నా అనుదిన బైబిలు పఠనమును నేను ప్రామాణికమైనదానిగా ఎలా చేసికోగలను
జాన్ పైపర్గారు రోమీయులకు వ్రాయబడిన పత్రికనంతటిని 225 ప్రసంగాలుగా బోధించారనే విషయం ఈ ప్రసారాలు వింటున్న శ్రోతలకు తెలుసు . ఈ ప్రసంగాల పరంపరను పూర్తిచేయడానికి ఆయనకు 1998 మార్చి నెల నుండి 2006 చివరి వరకు, 8 సంవత్సరముల 8 నెలల కాలం పట్టింది. ఈ 225 విలువైన సందేశాలు ఒక్కచోట పోగుచేయబడి ఉన్నాయి. వీటిని ఆన్లైన్లో, ‘‘ది గ్రేటెస్ట్ లెటర్ ఎవర్ రిటెన్’’ అనే శీర్షిక క్రింద చూడవచ్చు. జాన్ పైపర్గారి సందేశాలు రికార్డు చేయబడినవాటిలో ఈ సందేశాలు చాలా ప్రత్యేకమైనవి. మీలో చాలా మంది వీటన్నిటిని వినియుంటారని నాకు తెలుసు., ఈ రోజు నేను ప్రసారం చేయదలచిన ఎపిసోడ్ కూడా దీని వంటిదే, మన ప్రసారాలు వింటున్న ఒక శ్రోత చేత ఇది పంపబడింది. ఈ ప్రసంగంలో, పాస్టర్ జాన్గార, మన అనుదిన బైబిలు పఠన క్రమశిక్షణ, యాంత్రికమైనది కాదు గాని ప్రామాణికమైనదని ఎలా రూఢపర్చుకొనగలమనే అంశం గూర్చి బోధిస్తున్నారు. ‘‘మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను’’ అనే ఈ అంశం రోమా 12:9 ఆధారంగా తీసికొనబడిన వాటిలో ఒకటి. ఇది నవంబర్ 21, 2004 నాడు బోధింపబడింది. ఆయన మాటల్లోనే వినండి.
ఈనాటి మన అంశాన్ని రోమా పత్రికలోగల కొన్ని ఆలోచనలతో మొదలుపెడదాం. మనల్ని అంతరంగంలో లోతుగా మార్చివేసేట్టుగా వాక్యభాగాన్ని చదవాల్సిన విధానము గూర్చిన కొన్ని ఆలోచనలు ఈ వాక్యభాగంలో ఉన్నాయి. చెప్పాలంటే, 12వ అధ్యాయంలోని 9-13 వచనాలు చూస్తే, కేవలము ఈ 5 వచనాల్లోనే 13 ఉపదేశాలు ఉన్నాయి.
ప్రశాంతంగా నున్న సమయంలో ప్రాణసంకటం
నీవు పొద్దునే లేచావు. పనికి వెళ్లక ముందు ఒక మంచి క్రైస్తవునిగా బైబిలు చదవడానికి చక్కగా సిద్ధపడ్డావని అనుకుందాము. ఇదొక మంచి ఆలోచనే. నీవు దీనిని అమలుచేయాల్సిందే. కొన్ని అధ్యాయాలు చదవాలని బైబిలు తెరిచావు. ఈరోజు నీవు చదవాలనుకున్న అధ్యాయాల్లో రోమా 12వ అధ్యాయం కూడ ఉన్నది. ఈ అధ్యాయమంతటిని చదవడానికి నీవు 3 నిమిషాలు తీసికోవచ్చు. అనగా, ఈ 13 ఆజ్ఞలు చదవడానికి నీవు 15 సెకెండ్ల సమయమిచ్చావని అర్థం. ఈ ఉపదేశాల జాబితా ఇలా ఉంటుంది:
1. మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను.
2. చెడ్డదానిని అసహ్యించుకొనుడి.
3. మంచిదానిని హత్తుకొనుడి.
