనలను మన మనస్సులో పుట్టింపవచ్చు. గ్యార్రిక్, ఆలోచనల గూర్చి మాత్రమే అడుగుతున్నాడు, గాని ఆలోచనలు మరియు కోరికలు సన్నిహిత సంబంధంగలవై యున్నవి గనుక మనం ఈ రెండింటి గూర్చి తెలుసుకోవాలనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలచాను. కాబట్టి నా జవాబులో ఈ విషయాన్ని నేను నా మనస్సులో ఉంచుకుంటాను.
సాతాను మరియు మన పాపపు స్వభావం
‘‘సాతాను మన మనస్సుల్లో ఆలోచనలను వాస్తవంగా ఉంచుతాడా?’’ అనే గ్యార్రిక్ ప్రశ్న కలిగిన వాక్యభాగంతో మొదలుపెడదాం. యోహాను 13:2 చూడండి – ‘‘వారు భోజనము చేయుచుండగా (చివరి రాత్రి భోజనము – ప్రభుభోజన సంస్కారమును ఆచరించుచుండగా), ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించియుండెను.’’ యూదాలో ఆలోచన, తాత్పర్యము, కోరిక ఉన్నాయి. సాతాను ‘‘పుట్టించియుండెనని’’ యోహాను చెప్పుతున్నాడు.
ఇక్కడ మరొక విషయం స్పష్టంగా తెలుస్తున్నది. ఉద్దేశ్యం మరియు కోరిక అనేవి యూదా విషయంలో మరియు మన విషయంలో కూడ సొంత పాపపు స్వభావంలో నుంచి పుట్టుకరాలేదనేది దీని అర్థం కాదు. యోహాను 12:6లో, వాడు తన దగ్గర ఉండిన శిష్యులందరికి సంబంధించిన డబ్బు సంచిలో నుండి డబ్బులు దొంగిలించుచుండిన దొంగ అని వర్ణింపబడ్డాడు. వానికి బీదల మీద శ్రద్ధ లేదని వాక్యం చెప్పుతున్నది, అనగా వాడొక అబద్ధికుడని, దురాశగలవాడని అర్థమవుతున్నది. గనుక యేసు, యూదా వెంబడింపగోరిన మెస్సీయ అయియుండలేదని మనం దీని నుంచి చాల ఖచ్చితంగా భావించుకొనవచ్చు. వాని మనస్సులోను, హృదయంలోను అనేక ఇతర విషయాలు మెదలుచుండినవి. కాబట్టి ఇప్పుడు సాతాను చేయవలసిందెల్లా, యూదా యొక్క సొంత పాపపు స్వభావమునే తీవ్రతరం చేసి దానికి నిర్దేశమియ్యడమే. మన విషయంలో కూడ ఇది నిజం. సాతాను ఉంచే ఆలోచనలకు మనకై మనం తలంచే ఆలోచనలకు లేదా సాతాను ఉంచే కోరికలకును మనకై మనం ఆశపడే కోరికలకును మధ్య స్పష్టమైన, సూక్ష్మమైన తేడా ఏమీ లేదు.
‘‘మన సొంత పాపపు స్వభావం, ఒక ఆహ్వానము వంటిదై యున్నది, ద్వారం దగ్గర స్వాగతం పలికే చాప వంటిదై యున్నది, సాతాను కొరకు తెరవబడియున్న ద్వారమై యున్నది.’’
అది ఎలా అనేది మనకు సరిగ్గా తెలియదు. ఈ ‘ఎలా?’ అనే ప్రశ్నలే మనలను తికమక చేస్తుంటాయి, కాదంటారా? సాతాను వాని వికారమైన పని చేయబడేట్టు మన సొంత పాపపు స్వభావంతో ఎలా వ్యవహరిస్తాడో మనకు సరిగ్గా తెలియదు. గాని మన సొంత పాపపు స్వభావం, ఒక ఆహ్వానము వంటిదై యున్నది, ద్వారం దగ్గర స్వాగతం పలికే చాప వంటిదై యున్నది, సాతాను కొరకు తెరవబడియున్న ద్వారమై యున్నదని చెప్పడం సమంజసమవుతుంది. ఇదే విషయాన్ని ఎఫెసీ 4:26-27లో పౌలు ఇలా చెప్తున్నాడు – ‘‘కోపపడుడి గాని పాపము చేయకుడి., సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు, (తద్వారా) అపవాదికి చోటియ్యకుడి.’’ అనగా, పాపపు స్వభావంతో హృదయంలో పగపెట్టుకొనడం, సాతానుకు స్వాగతం పలుకడానికి ద్వారం దగ్గర చాప ఉంచినట్టేనని మరొక మాటలో చెప్పుకొనవచ్చు. ఇది మరొక విధంగా పనిచేస్తుంది. మోసపూరిత ఆలోచనలతో లేదా కోరికలతో మనం పాపము చేయాలని సాతాను సంతోషకరమైన సైగలు చేస్తూ మనలను పిలిచినప్పుడు, మన సొంత పాపపు స్వభావం పనిచేయడం మొదలుపెట్టి సాతాను పిలుపులను మరింత ఆకర్షణీయం చేస్తుంది.
