డిజైరింగ్ గార్డ్ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు మరియు బోధకుడు అయిన జాన్ పైపర్ గారితో ఇంటర్వ్యూ
పాస్టర్ జాన్ గారూ, మీరు ఇటీవల రాసిన పుస్తకాన్ని గురించి గతవారంలో మాట్లాడుకున్నాం. దాని వెలుగులో, నార్త్ కెరోలిన లోని చార్లెట్ నుండి బ్రాడెన్ అనే వ్యక్తి ఈ విధంగా రాసి అడుగుతున్నాడు, “పాస్టర్ జాన్ గారూ, మీరు క్రీస్తు కేంద్రితంగా చేస్తున్న పరిచర్య యొక్క యదార్థతను బట్టి, ఫలితాలను బట్టి మీకు కృతజ్ఞతలు. ఇంత పెద్ద మొత్తంలో కంటెంట్ ని మీరు ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నారు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. పొద్దున్నే మీరు ఏ సమయానికి నిద్ర లేస్తారు? అంత ఎక్కువగా చదవటానికి, రాయటానికి మరియు అవసరమైన ఇతర పనులను చేసుకోవడానికి మీకు సమయము ఎలా దొరుకుతుంది? టీవీ చూడటం మీరు ఇష్టపడరని “నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు” అనే పుస్తకంలో ప్రస్తావించారు. అయితే క్రీస్తు కొరకు అత్యంత ఎక్కువ ప్రయోజనకరంగా జీవించటానికి రోజువారీ దినచర్యను ఎలా తయారు చేసుకోవాలో దయచేసి తెలుపగలరు?”
1. ఇతరులతో పోల్చుకోనే మనస్తత్వాన్ని విసిరి పారేయండి.
మొట్టమొదటిగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు నావలే ఉండాలని అనుకుంటున్నట్లయితే, అలా ఆలోచించకుండా జాగ్రత్తపడండి. నా జీవితంలోని పాపాలు మీకు తెలియవు, నేను ఎంత నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నానో మీకు తెలీదు, వీటిని బట్టి నేను ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో మీకు తెలీదు. అయితే మనం సంపూర్ణులముగా ఎలా అవ్వగలము? అనేది అసలు ప్రశ్న. క్రీస్తును ఘనపరిచే విధంగా, దైవకేంద్రితంగా, వాక్యముతో మమేకమైపోయే విధంగా, ప్రేమగా, వినయముగా, పనిలో ముందుకెళ్లే వారిగా, న్యాయమును కోరే వారిగా, ఇతరులకు సేవ చేసేవారిగా మీరు మారగలరు. ఇతరులను బట్టి మిమ్మల్ని మీరు కొలుచుకోకండి. క్రీస్తులో మీకున్న సంభావ్యతతో(మీ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించే అవకాశం) మిమ్మల్ని మీరు కొలుచుకోండి . మీరు ప్రశ్న అడిగిన విధానాన్ని బట్టి నేను ఈ విషయాన్ని మీకు మొట్టమొదటిగా చెప్పాలనుకున్నాను.
2. గొప్ప అవకాశాల మీద మీ దృష్టి నిలపండి.
మీ జీవితంలో 10 శాతం మీ ఉత్పాదకతకు(చేయాలనుకున్న పనులను చేయగలగటం) అడ్డుపడే అవరోధాలను నివారించుటకు మరియు 90 శాతం గొప్ప లక్ష్యాలను సాధించే విషయంలో త్వరపడుటకు, మీ పూర్ణ శక్తితో వాటి సాధనకై ప్రయత్నించుటకు మీ దృష్టిని నిలపండి. ఉత్పాదకతకు అడ్డంకులను నివారించడం ద్వారా చాలా తక్కువ మంది మాత్రమే ఉత్పాదకతను పొందుతారు. దీని మీద మాత్రమే మీ దృష్టి నిలపటం అంత మంచిది కాదు. దీన్నిబట్టి మనకు ఉత్సాహము కలగదు, లక్ష్యాన్ని సాధించాలనే ప్రేరణ కూడా మనకు కలగదు.
