మంచి సంఘాన్ని ఎలా కనుగొనాలి?

మంచి సంఘాన్ని ఎలా కనుగొనాలి?

షేర్ చెయ్యండి:

మంచి స్థానిక సంఘాన్ని ఎలా కనుగొనాలి? అనే ప్రశ్నను ప్రతి వారం ఎవరో ఒకరు మాకు ఇమెయిల్ పంపిస్తూనే ఉన్నారు.చివరకు,ఒక అజ్ఞాత మహిళ ఇమెయిల్ ద్వారా అడిగిన ప్రశ్నకు ఈ రోజు జవాబు ఇస్తున్నాము. “ప్రియమైన పాస్టర్ జాన్ గారు, నేను ఈ మధ్యనే ఒక కొత్త సిటీకి వెళ్ళాను మరియు మా ప్రాంతంలో సిద్ధాంతపరంగా నమ్మకమైన సంఘాలు అనేకమున్నాయి(అద్భుతంగా!). నా పరిస్థితిలో మీరుంటే, ఇక్కడున్న మంచి సంఘాలన్నింటిలో ఏది ఎంచుకుంటారు? కేవలం నా ప్రాధాన్యతలను బట్టి నిర్ణయం తీసుకోవాలనుకోవడం లేదు. కానీ సంఘాన్ని ఎంచుకొనేటప్పుడు వ్యక్తిగత ప్రాధాన్యతలు ఎటువంటి పాత్ర పోషిస్తాయి?”

ముందుగా ఆ చివరి ప్రశ్న తీసుకుందాం. సాధారణంగా, ప్రాధాన్యతలు అంటే ప్రత్యక్షంగా బైబిల్ ఆదేశించని ఇష్టాలు అని నేను అనుకుంటున్నాను. దేవుని వాక్యం ఆదేశించనప్పటికీ, వాక్యం ద్వారా రూపుదిద్దుకున్న, ఏర్పడిన ఇష్టాలుంటాయి. అవి ఇతర ముఖ్యమైన విషయాల కంటె ఎక్కువ ముఖ్యం అవ్వనంత వరకు అవి మీ నిర్ణయంలో ఒక భాగంగా ఉండవచ్చు. చిన్న సంఘం లేదా పెద్ద సంఘం, ధ్యానపూర్వకమైనవి లేదా ఉత్సాహభరితమైనవి, సాంప్రదాయబద్దమైనవి లేదా సమకాలీన సంఘాలు, క్రమబద్ధమైనవి లేదా క్రమము లేనివి, ఆర్గాన్ వాయించేవి లేదా గిటార్ వాయించేవి, పొడుగాటి బెంచీలు లేదా కుర్చీలు, పది గంటలకి ప్రారంభమయ్యేవి లేదా పదకొండు గంటలికి  ప్రారంభమయ్యేవి, సాయంత్రముండేవి లేదా సాయంత్రము లేనివి, మరియు ఇలాంటి ఎన్నో ఇతర ప్రాధాన్యతలు ఉండి ఉండవచ్చు.

అలాంటి విషయాలపై మనందరికీ మన సొంత ఇష్టాలున్నాయి, మరియు అవి దేవుని వాక్యం ద్వారా రూపుదిద్దుకున్నవై, అవి మరింత ముఖ్యమైన బైబిల్ విషయాలకు లోబడి ఉంటే, అవి మీ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో భాగంగా మీకు మార్గనిర్దేశం చేయడం మంచిదని నేను అనుకుంటున్నాను.

అయితే, ఇప్పుడు ముఖ్యమైన విషయాలపై దృష్టిపెడదాం. స్థానిక సంఘాన్ని వెతకడానికి మీరు తీసుకోవాల్సిన తొమ్మిది మెట్లను ప్రస్తావిస్తాను. నేను కేవలం మీ పరిస్థితి గురించి మాత్రమే కాకుండా మరింత విస్తృతంగా ఆలోచిస్తున్నాను. అయితే ఇది మీ పరిస్థితికి కూడా వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను.

1. దేవుని సన్నిధికి వెళ్ళండి.

యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచుము.
నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము.
నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.
యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై యున్నాడు కావున తన
మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును.
న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును
తన మార్గమును దీనులకు నేర్పును. (కీర్తన 25:4–58–9)

కాబట్టి, ఆరోగ్యకరమైన సంఘములో మీరు ఉండి మీ తలాంతులు వాడబడుతుంటే  ప్రభువు ఆనందిస్తాడు. 25వ కీర్తనలోని ప్రార్థనకు ఆయన జవాబిస్తాడని మీరు నమ్మడానికి బలమైన కారణం అదే.

