మనము చేసే పనులు ఆశీర్వాదమా లేక శాపమా? 

మనము చేసే పనులు ఆశీర్వాదమా లేక శాపమా? 

షేర్ చెయ్యండి:

కొన్ని రోజుల క్రితం, మన పనుల్లో, వ్యాపార లావాదేవీల్లో దేవున్ని ఎలా మహిపర్చగలమో చూశాం. ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని యింకా కొంచెం విస్తరించి చర్చిద్దాం. మన ప్రసారాలు వింటున్న ట్రావిస్‌ ఇలా అడుగుతున్నాడు. ‘‘హాల్లో, పాస్టర్‌ జాన్‌, ఈ రోజుల్లో మనం చేస్తున్న పనులు దేవుని ఆశీర్వాదమా లేక శాపమా, దయచేసి చెప్తారా? ఆదికాండము 3వ అధ్యాయం ఆధారంగా, మన పనులు శాపంగానే కనబడుతున్నవి. గాని ప్రసంగి గ్రంథం ప్రకారం, దేవుడిచ్చిన ఆశీర్వాదంగా కూడ ఉన్నట్టనిపిస్తుంది. బైబిలు ప్రకారం, ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు నేను చేసే పని ఆశీర్వాదమంటారా, లేకా శాపమంటారా?’’

జవాబు: బైబిలులో పేర్కొనబడిన మొట్టమొదటి పనితో మొదలుపెడదాం రండి. అదేంటంటే దేవుడు చేసిన పని. ఆది 2:2-3.

దేవుడు, ఆయన చేయుటకు మొదలుపెట్టిన పనిని ఏడవ దినములోగా ముగించాడు, మరియు తన పని అంతటి నుండి ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు ఏడవ దినాన సృష్టిలో ఆయన చేసిన పనులన్నిటి నుండి విశ్రమించాడు కాబట్టి ఆ దినాన్ని ఆశీర్వదించి దానిని పరిశుద్ధమైనదిగా చేశాడు.

మీరు ముఖ్యమైన అంశాన్ని కోల్పోవద్దు. దేవుడు పనిచేశాడు. పై వాక్యంలో చెప్పినట్లుగా ఆయన పనిచేశాడు. గమనించండి, దేవునికి పని ఒక శాపంగా లేదు. దేవుడు శపింపబడలేదు. ఆయనకది భారం కూడా కాదు. ఆయన నిరాశతో నిరుత్సాహపడడు. ఆయన తనకిష్టముకాని దానిని చేయాలని బలవంతపెట్టబడలేదు.

ఆయన గొప్పతనానికి, సంపూర్ణతకు సూచనగా ఉన్నందున సృష్టిని చేయడానికి పని చేశాడు. తన మహిమను ప్రకటించే లోకాన్ని మరియు ఆ మహిమను ఆస్వాదించగల మరియు ఆరాధించగల తన యొక్క మానవ స్వరూపాన్ని సృష్టించడంలో అతడు పొంగిపోయాడు.

ఇది బలహీనతకు లేదా భారభరితమునకు లేదా నిరాశతో నిరుత్సాహపడుటకు సంకేతం కాదు, అది మహిమయై యున్నది. దేవునికి పనే మహిమయై యుండింది.

సంతృప్తికరమైన పని

ఆది నుండి కూడ పని ఒక శాపమై యుండలేదు. అది దేవుడిచ్చిన ఒక ఆశీర్వాదమై యుండింది. మానవుడు పాపములో పడిపోకమునుపు దేవుడు దానిని రూపొందించిన విధంగా, పని యొక్క సారాంశమేమంటే, సృజనాత్మకత : సృజనాత్మకంగా, ఉత్పాదకంగా చేయడం, ఏర్పాటు చేయడం అని అర్థం.  దేవుడు ప్రాథమికంగా ప్రపంచాన్ని సృష్టించే పని చేశాడు. ఇదే, పని యొక్క సారాంశం. ఆ తరువాత తన స్వరూపమందు మనల్ని సృజించి ఆయన చేసిన ప్రపంచంలో ఉంచి,

‘‘మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని’’ దేవుడు (వారితో) చెప్పెను (ఆది 1:26, 28).

