“మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము.” (లూకా 11:4)
ఎవరు ఎవరిని మొదట క్షమిస్తారు?
- ఒకవైపు “మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము.” అని ప్రార్థించమని యేసు చెప్తున్నారు. (లూకా 11:4)
- మరొకవైపు “ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి.” అని పౌలు అంటున్నాడు. (కొలస్సీ 3:13)
“మాకు రుణపడియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము.” అని ప్రార్థించమని యేసు మనకు బోధించినప్పుడు, క్షమించుటలో మొదటి అడుగు మనమే వేయాలి అని ఆయన ఉద్ధేశ్యం కాదు. అసలు మొదటిగా మనం క్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనలను క్షమించాడు (అపొస్తలుల కార్యములు 10:43). కాబట్టి, విరిగినలిగిన మనస్సు, ఆనందమైన, కృతజ్ఞతతో నిండిన, మరియు మన నిరీక్షణకు కారణమైన క్షమించబడిన అనుభవం నుండి, ఇతరులను క్షమిస్తాము.
ఇటువంటి క్షమించే గుణము మనలో ఉందంటే దానర్థం మనము మొదలు రక్షణలో క్షమించబడ్డాము అని అర్ధం. అంటే మనము ఇతరులను క్షమించడం ద్వారా, మన విశ్వాసాన్ని, క్రీస్తుతో ఏకమవ్వడాన్ని, కృపకు, వినయముకు కారణమైన పరిశుద్ధాత్మ మనలో నివసించడాన్ని రుజువు చేస్తున్నాము.
కానీ మనము ఇంకా పాపము చేస్తాము (1 యోహాను 1:8,10). క్రీస్తు మన కొరకు చేసిన కార్యమును నూతనంగా మన జీవితానికి అన్వయించుకోడానికి అంటే క్షమాపణను నూతనంగా అన్వయించుకోడానికి మళ్ళీ మళ్ళీ దేవుని వైపు మనం చూస్తాం. మనం క్షమించలేని ఆత్మను మనలో పెంచి పోషిస్తూ ఉంటే, ఆ పనిని మనం నమ్మకంగా చేయలేము. (మత్తయి 18:23-35 లో క్షమించలేని దాసుని ఉపమానం గుర్తుకు తెచ్చుకోండి. కోటి రూపాయాల అప్పుని తన యజమానియైన రాజు క్షమించినప్పటికీ తనకు 1000 రూపాయాల అప్పు ఉన్న తోటి దాసుడును క్షమించడానికి ఒప్పుకోలేదు. తనకున్న క్షమించలేని గుణాన్ని బట్టి, తన యజమాని దయాగుణము తనలో ఎటువంటి మార్పు తీసుకురాలేదు అని చూడవచ్చు.)
ఇటువంటి తప్పులనుండి మనల్ని రక్షించడానికి ప్రభువైన యేసు ఇలా ప్రార్థన చేయమని మనకి చెప్తున్నాడు “మాకు రుణపడియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము.” (లూకా 11:4). ఇంకో మాటలో చెప్పాలంటే మనము ఇతరులను క్షమిస్తున్నాము కాబట్టి మనము దేవునిని క్షమాపణ అడుగుతున్నామని యేసయ్య చెప్తున్నారు. అలా ప్రార్ధించడం ఎలా ఉంటుందంటే “తండ్రీ, క్రీస్తు వెల పెట్టి కొన్న దయను నా పట్ల నిరంతరము దయచేయండి. ఎందుకంటే ఈ దయ వలనే నేను క్షమించబడ్డాను. నేను పగను ప్రతీకారాలను విడిచిపెట్టి, నీవు నా విషయంలో చూపించిన దయను ఇతరులకు అందిస్తాను.”
ఈ రోజు మీరు దేవుని క్షమాపణను మరలా నూతనంగా తెలుసుకోవాలని మరియు ఇతరులని క్షమించడంలో మీ హృదయంలో ఆ కృప పొంగిపొర్లాలని కోరుతున్నాను. మీ జీవితంలో మీరు అనుభవించిన దేవుని కృప యొక్క మధురమైన అనుభవం మరింత నిశ్చయతని ఇస్తుంది, మీరు ఆయన రక్తంతో పొందుకున్న క్షమాపణను అనుభవించడానికి నూతనంగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అతను మిమ్మల్ని క్షమించిన మరియు క్షమించే బిడ్డగా చూస్తాడని మీరు తెలుసుకుంటారు.