4. సహోదర ఆప్యాయతతో ఒకరినొకరు ప్రేమించుడి.
5. ఒకని కంటె మరొకడు ఘనుడని ఎంచుడి.
6. ఆసక్తి విషయంలో మందులై యుండకుడి.
7. ఆత్మయందు తీవ్రతగలవారై యుండుడి.
8. ప్రభువును సేవించుడి.
9. నిరీక్షణగలవారై సంతోషించుడి.
10. శ్రమలో ఓర్పుగలవారై యుండుడి.
11. ప్రార్థనయందు పట్టుదలగలవారై యుండుడి.
12. పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుడి.
13. శ్రద్ధగా ఆతిథ్యమియ్యుడి.
5 వచనాల్లో మొత్తం 13 సంగతులు ఉన్నాయి. 15 సెకెండ్లలో చదివేశావు. బైబిలు చదవడం అయిపోయింది గనుక బైబిలును మూసేశావు. ప్రార్థన చేసుకొని, పనికి బయల్దేరావు. 13 ఉపదేశాలు లేదా ఆజ్ఞలు చదివావు, కదా. నీకు ఎన్ని జ్ఞాపకమున్నాయి? అనగా, జీవితంలోని ఈ 13 విషయాల్లో ఉత్తేజింపబడి వాటిలో పూర్తిగా నిమగ్నమై యుండుటకు నీవిప్పుడు నూతనపర్చబడ్డావా? ఇదేనా, పొద్దున్నే లేచి బైబిలు చదివిన దాని ప్రభావం? ఇది ఇలా పనిచేయదు, చేస్తుందా?
అలాగైతే, మనమేంచేయాలి? ఎందుకంటే, మన చెవులకు కితకితలు పెట్టాలనే ఉద్దేశంతో పౌలు ఈ మాటలు వ్రాయలేదు. మనకు సంబంధం లేని విషయాలుగా వ్రాయలేదు. ఈ 13 ఆజ్ఞలు మనలో వాస్తవమవ్వాలనేదే ఆయన నిజమైన ఉద్దేశం. మనము వాటిని చదివేటప్పుడు, అవి మనకు మరి ఎక్కువ వాస్తవం కావాలి. మనము వాటిని బోధించేటప్పుడు, అవి మనకు మరి ఎక్కువ వాస్తవం కావాలి. అవి ఊరకనే వ్రాయబడలేదు. కాబట్టి, బైబిలు మనకు శక్తివంతమైనదగునట్లు, మనలను మార్చునట్లు, మనము బైబిలుతో ఏంచేయాలనేది తెలిసికోడానికి మనకు సహాయం అవసరమై యున్నది. బైబిలు ఊరకనే వ్రాయబడలేదు.
వాక్యము మరియు పరిశుద్ధాత్మ పనిచేయుచున్నారు
మనకు సహాయం అవసరముందని చెప్పుకున్నాము, కదా. రండి, సహాయం కోసం, నాతోపాటు రోమా 15వ అధ్యాయం తీయండి. “ పౌలు గారు, మేము రోమా 12వ అధ్యాయాన్ని ఎలా చదవాలో, మాకు సహాయం చేస్తావా?’’ అని నేను అపొస్తలుడైన పౌలును అడిగాను. అందుకాయన, ‘‘చేస్తాను, తప్పక చేస్తాను, 15వ అధ్యాయంలోని 15-16 వచనాల్లో మీక్కావలసిన సహాయమున్నదని’’ అన్నాడు.
‘‘… మీకు జ్ఞాపకము చేయవలెననియుండి యెక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను.’’