“ఇతరులను బట్టి మిమ్మల్ని మీరు కొలుచుకోకండి. క్రీస్తు నందు మీ సామర్థ్యాన్ని బట్టి మిమ్మును మీరు కొలుచుకోండి.”
దీని గురించి చాలామంది పుస్తకాలు రాసి చాలా డబ్బు సంపాదించారు కానీ విలువైనదేదీ ఆ విధానంలో సాధించలేం. గొప్పవి, మహిమ కరమైనవి, అద్భుతమైనవియునైన భవిష్యత్తవకాశాలు మిమ్మల్ని ఆకర్షించి, మీ పూర్ణ శక్తితో మీరు వాటిని సాధించడానికి ప్రయత్నించేలా విలువైన విషయాలు మిమ్మల్ని చేస్తాయి. ఆ తర్వాత మీ మార్గము నుండి అవరోధాలను తొలగించుకొవటానికి ప్రయత్నం చేయవచ్చు. చీపురుతో ఊడ్చి పారేయడం లాంటి ఈ పది శాతం పనిని మీరు చేయాల్సి ఉంటుంది.
3. మీ జీవితంలోని సొంత కాలములను మనస్కరించండి.
మన జీవితంలోని వేర్వేరు కాలాలు ఒకదానికొకటి ఎంతో భిన్నంగా ఉంటాయి. మీకు పెళ్లై, పిల్లలుంటే అలాంటప్పుడు మీరు మీ పిల్లల మీద ఎక్కువ దృష్టి నిలపాల్సిన కాలమది. దేవుని చిత్తమైతే మీ జీవితంలో భిన్నమైన అవకాశాలు, ప్రాధాన్యతలతో మరొక కాలం ఉంటుంది. మీరు ప్రస్తుతం ఉన్న కాలంలో, ప్రస్తుత తప్పనిసరి అవసరతలకనుగుణంగా మీ పూర్ణ శక్తితో మీ దృష్టిని నిలిపి జీవించినట్లైతే ప్రభువు సంతోషిస్తాడు.
4. మీ జీవితాశయాన్ని తెలుసుకోండి.
మీ శక్తి యుక్తులన్నీ ధార పోస్తే తప్ప సాధించడానికి వీలుపడని మీ అతిపెద్ద జీవితాశయాన్ని గురించి మీరు తీవ్రంగా ఆలోచించండి, ప్రార్థించండి. ఫిలిప్పీ1:19-21లో వాక్యానుసారంగా నేను చెప్పాలనుకున్న విషయం వ్యక్తపరచబడింది. ఇవి పౌలు గారు చెప్పిన మాటలు మాత్రమే కాదు గానీ, జాన్ పైపర్ అను నేను కూడా చెప్పాలనుకుంటున్న మాటలు:
“మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే యిప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగా నైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా …… నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.” కాబట్టి, మన బ్రతకు ద్వారా నైనా సరే చావు ద్వారా నైనా సరే క్రీస్తు మహిమ పరిచబడే విధంగా, క్రీస్తు కొరకైన ఆసక్తిని ఇతరుల జీవితాల్లో వ్యాపింప చేయటం — అదే నా గురి, అదే నా లక్ష్యం. అది చాలా పెద్దది మరియు విస్తృతమైన లక్ష్యం. మీ లక్ష్యాన్ని మీరు తెలుసుకోండి, మీరు చేసే ప్రతీ పనిలో మీ లక్ష్య సాధనకై పాటుపడండి.
5. మీరు దేని విషయమై లెక్క అప్పగించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారో దాని విషయమై జాగ్రత్త పడండి.
