“దేవుని చేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే”. (రోమా 8:33)
“దేవుని చేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు?” ఎవరూ లేరు, ఎందుకంటే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అని పౌలు చెప్పాల్సింది. అది సత్యమే అయినప్పటికీ పౌలు అలా చెప్పలేదు. ఆయన “నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే” అని చెప్పాడు.
పౌలు క్రియకి బదులుగా కర్తను గూర్చి నొక్కి చెప్తున్నాడు.
ఎందుకు? ఎందుకంటే పౌలు మాట్లాడే భాష న్యాయస్థానాలు, చట్టాలలో వాడే భాష. ఒక న్యాయమూర్తి ఎవరినైనా నిర్దోషిగా విడుదల చేయడాన్ని ఆయనకు పైనున్న అధికారి తోసిపుచ్చవచ్చు.
కాబట్టి, మీరు దోషిగా ఉన్నప్పుడు స్థానిక న్యాయమూర్తి మిమ్మల్ని నిర్దోషిగా ప్రకటిస్తే, మీపై అభియోగాలు మోపే హక్కు న్యాయమూర్తికి పైగా ఉండే గవర్నర్‌కు ఉంటే? మీరు దోషిగా ఉన్నప్పుడు ఒక గవర్నర్ మిమ్మల్ని నిర్దోషిగా ప్రకటిస్తే, గవర్నర్ కి పైగా ఉండే చక్రవర్తి మీపై అభియోగాలు మోపగలిగితే?
నేను చెప్పాలనుకున్న అంశం ఇదే: దేవునికి పైన, ఉన్నత న్యాయస్థానాలు లేవు. దేవుడే నిన్ను నిర్దోషిగా ప్రకటిస్తే, అంటే ఆయన దృష్టిలో నిన్ను నీతిమంతుడిగా ప్రకటిస్తే, మరెవరూ మీపై అభియోగాలు మోపలేరు; ఎవరూ సాంకేతికతను అడ్డం పెట్టుకొని ఏమి చేయలేరు; ఎవరూ అది అన్యాయమైన తీర్పు అని చెప్పలేరు; ఎవరూ మీకు వ్యతిరేకంగా ఇంకేమైనా ఉన్నాయా అని వెదకలేరు. దేవుని తీర్పు అంతిమమైనది మరియు సంపూర్ణమైనది.
యేసును విశ్వసించిన మీరు, క్రీస్తుతో ఏకమైన మీరు, ఎన్నుకోబడిన వారిలో ఒకరిగా మిమ్మల్ని మీరు చూపించుకోండి. దేవుడే మిమ్మల్ని నీతుమంతుడని తీర్పు తీరుస్తాడు. మానవ న్యాయమూర్తి కాదు. గొప్ప ప్రవక్త కాదు. పరలోకం నుండి వచ్చిన ప్రధాన దేవదూత కాదు. కానీ సర్వ సృష్టికర్త, అన్నింటికీ యజమాని మరియు విశ్వమునకు మరియు దానిలోని ప్రతి అణువుకు, ప్రతి వ్యక్తికి పరిపాలకుడు అయిన దేవుడే మిమ్మల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చు వాడు.
నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, విపరీతమైన శ్రమల నేపథ్యంలో కదలని భద్రత గురించిన సంగతి. దేవుడు మన పక్షాన ఉంటే, మనకు విరోధులు ఎవరు? దేవుడు మన కొరకు తన కుమారుని ఇచ్చినట్లయితే, ఆయన మనకు మేలు చేసేవన్నీ ఇస్తాడు. దేవుడే మనల్ని నీతిమంతులుగా తీర్పు తీరుస్తే, మనపై చేయబడిన ఏ అభియోగమూ నిలబడదు.