నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడని నాకెలా తెలుస్తుంది?

నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడని నాకెలా తెలుస్తుంది?

షేర్ చెయ్యండి:

ఎక్కువ ముఖ్యమైన ప్రశ్నలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని మనమందరము ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొంటాము. ఇదో ఇలాంటి ప్రశ్న, పాస్టర్లు సహితం అడిగే ప్రశ్న,: “పాస్టర్‌ జాన్‌ గారూ, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు. నేను దుబాయ్‌లో ఒక పాస్టర్‌ గా పరిచర్య చేస్తున్నాను. నా అంతరంగములో పరిశుద్ధాత్మ ఉన్నాడని నేను ఖచ్చితంగా ఎలా తెలిసికోగలనో చెప్తారా? నేను 8 సంవత్సరాల వయసులో రక్షింపబడ్డాను, ఇప్పుడు నా వయస్సు 33. నా జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని నేను యింత వరకు గొప్పగా అనుభవించలేదు. నేను పరిశుద్ధాత్మతో ఎలా నింపబడవచ్చునో మీరు వివరిస్తే చాల బాగుంటుంది, నేను మీకు కృతజ్ఞుడనై యుంటాను. అదెలా ఉంటుంది?’’ 

మొదట ఒక విషయాన్ని స్పష్టం చేస్తాను: మన స్నేహితుడు రెండు ప్రత్యేకమైన ప్రశ్నలడుగుతున్నాడు. తను రెండు వేర్వేరు ప్రశ్నలడుగుతున్నాడని అతనికి తెలుసో, లేదో, నాకు స్పష్టంగా తెలియదు. కాబట్టి, మొదటిగా బైబిల్‌ ప్రకారం, ఇవి రెండు వేర్వేరు ప్రశ్నలని తను అర్థంచేసుకునేట్టు నేను చేయాలి.

అతని మొదటి ప్రశ్న: ‘‘నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడని నాకు ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది?’’ అతని రెండవ ప్రశ్న: ‘‘నేను పరిశుద్ధాత్మతో ఎలా నింపబడగలను?’’ కొంత కాలంపాటు నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తూ కూడా, పరిశుద్ధాత్మ చేత నింపబడకుండుట సాధ్యమే. ఈ విషయం అతనికి తెలుసో లేదో నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. అయితే, ఒక వ్యక్తి అంతరంగంలో పరిశుద్ధాత్మ మొత్తానికే నివసించట్లేదంటే అతడు లేదా ఆమె క్రైస్తవులై యుండుట సాధ్యం కానే కాదు.

ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మను కలిగియున్నాడు

క్రైస్తవులై యుండడం అంటే, క్రీస్తు ఆత్మను కలిగయుండడం అని అర్థం. రోమా 8:9, ‘‘దేవుని ఆత్మ మీలో నివసించియున్న యెడల మీరు ఆత్మ స్వభావముగలవారే గాని శరీర స్వభావముగలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.’’

కాబట్టి, పరిశుద్ధాత్మ లేనివారు క్రైస్తవులు కారు. ఎఫెసీ 5:18లో, అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మను కలిగియున్న క్రైస్తవుల నుద్దేశించి మాటలాడుతున్నాడు. … అది ఎలా చెప్పగలమంటే, మొదటి అధ్యాయంలో పౌలు, ‘‘మీరు (నా లేఖను చదువుతున్నవారు) . . . క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడని’’ సెలవిచ్చాడు (ఎఫెసీ 1:13-14). ఆ తరువాత ఎఫెసీ 5:18-20లో ఇలా సెలవిస్తున్నాడు,

‘‘మరియు మద్యముతో మత్తులై యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే (క్రైస్తవులైన మీరు, పరిశుద్ధాత్మను కలిగియున్న మీరు) ఆత్మపూర్ణులై యుండుడి. ఒకని నొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.’’

