మీ ప్రార్థన జీవితాన్ని ఉజ్జీవింపచేయడానికి ఏడు సాధారణ సూచనలు

మీ ప్రార్థన జీవితాన్ని ఉజ్జీవింపచేయడానికి ఏడు సాధారణ సూచనలు

షేర్ చెయ్యండి:

నేతన్ అనే పాడ్ కాస్ట్ శ్రోత ప్రార్థన గురించి ఈ విధంగా అడిగాడు. “పాస్టర్ జాన్ గారు, ఈ 2016లో  నా ప్రార్థనా జీవితానికి  ఉజ్జీవం కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తాను అని నేను చెప్పినప్పుడు నేను నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను. నేను ప్రార్థనను గూర్చి అనేక వేదాంతాలను చదివాను, కానీ ఇతరుల కోసం, ముఖ్యంగా జీవిత భాగస్వామి, పిల్లలు, కోల్పోయినవారు, నాయకులు,స్నేహితులు, అనారోగ్యంతో ఉన్నవారు మొదలైన వారి కోసం ప్రార్థించడానికి ఏదైనా ఆచరణాత్మక సూచనలు లేదా పద్ధతులను చెప్తే వినడానికి నేను ఇష్టపడతాను. నా ప్రార్ధనా జీవితాన్ని ఉత్తేజపరచడానికి మీ వద్ద ఏమైనా సలహాలు ఉన్నాయా?”

ప్రార్థించడానికి మనము పిలువబడ్డాము

ఇది అందరికీ తెలిసిన విషయంగా అనిపించవచ్చు, కానీ నా బాధ్యతలను అస్పష్టంగా కాకుండా లేఖనాలలో సూటిగా చూసి  బైబిల్ ఏమి చెబుతుందో అర్థం చేసుకోవడం ద్వారా నిజమైన ప్రేరణ లభిస్తుంది అన్నది నా వ్యక్తిగత అనుభవం. కాబట్టి నేతన్ కు మరియు మనకు సహాయపడటానికి మనం అక్కడ ప్రారంభిద్దాం, ఎందుకంటే బహుశా మనమందరం అదే కోరికను కలిగియున్నాము.

ఇతరుల కొరకు క్రమం తప్పకుండా ప్రార్థన చేసే అలవాటున్న నేతన్ యొక్క కోరికను బైబిలు ప్రశంసిస్తుంది; ప్రత్యేకంగా, స్పష్టమైన ఆదేశాల ద్వారా  మరియు అనేక ఉదాహరణల ద్వారా ప్రశంసిస్తుంది. ఉదాహరణకు, యాకోబు 5:16లో “మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరుస్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి” అని వ్రాయబడి ఉంది. కాబట్టి తన కోరిక దేవుడు కోరుకున్న దానికి అనుగుణంగా ఉందని నాథన్ మనస్ఫూర్తిగా భావించాలి. ప్రార్ధించండి. ఇతరుల కోసం ప్రార్ధించండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి.

“ప్రార్థి౦చమని దేవుడు మనకు చెబుతాడు, ఆ తర్వాత ఎలా చేయాలో కూడా మనకు చాలా ఉదాహరణలు ఇస్తాడు.”

ఆ వచనంలో “ఒకనికొరకు ఒకడు” అంటే ఎవరుతోనైతే మీరు సంబంధాలు కలిగివుంటారో వారి కొరకు మీరు ప్రార్థించవలసి ఉంది. వారి కొరకు మాత్రమే కానప్పటికీ, మీరు ప్రార్థన చేసే వారిలో ఖచ్చితంగా వారు ఉండాలి. వారి కోసం ప్రార్థించండి. అలా చేయడం దేవుడిని సంతోషపెట్టడమే అవుతుంది. మనం మోకాళ్లపై ఉండి వారి కోసం మధ్యవర్తిత్వం వహించినప్పుడు, ఆయన చెప్పింది చేసే వారమవుతాం. దేవుడు అది చూసి చిరునవ్వు నవ్వుతున్నాడనే మధురమైన, ఓదార్పు భావాన్ని అది మనకు ఇవ్వాలి.

ఇతరులను వెంబడించడం

మనం ఏమి చేయాలో అనే దానికి ఆజ్ఞలు మాత్రమే కాదు, ఉదాహరణలు కూడా లేఖనాలలో ఇవ్వబడ్డాయి. పౌలు తన బంధువుల కోసం ప్రార్థిస్తున్న ఉదాహరణలు లేఖనాలలో ఉన్నాయి, “సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణపొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై యున్నవి” (రోమా 10:1). రక్షించబడాలని కోరుకునే ప్రజల కోసం పౌలు హృదయపూర్వకంగా తన తండ్రికి ప్రార్థించడాన్ని చూసినప్పుడు ఎన్నిసార్లు ప్రోత్సహించబడ్డానో నేను మీకు చెప్పలేను.