ఆ తరువాత, ఆది 2:15లో ఇలా వ్రాయబడి యున్నది: ‘‘దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.’’ ‘సేద్యపరచుటకును దాని కాచుటకును’ అనే మాటల అక్షరార్థం – సేవచేయుట. ‘‘దానికి సేవచేయుము’’ అనే మాటలు, ప్రభువు పనిలో ఒకడు సేవించుట వంటిదై యున్నది – దానికి సేవచేయాలి, పనులు చేయాలి, దానిని కాయాలి.

మానవ పతనానికి ముందు ఏదెను తోటలో పనులు చేయడం, దానిని కాయడం, అనేది మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడనే ఆజ్ఞ యొక్క పాక్షిక నెరవేర్పైయుండిందని నేను ఊహిస్తున్నాను. అలాగైతే, దీని అంతరార్థమేంటి? ఆ తోటను చేసింది దేవుడే గనుక దానిలో ఒక లోపముందని  భావం కాదు. అది లోపముగలదై యుండలేదు. దేవుడు పొరపాటు చేశాడన్నట్టు దాన్ని సరిదిద్దాల్సిన అవసరమే లేదు. ‘‘అయ్యో, ఎంత పొరపాటయ్యింది! నేను తోటను సరిగా అమర్చలేదు. గనుక ఇప్పుడది సరిచేయబడాలి’’ అన్నట్టు కాదు. దేవుడు ఆ తోటను మానవుని కోసం చేశాడు. మానవుడు దేవుని వలె సృజనాత్మకంగా పనులుచేయడానికి ముడిసరుకు సమకూర్చడమై యుండిందనేది దాని భావం. అది సంపూర్ణమైన పనిగా ఉండింది. తోటలో పనిచేయడం వలన మానవుడు బాగా వర్ధిల్లుతాడు, తోట సాగుచేయబడుచు కాపాడబడుతుంటుంది గనుక అది కూడ వర్ధిల్లుతుంది. అది ఆహ్లాదకరమైన సంతృప్తినిస్తుంది – ఆశాభంగం కలిగించదు, భారంగా ఉండదు, వ్యర్థం కూడా కాదు. ఇది మానవ పతనానికి ముందటి పని: ఈ పని కుతూహలాన్ని కలిగించింది, సంతృప్తినిచ్చింది, సృజనాత్మకమైనదై యుండింది.

శపింపబడిన పనా?

ఆదికాండము 3 లో రాయబడినట్లుగా పాపం ఈ లోకంలోకి ప్రవేశించినపుడు, సంతృప్తికరమైన ఈ పనిని వ్యర్థమైన, భారమైన, మరియు నిరాశపరిచేదిగా మార్చి వేసింది. ఆది 3:17-19,

‘‘ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. .  . నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. . . .’’

‘‘పని వ్యర్థమవడము మరియు పని భారము పెరగడము సృష్టియొక్క శాపములోని భాగమైయున్నది, అయితే ఇది ఎల్లప్పుడు ఇలాగే వుండదు.’’

పని లేదా పనిచేయడం ఒక శాపమని అనడం సరైనది కాదు. పని యొక్క నిరర్థకత, ఆశాభంగం, భారము మరియు దాని వల్ల కలిగే బాధ శాపమైయున్నవని అనడం సరైన విషయం. పౌలు, ‘‘సృష్టి . . . వ్యర్థపరచబడెనని’’ రోమా 8:20-21లో అన్నాడు. పాపము లోకములోనికి ప్రవేశించినప్పుడు, ‘‘సృష్టి నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్య్రము పొందుదునను నిరీక్షణగలదై, స్వేచ్ఛగాకాక దాని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడునట్లు’’ దేవుడు చేసెను. కాబట్టి, పని వ్యర్థమవడం మరియు పని భారము పెరగడం, సృష్టియొక్క శాపములోని భాగమైయున్నది, అయితే ఇది ఎల్లప్పుడు ఇలాగే వుండదు. ‘‘పొందబోవు దాని గూర్చిన నిరీక్షణ’’ కలదని ఆయన సెలవిచ్చాడు, మరియు పాపము యొక్క పాపిష్టితనం  ఎంతో అపరిమితమైనదై యున్నదని చూపించడానికి దేవుడు లోకానికి ఈ శాపాన్ని తాత్కాలికంగా జారీచేశాడు.