అనగా, పరిశుద్ధాత్మతో నింపబడడం, కొన్నిసార్లు ఎక్కువగా, కొన్నిసార్లు తక్కువగా ఉండు, పరిశుద్ధాత్మ శక్తి యొక్క ఒక స్థాయి లేదా ఒక లక్షణమై యున్నదని మరొక మాటలో చెప్పుకొనవచ్చు. ఉదా॥ అపొ 4:31 లో, ప్రార్థన చేయడానికి కూడుకున్న సందర్భంలో ‘‘వారు (కైస్తవులు) ప్రార్థన చేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను. అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి’’  అని రాయబడింది.

కాబట్టి, అతిశయపూర్వకమైన, అమూల్యమైన, మధురమైన, శక్తివంతమైన, అసాధారణమైన అనుభవాల్లో ఒకటైన పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే మనము క్రీస్తు కొరకు సాక్ష్యమివ్వడానికి  మరింత సిద్ధంగా, స్వతంత్రముగా మరియు ధైర్యముగా ఉండడం అని అర్థం. లేదా ఎఫెసీ 5వ అధ్యాయం ప్రకారం, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనము కీర్తనలతోను సంగీతములతోను మరియు ఆత్మసంబంధమైన పాటలతోను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు ఉప్పొంగిపోడానికి మరింత సిద్ధంగా, స్వతంత్రముగా మరియు ఆసక్తిగలవారముగా ఉంటామని అర్థం.

పరిశుద్ధాత్మను కలిగయుండువారు క్రైస్తవులుగా గుర్తింపబడతాడు. పరిశుద్ధాత్మ లేకుండా ఒకరు కూడా క్రైస్తవులై యుండలేరు. పరిశుద్ధాత్మలేని క్రైస్తవులు లేరు. విశ్వాసులందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుకోవాలి. ఎందుకంటే ఆ నింపుదల క్రీస్తును మహిమపరచే స్వేచ్ఛను, ధైర్యము మరియు శక్తిని అనుభవించేలా చేస్తుంది.

‘‘అలాగైతే, నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడని నాకెలా తెలుస్తుంది?’’ అని ఈ సోదరుడు అడుగుతున్నాడు. ‘‘నీవు, వాస్తవంగా, క్రైస్తవుడవై యున్నట్లయితే, నీవు నిజంగా తిరిగి జన్మించినట్లయితే, నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడని నీకు తెలుస్తుంది.’’ 

క్రీస్తు యెదుట మన పరిస్థితి

ఈ ప్రశ్నకు బైబిలు ప్రకారంగా జవాబివ్వడానికి, ముఖ్యంగా నీవు క్రీస్తునంగీకరింపక మునుపుండిన నీ పరిస్థితి నీకు తెలియాలి. ఇది చాలా ముఖ్యం. క్రీస్తును ఎప్పడు అంగీకరించారో మనకు జ్ఞాపకం ఉండాల్సిన అవసరం లేదు, నాక్కూడా తెలియదని నీకు స్పష్టంగా చెప్పుతున్నాను. మనమెంత చెడ్డవారమై ఉన్నామో అనే సంగతి, మన అమ్మానాన్నలకు లేదా మనకు జ్ఞాపకముండడం లేదా మన గురించి తెలిసిన వారు ఇచ్చే సాక్ష్యం వీటిని బట్టి కాదు గాని, బైబిలులో నుండి మనకు తెలిసియుండాలి.

మన పరిస్థితి గూర్చి బైబిలు నుండి మనం స్పష్టంగా తెలిసికోగలము. అనేకులు, వేలాది మంది అని కూడ చెప్పవచ్చు, వారు క్రీస్తునంగీకరింపక మునుపుండిన పరిస్థితి గూర్చి చాలా తక్కువగా, అస్పష్టంగా బోధింపబడియున్నారు. బైబిలు దీని గురించి చెప్పేదేమంటే, 

  • మనము ఆత్మసంబంధంగా చచ్చినవారమై యుంటిమి (ఎఫెసీ 2:1,4-5).
  • మనము దేవుని ఆత్మ విషయాలను అంగీకరించలేకుండా ఉన్నాము (1 కొరింథీ 2:14).
  • పౌలు చెప్పుతున్నట్టు, మనము దేవునికి లోబడలేని లేక దేవుని సంతోషపర్చలేని శరీర స్వభావము గలవారమై ఉన్నాము (రోమా 8:7-8).