కాబట్టి లేఖనంలోని ఆ మాటలు ఎంతో ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని ఇచ్చి మనం ముందుకు వెళ్ళడానికి బలపరుస్తాయి. ఆయన అక్కడ అవిశ్వాసుల కోసం ప్రార్థిస్తున్నాడు, కానీ ఎఫెసీ 1, ఎఫెసీ 3, కొలస్సీ 1, ఫిలిప్పీ 1 లలో విశ్వాసుల కోసం కూడా ప్రార్థిస్తాడు. పౌలు యొక్క ఆ గొప్ప ప్రార్థనలు, ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయో.

నేను నేతన్ను, అలాగే మనందరినీ ఇలా ప్రోత్సహిస్తాను: పౌలు ప్రార్థనలను ఎక్కువసేపు ధ్యానించండి మరియు వాటి ద్వారా ప్రార్థించండి. ఫిలిప్పీ 1లోని ఒక ఉదాహరణ: “మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు, క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను.” (ఫిలిప్పీ. 1:9,11).

ఇతరుల కోసం ప్రార్థించడానికి నన్ను ప్రేరేపించడంలో, ఎలా చేయాలో నాకు చూపించడంలో, నా కోసం మాదిరి చూపించడంలో పౌలు చేసిన ఈ ప్రార్థనలు ఎంతో విలువైనవిగా భావిస్తున్నాను. ఇతరుల కోసం ప్రార్థించడానికి  ఆ ప్రార్థనలు మీలో ఒక భాగంగా చేసుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.

ప్రార్థించేలా ఇతరులను ఆహ్వానించుట

ఆ తర్వాత పౌలు తన పాఠకులను తన కోసం ప్రార్థించమని ఆహ్వానించడం చూస్తాము. “ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును… మాకొరకు ప్రార్థించుడి” (2 థెస్స. 3:1-2).

అంతేగాక, రోమా 15:30-32లో ఇలా వ్రాయబడి ఉంది “సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలోనుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును, నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను.”

యేసును మినహాయిస్తే మిగతా అందరి కంటే గొప్పవాడైన పౌలు ఈ విధంగా ప్రార్థించమని అడగడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది నన్ను ఎవరి గురించైనా మోకాళ్లపై ఉండి ప్రార్థించాలి అనిపించేలా చేస్తోంది, ఎందుకంటే పౌలుకే ఇది అవసరమైందంటే, మనకు తెలిసిన ప్రతి ఒక్కరికీ ఆ విధమైన ప్రార్థన అవసరమే.

కాబట్టి దేవుడు మనల్ని ప్రార్థించమని చెబుతాడని, ఆ తర్వాత ఎలా చేయాలో చాలా ఉదాహరణలు కూడా ఇస్తాడనేది నేను చెప్పగల అత్యంత ప్రేరణ కలిగించే విషయం అని నేను అనుకుంటున్నాను. మనం అలా చేయడాన్ని ఆయన ఇష్టపడతాడు. అందుకే బహుశా ప్రకటన గ్రంథం 5:8 లో పెద్దల చేతిలోని బంగారు గిన్నెల్లోని ప్రార్థనలను దేవుని సన్నిధిలో ధూపంగా వర్ణిస్తుంది.

దేవుని ముందు ధూపం ఏమి చేస్తుంది? అది ఆయన గదిని ఆహ్లాదకరమైన సువాసనతో నింపుతుంది. మోకాళ్లపై ఉండి ఇలా చెప్పడం ఎంత అందమైన చిత్రం: దేవుడు సంతోషించేలా నేను ఇప్పుడు తియ్యనైన వాసనగల దీపంను లేదా కొవ్వొత్తును వెలిగించబోతున్నాను మరియు ఈ మధ్యాహ్నం లేదా ఈ ఉదయం పరలోకం యొక్క గదిని సువాసనతో నింపబోతున్నాను.

ఏడు సాధారణ ప్రార్ధనా సూచనలు

పైన చెప్పినది నేను చెప్పగలిగే అతి ముఖ్యమైన విషయం, కానీ నేథన్ కోరినది అది కాదు. సూచనలు అడిగారు. సలహాలు కోరారు. కాబట్టి నేను వాటిని గూర్చి చెప్పడం ప్రారంభిస్తాను. వాస్తవానికి, ఇవి బైబిలు అధికారంతో చెప్పినవి కావు, ఎందుకంటే ఇవి పైపర్ అనుభవం నుండి తీసుకోబడ్డాయి మరియు పరిశుద్ధులు ఒకరికొకరు అదే చేయాలి. మనం కనుగొన్న విషయాలను ఇతరులతో పంచుకోవాలి.