కాపలాలేని మనస్సులు
‘‘సాతాను మన హృదయంలో తలంపులను ఉంచుతాడా?’’ అని గ్యార్రి అడిగిన ప్రశ్నకు జవాబుగా బైబిలులోని మరొక ఉదాహరణ చూద్దాము. అపొ 5:3 చూడండి. భార్యాభర్తలైన సప్పీర మరియు అననీయ ఏకమై, పొలము అమ్మగా వచ్చిన సొమ్ములో నుండి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టాల్సిన దానిలో నుండి కొంత దాచుకొని, అపొస్తలుల యొద్ద అబద్ధమాడుటకు నిర్ణయించుకొనిన సందర్భమిది. పేతురు, ‘‘అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను?’’ అని అడిగాడు. ‘‘మనం మన పొలమును అమ్మిన మొత్తము వెల గూర్చి అబద్ధం చెప్పి మన కోసం కొంత అదనపు సొమ్ము దాచుకొందామని’’ అననీయ మరియు అతని భార్య సప్పీర అనుకున్నారు. ఈ ఆలోచన ఒక ప్రణాళిక అయ్యింది, ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చింది, ఇప్పుడు ఈ ప్రక్రియ అంతటిని పేతురు, ‘‘సాతాను మీ హృదయాలను ప్రేరేపించెను’’ అని వర్ణించాడు. సాతాను, ఈ భార్యాభర్తల ప్రణాళికను, నిజాయితీ లేదా ఆరాధన కంటె మరి ఎక్కువగా కోరుకొనబడదగినదిగా చేశాడు. సాతాను ప్రణాళిక వారిని నింపివేసి వారి ఇతర ఆలోచనలు మరియు కోరికల నన్నింటిని గెలుచుకున్నాడు. ఇది వారికి ఖరీదైన పాపమే అయ్యింది (అపొ 5:5,10 చూడుము).
రాజైన దావీదు దేవుని చిత్తమునకు విరోధంగా ఇశ్రాయేలీయుల జనసంఖ్యను లెక్కించునట్టు సాతాను అతన్ని కదం తొక్కించిన విధానం ఇందుకు మరొక ఉదాహరణమై యున్నది. ‘‘తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు – ప్రజా సంఖ్య వ్రాయుటకు – దావీదును ప్రేరేపింపగా…’’ (1 దిన 21:1). సాతాను, దావీదు మనస్సులో ఒక ఆలోచనను ఉంచి, అది సైన్యపరంగా వివేకంతో కూడిన పనిగా అగపడునట్లు చేశాడు, గాని వాస్తవానికి అది దేవుని యందలి అపనమ్మకమయ్యింది. కాబట్టి, చివరకు దావీదు ఈ బుద్ధిలేని పనికి మారుమనస్సు పొందాల్సివచ్చింది.
