బైబిలు చదవడము నాకు వేదనకరంగా ఉన్నది – బైబిలును చిన్న భాగాలుగా నేనెలా అధ్యయనం చేయవచ్చు?
పుస్తకాలు చదవడంలో నీవు ఆనందానుభూతిని అనుభవిస్తున్నట్లయితే, ఎక్కువ సేపు చదువుతూ చదువుతున్న దానిలోనే నిన్ను నీవే మర్చిపోతున్నట్లయితే, ఈ వరం కొరకు దేవునికి వందనాలు. ఎందుకంటే, ఈ వరాన్ని అందరు క్రైస్తవులు ఆనందంగా అనుభవించడం లేదు. అనేక మంది విశ్వాసులకు, అక్షరాలను, పదాలను పలకడం, సంఖ్యలు సంకేతాలను గుర్తించి అర్థం చేసుకోవడం కష్టమవుతున్నట్టే, చదవడమనేది కూడా చాల కష్టంగా ఉంటున్నది. మన శ్రోతయైన హెన్రీగారి పరిస్థితి ఇలాగే ఉన్నట్టున్నది. ఇతడు ఇలా వ్రాస్తున్నాడు, ‘‘హలో, పాస్టర్ జాన్ గారూ! నా పఠనా సామర్థ్యాన్ని బలహీనపరుస్తున్న అభ్యాస వైకల్యంతో నేను బాధపడుతున్నానని ఇటీవలనే తెలుసుకున్నాను. పుస్తకం తెరిస్తే నాలుగైదు లైన్లు మాత్రమే చదవగలుగుతున్నాను, ఒక్క పేజీ కూడ పూర్తిగా చదవలేకపోతున్నాను. కొన్ని నిమిషాలు చదివిన తరువాత నా ఏకాగ్రతను కోల్పోతున్నాను, అంతకు మించి చదవడానికి ప్రయత్నిస్తే తీవ్రమైన తలనొప్పి మొదలవుతుంది. మొదట్లో, నేను కేవలం సోమరినై ఉంటున్నానని అనుకున్నాను. గాని ఇది వాస్తవానికి నా జీవితమంతా నేను కలిగున్న అభ్యాస వైకల్యమై యున్నది. నేను బైబిలు చదవాలని ఆశపడుతున్నాను. తెరచిన వాక్యభాగాన్ని పూర్తిగా చదవాలని ఇష్టపడుతున్నాను. గాని నాకు చెప్పశక్యముకానంత కష్టమవుతుంది. అప్పుడప్పుడైతే, దాదాపు అసాధ్యమవుతుంది. కొంత సేపు మాత్రమే చదవగలవారు బైబిలంతటిని ఎలా చదవగలరు, ఏమి నేర్చుకోగలరు?
ఇటీవలనే నేనొక వ్యాసం వ్రాశాను. దాని శీర్షిక, ‘‘పరిశుద్ధపరచబడుట మరియు వృద్ధాప్యము.’ ఆ వ్యాసంలో “నీవు దేవుని వాగ్దానాలను చదివిన తరువాత వాటిని జ్ఞాపకముంచుకోలేనంతగా నీ జ్ఞాపక శక్తి తగ్గిపోయినప్పుడు విశ్వాసం మరియు విశ్వాసం వలన కలిగే విధేయత కొరకు నీవెలా పోరాడుతావు?’’ అనే ప్రశ్నను లేవదీశాను. మనము వృద్ధాప్యమును, జ్ఞాపకశక్తి కోల్పోవడం, చూపును కోల్పోవడం, చదవగలిగే సామర్థ్యమును కోల్పోవడం, వినికిడిని కోల్పోవడం, మరియు బహుశా అపస్మారక స్థితిలో ఉండడం, మొదలగు విషయాలను వయస్సు మళ్లిన కొలది క్రమక్రమంగా కలిగేవాటిగా చూడాలనేది, నేనిచ్చిన జవాబులో భాగమైయున్నది. హెన్రీ తన వైకల్యం వైపు తన దృష్టిని మళ్లిస్తున్నాడు, గాని మనము ఊరికే ఉండకూడదు. వ్యక్తిగతంగా ప్రయాసపడుతూ, మనము కోల్పోతున్నామని అనుకుంటున్న విషయాలను పూరించుకోవలసి యున్నది.