అక్కడ కాస్త ఆగండి. అనుభవజ్ఞులైన క్రైస్తవులకు, బైబిల్లో పదాలు మళ్లీ మళ్లీ చెప్పబడుచున్న పదాలని తెలుసుకొనండి. బైబిలులో నేనొక క్రొత్త విషయాన్ని ఎన్నడూ చదవను. నేను బైబిలును ఎన్నోసార్లు చదివాను – దానిలోని ప్రతి మాటను, మళ్లీ మళ్లీ చదివాను. బైబిలులో నాకు క్రొత్త మాట కనబడదు. ఒక నూతన వాస్తవమును, నూతన సత్యాన్ని, నూతన శక్తిని, కొన్ని నూతన అంతర్భావాలను చూడాలని నేను ప్రార్థిస్తున్నాను. గాని దానిలోని అవే పదాలు లేదా మాటలు నేను మళ్లీ మళ్లీ చూశాను.
జ్ఞాపకం చేసేది (రిమైండర్) – మీకు ఇప్పటికే తెలిసిన వాటిని మీకు గుర్తుచేసే చిన్న ప్రార్థన కూటము, కుటుంబ ప్రార్థన సమయం, బైబిల్ పఠనం లేదా ప్రసంగాన్ని ఎప్పుడూ విస్మరించవద్దు, అసంతృప్తి వ్యక్తపరచొద్దు. దేవుడు తరచుగా సుపరిచితమైన సత్యాలలో కొత్త విషయాలను బయలుపరుస్తాడు మరియు మీ జీవితంలోని మార్పు అవసరమయ్యే ప్రాంతాలను రూపాంతరం చేయడానికి పని చేస్తాడు. కాబట్టి, ఇది తెలుసుకోండి : బైబిలు ముఖ్యంగా క్రైస్తవులకు, క్రైస్తవ జీవితం జీవించడానికి కీలకమైన మరియు విషయాలను జ్ఞాపకం చేసే పుస్తకమైయున్నదని గ్రహించాలి.
అపొస్తలుడైన పౌలు,
‘‘దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి, మీకు జ్ఞాపకము చేయవలెననియుండి యెక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా వ్రాయుచున్నానంటున్నాడు.’’
కాబట్టి, బైబిలు కృపాసహితమైన వరం అనే విషయం తెలుసుకోండి. ఈ విషయాలను మనకు వ్రాయడానికి పౌలుకు కృప అనుగ్రహింపబడింది. దీనిని నిర్లక్ష్యం చేయవద్దు. 15-16 వచనాలు చూడండి:
‘‘… అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు, … అన్యజనుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారకుడనైతిని.’’
‘‘అన్యజనులు’’ – మనలో అనేకులము అన్యజనులము, ఇప్పుడు ‘ఒక ఆరాధనా అర్పణ’గా వ్యవహరింపబడుతున్నాము. ఇది మీకు రోమా 12:1ని గుర్తుచేయాలి: ‘‘… సజీవ యాగముగా మీ శరీరములను … సమర్పించుకొనుడి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.’’ మనము దేవుని కుమారుని స్వరూపము లోనికి రూపాంతరము చెందుచుండగా, ఆరాధన అర్పణగా మనము పౌలు చేత దేవునికి అర్పింపబడుతున్నాము.
నీవూ నేనూ కూడ ఎక్కువ అనుకూలమునైనవారం అవ్వాలని పౌలు రోమా పత్రిక వ్రాశాడు. రోమా 12:2లోని అనుకూలమునైన అనే మాట మీకు గుర్తుకొస్తుందా? ‘‘… అనుకూలమును … అయ్యున్నదేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి.’’ దేవుని చిత్తము అనుకూలమైనదై యున్నదానిగా హత్తుకొనండి. మీరలా చేసినప్పుడు, ఈ క్రింది విధంగా జరుగుతుంది:
అన్యజనులు ఆత్మసంబంధమైన అర్పణగా అర్పింపబడతారు. రోమా పత్రిక వ్రాయడం వలన ఇది జరుగుతున్నది. కాబట్టి, నీవు రోమా పత్రిక చదువునప్పుడు నీలో కూడా ఇదే జరుగవలసి యున్నది.
‘‘పరిశుద్ధాత్మలేని బైబిలు పఠనము వలన మన జీవితాలపై ప్రభావమేమీ ఉండదు.’’