మనం బైబిలు యొక్క ఆరంభ పుటల్లోనికి వెళ్లినప్పుడు, ఏదెను తోటలో హవ్వ మోసం చేయబడిన విధానం, సాతాను ఈ రోజుల్లో పనిచేస్తున్న విధానం వంటిది కాదని మనం అనుకొనవచ్చు, ఎందుకంటే ఆ మోసం అపవాదికి మరియు హవ్వకు మధ్య వాస్తవంగా జరిగిన సంభాషణ ద్వారా జరిగింది. గాని, ఏదెను తోటలో జరిగినట్టే మన విషయంలో దాడి జరుగవచ్చు గనుక మనం జాగ్రత్తగా, మెలకువతో ఉండాలని పౌలు చెప్పాడు. అతడు 2 కొరింథీ 11:3లో ఇలా చెప్తున్నాడు, ‘‘సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్టు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు యెడల నున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.’’ ఈ వచనం ప్రకారం, మన ఆలోచనలను దుర్నీతిమయముచేసి, మనం దారితప్పి తొలగిపోవునట్లు చేయడము సాతాను మన మనస్సుల్లో చేసే పని అని చెప్పబడుతున్నది. సాతాను దీనంతటిని ఎలా చేస్తాడో మనకు తెలియదు, గాని ఇది చేయబడుతున్నది., వాడు చేస్తున్నాడు. వాడు మన ఆలోచనలను సర్వనాశనం చేయగలడు, వాటిని వక్రీకరించి మనలను తప్పుదోవ పట్టించి క్రీస్తుకు విరోధమైనవాటిగాను పాపమునకు అనుకూలమైనవాటిగాను మార్చగలడు.
సత్యముతోకూడిన ఆయుధాలు
సాతాను మోసగాడు, అబద్ధికుడు, హంతకుడు అని దీనంతటి గూర్చి మనస్సులో ఉంచుకోవలసిన ప్రధానమైన వాస్తవమై యున్నది. వాడు మోసగిస్తూ, అబద్ధాలాడుతూ – కొన్నిసారు సగం సత్యమే చెప్తాడు, గాని ఎల్లప్పుడు మోసంతోనే, హత్యతో కూడిన ఉద్దేశంతోనే – వాని నాశన కార్యాన్ని చేస్తాడు. ప్రకటన 12:9 చూడండి, ‘‘కాగా సర్యలోకమును మోసపుచ్చుచు, అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను.’’ యోహాను 8:44 – ‘‘ఆది నుండి వాడు (అపవాది) నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు., వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము ననుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.’’
వాని ఆలోచనలన్నియు, తప్పుదోవ పట్టించేవే అయ్యున్నాయని మరొక మాటలో చెప్పవచ్చు. అవన్నీ పెడదోవ పట్టించే తలంపులు. అవి సగం సత్యమైనవైనా లేదా పూర్తిగా అబద్ధాలైనా, అన్నీ తప్పుదారి పట్టించేవే. వాని అద్భుతకార్యాలన్నియు అబద్ధమే ` అనగా, అబద్ధానికి ప్రయోజనము చేకూర్చునవి (2 థెస్స 2:9) – అనగా, వానికి విరోధమైన స్థిరమైన ఆయుధం సత్యమై యున్నది, సత్యమునందలి విశ్వాసమై యున్నదని అర్థం.
పౌలు ఈ విషయాన్ని 2 తిమోతి 2:24-26లో ఈ విధంగా చెప్తున్నాడు. మనం మనలను వ్యతిరేకించువారిని, ‘‘సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడువారికి మారుమనస్సు దయచేయును’’ అనే ఉద్దేశ్యంతో సాత్వికముతో సరిదిద్దాలి. తత్ఫలితంగా, ‘‘సాతాను తన యిష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరు.’’ వాడు చేసే విధానం ఇదే: సత్యవిషయమైన అనుభవజ్ఞానము కలుగనీయకుండుట. యేసు, ‘‘మీరు సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయునని’’ సెలవిచ్చాడు (యోహాను 8:32).
2 తిమోతిలోని వాక్యభాగాన్ని చదవడం కొనసాగిద్దాం, నేను 24-26వ వచనం మధ్యలో ఆపేసినట్టున్నాను కదా. ‘‘. . . సాతాను తన యిష్టము చొప్పున చెరపట్టిన వీరు, వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరు’’ (2 తిమోతి 2:24-26). వాడు (సాతాను) వారిని ఎలా చెరపట్టాడు? వారు అబద్ధాల్లో, అసత్యాల్లో చిక్కుకొనునట్లు చేశాడు. వారి హృదయాల్లో అబద్ధాలనుంచుతూ, సత్యము కంటె తప్పే శ్రేష్ఠమైనదని, నీతి కంటె పాపమే ఉత్తమమని వారిని మోసంచేస్తూ, అబద్ధాన్ని నమ్మునట్లు వారిని పట్టుదలతో ఒప్పించాడు. గనుక సత్యమే పలుకుచు నీతితో కూడిన ప్రేమను చూపడం దీనికి విరుగుడు లేదా పరిష్కారమని పౌలు సెలవిస్తున్నాడు.
