ప్రశ్న,

జ్ఞానవంతులు మరియు శక్తివంతులను  కాక లోకములోని వెర్రివారిని  దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో అనే సంగతిని అన్వేషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తన సందేశాన్ని పంచుకోవడానికి ధనవంతులైన ఉత్పాదకులను, తెలివైన వారిని, అత్యంత అనర్గళంగా మాట్లాడేవారిని, అగ్రశ్రేణి అథ్లెట్లను లేదా ప్రసిద్ధ సినీ తారలను దేవుడు ఎందుకు ఎన్నుకోలేదు? దేవుడు, బలహీనులను తన పని కొరకు ఎందుకు ఎన్నకున్నాడు ఎందుకు మరియు ఉపయోగించుకుంటున్నాడు?

ఈ ప్రశ్న ఫిలిప్పీన్స్ లో మన  పోడ్ ‌ కాస్ట్ వినే యూక్లిడ్ నుండి వచ్చింది. అతను ప్రపంచవ్యాప్తంగా సువార్తను వ్యాప్తి చేసే గొప్ప ఆజ్ఞకు అంకితం చేయబడ్డ వ్యక్తి.

“హలో, పాస్టర్ జాన్. నేను నా జీవితాన్ని గొప్ప ఆజ్ఞకు అప్పగించుకొని, సువార్తను అన్ని దేశాలకు పంచుకోవాలనుకుంటున్నాను. 1 కొరింథీయులు 1:27 లో, ‘‘జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. నా ప్రశ్నేమిటంటే, లోకమంతటికీ సువార్తను ప్రకటించడానికి దేవుడు లోకములోని జ్ఞానులందరినీ ఎందుకు రక్షించలేదు? అలా చేసుంటే, ఎన్నుకోబడిన కొంతమంది బుద్ధిహీనుల సమూహం కంటే ఎక్కువగా త్వరగా ప్రపంచానికి సువార్త విస్తరించేది కదా?

సమాధానం:

దేవుడు బుద్ధిహీనులను ఎన్నుకుంటాడు మరియు వాడుకుంటాడు గనుక దేవునికి స్తోత్రము.

నేను చెప్పే మొదటి జవాబు ఏమిటంటే, తెలివైన, మేధావులైన మరియు తలాంతులు గల ప్రజలందరూ ఎన్నుకోబడి ఉంటే, సువార్త ప్రభావం వేగంగా మరియు మరింత గుర్తించదగినదిగా ఉండేది, కానీ అది నిజమైన క్రైస్తవ్యంగా ఉండేది కాదు. దేవుని కుమారుడు శక్తివంతమైన యోధునిగా లేదా తెలివైన తత్వవేత్తగా వచ్చి, లోకంపై త్వరితంగా మరియు ఆకట్టుకునే ప్రభావాన్ని చూపించడానికి తన బలం మరియు తెలివితేటలను ఉపయోగించినట్లయితే, అది క్రైస్తవ్యంగా ఉండేది కాదు.

సిలువ యొక్క కేంద్రీయత

జగత్తు ప్రారంభానికి ముందే, అత్యంత వినయపూర్వకమైన మరియు అవమానకరమైన మరణం ద్వారా ప్రజలను రక్షించడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం చాలా ముఖ్యమైనది. ఈ నిర్ణయంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సిలువ వేయబడుట ఉంది. అది ఒక కళంకమైన విషయం, ఒక సంపూర్ణమైన వెర్రితనము, ఒక అవమానము, సంపూర్ణమైన కోపము కలిగిన సంగతి. కానీ ఆ విధముగానే మనము రక్షించబడ్డాము. సువార్త జయించేది కూడా ఇలాగే.

కొరింథీయులకు పౌలు వ్రాసిన పత్రికలోని మొదటి మూడు అధ్యాయాలు వారికి మరియు మనకు స్పష్టంగా ఇదే విషయం చెప్పడానికి వ్రాయబడ్డాయి, క్రైస్తవ్యమనేది ఆకట్టుకునే మానవ ప్రసంగాలు లేదా తెలివైన ఆలోచనల ద్వారా నిర్వచించబడటం లేదా వ్యాప్తి చెందడం గురించి కాదు. కొరింథులో ప్రజలు తమ గొప్ప ప్రసంగాలను మరియు తెలివితేటలను గూర్చి గర్వించారు. కొరింథీ సంఘము ఈ విషయాలతో చాలా ఆకట్టుకునేలా అనిపిస్తుంది. “నేను పౌలును వెంబడిస్తున్నాను” లేదా “నేను అపొల్లోను వెంబడిస్తున్నాను” లేదా “నేను కేఫాను వెంబడిస్తున్నాను” (1 కొరింథీయులు 1:12) అని చెప్పుట ద్వారా వారు అతిశయించారు.

మాటల్లో,తెలివితేటలలో ఉన్నతమైనవారని నమ్మే బోధకుడితో తమను తాము సమలేఖనం చేసుకోవడం ద్వారా వారు గుర్తింపు మరియు ప్రశంసలను కోరుకున్నారు. ఇది క్రైస్తవ్యమును నిర్వచించేది కాదని లేదా క్రైస్తవ్యము యొక్క పురోగతికి సరైన మార్గం కాదని వివరిస్తూ పౌలు మూడు అధ్యాయాలను గడిపాడు.