జీవముగల దేవుని ఎదుట వాక్యానుసారమైన జవాబుదారితనమును గూర్చి అవగాహన కలిగి ఉండండి. సువార్తను మరియు సువార్త మనలో ఏ విధంగా పని చేస్తుందో అనే విషయాన్ని అర్థం చేసుకోండి. దేవుని చేత అంగీకరించబడడానికి, ఆయనతో సత్సంబంధాన్ని పొందటానికి మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. వీటి కోసం మనం సొంత ప్రయత్నాలు చేయాలని అనుకుంటే, మనం సువార్తను సరిగ్గా అర్థం చేసుకున్నట్టు కాదు. దేవునితో సత్సంబంధాన్ని ఇప్పటికే కలిగియున్నాం కాబట్టి పొద్దున మొదలుకొని రాత్రి వరకు మన పూర్ణ శక్తితో కష్టపడేది దేవునితో సత్సంబంధాన్ని పొందడానికి కాదు. ఫిలిప్పి2:12-13 : “మీ సొంత రక్షణను భయముతోనూ వణకుతోను కొనసాగించుకొనుడి, ఎందుకనగా మీలో కార్యసిద్ధి కలగచేయువాడు దేవుడే [ఆధారము, పునాది].” ఇది సువార్త లోని శక్తిశీలమైన విషయము.
“అయినను నేనేమైయున్నానో అది దేవుని కృప వలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను,నాకు తోడైయున్న దేవుని కృపయే.” (1కొరింథీ15:10). నాలో దేవుని కృప ఇప్పటికే నివసిస్తున్నది, పనిచేస్తున్నదని పౌలు గారు చెప్తున్నారు. ఈ క్రమాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే, ఈ జీవితంలో మీరు ఎంతో సాధించొచ్చు గాని మీరు చదివిన పుస్తకాలు, మీరు కట్టిన భవనాలు, మీరు సాధించిన వాటన్నిటిని తీసుకొని నేరుగా నరకానికే వెళ్తారు.
“మీ జీవితంలో మీరున్న కాలంలో ప్రస్తుత డిమాండ్లకనుగుణంగా మీ పూర్ణ శక్తితో మీ గమనాన్ని నిలిపి జీవించండి .”
అంత్య దినమున మనం ఆయన ఎదుట నిలబడ్డప్పుడు మనం ఏ విధంగా లెక్క అప్పగించాల్సినవారంగా ఉన్నామో దాని తీవ్రతను “తలాంతుల ఉపమానము” ద్వారా ఏసుప్రభు బోధించాడు (మత్తయి 25:14–30). ఆయన ఒకనికి ఐదు తలాంతులను, మరొకనికి రెండు, మరొకనికి ఒకటి ఇచ్చాడు. లెక్క చూసుకోవడానికి ఆయన వచ్చినప్పుడు ఒక్క తలాంతు తీసుకున్నవాడు ఈ భయంకరమైన మాటలు వినాల్సి వచ్చింది : “సోమరివైన చెడ్డదాసుడా” (మత్తయి25:26). నా విషయంలో ప్రభువు నోట నుండి ఈ మాటలు నేను వినాలనుకోవట్లేదు.
నేను, లూకా12:42లో చెప్పబడిన విధముగా వీటికి పూర్తి భిన్నమైన మాటలు వినాలనుకుంటున్నాను: “తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు?” నేను పాస్టరైన తర్వాత ఈ మాటల గురించి తరచుగా ఆలోచించే వాడిని. “తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడు”లా నేను ఉన్నాను (లూకా12:42). “ఎవని ప్రభువు వచ్చి, వాడు ఆలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు” (లూకా 12:43).
నేను వర్తమానము చెప్పడానికి సిద్ధపడుతూ ఉంటాను, లేక ఏదో రాసుకుంటూ ఉంటాను, లేక కుటుంబ ప్రార్థన నడిపిస్తూ ఉంటాను. మరియు నేను ప్రభువుతో ఈ విధంగా అంటాను: “ఏసుప్రభువా మీరు ఇప్పటికిప్పుడు వస్తే, నేను ఈవిధంగా చేస్తూ ఉండటం మీరు కనుగొంటారు.” సోమరివైన చెడ్డ దాసుడు దేవునిచే తనకివ్వబడిన తలాంతును ఉపయోగించకుండా పాతిపెట్టిన దానికి పూర్తిగా భిన్నమైన రీతిలో నేను చేస్తూ ఉంటాను.