ఆ తరువాత వచ్చే వాక్యం : ‘‘పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి’’ (రోమా 15:15-16ఎ). పరిశుద్ధాత్మలేని బైబిలు పఠనము వలన మన జీవితాలపై ప్రభావమేమీ ఉండదనే విషయం నీకు తెలుసు, నాకు కూడ తెలుసు. వాస్తవానికి, పరిశుద్ధాత్మ లేకుండా మనము బైబిలు చదవడానికి ప్రయత్నించినట్లయితే, ‘‘నేను చదవగలను. నన్ను చూడండి’’ అనే మన సొంత నైతిక తీర్మానాన్ని మాయమాటలతో ప్రచారము చేసుకొనే బ్రహ్మాండమైన న్యాయవాదులమవుతాము. దానికి బదులుగా, మనకు, పరిశుద్ధాత్మ చాలా అవసరం.
అనుదిన బైబిలు ఆస్వాదనము (అవగాహన) కొరకు మూడు సూత్రాలు
నా జీవితం మారునట్లు నేను రోమా 12వ అధ్యాయాన్ని చదవడానికి నాకు సహాయపడు మూడు విషయాలను ఈ వచనాల్లో నుండి నేను రాబట్టుకున్నాను. ఈ సందేశాల ద్వారా నేను మారాలని ఆశిస్తున్నాను. ‘‘మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను’’ అనే 9వ వచనం ద్వారా నేను మారాలని ఆశిస్తున్నాను. ఈ మాటలు చదివిన తరువాత నేను వేషధారుడనై యుండకూడదని ఆశిస్తున్నాను. నేనెలా వేషధారణ లేనివాడనై యుండగలను? ఈ మాటలు నన్ను వేషధారణ లేనివానిగా, నా ప్రేమ విషయంలో యథార్థమైనవాడిగా మరియు నిజమైనవాడిగా చేయడానికి నా జీవితాన్ని మార్చే శక్తి కలిగేలా ప్రభావం చూపేదేమిటి? బైబిలును చదవడానికి మూడు మార్గదర్శకాలు:
1. బైబిల్ చదివేటప్పుడు ప్రార్థించండి.
నీవు బైబిలు చదివేటప్పుడు ప్రార్థించాలి. ఎందుకంటే, మన ప్రవర్తనా పద్ధతి అంతటిలో, మనము దేవుణ్ణి చూసే తీరులో మరియు మనం ఒకరి యెడల మరొకరము వ్యవహరించు విధానములో మార్పు కలిగేటట్లు, బైబిలులోని విషయాలను మనకు వర్తింపజేసేవాడు పరిశుద్ధాత్మయే. అప్పుడు, ఈ కార్యాలు జరిగించుమని మనము ఆయనను అడగాలి. కాబట్టి, నీవు బైబిలు చదివేప్పుడు, ఒక వచనం చదివిన తరువాత ఒక్క క్షణమాగి, ‘‘ఓ పరిశుద్ధాత్ముడా, నేను ఈ విషయాన్ని నా జీవితంలో నిజముగా ఆచరించేలా సహాయం చేయు. నన్ను దీనమనస్కునిగా, నమ్మదగినవానిగా, ప్రేమించువానిగా చేయడానికి నీవు చేయవలసినదంతా చేయుమని’’ ప్రార్థించు. నీవు ప్రార్థించాల్సిన పద్ధతి ఇదే. ఇది కష్టమే.