2. నమ్మకాల విషయంలో స్పష్టత కలిగి ఉండండి

మీ నమ్మకాలు వాక్యానుసారమని నిర్ధారించుకోడానికి, ఆరోగ్యకరమైన సంఘం గురించి బైబిల్ ఏమి చెబుతున్నదో అర్ధం చేసుకోడానికి పరిశోధించే ఈ సమయాన్ని ఉపయోగించండి. మీరు వెతుకుతున్న దానిని స్పష్టం చేసుకోడానికి నేను మార్క్ డెవర్ వ్రాసిన వాట్ ఈజ్ ఎ హెల్తీ చర్చ్ అనే పుస్తకాన్ని సిఫారసు చేస్తాను.

3. చుట్టూ ఉన్నవారిని అడగండి.

సిటీలో మీకు తెలిసిన వారిని లేదా సిటీ గురించి తెలిసిన వ్యక్తులతో మాట్లాడండి. వారు నమ్మదగిన వారైతే, వారు ఇచ్చే సలహాలు కూడా బహుశా అత్యంత నమ్మదగిన సమాచారమవుతుంది. సంఘమును ఒక్క ఆదివారం సందర్శించి తొందరపాటుతో తప్పుడు అభిప్రాయాలకు రావడం కంటే ఇది మరింత నమ్మదగినది అని నేను అనుకుంటున్నాను.

4. ఇంటర్నెట్లో వెదకండి.

ఇంటర్నెట్ కారణంగా ముందు తరాల కంటే మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సంఘాల కోసం ఇంటర్నెట్లో  అన్వేషించండి మరియు వారి వెబ్‌సైట్‌లను అధ్యయనం చేయండి. వారి వెబ్‌సైట్‌ ఎంత ఆకర్షణీయంగా ఉందో అన్న దాని  మీద మీరు ఆధారపడకండి. మంచి సంఘాలకు ఆకర్షణీయమైన వెబ్‌సైట్‌లు ఉండకపోవచ్చు. కానీ మీకు కావలసినది సమాచారమే గాని ఆకర్షణలు కాదు. “కృప సిద్ధాంతాలను నమ్మే జంటనగరాల్లోని సంఘాలు” అని నేను నిన్ననే గూగుల్ లో వెదికాను. గూగుల్ ఇచ్చిన జాబితాలో రెండవ స్థానంలో సిటీస్ చర్చి ఉంది. ఇది నేను పరిచర్య చేసిన బెత్లెహేమ్ సంఘం ద్వారా స్థాపించిన మరో సంఘం.  నాలుగవ స్థానంలో బెత్లెహేమ్ సంఘం వచ్చింది. ఇప్పుడు జంటనగరాల్లో ఉండే ఎవరికైనా ఆ రెండు చర్చిలను సిఫారసు చేస్తాను.

వాస్తవానికి, ఆ రకమైన పరిశోధన సరిపోదు. మీరు ఎంచుకొనేటప్పుడు ఇలాంటి పరిశోధనను ఒక్క దానినే ఆధారం చేసుకోవద్దు. మీరు గూగుల్లో కొన్నిసార్లు నిజంగా ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు. ఆ పరిశోధన కేవలం ప్రారంభం మాత్రమే. ఆ రకమైన పరిశోధన తీవ్రమైన పొరపాట్లకు దారితీసే అవకాశం ఉంది. దానికంటే ది గాస్పెల్ కోయిలేషన్ వెబ్‌సైటుకి వెళ్లి చర్చిల కోసం వెతకడం  మంచిది. గూగుల్లో వెదకటం కంటె కూడా బహుశా ఇది మంచి ప్రారంభ మెట్టు.  అయితే గూగుల్ కూడా సహాయపడుతుంది.

5. నాయకత్వాన్ని పరీక్షించండి

ఒక నిర్దిష్టమైన నాయకత్వంగల ఒక సంఘం కోసం చూడండి. దాని కోసం 1 పేతురు 5:2–4 తో ప్రారంభించవచ్చు:

బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను,. . .
మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.

ఇతరులకు సేవ చేయడానికి ఇష్టపడే సంతోషకరమైన కాపరుల కోసం చూడండి.

దుర్లాభాపేక్షతోకాక సిద్ధమనస్సుతోను…

డబ్బును ప్రేమించని,  నిరాడంబర జీవితాలు కలిగి, పని చేయడానికి ఆసక్తి చూపే కాపరుల కోసం చూడండి మరియు వారు వీలైతే జీతం లేకుండా కూడ పని చేస్తున్నవారిని చూడండి.

మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి; వినయంగా ఉండే కాపరుల కోసం చూడండి. వారు అధికారం కోసం తాపత్రయపడరు. ఎవడైనను మొదటి వాడైయుండ గోరినయెడల, వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడునై యుండవలెనని (మార్కు 9:35) అని చెప్పిన యేసు మాటలను అనుసరించే కాపరులను  చూడండి.  మరియు వారు మాదిరిగా ఉండడం ద్వారా ప్రేరేపిస్తారు తప్ప బలవంతం చేయరు. దబాయించరు.

6. ప్రేమ కొరకు చూడండి.

ఈ రకమైన వ్యక్తుల కోసం సంఘంలో వెదకండి. 1 యోహాను 3:14 ఇలా చెప్తుంది,

మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు.

కాబట్టి, క్రొత్తగా జన్మించడమే సభ్యత్వం. క్రొత్తగా జన్మించిన వారిని ఎలా గుర్తిస్తారు? వారు ఇతర విశ్వాసులను ప్రేమిస్తారని యోహాను చెప్పాడు. వివిధ జాతులను బట్టి, వివిధ ఆర్థిక స్థాయిలను బట్టి, విభిన్న విద్యలను బట్టి  విశ్వసించేవారిని వేరు వేరుగా చూడడం మీరు అక్కడ చూస్తున్నారా?  క్రొత్తగా జన్మించిన  వారి ప్రేమలో ఈ విధానం కనపడదు.

1 పేతురు 5లో సంఘానికి ఎలాంటి నాయకులు ఉండాలో వర్ణించిన తర్వాత, పేతురు ప్రజలను గూర్చి ఇలా వర్ణిస్తాడు:

మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని… ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి… ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి (1 పేతురు 5:5-7)

కాబట్టి, ప్రేమగలిగి, వినయంగా ఉండే, తమ చింతలను దేవునిపై వేసే సంఘాన్ని వెతకండి.

7. బోధలను పరీక్షించండి

తరువాత మీ దృష్టిని బోధ వైపు మళ్లించండి. బైబిల్లోని ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి సిగ్గుపడని సంఘాన్ని చూడండి. వాక్యానుసారంగా కాకుండా లోకానుసారంగా జీవించే వ్యక్తులు భాధపడతారేమో అని భయపడి లేఖనాలు బోధించని సంఘానికి వెళ్లవద్దు. ఒక సంఘం వాక్యానుసారంగా బోధిస్తున్నదో లేదో తెలుసుకోడానికి స్త్రీ పురుష తత్వాలను  గురించిన బోధ ఒక మంచి పరీక్ష అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇది చాలా వివాదాస్పదమైన విషయంగా మారింది.

వారు ఏమి బోధిస్తున్నారు? స్త్రీ పురుషుల లైంగికతకు సంబంధించిన విషయాలను ఎలా బోధిస్తున్నారు? వారు దేవుని వాక్యమంతటిని, దేవుని నమ్మకమైన వాక్యముగా సిగ్గుపడకుండా బోధిస్తున్నారా?

8. పరిచర్యను వెదకండి.

మీరు ఈ చర్చిలో సేవ చేయగలరా? విశ్వాసులు పరిచారకులుగా ఉండటం మరియు పరిచర్య పని కోసం పరిశుద్ధులను సన్నద్ధం చేయడం గురించి కాపరులు ఆలోచిస్తారా (ఎఫె. 4:12)? మీరు కేవలం కూర్చొని చూసేవారుగా ఉండటానికి ఇష్టపడరు.

9. గంభీరమైన ఆనందం కోసం వెతకండి.

ఈ సంఘ జీవితం తీవ్రమైన ఆనందాన్ని ఇస్తుందా? అని నేను అడుగుతాను. దేవుని కృపవల్ల బాధపడటం నేర్చుకున్న వాళ్ళు, కోపగించుకోనివారుగా, విస్మరించని వారుగా, అమాయకులుగా ఉన్నారా? “దుఃఖపడిన రమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము” ఎలాగో వారికి తెలుసా (2 కొరి౦థీయులు 6:10)? వారి సమస్యలు, వారి బాధలు విషయంలో యదార్థంగా ఉంటారా?

ఇవే ఆ 9 మెట్లు. ఒక క్రమంలో అవి ఖచ్చితంగా జరగాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ మొదలు పెట్టానో అక్కడే ముగిస్తాను. కేవలం ప్రార్థనతో ప్రారంభించవద్దు. ప్రతి అడుగును ప్రార్థనతో నింపండి, అప్పుడు దేవుడు తప్పక మీకు మార్గనిర్దేశం చేస్తాడు.

న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును. (కీర్తన 25:9) 

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...