6. పనిని వెంటనే చేయండి
దేవుని ఎదుట మీకున్న జవాబుదారీతనానికి తోడుగా, అత్యవసర భావనను జోడించుకోండి:
“పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు.” యోహాను 9:4. లేదా ఏఫేసి 5:15-16: “దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.” లేదా కొలస్స.4:5 “సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి.” దీనంతటిలో అత్యవసర భావన, త్వరిత వైఖరి కనపడుతుంది. దినములు చెడ్డవి, రాత్రి వచ్చేస్తుంది.
7. పూర్ణ హృదయముతో లేకపోవటాన్ని త్యజించండి.
నీవేం చేసినా నీ పూర్ణ హృదయంతో చెయ్యి. సగం సగం మనసుతో చేయొద్దు. జీవితములో ముందుకెళ్లేటప్పుడు చాలా మంది కుంటుతూ వెళ్తారు, పూర్ణ హృదయముతో కాకుండా సగం సగం మనసుతో, సగం సగం శక్తితో బ్రతుకుతారు. మీరు ఏదైనా విలువైన పని చేస్తుంటే ఆ పనిని మీ పూర్ణ మనసుతో చేయటం మంచిది. ప్రసంగి 9:10: “చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము.”
గత 30 సంవత్సరాలుగా తాను చెప్పిన మాటలన్నిటికంటే, జోనాథన్ ఎడ్వర్డ్స్ యొక్క నిర్ణయాలలో ఒకటి నన్నెక్కువగా ప్రభావితం చేసింది — ఆయన చెప్పిన మాటలు, అంటే అన్నీ కాకపోయినా కనీసం తన నిర్ణయాల గురించి రాసిన మాటలైనా అనుకోవచ్చు. వాటిలో ఒక నిర్ణయాన్ని గురించి ఇలా చెప్పాడు “నేను బ్రతికున్నంత వరకు, నా పూర్ణ శక్తితో నేను బ్రతకాలని నిర్ణయించుకున్నాను.” చాలా కాలం నుండి ఈ మాటలు నన్ను గట్టిగా పట్టుకున్నాయి. అప్పుడు నేను “అవును ప్రభువా”, అని అనుకొన్నాను.
దీనికి పూర్తి భిన్నమైన విషయాన్ని గురించి ఒక్క నిమిషం ఆలోచించండి: సామెతల గ్రంథంలో “సోమరి” అనే పదం 14 సార్లు ప్రస్తావించబడింది. ఇది అంత మంచిగా అనిపించని పదం, కదా? సోమరి అని 14 సార్లు ఉంది. సోమరి అంటే ఎవరు? సామెతలు 20:4: “విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.” సోమరిగా ఉండాలని మనం అనుకోము కదా.
8. ముందుకు సాగిపోండి.
ఎన్నో గొడ్డలి దెబ్బలు ఒక పెద్ద చెట్టును పడేస్తాయి. 1000 సార్లు గొడ్డలితో కొట్టినప్పటికీ చెట్టు పడిపోలేదు అనుకోండి, మనం ఎంత తొందరగా నిరుత్సాహానికి గురవుతాం. రాబిన్సన్ క్రూసో అనే నవల వినడం నేను ఇందాకే పూర్తి చేశాను. “అరే, ఏంటి జాన్ పైపర్ గారూ, యవనస్తులు చదివే నవలను మీరు వింటున్నారా?” అని మీరు నన్ను అడగవచ్చు. ఈ క్లాసిక్స్ నేను ఇంతకుముందు ఎన్నడు వినలేదు కాబట్టి ఇప్పుడు వింటున్నాను.