దేవుని పనితనము

అయితే, లోకాన్ని ఈ శాపము నుండి ఒక్కసారిగా గాక, దశలవారీగా విమోచించడానికి క్రీస్తు వచ్చాడు. పని విషయంలో కూడ ఇలాగే జరుగుతుంది. సువార్త అంటే, యేసు అనుగ్రహించు రక్షణ గూర్చిన సువర్తమానం. నీవు రక్షణ సంపాదించడానికి సాధనంగా పని చేయాల్సిన అవసరం లేదు. నీవు దానిని సంపాదించలేవు. అది ఉచితం. రక్షణలో అసాధ్యమైన, నిరీక్షణలేని, భారమైన పాత్రను పనికి కేటాయించబడలేదు. ఇది నిజంగా శుభవార్తే.

ఎఫెసీ 2:8-10 ప్రకారం, మన రక్షణలో జరిగే “పని” గూర్చి చెప్పబడిన మూడు విషయాలను ఒకసారి వినండి.

‘‘మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు., ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది (1) క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. మరియు మనము వాటియందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన (3) సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసు నందు సృష్టింపబడినవారమై (2) ఆయన చేసిన పనియై యున్నాము.’’

‘‘మనము సత్‌క్రియలు చేయుటకై క్రీస్తునందు పున:సృష్టింపబడితిమి.’’

ఇది మహిమకరమైన సంగతి. మొదటిగా, పని మనలను రక్షించదు. క్రీస్తే మనలను రక్షిస్తాడు. విశ్వాసముంచుట ద్వారా ఆయన రక్షిస్తాడు. రెండవదిగా, దేవుడే కల్పించుకొని ఈ కార్యం చేస్తాడు. ఆయన మనల్ని నూతన పరుస్తాడు మరియు క్రీస్తునందు నూతన సృష్టిగా మనల్ని చేయడానికి అవసరమయ్యే అన్ని విషయాలను ఆయన చేస్తాడు. మనము ఆయన చేతిపనియైయున్నాం. మూడవదిగా, మనమిప్పుడు ప్రేమింపబడ్డాం, క్షమింపబడ్డాం, అంగీకరించబడ్డాం మరియు దత్తత తీసుకోబడ్డాం, కాబట్టి మనము సత్‌క్రియలు చేయడానికి పున: సృష్టింపబడ్డాము. మనము మొట్టమొదటిసారి, ఆదియందు, సృజింపబడినప్పుడు సత్‌క్రియలు చేయు మానవులమై ఉండడానికి సృజింపబడ్డాము. మనము మానవులముగా సృజింపబడడానికి ఇదే అసలైన ఉద్దేశమై యుండింది, మరియు మనము సత్‌క్రియలు చేయుటకై క్రీస్తునందు మరలా జన్మించబడ్డాము.

దేవుని మహిమ కొరకు తేలికైన కాడి

క్రీస్తునందలి ఈ పని భారమైనది కాదు. ఇది నీకు భారంగా ఉన్నట్లైతే, యేసుకు  విధేయత చూపడం మరియు క్రీస్తు కొరకు పనిచేయడం నీకు భారంగా ఉన్నట్లైతే, నీవు స్పష్టంగా ఆలోచించడంలేదని అర్థం, లేదా నీవు క్రీస్తును నమ్మవలసిన విధంగా నమ్మడం లేదని అర్థం. మత్తయి 11:28-30లో వ్రాయబడిన మాటలు వినండి. ఇది మనము చేయాలని క్రీస్తు పిలుపునిచ్చిన పని యొక్క పరస్పర వైరుధ్యమై యున్నది. ఒక ప్రక్క, కష్టపడి పని చేయడానికి కాడిమోపబడిన ఎద్దుల వలె మనమున్నాం. మరొక ప్రక్క, మనం చేసే పని, పక్షి ఈక కంటె తేలికైయుంది. పైవచనాలు ఇలా చెప్పుతున్నాయి: ‘‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మీ మీద నా కాడి ఎత్తికొనుడి’’ – ఒక్క నిమిషం: విశ్రాంతి అని ఇప్పుడే కదా అన్నారు. మళ్ళీ కాడి అంటున్నారు అదేమిటి? ఎద్దులు, నాగలిని లేదా బండిని లాగునట్లు వాటి మెడ మీద పెట్టబడేదాన్ని ‘కాడి’ అంటారు, అది గట్టిగా ఉంటుంది. ‘‘నేను సాత్వికుడను దీనమనస్సుగలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి., అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.’’