మనకు మనం సాయం చేసుకోలేని పరిస్థితుల్లో మనం తరుచుగా సంఘములో ఉన్నవారిమీద ఆధారపడుతుండడాన్ని నేను గమనించాను. ఉదాహరణకు, మన చివరి రోజుల్లో వారు వారు మనతో ఈ మాటలు మాట్లాడొచ్చు. అవేమంటే : యెషయా 46:4 – ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.ఈ మాటలు మా తాతగారితో నేను కూడా చెప్పాను.
మా తాతగారు చనిపోయారని – ఈ లోకంలో లేనేలేరని, అందరూ అనుకున్నారు. ఆయన బహుశా 40 లేదా 45 కి.గ్రా. బరువుంటాడు. తల్లిగర్భములోని పిండము పడుకున్నట్టు పడుకున్నాడు. చాలా వారాల వరకు ఆయన మాటలాడలేదు. కళ్లు, పక్కులు కట్టుకపోయాయి. నేను మా నాన్నగారు కలిసి తన చెవుల్లో బిగ్గరగా ప్రార్థన చేయడం ముగించినప్పుడు, ఆయన శరీరమంతా ఒక్కసారి కదిలింది, ఆయన ‘‘ఆమేన్’’ అని అన్నాడు. నాకు చాల ఆశ్చర్యం కలిగింది గనుక ఆనాటి నుంచి నేను అపస్మారక స్థితిలో ఉన్న వారి చెవుల్లోకి ప్రార్థించడముగాని, బైబిలు చదవడముగాని ఎన్నడూ మానలేదు.
దేవుని వాక్యము వినడం ఎన్నడూ మానవద్దు
ఇదంతా ఎందుకు చెప్పుతున్నానంటే, పరిస్థితి ఎంత ఎక్కువ బలహీనమైనదిగా మారినప్పటికిని, దేవుని వాక్యము వినడం ఏమాత్రం మానుకోవద్దు. నీకు సహాయం చేయగల, నీకు చదివి వినిపింపగల వారు అందుబాటులో ఉండేట్టు చూచుకో. పరిశుద్ధపరచబడుట యొక్క ప్రాముఖ్యత మరియు సాధనాల గూర్చి యింకా కొంచెం స్పష్టంగా చెప్పాల్సివుందని నేననుకుంటున్నాను. ఎందుకంటే, ఈ విషయంలో హెన్రీ స్థితి ఏమిటో నాకు తెలియదు. హెన్రీ, బహుశా, ఆత్మసంబంధమైన ఒక క్రమశిక్షణగా, బైబిలంతటిని ఎలా చదవగలను అనే దాని గూర్చి మాత్రమే అడుగుచుండొచ్చు. గాని, ఏ విధంగానైనా సరే, లేఖనములోని దేవుని వాక్యమును వినడం కేవలం ఒక క్రమశిక్షణే కాదు – అది చావు బ్రతుకులకు సంబంధించిన విషయమై యున్నదనే వాస్తవాన్ని నేను నొక్కిచెప్పాలని ఆశపడుతున్నాను.
‘‘లేఖనములోని దేవుని వాక్యమును వినడం కేవలము ఒక క్రమశిక్షణే కాదు – అది చావు బ్రతుకులకు సంబంధించిన విషయమై యున్నది.’’
మనము విశ్వాసము వలన జీవిస్తాము లేదా మనం ఏమాత్రమును జీవిస్తున్నవారము కాము. విశ్వాసము, వినుట వలన కలుగుతుంది. వినుట, క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది (రోమా 10:17). ‘‘మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును’’ (మత్తయి 4:4). యేసు దీనంతటి గూర్చి మాత్రమే కాదు గాని, దేవుని వాక్యము వినుట మరియు దేవుని వాక్యము మీద ఆధారపడుట గూర్చి కూడ బోధించాడు.