“ఏదైనా చేయటం విలువైనది అని మీరు భావిస్తే, దానిని మీ పూర్ణ హృదయముతో చేయటం ఎంతో విలువైనది.”
రాబిన్సన్ క్రూసో, ఒక ద్వీపంలో ఒంటరిగా ఉండిపోయాడు, తప్పించుకోవాలనుకుంటున్న తనకు ఒక పడవ అవసరమైంది. ప్రధాన భూభాగము 45 మైళ్ల దూరంలో ఉంది. అక్కడ నరమాంస భక్షకులు ఉండే అవకాశం ఉంది. తాను కచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నాడా లేదా అనేది తనకే స్పష్టత లేదు, కానీ తనకు పడవ అవసరం అని మాత్రం భావించాడు. తనకు వేరే పనేమీ లేదు, కాబట్టి తనంతట తానే పడవను తయారు చేసుకోవాలనుకున్నాడు. దానికోసం తనకు ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టు దిగువన ఐదు అడుగుల పది అంగుళాలు ఉంటుంది. తన దగ్గర ఒక గొడ్డలి ఉంది. ఆ చెట్టును నరికేయడానికి 22 రోజులు, కొమ్మలను నరికేయడానికి మరో 14 రోజులు మరియు పడవను పూర్తి చేయడానికి ఒకటిన్నర సంవత్సరం పడుతుంది – ఇదంతా ఆ గొడ్డలి సాయంతో మాత్రమే చేసాడు.
ఒక రోజు, రెండు రోజులు చెట్టు కొట్టడానికి ప్రయత్నం చేసిన తర్వాత, “ఈ చెట్టును పూర్తిగా పడేయలేకపోతున్నాను. ఇక పనిచేయటం నావల్ల కాదు అని ఆ చెట్టును కొట్టడం విడిచిపెట్టి దానికన్నా చిన్న చెట్టును వెతుక్కుంటాను అని అనుకుంటాము. అయితే, దీనికి పరిష్కారము ఉంది. ఎన్నో గొడ్డలి దెబ్బలు ఒక పెద్ద చెట్టును పడేస్తాయి. మీరు ఏదైనా గొప్పగా చేయాలనుకుంటున్నారా? నిష్క్రమించొద్దు. ప్రయత్నిస్తూనే ఉండండి.
9. కష్టమైన పనులను ఆనందంగా ఎదుర్కొండి.
మీరు మొదటిసారిగా ఆలోచించినప్పుడు మీకు సహజంగా చేయటానికి ఇష్టంమనిపించని విషయాలను, చేయటానికి కష్టమనిపించే చాలా విషయాలను సంతోషంగా చేయడానికి ఇష్టపడండి. మీరు సహజంగా చేయాలనిపించే విషయాలను మాత్రమే చేసుకుంటూ పోవటం ఎవరైనా చేయగల విషయమే, కానీ, చేయాల్సిన విషయాల గురించి ఆలోచించినప్పుడు మొదట్లో కష్టంగా అనిపించినప్పటికీ వాటిని చేయటం కంటే జీవితంలో విలువైనది మరొకటి ఉండదు. మొదట్లో కష్టంగా అనిపించిన విషయాలు మీ జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సంతోషంగా చేయటం నేర్చుకోండి.
10. మీ పిలుపుకు క్రీస్తుతో ముడిపెట్టి కొనసాగండి
ఆఖరిగా, మీరు చేయాల్సిన పనిని గురించి మీరు తెలుసుకోండి – దేన్ని చేయటం మీరు సంతోషిస్తారో దాన్ని తెలుసుకోండి. మీ బలహీనతలు, మీ బలాలన్నిటితో, క్రీస్తు కొరకు మరియు ఆయన రాజ్యము కొరకు మీ శక్తి యుక్తులన్నీ మీ ప్రేమనంతటిని వెచ్చించండి.