మన చిత్తములను, మన హృదయాలను, మన మనస్సులను, మన భావోద్రేకాలను మార్చుకొనగల శక్తి మనకు లేదు. మనము పూర్తిగా దేవునికి దూరమై ఉన్నాము. అలాగైతే, పరిశుద్ధాత్మను మనమెలా పొందాము? అదొక అద్భుతకార్యం. అది సార్వభౌమ కృపయై యుండింది, మనము పూర్తిగా నిస్సహాయులమై యున్నప్పుడు దేవుని కృప సార్వభౌమ రీతిలో మనకు వర్తింపజేయబడింది.

చచ్చినవారమైయుండిన మనము మరల బ్రతికింపబడితిమి (మృతులలో నుండి లేపబడితిమి)                           ‘‘గాలి తన కిష్టమైన చోటను విసరును. నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యుండునని’’ యేసు చెప్పాడు (యోహాను 3:8). అద్బుతం జరిగింది. పరిశుద్ధాత్మ మన కన్నులు తెరిచాడు (అపొ 16:14). నీవు సువార్త వెలుగును మరియు క్రీస్తు మహిమను చూచునట్లు దేవుడు నీ హృదయంలో సర్వశక్తివంతంగా ప్రకాశించాడు (2 కొరింథీ 4:6). నీవిక మీదట చచ్చినవాడవై యుండకుండా, ఇకమీదట గ్రుడ్డివాడవై, దేవునికి శత్రువై, దేవుని సంతోషపర్చని వాడవై ఉండకుండా, తిరుగుబాటు చేయకుండా, సిలువను వెఱ్ఱితనముగా ఎంచకుండా ఆయన నీకు జీవాన్ని ప్రసాదించాడు, నీకు జీవమునిచ్చాడు.

గనుక నీవు సువార్తలో క్రీస్తు మహిమను చూశావు. ఆ మహిమను మరి ఎక్కువ అందంగాను, లోకంలోని ఇతరవాటికంటే కూడా మరి ఎక్కువ కోరుకొనదగినదిగాను చూశావు. నీవు దేవుని ఆత్మ చేత సజీవుడవుగా చేయబడ్డావు. దేవుడు నీకు నిజమైనవాడుగా, అమూల్యమైనవాడుగా మరియు సుందరమైన వాడుగా అయ్యాడు. నీ గ్రుడ్డితనమంతా తొలగిపోయింది. పాపమిచ్చు వాగ్దానము కంటె సిలువ, క్రీస్తు, ఆయన మార్గము మరియు ఆయన వాక్యము మరి ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నట్టు నువ్వు తెలిసికొన్నావు. దేవుని పట్ల వైరము కలిగయుండదానికి బదులుగా, నీవాయనను ప్రేమించావు గనుక ఆయనను యింకా ఎక్కువ సంతోషపెట్టాలని ఆశించావు. సందేహము, అనుమానము మరియు కఠిత్వమునకు బదులుగా, ఆయన వాగ్దానాలే నిజమైనవని గ్రహించి వాటిని నమ్మావు, ఆ వాగ్దానాల మీదే ఆధారపడ్డావు. క్రీస్తు నీకు గొప్ప నిధిగా అయ్యాడు.  