దేవుని వాక్యము లేకుండ విశ్వాసం నిలకడగా కొనసాగజాలదు. ‘‘అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడడని’’ హెబ్రీ 12:14లో వ్రాయబడి యున్నట్టు, పరిశుద్ధత, విశ్వాసం నుండి కలుగుతుంది, మరియు రక్షణ కొరకు పరిశుద్ధత అవసరమై యున్నది.
కాబట్టి, హెన్రీ, నామట్టుకైతే, మీరడుగుతున్న ప్రశ్న ప్రాముఖ్యత లేనిది కాదు. అది నామమాత్రపు ప్రశ్న కూడా కాదు. మీ ప్రశ్న, నిజక్రైస్తవుడై యుండుట అంటే ఏమిటో, విశ్వాసాన్ని ఎలా నిలకడగా కొనసాగించాలో అనే ముఖ్య విషయానికి సంబంధించినదై యున్నది. అర్థమవుతున్నది కదా.
అడ్డంకులను అధిగమించుట
దేవుని వాక్యము వినే సమయంలో, వినాలని ఆశపడునప్పుడును మనకు పెద్ద పెద్ద అడ్డంకులుంటాయి. ఇవి నేర్చుకోవడంలో వైకల్యములు గలవారికి మాత్రమే కాదు, మనందరికీ ఉన్నాయి. పెద్ద పెద్ద అడ్డంకులేవంటే – పాపము, ఉదాసీనత (పట్టింపులేనితనము), లోకమును ప్రేమించుట, మరియు క్రీస్తు మహిమను చూడకుండా చేసే ఆధ్యాత్మిక అంధత్వము. ఇవన్నీ దేవుని వాక్యాన్ని వినడానికి పెద్ద అడ్డంకులుగా ఉంటున్నాయి.
హెన్రీగారి విషయంలో – ముసలితనము, అభ్యాస వైకల్యము వంటి అడ్డంకులు కూడ ఉన్నాయి. కాబట్టి, హెన్రీగారు అడిగిన ప్రశ్నను నేను చాల తీవ్రమైనదిగా ఎంచుతున్నాను. హెన్రీగారూ, మీ విశ్వాసాన్ని – పౌలు ‘విశ్వాసమునకు సంబంధించిన మంచి పోరాటమని’ పిలుస్తున్నాడు – దానిని ఎలా నిర్వహించుకుంటున్నావు? మీకు మరియు మీరు దేవుని వాక్యము వినడానికి మధ్య అభ్యాస వైకల్యమున్నది కదా, అలాంటప్పుడు విశ్వాసము వలన కలిగే పరిశుద్ధత కోసం మీరెలా పోరాడుతారు? నాలుగు సలహాలిస్తాను, గమనించండి.
1. చూడటానికి చదవడం
మొదటిదిగా, మీ మనస్తత్వం, మీ ఆలోచనా విధానం, ‘నేను ‘10 లేదా 20 లేదా 25 నిమిషాలు’ (ఇంత సమయమని) బైబిలు చదవాలి, లేదా ‘ఒక అధ్యాయం, లేదా రెండు అధ్యాయాలు (ఇంత భాగమని) చదవాలనేది’ యుండకుండ జాగ్రత్తపడండి. స్వరక్తమిచ్చి కొనబడిన దేవుని వాగ్దానాలతో మీ విశ్వాసాన్ని బలపర్చుకొనండి. సువార్తపై ఆధారపడుతూ, వాగ్దానాలను నమ్మడం ద్వారా విశ్వాసం సజీవంగా నిలుస్తుంది.
దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన క్రీస్తునందు మనకేం చేశాడు మరియు మన భవిష్యత్తు కోసం ఆయన ఏంభద్రపర్చాడో తెలిసికోవాలనేది, బైబిలు చదవడంలోగల లక్ష్యమై యున్నది. అది ఐదు గంటల సమయమైనా లేదా ఇప్పటి నుంచి ఐదు వేల సంవత్సరాల కాలమైనా, బైబిలులోని ఆత్మ సంబంధమైన విషయాల యొక్క చక్కదనాన్ని, మహిమను మరియు నిశ్చయతను మనం చూడాల్సిన అవసరమున్నది. బైబిల్ చదవడానికి, అది కూడ రెండధ్యాయాలు లేదా మూడధ్యాయాలు ఇంత సమయంలోగా చదవాలనేది లక్ష్యం కాదు. దేవున్ని, ఆయన మార్గాలను, మరియు ఆయన వాగ్దానాలను అవగాహనకు తెచ్చుకోవాలి మరియు ఆస్వాదించాలనేది లక్ష్యమై యున్నది. విశ్వాస సహితమైన మంచి పోరాటం పోరాడుతూ, విశ్వాసం ద్వారా విధేయతతో నడుచుకోవడమనేది లక్ష్యమై యున్నది. ఇదే మనస్తత్వాన్ని కలిగియుండునట్లు చూసుకోవాలి. మీ విశ్వాస నిమిత్తమైన బలమైన ఆహారం కోసమని మీరు బైబిలు చదవాల్సి వున్నది.
స్వస్థపర్చు దేవుడు
రెండవదిగా, దేవుడు మీకు సహాయం చేయాలని – మీరు నేర్చుకోడానికి ఇబ్బందిగల వైకల్యంతో వ్యవహరించడానికి లేదా అది ఏ విధమైన అడ్డంకియైనను దానితో వ్యవహరించడానికి మీకు జ్ఞానమునిమ్మని ఆయనను మన:పూర్వకంగా మనవి చేయండి. సహజాతీతమైన సహాయం కొరకు ఆయనను వేడుకొనండి.
‘‘వారి వైకల్యం లేదా దౌర్బల్యం విషయంలో ఎంత మంది క్రైస్తవులు సర్వమును పూర్వనిర్ణేతమైయున్నదనేవారు, భౌతికవాదులు, మరియు మానవతావాదులైయున్నారోనని నేను భయపడుతున్నాను.’’
వారి వైకల్యం లేదా దౌర్బల్యం విషయంలో ఎంతో మంది క్రైస్తవులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని నేను కలవరపడుతున్నాను. ఈ విషయాన్ని కేవలము వ్యాధి లేదా ఔషధాల దృష్ట్యా ఆలోచించవద్దు. కేవలము చికిత్స దృష్ట్యా దీని గూర్చి తలంచవద్దు. మానవ క్రమశిక్షణాపరంగా మాత్రమే ఆలోచించవద్దు. ఇవన్నీ ముఖ్యమే.
సార్వభౌముడైన దేవుడు మీ పక్షాన ఏదైన ఒక చర్యను సహజాతీతంగా చేసినట్లయితే ఆయన ఏంచేయగలడో, దాని దృష్ట్యా ఆలోచించాలి. ఆయన మీ వైకల్యాన్ని తీసివేయకపోవచ్చు. సామాన్యంగా తీసివేయడు, గాని బైబిలు చదవడానికి మీరెదుర్కొంటున్న మీ వైకల్యాన్ని తీసివేయుమని మీరాయనను వేడుకున్నట్లయితే ఆయన ఏంచేయగలడో ఎవరికి తెలుసు?
కష్టపడి పనిచేయండి
మూడవదిగా, మీరాశపడుతున్న దానిని సాధించడానికి మీరు ఎంతో మంది కంటె మరి ఎక్కువ కష్టపడి పనిచేయాల్సి వుంటుందని మీ మనస్సులో నిశ్చయించుకొనండి. మనమందరమూ బలహీనతలుగలవారమే గాని అవి వేర్వేరుగా ఉన్నాయి. మనలో ఉన్న బలహీనతలను ఒక సాకు లేదా నెపంగా ఎంచుకుంటూ, దాని గూర్చే బాధపడుతు, స్వీయజాలితో చింతిస్తూవుంటే, మనకై మనమే మన జీవితాన్ని వృథాచేస్తున్నవారమవుతాము.