సరిగ్గా ఇదే విషయం మనకు ఎఫెసీ 6: 11-18లో దొరుకుతుంది. ‘‘మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.’’ ఆ తరువాత సర్వాంగ కవచములోని ఆరు వేర్వేరు ఆయుధాలు పేర్కొనబడినవి. ఈ ఆరింటిలోని నాలుగు సూటిగా సత్యమునకు సంబంధించినవై ఉన్నాయి, ఎందుకంటే అపవాది పన్నాగాలన్నీ అబద్ధాలే. గనుక మనం సత్యముతో మనలను మనం మరియు ఇతరులను కాపాడుకొందాము:
1. నడుముకు సత్యమను దట్టి (ఎఫెసీ 6:14)
2. కాళ్లకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు (ఎఫెసీ 6:15)
3. దేవుని వాక్యమను ఆత్మఖడ్గము (ఎఫెసీ 6:17)
4. దేవుని వాక్యమందలి విశ్వాసమనెడి డాలు (ఎఫెసీ 6:16)
‘‘సాతాను మన మనస్సుల్లో తలంపులను ఉంచవచ్చు, గాని మనం వాటిని గుర్తించి త్యజించడానికి మనకవసరమైన సమస్తమును దేవుడు మనకిచ్చాడు.’’
నీ చేతిలో ఒక ఖడ్గము వలె దేవుని వాక్యమున్నది. డాలును పైకెత్తి పట్టుకో. సత్యమనెడు దేవుని వాక్యమునందు నమ్మకముంచు.
సాతాను అబద్ధాలను త్యజించుట
గ్యార్రిక్ అడిగిన ప్రశ్నకు ఇవ్వబడిన జవాబు చాలినంత స్పష్టంగా ఉన్నదని నేను భావిస్తున్నాను. ఔను, సాతాను మన మనస్సుల్లో తలంపులను ఉంచగలడు, గాని మనం వాటిని గుర్తించి త్యజించడానికి మనకవసరమైన సమస్తమును దేవుడు మనకిచ్చాడు. మన మనస్సులోనికి వచ్చే ప్రతి తలంపు గూర్చి ప్రశ్నించుకోవలసిన అవసరమున్నదని నేను భావిస్తున్న కొన్ని చక్కని ప్రశ్నలు ఇక్కడ ఇవ్వబడినవి.
1. ఈ ఆలోచన లేఖనాల విషయంలో అబద్ధమా?
2. ఈ ఆలోచన క్రీస్తు మహిమ విషయంలో అబద్ధమా?
3. ఈ ఆలోచన క్రీస్తును ఘనపర్చు ఇతరుల యెడలగల ప్రేమ విషయంలో అబద్ధమా?
4. ఈ ఆలోచన పవిత్రత విషయంలో అబద్ధమా?
5. ఈ ఆలోచన పాపాన్ని ఆకర్షణీయమైనదానిగాను, పరిశుద్ధతను అనాకర్షణీయమైనదిగాను చేయుటకు ప్రయోజనకరమవుతుందా?
ఈ ప్రశ్నలలో దేనికైనను ‘ఔను’ అని జవాబు వచ్చినట్లయితే, మనం ప్రకటన 12:11ను జ్ఞాపకంచేసుకోవాలి. ఈ వచనంలో యోహాను ఇలా చెప్పుతున్నాడు, ‘‘వారు గొఱ్ఱెపిల్ల రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని (సాతానును) జయించియున్నారు గాని, మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించినవారు కారు.’’ అనగా, మనం మనలను ప్రేమించి, మన కొరకు తననుతాను అప్పగించుకొనిన క్రీస్తు వైపునకు మళ్లి, ఆ తరువాత తన ఉన్నతమైన విలువతో కూడిన సహాయకరమగు అమూల్యమైన వాగ్దానాలను పట్టుకొని, ‘‘క్రీస్తే నా సత్యము. క్రీస్తే నా నిక్షేపము. కంటికి కనబడకుండా ఇక్కడ నుండి వెళ్లిపో!’’ అని సాతానుకు సాక్ష్యమిస్తామనియు మరొక మాటలో చెప్పుకొనవచ్చు. గనుక మనం క్రీస్తువైపు మళ్లి, క్రీస్తుతో కూడ సత్యమందు నడుచుకొందాం.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web