గత రాత్రి, మేము ఆరాధన కార్యక్రమంలోనికి వెళ్లక ముందు, మాలో అనేకులము క్రింది అంతస్తులోని క్వయర్ రూమ్‌లో కూడుకున్నాము. అక్కడ నేను గత రాత్రి ఈ విషయాన్ని బోధించాను : ‘‘దేవా, అవసరమైనది ఏదైనా సరే – చావైనా, ఉద్యోగం ఊడిపోవడమైనా, కేన్సరు వ్యాధియైనా, అవసరమైనది ఏదైనా సరే చేసి – నాలోని వేషధారణను తీసివేయుమని నేను చెబుతుండగా, ‘‘మ్మ్’’ అనే మూలుగులు, ‘‘ఆమేన్’’ అనే మాటలు చాలా వినిపించాయి. ఈ సంఘంలో నీవు చేయాల్సినది ఏదైనా సరే, అది ఏదైనా సరే, చేయు దేవా, ఎందుకంటే మేము వేషధారులముకాక వాస్తవమైనవారమై యుండాలని ఆశిస్తున్నాము. మేము నిజక్రైస్తవులమై యుండాలని ఆశిస్తున్నాము. రోమా 12వ అధ్యాయంలోని మాటలు మాలో వాస్తవం కావాలని ఆశిస్తున్నాము. మేము ప్రేమ గూర్చి కేవలం మాట్లాడుతూ, క్రియల్లో లేకుండా మా నోటిమాటల్లో మాత్రమే చూపాలని ఆశించడము లేదు’’ అని ప్రార్థించాను. కాబట్టి, ప్రార్థించండి. ఇది మొట్టమొదటిది : బైబిలు చదువునప్పుడు ప్రార్థించండి. ‘‘దేవా, నేను చదువుతున్న ఈ విషయాలను నా జీవితంలో నెరవేర్చుమని’’ ప్రార్థించండి.
2. యేసు వైపు చూడండి.
నీవు బైబిలు చదువుతుప్పుడు యేసు వైపు చూడు. నీవు రోమా 12:9 చదువుతుండగా, ‘‘నీ ప్రేమ కపటములేనిదై యుండవలెను’’ లేదా, ‘‘నీ ప్రేమ వేషధారణ లేనిదై యుండవలెను’’ అనే మాటలు నీవు వింటావు – ఇదొక మంచి అక్షరార్థమైన అనువాదం. ‘‘నీ ప్రేమ యథార్థమైనదై యుండవలెను’’, నీవు ఈ మాటలు చదువుతున్నప్పుడు, ‘‘నేను ఇది విజయవంతంగా చేయలేను. నేను పుట్టుకతోనే వేషధారిని. నాకు ఇతరుల మెప్పు ఎంతో ఇష్టం. నేను పరిపూర్ణుడనుకానని నాకు తెలుసు. నేను ఎప్పుడూ నాలో ఉన్నదానిని దాచిపెట్టి, లేనిదానిని ఉన్నట్టు చూపిస్తున్నాను. నేను ఇతరులను ప్రేమించువాడనై, నమ్మదగినవాడనై యుండాలని ఆశిస్తున్నాను. ప్రేమ విషయంలో తమాషాగా ఆటలాడను. కాబట్టి, ‘నేను,’ ‘నా’ అని అనుకుంటూ నన్ను నేను చూచుకోను. నేను యేసు వైపు చూస్తాను. నా వేషధారణ అంతటిని క్షమించడానికి ఆయన పుట్టాడు, తన ప్రాణమునర్పించాడు. ఆయన నా కోసం సంపూర్ణంగా పారదర్శకముగా జీవించి నాకు మాదిరి చూపాడు. ఆయన ఇప్పుడు నాకు నేర్పించి, ఒక గురిని నాముందుంచాడు. ఆయనే నా సంతృప్తి, నన్ను క్షమించువాడు, నాకు మాదిరి, నా ధననిధి’’ అని నీకు నీవు చెప్పుకో.
నీవు యేసు వైపు చూచినప్పుడు, ఆయన వలన కలుగు సంతృప్తి, నీవు నీ వేషధారణను మానివేసే విధంగా నీకు సహాయం లభిస్తుంది. కాబట్టి, ఇది రెండవది: నిన్ను నీవు చూచుకొనక, విశ్వాసముతో యేసు వైపు చూడు.
