“దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిప్ఠమైన చేతిక్రింద దీనమనస్కులైయుండుడి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి”. (1 పేతురు 5:6-7)

భవిష్యత్తును గురించిన చింత ఎందుకు గర్వం వంటిది?

ఈ ప్రశ్నకు దేవుని జవాబు ఇలా ఉంటుంది (యెషయా 51:12 ని వేరే మాటల్లో చెప్పాలంటే)

నేను, అంటే మీ సృష్టికర్తను, మీ ప్రభువును; మిమ్మల్ని ఓదార్చు వాడను నేనే, మిమ్మల్ని సంరక్షించడానికి వాగ్దానములు చేయువాడను నేనే. మిమ్మల్ని భయపెట్టు వారందరూ కేవలం మట్టిలో కలిసిపోయే మనుష్యులు మాత్రమే. అందుచేత, మీరు భయపడుతున్నారంటే నన్ను నమ్మట్లేదని అర్థం. అంతేగాదు మీకున్న వనరులు మిమ్మల్ని సంరక్షిస్తాయని నిశ్చయత లేకపోయినా, భవిష్యత్తులో నేను ఇవ్వబోయే కృపను విశ్వసించుటకు బదులుగా, మీరు ఇంకా మీ మీదనే ఆదారపడుతున్నారు. కాబట్టి, మీరు వణుకుతూనే, అంటే బలహీనంగా ఉంటూనే, అహంకారాన్ని (గర్వాన్ని) బయటకు చూపుతున్నారు.

మరి దీనికి విరుగుడు ఏంటి? మీపై మీరు ఆధారపడుటకు బదులుగా దేవునిపై ఆధారపడండి. భవిష్యత్తులో ఆయన అనుగ్రహించే చాలినంత కృపకు సంబంధించిన వాగ్దానపు శక్తిలో మీ విశ్వాసాన్ని ఉంచండి.

1 పేతురు 5:6-7 వచనాలలో ఆందోళన అనేది గర్వం లాంటిది అని మీరు చూడవచ్చు. ఈ రెండు వచనాలకు మధ్య ఉన్న వ్యాకరణ సంబంధాన్ని గమనించండి. 6వ వచనం “దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిప్ఠమైన చేతిక్రింద దీనమనస్కులైయుండుడి. (ఇప్పుడు, 7వ వచనం చూడండి) మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి.” 7వ వచనం క్రొత్త వాక్యం కాదు. ఈ వచనం 6 వ వచనంపై ఆధారపడి ఉన్న వచనం: “మీ చింత యావత్తు ఆయన మీద వేయుట (ద్వారా)… దీన మనస్కులై ఉండండి.”

దేవుని మీద మీ చింతలన్నీ వేయండి అనే మాటకు, దేవుని బలిష్టమైన చేతి క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండడమని అర్థం. ఇది ఎలా ఉంటుందంటే, “నెమ్మదిగా తినండి… ఎక్కువ శబ్దం చెయ్యకుండా నమలండి” అని, లేక “జాగ్రత్తగా నడపండి… రోడ్డు మీద మీ దృష్టిని పెట్టండి” అని, లేక “ఉదారంగా ఉండండి… మీ ఇంటికి ఎవరినైనా భోజనానికి ఆహ్వానించండి” అని, లేక “దీనమనస్కులై ఉండండి…. మీకున్న భయాల్ని చింతల్ని దేవునిపై వేయండి” అని చెప్పినట్లుగా ఉందని అర్థం చేసుకోవాలి.

మిమ్మల్ని మీరు దీనమనస్కులుగా చేసుకునే ఏకైక మార్గం ఏంటంటే దేవుని మీద మీకున్న చింతలన్నీ వేయడమే. అంటే, దేవునిపై మీ చింతలన్నీ వేయడానికిగల ఒకానొక ఆటంకం ఏంటంటే మీకున్న గర్వమే. అంటే, అనవసరమైన చింత అనేది అహంకార రూపంలో ఉందన్నమాట. అది ఎంత బలహీనంగా అనిపించినా, కనిపించినా అది అహంకారమే.

ఇప్పుడు, గర్వానికి వ్యతిరేకంగా మన చింతలన్నీ ప్రభువు మీద ఎందుకు వేయాలి? ఎందుకంటే, మనకు చింతలున్నాయని గర్వం అంగీకరించదు కాబట్టి. లేక, మనంతటికి మనమే వాటిని పరిష్కరించుకోలేపోతున్నాం కాబట్టి, అహంకారం, చింతలను పరిష్కరించుకోలేదని అర్థమైనప్పుడు, తనకు నచ్చకపోయినా ఈ చింతలకు పరిష్కారం, ఎక్కువ జ్ఞానముగలవానిని మరియు బలవంతుణ్ణి నమ్మడమే.

మరొక విధంగా చెప్పాలంటే, గర్వం అనేది అపనమ్మకానికి మరొక రూపం. భవిష్యత్తులో దేవుడు అనుగ్రహించే కృప కోసం ఆయన్ని నమ్మడానికి గర్వానికి ఇష్టముండదు. మరో ప్రక్క సహాయం కావాలని విశ్వాసం అంగీకరిస్తుంది. అయితే, గర్వం అలా చేయదు. సహాయ అవసరతకై విశ్వాసం దేవునిపై ఆధారపడుతుంది. అయితే, గర్వం అలా ఆధారపడదు. విశ్వాసం చింతలన్నిటిని దేవుని మీద వేస్తుంది. గర్వం అలా చేయదు.

అందుచేత, గర్వమనే అవిశ్వాసంతో యుద్ధం చేయాలంటే మీ చింతలన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. “ఆయన మీ గురించి చింతించుచున్నాడు (పట్టించుకుంటాడు)” అన్న మాటలో ఉన్నటువంటి భవిష్యత్ కృపా వాగ్దానంలో ఆనందించాలి. ఆ తర్వాత, మీకున్న భయాలన్నిటిని ఆయన బలిష్టమైన భుజాల మీద వేయాలి.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *