నేను అలసిపోయాను, పనులేమో చాలా ఉన్నాయి – బైబిలు చదవడానికి నాకు సమయం ఎలా దొరుకుతుంది

షేర్ చెయ్యండి:

జీవితంలో అలసిపోయే సమయాలుంటాయి. మనము చాలా అలసిపోతున్నాము. పనులు చూస్తే యింకా చాలా వున్నాయి. కాబట్టి బైబిలు చదవడానికి ఏ విధంగానూ వీలయ్యేట్టు లేదన్నట్టు అగపడే సందర్భాలు కూడ ఉన్నాయి. మనకు ఈ ఉత్తరం వ్రాస్తున్న ఎలైనా పరిస్థితి కూడ ఇలాగే వున్నది.  

“హలో, పాస్టర్‌ జాన్‌! నేను ఒంటరిగా ఉంటాను. వారంలో చాలా గంటలు పనిచేస్తుంటాను. బైబిలు చదవడం నాతో అవటం లేదు. అది దాదాపు అసాధ్యంగా ఉంటుంది. వంటచేసుకోవాలి, వంట పాత్రలు కడుక్కోవాలి, వ్యాయామం చేయాలి, ఇల్లూ ఒళ్లూ శుభ్రంగా కడుక్కోవాలి, ఇంట్లోకి అవసరమైనవి కొనుక్కొనిరావాలి, అవసరమైతే భోజనం తెచ్చుకోవాలి, నాకు అవసరమయ్యే వస్త్రాలు, వస్తువులు కొనుక్కోవాలి, ఇలా యింకెన్నో పనులుంటున్నాయి. నేను ఇంటికి చేరుకునేప్పటికి, నీరసంతో చతికిలబడుతున్నాను. నా బైబిలు చదువుకొని, ప్రార్థిస్తూ, దేవునితో ఏకాంతంగా గడపడానికి సమయం కేటాయించుకున్నాను. అయితే, నేను దేవునికి 15 నిమిషాల సమయం మాత్రమే ఇస్తున్నట్టనిపిస్తుంది. ఇది నాకిష్టం లేదు. కానీ నేను బ్రతకడానికి, ఖర్చులకు బిల్లులు చెల్లించాలి కాబట్టి పనిచేస్తున్నాను. నేను ఇరుక్కుపోయినట్టుగా ఉంది. బైబిలు చదివేప్పుడే ఎక్కువ నిద్ర వస్తుంది.వారం చివర్లో మాత్రమే సమయం దొరుకుతుంది. కాని అది చాలడం లేదు. ఇన్ని పనులున్న తరుణంలో, దేవునికి ఆచరణాత్మకంగా చాలినంత సమయమియ్యడానికి నేను గట్టెక్కేదెలా? ఏంచేయమంటారు?”

 ఎలైనా, బైబిలు చదువుతూ దేవునితో సమయం గడపాలనే తన ఆశకు భంగం కలిగిస్తున్న, మూడు ముఖ్యమైన విషయాలను వ్రేలుపెట్టి చూపిస్తుంది. మొదటిది – ఆమె ఇరుక్కుపోయినట్టున్నది. రెండవది – నిస్సత్తువతో నీరసించిపోతుంది, కావున బైబిలు చదువుదామని తెరిచేలోపల నిద్ర ముంచుకొస్తుంది. ఇక మూడవది – అనేక ఒత్తిడులతో కూడిన పనుల్లో నిమగ్నమైయుంది గనుక బైబిలు చదవాలంటే పిచ్చెక్కినట్టై బైబిలు చదవడం మానేస్తుంది. ముందు, ఈ మూడు విషయాల గూర్చి చెప్తాను. 

ఇరుక్కుపోకుండుట 

మా ఇంటి బయట కొందరు మంచులో ఇరుక్కుపోవడం నేను గమనిస్తుంటాను. మా వీధిలో ఒక మూలలో మా ఇల్లుంటుంది. ఆ వీధి గుండా వెళ్లేవారు ఆగి, ఆ తరువాత వెనక్కి వెళ్లి ముందుకు పోతుంటారు. కొందరు ఒకే చోట దాదాపు పది నిమిషాలు కూర్చుండిపోతారు. నేను వారిని చూస్తూ, ‘‘వారి దగ్గరికి వెళ్లి వారి వాహనాలను తోస్తానని’’ అనుకుంటాను. వారి వాహనాల టైర్లు ఆ మంచులో బొంగరము తిరిగినట్టు తిరుగుతూనే ఉంటుంది. అక్కడ నుండి కదులుతున్నట్టు ఉంటుంది, కాని కదలరు. ఇక్కడ, ఈ సమస్యకుగల కారణంలో ఒక భాగం, మంచు. గాని బొంగరం మాదిరి తిరిగినట్టు అదే పని మళ్లీ మళ్లీ చేయడం కూడ ఈ సమస్యకుగల కారణంలో భాగమై యున్నది.

     ‘‘లోపమును సవరించడానికి వాక్యమును విడిచిపెట్టవద్దు. లోపములలోనికి ఇతర విషయాలను బలవంతంగా నెట్టుతూ సవరించు.’’

     ఇరుక్కుపోకుండా ఉండాలంటే, చేస్తున్న పనిని తిరగేసి, రివర్స్‌లో చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఇది ఇరుక్కుపోయిన వస్తువును ముందుకు, వెనుకకు, మళ్లీ ముందుకు వెనుకకు కదిలిస్తూ, నిదానంగా బయటికి తీసినట్టు ఒక విధమైన వ్యతిరేకమైన చర్య వలె ఉంటుంది. లేదంటే, ఇరుక్కుపోయిన వాహనం యొక్క ముందు చక్రాల ముందున్న మంచును తొలగించడానికి పార అవసరం రావచ్చు. లేదంటే దగ్గర్లోనే ఉన్న జాన్‌ పైపర్‌ వంటి వారి ఇంటి డోర్‌బెల్‌ నొక్కి, ‘‘సహాయం చేయడానికి మీ దగ్గర ఎవరైనా ఉన్నారా?’’ అని అడగొచ్చు. ఇలా సహాయపడటం, మాకు అలవాటే. నేను మా కుమారులు కలిసి మంచులో ఇరుక్కుపోయిన చాలా వాహనాలను ముందుకు తోసి సాయపడ్డాము. ఇక్కడ విషయమేమంటే, ఇరుక్కుపోకుండా ఉండటానికి కొన్నిసార్లు క్రొత్త ప్రయాసములు, అవసరమవుతాయి.

అవసరమైనది ఒక్కటే

ఎక్కువ పనులుండడం, నిస్సత్తువతో నీరసించడం, ఇది ఏమై యుండవచ్చు? ఎలైనా, వ్రాసి పంపిన తన పనుల జాబితా చాల వివరంగా ఉంది – వంటపని, ఇంటిపని, వ్యాయామం, ఉద్యోగం, మొ॥ ఇవన్నీ నిన్ను జీవితంలో నిమగ్నం చేయడానికి ఆదర్శప్రాయమైనవి, మంచివి, విలువైనవే. కానీ, ఇలాంటి విషయాల్లో వేర్వేరుగా స్పందించిన ఇద్దరు స్త్రీల ఇంటికి యేసు వెళ్లాడు. గుర్తుకొస్తుందా? నేనెవరి గూర్చి మాట్లాడుతున్నానో? ఔను, వారే – మార్త మరియు మరియ.

మార్త వంటపనుల్లో, ఇంటిపనుల్లో నిమగ్నమై యుండింది. ఆమె ప్రభువు దగ్గరికి వెళ్లి, ‘‘ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పండి అన్నది’’. అయితే ప్రభువు, ‘‘మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను’’ (లూకా 10:40-42).

ఇప్పుడు ఎలైనా, ‘‘నా బిల్లులు కట్టడానికి ఎవరు వెళ్తారు?’’ అని అడుగుతుందని నాకు తెలుసు. ఆమె చెప్పుతున్నది అదే, కదా. నిజమే. గాని, యేసు ఎలైనా ఇంటికి వెళ్లి ఆమె చేస్తున్న పనుల పట్టికను గమనించి, కొన్ని విషయాలు చూపిస్తూ, ‘‘లేదు ఎలైనా, నీవు అంతంత సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు. ఈ పని చేయడానికి నీవు అంత సమయం మరియు శక్తిని కేటాయించాల్సిన అవసరం లేదు. అవసరమైనది ఒక్కటే, నీవు వంట చేసే విధానం కంటె మరి ఎక్కువ అవసరమైనది, నీవు నీ ఇంటిని నీ ఒంటిని శుభ్రంచేస్తున్న తీరు కంటె మరి ఎక్కువ అవసరమైనది, నీవు వ్యాయామం చేస్తున్న పద్ధతి కంటె మరి ఎక్కువ అవసరమైనది, చిల్లర వస్తువులు మరియు ఇతర వస్తువులు కొంటున్న విషయం కంటె మరి ఎక్కువ అవసరమైనది, ఒక్కటే’’ అని చెప్పొచ్చు.

లూకా 8:14లో, ఒక విత్తనము సామాన్యమైనవాటి చేత, అనేక పనుల చేత అణచివేయబడిందని యేసు హెచ్చరిస్తున్నాడు, ఔనా? ‘‘ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలినవారెవరనగా, విని కాలము గడిచిన కొలది యీ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలించనివారని’’ ఆయన సెలవిస్తున్నాడు.

‘‘యీ జీవన సంబంధమైన విచారములు’’ మనకందరికీ లేవా? ఒకవేళ మనం ఆ మాట అంటే, ఆ తరువాత ఆయన, ‘‘మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని’’ మనకు గుర్తుచేస్తున్నాడు (మత్తయి 4:4).

రోజువారీ పనులు

     ఎలైనాకు ప్రోత్సాహకరంగా ఉండేట్టు కొన్ని విషయాలు చెప్తాను. కూర్చోని, నీవు నీ జీవితాన్ని గడుపుతున్న తీరుకు సంబంధించిన విషయాల జాబితా ఒకటి తయారుచేసుకో. అంటే, ఆమె మనకు పంపిన ఉత్తరంలో ఇదివరకే అన్నీ తెలియజెప్పింది కదా అని నా భావం.  ఆమె తన జీవితంలో తాను చేయాలని నిజంగా కోరుతున్న పనులు చేయకుండా, తన సమయాన్ని దొంగిలిస్తున్న విషయాల గూర్చి నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క విషయం గూర్చి ఆమె ఈ ప్రశ్న వేసుకోవాలి. ‘‘నేను దీనిని చేస్తున్న విధానం, ఉత్తమమైనదా? బైబిలు చదువుకొని, ప్రార్థిస్తూ, దేవునితో సమయము గడుపుట కంటె ఇది మరి ఎక్కువ ముఖ్యమైనదా? దేవుని వాక్యం చదువుకొని ప్రార్థించడానికి చాలినంత సమయం దొరికేట్టు ఈ పనులు చేసే సమయంలో మార్పులు చేసుకొడానికి మార్గం ఉందా?’’ అని.

ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే, నీవిప్పుడు పొద్దున్నే లేస్తున్న సమయం కంటె యింకా 45 నిమిషాలు ముందుగా లేచేట్టు అలారమ్‌ సెట్‌  చేసుకో. లేచిన తరువాత, స్నానం చేసి, సిద్ధపడి, ఇంటిపనులలో దేన్నైనా మొదలుపెట్టక ముందే, బైబిలుతో కూర్చో. లోపాలను సవరించడానికి వాక్యమును విడిచిపెట్టవద్దు. లోపములలోనికి ఇతర విషయాలను బలవంతంగా నెట్టుతూ సవరించు. అవన్నీ కూడా చేస్తావు. నీవు నీ బైబిలును చదివినట్లయితే, నీ బిల్లులు కూడ చెల్లిస్తావు – తప్పక చెల్లిస్తావు. నీకు మాట ఇస్తున్నాను.

మెలకువగా ఉండుము

     ఇదివరకటి కంటె ఇప్పుడు 45 నిమిషాలు ముందుగా లెమ్మంటున్నాను, కదా. ఈ మాటలకు ఎలైనా తన తల ఊపుతూ, ‘‘బాగుంది, మీరు నాతో తమాషా చేస్తున్నారా? నేనిప్పటికే నిస్సత్తువతో నీరసిస్తున్నాను’’ అంటుంది. ఆమె బైబిలు తెరవగానే నిద్ర వస్తుంది అంటుంది. మనలో ఎవరికి అలా నిద్ర రాలేదు? మూడు ఆచరణాత్మక ఆలోచనలు చెప్తాను, వినండి:

1. ముఖ్యంగా బైబిలు చదవడానికి, చదివేప్పుడు, నిద్ర రాకుండా ఉండడానికి, ఎక్కువ విశ్రాంతి కోసం, ఇదివరకటి కంటె ముందుగా నిద్రపో. నీవు అలసిపోయినప్పుడు, ఆ యా వస్తువులు కొనడానికి బలవంతంగా లేచి వెళ్లు. నీవు అలసిపోయినప్పుడు బలవంతంగా మెలకువగా ఉండలేకపోవచ్చు. గాని, అలసిపోయినప్పుడు ఆ యా వస్తువులు కొనడానికి వెళ్లగలవు.

2. పొద్దున్నే లేవగానే తప్పనిసరైతే, వెళ్లి కప్పు కాఫీ తయారు చేసికొని త్రాగు. కాఫీలోని కెఫిన్‌, దాని పని అది చేయ్యనీ. నేను కాఫీ త్రాగను, గాని కెఫిన్‌ చేసే పని చేసే డయెట్‌ కోక్‌ మరియు టీ త్రాగుతాను.

3. నిద్ర మత్తు ముంచుకొస్తున్నట్లయితే, నీ బైబిలు తీసికొని, కూర్చోవద్దు గాని నీ గదిలోనే అటూ ఇటూ నడుస్తూ నీ బైబిలు చదువు. కూర్చోనే బైబిలు చదవాలనే పవిత్ర నియమం లేదు. నడుస్తూ ఉన్నప్పుడు నిద్రపోవడం కష్టం. మొన్నటి దినాన నేనిలాగే చేశాను.

ప్రశస్తమైన ధననిధి

అత్యంత ముఖ్యమైన ఆచరణాత్మకమైన ఈ సలహాల కంటెను మరి ఎక్కువ ముఖ్యమైన విషయమేమంటే, దేవుని వాక్యమే అన్నిటి కంటె మరి ఎక్కువ ప్రశస్తమైనదనే ప్రాథమిక, మౌలిక, పునాదివంటి అనుభవమే.

     కీర్తన 19:9-10 వచనాలు నీకు నీవు బోధించుకుంటూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు నీవే బోధించుకో. ‘‘యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటి తేనెధారల కంటెను మధురమైనవి.’’ దేవుని వాక్యము కంటె బంగారము, ఆహారము ఎక్కువ విలువైనవని లేదా మధురమైనవని అనవద్దు, అనుకోవద్దు. అవి ఎక్కువ విలువైనవి లేదా మధురమైనవి కానే కావు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...