3. చిన్న చిన్న వాక్యభాగాలుగా ధ్యానించండి.
ఈ మాటల గూర్చి నిదానంగా ధ్యానించు. ఇది కఠినమైనదని నాకు తెలుసు. ఎందుకంటే, ఒక ప్రక్క, ‘‘బైబిలు చదువు, బైబిలంతటిని చదువు. నీ బైబిలు పఠనా ప్రణాళికను తీసికొని, బైబిలంతటిని ఒక్క సంవత్సరంలో పూర్తిగా చదువు’’ అనే సందేశం ప్రసంగవేదిక మీది నుండి నీకు వినిపిస్తున్నది. మరొక ప్రక్క, బైబిలంతటిని చదవడం పూర్తిచేయడానికి నీవు వేగంగా ముందుకు సాగాల్సి వుండగా నేనేమో, రోమా 12:9లోని మొదటి సగభాగాన్ని నిదానంగా ధ్యానించుమంటున్నాను.
ఇలాంటి పరిస్థితిలో నీవు ఏం చేయాలి – బైబిలంతటిని చదవడమా లేక 9వ వచనాన్ని ధ్యానించడమా? ‘నన్నేంచేయమంటావు?’ అని అడుగుతున్నావు కదూ. ఏంచేయమంటానంటే, రెండూ చేయు. ‘అదెలా?’ అనడిగితే, ‘అది నాకు తెలియదు. నేను బైబిలును త్వరత్వరగా చదవాలి మరియు నిదానంగా చదవాలని మాత్రమే నాకు తెలుసు.- ఎందుకంటే, నీవు బైబిలంతటిని ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో పూర్తిగా చదవనట్లయితే, బైబిలు గూర్చిన సంపూర్ణ సారాంశం తెలియదు. దాని పూర్తి వివరాలు సంగ్రహముగా తెలియవు.
ఒక సాదృశ్యం చెబుతాను. నా దగ్గర ఈ సాదృశ్యం మొట్టమొదటి జంబో జెట్ విమానం తయారుచేయబడినప్పటి నుంచి ఉన్నది. దీనిని నీవు గుర్తు పెట్టుకోగలవు. ఇందులో చాలా భాగం వరకు నీ జీవిత కాలంలో జరిగింది, ఔనా? మొదటి జంబో జెట్ ముందు భాగంలో గోపురం వంటి ఒక పెద్ద ఎత్తెన భాగం ఉండింది. వారు దానిని ఎలా చేయగలిగారు? అది రెండంతస్తులున్న ఒక విమానం, అసలది నమ్మశక్యం కాదు. నాకది ఇంకా జ్ఞాపకమున్నది. కాబట్టి దాని గూర్చి నేనిలా వర్ణించుకుంటాను: అది గంటకు 560 మైళ్ల వేగంతో ఎగురుతుంది, దాదాపు 37,000 మొదలుకొని 38,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. ఇప్పుడది ఫ్లారిడా పట్టణం మరియు ఇదిగో ఈ నారింజ తోటల మీదుగా వెళ్తున్నది, కిటికీ గుండా క్రిందికి చూస్తే దాదాపుగా ఫ్లారిడా పట్టణమంతా కనబడుతున్నది. ఒక నారింజ తోట కూడ కనబడుతున్నది. అప్పుడు, ‘‘వావ్, అది ఎంత అద్భుతకరమైన నారింజ తోట కదా. అవి చాల పండిపోయిన నారింజలు. చాల రుచిగా ఉంటాయి. చాల శక్తినిస్తాయని’’ నీవనుకుంటావు. అది తప్పు – అది అలా ఉండదు. నీవు చాలా, చాలా ఎత్తులో ఎగురుతున్నావు.
‘‘మీ వేగాన్ని తగ్గించి నిదానంగా వెళ్లండి. నీవు ధ్యానించాల్సి వున్నది. ‘దీని అర్థమేంటి? ఇది నా జీవితానికి ఎలా అన్వయిస్తుంది?’ అని నీవు ప్రశ్నించుకోవాలి.’’