1. జాబితాను ఉపయోగించండి

ఒక జాబితాను ఉపయోగించండి మరియు దానిని వర్గాలుగా విభజించండి. మనం ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడుతున్నాము, సరేనా? మీరు కాలక్రమేణా ఎక్కువ మందిని తెలుసుకోబోతున్నారు, ప్రార్థించమని మిమ్మల్ని ఎక్కువ మంది కోరుకుంటారు. మీ సంబంధాలు పెరుగుతాయి తద్వారా ఒక జాబితా సరిపోదు. మీరు దానిని చిన్న చిన్న జాబితాలుగా, వివిధ సమూహాలుగా విడగొట్టాలి.

నా ఐప్యాడ్ లో ఎవర్ నోట్ లో ఒక నోట్ బుక్ ను సృష్టించడం ద్వారా, నాకు ప్రార్థన అనే నోట్ బుక్ ఉంటుంది. మరియు ప్రార్థన క్రింద, నాకు విభిన్న రకాల సమూహాలు ఉన్నాయి, మరియు మీరు వ్యక్తులను వివిధ జాబితాలకు జోడించవచ్చు, ఆపై మీరు ఆ వ్యక్తుల కోసం ఎప్పుడు ప్రార్థించబోతున్నారో మీరు నిర్ణయించుకోవచ్చు. కాబట్టి జాబితాలను ఉపయోగించండి.

2. కేంద్రీకృత వృత్తాలు

కేంద్రానికి దగ్గరగా అత్యంత సన్నిహిత సంబంధాలను ఉంచి వారి కోసం ఆలోచించండి మరియు ప్రార్థించండి. కేంద్రము నుండి దూరమవుతున్న కొద్దీ పెద్దగా పరిచయం లేని మిగతా సమూహాలు, పరిచర్యలు మరియు దేశాల కోసం ప్రార్థనలను చేయండి. ఉదాహరణకు, నా ఎవర్ నోట్ ఫోల్డర్లో వ్రాసుకున్న నా సొంత కుటుంబం అంటే మేము ముగ్గురం ఉన్నాము. వాస్తవానికి ఇప్పుడు నా కూతురు తలిత కళాశాలలో ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఇద్దరమే ఇంట్లో ఉన్నాము. మా ఇద్దరి గురించి ప్రార్థన చేయడంతో మొదలు పెడతాను.

నేను అక్కడ నుండి దూరంగా నివసిస్తున్న పిల్లలు మరియు మనవరాళ్ల వద్దకు వెళతాను, ఆపై అక్కడ నుండి నాకు సంబంధం ఉన్న పరిచర్యలకు మరియు బెత్లెహేమ్ బాప్టిస్ట్ చర్చి మరియు డిసైరింగ్ గాడ్. ఆర్గ్ మరియు బెత్లెహేమ్ కాలేజ్ మరియు సెమినరీలోని వారి దగ్గరకు వెళతాను. అక్కడ నేను ప్రార్థించే వారు చాలా మందే ఉన్నారు.

“మీకు సన్నిహితంగా ఉన్న వారి నుండి అన్ని దేశాల వరకు కేంద్రీకృత వృత్తాకార వలయాల్లో ప్రార్థించండి.”

ఆ తర్వాత నాకు తెలిసిన సంఘ స్థాపకులు క్రైస్ట్ టుగెదర్ ఫెలోషిప్ కు వెళతాను. ఆ తరువాత నేను టుగెదర్ ఫర్ ది గాస్పెల్ మరియు ది గాస్పెల్ కొయలిశన్ మరియు ట్రైనింగ్ లీడర్స్ ఇంటర్నేషనల్ వంటి పరిచర్యలకు వెళ్తాను మరియు అక్కడ నా జాబితాలో ఉన్న చాలా మంది స్నేహితులు ఉన్నారు.

ఆ తరువాత నేను నా ఇరుగుపొరుగుకు మరియు చుట్టుపక్కల నేను వ్రాసుకున్న కొంతమంది వ్యక్తుల కొరకు చేస్తాను, మరియు కొన్నిసార్లు, నేను చేసే జాగింగ్-సువార్త ప్రచారం దగ్గరికి వెళతాను. నేను ప్రజలను కలుస్తాను, మరియు వారు వారి పేరును నాకు చెబుతారు, మరియు నేను దేని కోసం ప్రార్థించగలను అని నేను వారిని అడుగుతాను మరియు అది నా ఇంకొక జాబితా అవుతుంది. కాబట్టి ఆ జాబితాల వైవిధ్యాన్ని నేను నిర్వహించే ఒక మార్గం కేంద్రీకృత వృత్తాలు.