మనము ఎన్నటికినీ కలిగియుండలేని బలములు కొన్ని ఉన్నాయి. మనమెన్నటికినీ సాధించలేని కొన్ని విషయాలున్నాయి. గాని, వైకల్యములుగలవారు తమ బలహీనతలను అధిగమించి ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు కదా! ఇది అద్భుతం.
ఉదా॥ మీరు బైబిలును ఒకేసారి అరగంటసేపు చదువడానికి బదులుగా, మూడేసి నిమిషాల చొప్పున పదిసార్లు చదువాల్సి ఉండొచ్చు. మీకు గుర్తుచేయడానికి మీ స్మార్ట్‌ఫోన్‌లో అలారం సెట్ చేసుకొనండి. లేదా, మీ మనస్సులోను హృదయంలోను ఉంచుకొని (అవసరమైనప్పుడు గుర్తుచేసుకోగలుగుటకు) ఇదివరకటి కంటె ఇప్పుడు యింకా కొంచెం ఎక్కువ కష్టపడి కొన్ని వాక్యాలు కంఠస్థం చేయండి.
ఆడియో (ధ్వని (శ్రవణ) సంబంధమైన
నాలుగవదిగా, ఆడియో బైబిలును ఉపయోగించుకోవడాన్ని అలక్ష్యము చేయవద్దు. ఇవి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము అందిస్తున్న గొప్ప వరములై ఉన్నాయి. ఆడియో బైబిలును మీ ఐపాడ్ లేదా స్మార్ట్‌ఫోన్ లేదా సిడి ప్లెయర్‌లో ‘ఆన్’ చేసికొని, వింటూ, అవే వాక్యభాగాలను మీ బైబిలులో మీరు చూడటం ద్వారా మీ అభ్యాస వైకల్యం యొక్క ప్రతికూల ప్రభావాల్లో కొన్నింటిని అధిగమించగలుగుతున్నారని మీరు నిదానంగా కనుగొనవచ్చు. నేనిలా చేస్తుంటాను. నేను చాలా అలసిపోయినప్పుడు, ఆడియో బైబిలును ‘ఆన్’ చేసికొని, నా కొరకు అది గొంతెత్తి చదువుతూవుంటే, నేను బైబిలులో నా కళ్లతో చదువుతుంటాను.
‘‘మీ మనస్తత్వం, కేవలము ‘ఇంతసేపు చదవాలని’ కాదు, గాని స్వరక్తమిచ్చి కొనబడిన దేవుని వాగ్దానాలను ఆస్వాదించడమై యుండాలి.’’
మీరు అలా కళ్లు మూసుకొని వినవచ్చు, లేదా మీ వాహనంలో వినవచ్చు, లేదా వంటచేస్తూ వినవచ్చు, లేదా నిద్రపోతున్న సమయంలో వింటూ, వింటూ నిద్రపోవచ్చు, లేదా వింటూ మేల్కొనవచ్చు. ఇది నిజముగా ముఖ్యమని నేను భావిస్తాను. మనుష్యులు నిద్రపోడానికి ఎన్నెన్ని తంటాలు పడుతుంటారో దేవునికే తెలుసు, గాని బైబిలు వింటూ, వింటూ నిద్రపోండి, మళ్లీ వింటూనే మేల్కొనండి.
చివరగా, సంఘమనెడి క్రీస్తు శరీరంలో, మీ కుటుంబంలో స్నేహాన్ని పెంపొందించుకోవడంలో మీ జీవితాలను వెచ్చించమని నేను అన్ని విధాలుగా చెప్పుతున్నాను. మీ పనులు మీకై మీరు చేసికోలేనప్పుడు, చదివి వినిపించడానికి, మరియు బహుశా, మీరు మీ చివరి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు, వినికిడి కోల్పోయినట్టున్న చెవిలో, ‘‘ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే, తలవెండ్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే. నేనే చేసియున్నాను, చంకపెట్టుకొనువాడను నేను, నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే’’ (యెషయా 46:4) అనే గంభీరమైన ఆ మాటలు మీ చెవిలో బిగ్గరగా చదువుటకు ఇతరులు అందుబాటులో ఉండునట్లు ఈ పని చేయండి.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web