మనము బైబిలును ఇలాగే చదువుతున్నాము: ఎత్తులో ఎగురుతూ చదువుతున్నాము. ఫ్లారిడా పట్టణాన్ని చూడటం మంచిదే. నిజంగా ఆ పట్టణం బాగుంది. ఫ్లారిడా పట్టణాన్ని బైబిలులో చూడటం మంచిదే. గాని నీవు ఆ విమానాన్ని కొంతసేపటికి ఓర్లాండోలో దింపాలి. డిస్నే ప్రపంచంలోనికి వెళ్లిపోవద్దు. నారింజ తోటల్లో వెళ్లి, ఆ తోట గుండా అలా నడుచుకుంటూ వెళ్లు. 9వ వచనం, దానిలోని మొదటి సగభాగం నీ ముందున్నది, చెట్టు దగ్గర కాస్సేపాగి ఒక నారింజ పండును తీసికొని, దానిని పరిశీలనగా చూడు. ఒక అందమైన సంగతి : ‘‘మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను.’’ అయితే, దీని అర్థమేంటో! నేను ఆ నారింజ లాగా ఉండాలని ఆశపడుతున్నానా. నేను దీని లాగ వాస్తవమైనదిగా ఉండాలి. పరిశుద్ధాత్ముడా, దయచేసి నా జీవితంలోని వేషధారణ అనే వ్యాధిని సమూలంగా తీసివేయు.
నీవు నిదానించాలి. నీవు ధ్యానించాలి. ‘‘దీని అర్థమేంటి? ఇది నా జీవితానికి ఎలా వర్తిస్తుంది? బైబిలులోని ఇతర భాగాలతోను దీనికిని గల సంబంధమేంటి?’’ అంటూ నీవు ప్రశ్నించుకోవాలి – ఇలా ప్రశ్నించుకుంటున్నంతసేపు నీవు, ‘‘ఓ దేవా, మార్పు కలుగజేయు, నా జీవితంలో మార్పు కలుగజేయుమని’’ ప్రార్థిస్తుండాలి.
అలా చదువుతూనే ఉండు
ఇవి నేను నీ ముందుంచుతున్న మూడు మార్గదర్శకాలు. ఇవి రోమా 15:15-16లో సూచింపబడి ఉన్నాయని నేను భావిస్తున్నాను – వచనాల ముగింపులో, ‘‘మీకు వ్రాయుచున్నాను’’ అనే మాట, వచనాల ప్రారంభంలో,‘‘పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి’’ అనే మాటలు గమనించండి. మనము బైబిలు చదువుతాము. పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థిస్తాము. చదివిన దానిని జీర్ణించుకుంటాము. దాని గూర్చి నిదానంగా యోచిస్తాము. యేసు వైపు చూస్తాము.
యేసు వైపు చూడడానికి గల కారణం, యోహాను 16:14 ప్రకారం, క్రీస్తును మహిమపర్చుటకు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతున్నాడు. ఇది చాలా కీలకమైన సత్యం. కాబట్టి, నీవు నీ సొంత బలంతో చదవాలనే దృక్పథంతో బైబిలును చదివినట్లయితే, పరిశుద్ధాత్మ నీ దరిదాపుల్లోకి రాడు. అయితే, నీవు యేసు వైపు చూస్తూ, ‘‘యేసయ్యా, నీవు హెచ్చింపబడాలని, నీవు మహిమపర్చబడాలని నేనాశిస్తున్నాను. నేను ప్రేమించుచున్న వ్యక్తిగా మారి, నీ ప్రేమ ప్రదర్శింపబడాలని ఆశిస్తున్నానంటూ’’ ప్రార్థిస్తూ బైబిలు చదివినట్లయితే, నీవు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతావు ఎందుకంటే, యేసును మహిమపర్చడానికి పరిశుద్ధాత్మ నీ దగ్గర ఉన్నాడు.

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web