నీవు సజీవంగా ఉన్నావని ఈ విధంగా నువ్వు తెలుసుకున్నావు. నీవు మారుమనస్సు పొందావని ఇలా తెలుసుకున్నావు. ఈ విధంగా నీవు విశ్వాసంగలవాడవై యున్నావు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని ఇలా తెలుసుకుంటున్నావు. అద్భుత కార్యాలు చేసే దేవుని ఆత్మ నీలో లేకపోతే, వీటన్నిటిలో ఏది కూడా నీలో సంభవించేది కాదు. అయితే, వీటిని గూర్చి అనగా, నీవు చచ్చినవాడవై యున్నప్పుడు, దేవుని ఆత్మ యొక్క సార్వభౌమ కార్యము నీలో జరిగితేనే తప్ప, నీలో ఇంతచక్కని మార్పు సాధ్యమయ్యేదికాదని నీకు బైబిలు బోధిస్తే తప్ప, నీకీవిషయాలు తెలియవు (లూకా 18:27).

నీవు ఆశ్చర్యపడుచున్నావా?

దీనంతటికి నీ నిర్ణయమే కారణమని నీకు ఎవరైనా బోధించినట్లయితే – నేను మళ్లీ నొక్కి చెప్పుతున్నాను, ఎందుకంటే ఈ అభిప్రాయం చాలా విస్తారంగా వ్యాపించి యున్నది, ఇది నాశనకరమైనది కూడా. దీనంతటికి నీ నిర్ణయమే కారణమని నీకు నీకు ఎవరైనా బోధించినట్లయితే, నీలో కలిగిన మార్పుకు నీవు ఆశ్చర్యపడవు. అలా భావిస్తే, నీవు తిరిగి జన్మించావనడానికి, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడనడానికి నిజమైన రుజువు నీలో ఉండదు. రక్షణ విషయంలో దేవుని సార్వభౌమాధికారాన్ని కాదనే వారందరి గూర్చి ఈ సంగతి అత్యంత దు:ఖకరమైనదై యున్నది.

నీకు నీవు ఈ ప్రశ్న వేసుకో: దేవుని సార్వభౌమ కృపనుబట్టియే నీవు ప్రతి ఉదయం క్రీస్తునందలి విశ్వాసిగా మేల్కొంటున్నావు గనుక నీవు ఆశ్చర్యపడుతున్నావా? నీవు ఆశ్చర్యపడుతున్నావా? నీవు తిరిగి జన్మించావనడానికి రక్షణార్థమైన నిజమైన విశ్వాసమే నంబర్‌ వన్‌ రుజువై యున్నది. 1 యోహాను 5:1, ‘‘యేసే క్రీస్తైయున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు.’’ అనగా, అతడు దేవుని ఆత్మ మూలముగా పుట్టియున్నాడు మరియు దేవుని ఆత్మను కలిగియున్నాడు.

కాబట్టి, టోనీ, మనమిక్కడ ఆపడం మంచిదనుకుంటున్నాను. ‘‘నీవు పరిశుద్ధాత్మతో నింపబడటమెలా?’’ అని అతడడిగాడని నాకు తెలుసు. దాని గూర్చి నేను ఏమీ చెప్పలేదు. గాని ‘‘నేను పరిశుద్ధాత్మతో ఎలా నింపబడగలను?’’ అనే అతని రెండవ ప్రశ్నకు జవాబు చాలా  పెద్దగా ఉంది గనుక స్థలాభావం వలన ఆపేస్తున్నాను. అతడడిగిన ప్రశ్న యొక్క సారాంశాన్ని మనమిక్కడ తెలియజేశామని నేననుకుంటున్నాను: మన జీవితాల్లో పరిశుద్ధాత్మ పనిచేయుచున్నాడని వివేచనాత్మకంగా మనమెలా చెప్పగలము? దీనికి బైబిలు ప్రకారమైన ప్రధాన జవాబేంటి? అదేమనగా, మనము చచ్చినవారమై యుండగా ఆయన మనలను మరల బ్రతికించాడు, క్రీస్తును మన సర్వోన్నతమైన నిధిగా చేశాడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...