ఔను, క్రీస్తును వెంబడించువారిగా, మనం చేయవలసిన ముఖ్యమైన పని ఉంది. కాడి అంటే అదే. మనం మోయాల్సిన ఒక కాడి ఉంది. చేయడానికి ఏ పని లేనివారముగా మనం సృజింపబడలేదు. పనిలేనట్లయితే, అది ఎంత విసుకుగా ఉంటుంది కదా? కాని ఈ పనిలో, ఈ కాడిలో, ఆత్మకు శాపమేలేని విశ్రాంతి దొరుకుతుంది. మన పనులన్నిటిలో శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే, ఆ పనుల్లో క్రీస్తును మహిమపర్చే కీలకాంశము, 1 పేతురు 4:11లో వివరించబడి యున్నది: ‘‘ఒకడు ఉపచారము చేసిన యెడల లేదా ‘‘పనిచేయువాడు’’ అని అనండి. దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసు క్రీస్తు ద్వారా మహిమపరచబడును.’’ ఇక్కడ సామర్థ్యము అనుగ్రహించువాడే మహిమపరచబడతాడు. మనకు సహాయం దొరుకుతుంది, ఆయనకు మహిమ కలుగుతుంది, పని దాని భారమైన శాపము నుండి విడుదల పొందుతుంది.

ఈ రిఫరెన్సు కూడ గమనించండి, 1 కొరింథీ 15:10 – ‘‘అయినను నేను ఏమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె ` ఇతర అపొస్తలులందరి కంటె – నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.’’ మానవ పతనానికి ముందు ఉన్నట్లుగానే క్రైస్తవ జీవితంలో కష్టపడి చేసే పని యొక్క మహిమ ఇదే. ఏదెను తోటలో దినమంతా పనిచేసిన ఆదాము తాను చేసిన పనిని సంపూర్తిగా తన అవసరాలకు తగ్గట్టు చేస్తూ, తన ప్రయాసముల ఫలితంగా వర్ధిల్లుతూ, దానియందు అతిశయించాడని నేననుకోను. ‘‘ప్రయాసపడేది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే’’- ఈ మాటలు భారము వలన కలిగే దౌర్బల్యాన్ని మరియు నిరర్థకతను పూర్తిగా తొలగిస్తాయి.

మీరు ఏమిచేసినను…

క్రైస్తవులంగా, మనం ఎన్నో పనులు చేయాలని పౌలు పిలుపునిస్తున్నప్పుడు, బరువెక్కిన, ఆశాభంగం కలిగించే,శాపగ్రస్తమైన జీవితం జీవించడానికి పిలుపునివ్వడం లేదు. ఆయన మన మహిమ మరియు ఆనందం కొరకు మనల్ని పిలుపునిస్తున్నాడు. 1 కొరింథీ 15:58 – ‘‘కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై యుండుడి – అనగా, ఎన్నో పనులు చేయడమని అర్థమిస్తున్నదని నేననుకుంటున్నాను.’’ అది వ్యర్థం కాదు. ఇది కేవలం సంఘ పనులు మాత్రమే కాదుగాని, యేసు నామములో, యేసు మహిమార్థమై, యేసు శక్తి మీద ఆధారపడుతూ చేసే ప్రతి పనికీ మరియు పనులన్నిటికీ వర్తిస్తుందని నేననుకుంటున్నాను.

వాస్తవానికి, కొలొస్స 3:23-24 లో పౌలు ఇలా చెప్తున్నాడు, ‘‘ప్రభువువలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక, మీరేమి (ఇది ముఖ్యమైన మాట) చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు.’’ ఈ లెక్కచొప్పున ఇది మనము చేసే పనులన్నిటిని – సంఘపనులు మాత్రమే కాదు గాని,  అన్ని పనులను – ఆరాధన స్థాయికి హెచ్చిస్తుంది. ఈ పనులను మనము ప్రభువు నామములో, ప్రభువు మీద ఆధారపడుతూ, ప్రభువు మహిమ కొరకు చేసినట్లయితే, అది దైవికపని. అది క్రీస్తును ఘనపరిచే పని.

మరొకసారి చెబుతున్నాను. దేవుని జ్ఞానము, మంచితనము మరియు సౌందర్యము ప్రకారము లోకమును రూపుదిద్దడానికి, సృజనాత్మకంగా పనిచేయడానికి మరియు లోకమును లోపర్చుకోడానికి ఆది నుండే మనం సృష్టించబడ్డాము. ఇది శాపమై యుండలేదు, శాపము కాదు., ఇదొక ఆశీర్వాదం. ఇది నిరంతరము ఆనందమయంగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...