3. దేవుని వాక్యాన్ని ఉపయోగించండి

వీరి గురించి దేవుని వాక్య సహాయంతో ప్రార్థించండి. ఇది మీ ప్రార్థనలు పునరావృతం కాకుండా చేస్తుంది. మొదటిగా దేవుని వాక్యాన్ని చదవండి. దానిపై ధ్యానం చేయండి. అందులో ఉన్న వాటిని ఉపయోగించి ప్రార్థించండి. అప్పుడు ఆ రోజు ప్రార్థించడానికి నియమించబడిన ప్రజల కోసం దేవుడు వాక్యంలో మీకు చూపించే వాటిని ఉపయోగించి ప్రార్థించండి.

4. మీ ప్రార్ధనలను పోల్చి చూడండి

మీరు ప్రార్థిస్తున్నదాన్ని క్రొత్త నిబంధనలోని ప్రార్థనలతో పోల్చడం ద్వారా మీ ప్రార్థనలను అప్పుడప్పుడు పరీక్షించవచ్చు. నేను క్రొత్త నిబంధనలోని ప్రార్థనలన్నింటినీ ఒకే చోట ఉంచాను. అది అందుబాటులో ఉందని నేను అనుకుంటున్నాను. టోనీ, ఒకసారి చూసి దానిని అందరికీ అందుబాటులో ఉండేలా చూడు. డిసైరింగ్ గాడ్ వెబ్సైట్ లో ఇది లభిస్తుందని నేను అనుకుంటున్నాను. క్రొత్త నిబంధనలో ప్రార్థించబడిన విషయాలన్నిటినీ – దాదాపు 40 వేర్వేరు ప్రార్థనల జాబితాను ఇక్కడ ఉంచాను. నేను ఆ జాబితాను ప్రతిరోజూ కాదు, అవసరాన్ని బట్టి ఉపయోగిస్తాను. వాటిని తెరిచి నాకు నేను ఇలా అడుగుతాను: క్రొత్త నిబంధనలోని ప్రార్థనలలో ఏదైనా ముఖ్యమైన విషయాన్ని నేను విస్మరిస్తున్నానా?

5. సాధారణమైనవి మరియు నిర్దిష్టమైనవి

సాధారణ ప్రార్థనలను నిర్దిష్ట ప్రార్థనలతో మిళితం చేయండి. చాలా మంది సాధారణ ప్రార్థనల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. సాధారణ ప్రార్థనలంటే నాకు చాలా ఇష్టం. లోకమంతటా నీ నామం పవిత్రంగా ఉండు గాక. అదొక ముఖ్యమైన సాధారణ ప్రార్థన. నిర్దిష్ట ప్రార్థనలు కూడా ముఖ్యమైనవి. ఒక నిర్దిష్ట ప్రార్థన: బిల్ కు ఈ వారం ఉద్యోగం రావాలి. ప్రభువా, అతనికి ఉద్యోగం లేదు. ఉద్యోగం వెతుక్కోవడంలో సాయపడండి. ఇది నిర్దిష్టమైన ప్రార్థన. దానికి వెంటనే సమాధానం చూడొచ్చు. ఒక సాధారణ ప్రార్థన ఇలా ఉంటుంది: ప్రభువా, బిల్ మిమ్మల్ని మరింత ప్రేమించడానికి మరియు అన్నిటికీ మించి మిమ్మల్ని విలువైన వాడని భావించేలా చేయండి. దీనిని గుర్తించడం చాలా కష్టం కదా? కానీ మీరు ప్రార్థించడం చాలా కీలకం.

6. నిశ్శబ్ద క్షణం

ఒకరి గురించి ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఉండండి. దేవుడు ఈ రోజు తనకు అవసరమైన విషయాలను గుర్తుకు తెస్తాడో లేదో చూడండి. దేవుడు మీ మనస్సులో ఏదైనా నిర్దిష్టమైనదాన్ని తీసుకువస్తే ఆ విషయాలను గూర్చి ప్రార్థించండి.

7. జవాబుల కోసం చూడండి

చివరగా, నేను చెప్పే విషయం: సమాధానాల కోసం ఎదురు చూడండి. వాటిని గమనించండి. మీ జర్నల్ లో లేదా మరొక ఫోల్డర్ లో సమాధానాలను  ఉంచండి. దీనినంతటిని తాజాగా, ప్రామాణికంగా ఉంచేది ఏంటంటే వాక్యము నుండి ప్రవహించి లేఖనాలు దగ్గరికే తిరిగి వెళ్ళే విధానమే. మన ప్రార్ధనలు బట్టీపట్టీ చెప్పేవిగా, యాంత్రికంగా మరియు అలవాటుగా చేసేవిగా ఉండకుండా జాగ్రత్త పడండి. వాటిని అర్థవంతంగా ఉంచడానికి, బైబిలును ప్రతిరోజూ కొత్తగా అనుభవించాలి మరియు మన ప్రార్థనలు ఇతరుల కోసం తాజాగా మరియు హృదయపూర్వకంగా ఉండనివ్వండి.

 

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...