మానవ జ్ఞానముతో సమస్య

“నేను పౌలును వెంబడిస్తున్నాను” అని వారు చెప్పడం పౌలు విన్నప్పుడు (1 కొరింథీయులు 1:12), “పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా?” (1 కొరింథీయులు 1:13) అని అడిగాడు. వారు సిలువ వేయబడిన క్రీస్తు సందేశాన్ని తన నైపుణ్యాలలో అతిశయించే విషయంగా మార్చుతున్నారని అతడు నమ్మలేకపోయాడు. మూడు వచనాల తరువాత, అతడు, “క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అని చెబుతాడు (1 కొరింథీ 1:17).

కొరింథులో ప్రధాన సమస్యలేమిటంటే,  మానవ వాగ్ధాటి మరియు తెలివితేటలు. ప్రజలు గొప్ప ఉపన్యాసాలు, జ్ఞానం, తెలివైన మాటలు మరియు పదునైన ఆలోచన గలవారిని మెచ్చుకునేవారు మరియు వాటిని బట్టి  గర్వించారు. ఆకట్టుకునే మాటలు మరియు తెలివితేటలతో పెద్ద సమూహాలను ఆకర్షించవచ్చు మరియు త్వరగా ప్రశంసలు పొందుకోవచ్చు కానీ,  పౌలు అది నిజమైన క్రైస్తవ్యానికి ప్రాతినిధ్యం వహించదు అని చెప్పాడు. వాస్తవానికి, ఇలా చేయడం, క్రీస్తుకు వ్యతిరేకంగా వెళ్లి సిలువ యొక్క ప్రాముఖ్యతను తగ్గించడమే, ఎందుకంటే సిలువ, మానవ నైపుణ్యాల్లో  అతిశయించుట యొక్క ముగింపును సూచిస్తుంది.

మన సొంత సామర్థ్యములలో గర్వించదగిన అతిశయమును తీసివేసి ఆ స్థానంలో  మన లోతైన అవసరతను మరియు పాపతత్వమును గుర్తించి, మన విమోచకుడైన క్రీస్తునందు పిల్లవానివంటి నమ్మకంతో ఆ స్థానమును భర్తీ చేయుట వంటిది. క్రీస్తు సిలువ కేవలము క్రీస్తు మరణమును సూచించుట మాత్రమే కాదు; అది మనల్ని మనం రక్షించుకోడానికి మరియు గర్వము ద్వారా స్వీయ-మహిమను వెదకుటకు మనం చేసే ప్రయత్నాలకు మనం మరణించడాన్ని కూడా సూచిస్తుంది. ఆతర్వాత  1 కొరింథీయులు 1:18 లో పౌలు, ” సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చెబుతాడు.

దేవుని జ్ఞానము

కేవలం మూడు వచనాల తరువాత, ఆ అద్భుతమైన వచనంలో,దేవుని జ్ఞానాన్ని కనుకోడానికి లేదా రక్షణ జ్ఞానం తెలుసుకోడానికి, మన స్వాభావిక జ్ఞానము, తెలివితేటలు మరియు తర్కము మనకు సరిపోవు అని పౌలు వివరిస్తాడు. ఇక్కడ అతడు ” దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా పూర్వక సంకల్ప మాయెను” (1 కొరింథీయులు 1:21) అని చెబుతాడు.

మానవ జ్ఞానం రక్షణ యొక్క మార్గము కాదని దేవుని జ్ఞానం నిర్ణయించింది. దానికిబదులుగా, దైవిక వెర్రితనములో విశ్వాసముంచడం రక్షణ యొక్క మార్గమైయుంటుంది. ” దేవుని వెఱ్ఱితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది” (1 కొరింథీయులు 1:25). ఫిలిప్పీన్స్ ‌ లోని మన స్నేహితుడు యూక్లిడ్ కోసం హైలైట్ చేయవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది ఎల్లప్పుడూ ఈ విధంగా కనిపించదు.

దేవుని మూర్ఖత్వము వాస్తవానికి మానవ జ్ఞానము కంటే తెలివైనది, కానీ అది మొదట అలా కనిపించకపోవచ్చు. ఇది వెర్రితనంగా అనిపించవచ్చు. అదేవిధంగా, దేవుని బలహీనత మానవ బలం కంటే బలమైనదిగా ఉంటుంది, అది ఆ విధంగా కనిపించకపోవచ్చు; అది బలహీనతలా అనిపించవచ్చు. అదే క్రైస్తవ్యము యొక్క సారము. ఈ విధంగానే సువార్త లోకంలో పురోగతి చెందుతుంది. 1 కొరింథీయులు 2:1 లో పౌలు దానిని మళ్ళీ చెబుతున్నాడు: ” సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. అక్కడ మళ్ళీ : ఉన్నతమైన మాటలు , నైపుణ్యము గల, ఆకట్టుకునే గ్రీకు వాక్చాతుర్యము లేదా జ్ఞానము, లేదా తాత్వికమైన సంగతులు అని చదువుతాం.

దేవుని సువార్త వ్యూహం

“పౌలు, ఎందుకిలా?” యూక్లిడ్ అడుగుతున్నది అదే. “వాక్చాతుర్యము మరియు మానవ తెలివితేటలను ఎందుకు ఉపయోగించకూడదు?” 1కొరింథీయులు 2:4 లో సమాధానం ఇలా ఉంది: మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని.

ఇప్పుడు, యూక్లిడ్ 1 కొరింథీయులు 1:27 ను చూపిస్తూ, “లోకమంతటికీ సువార్తను ప్రకటించడానికి దేవుడు లోకములోని జ్ఞానులందరినీ ఎందుకు రక్షించలేదు? అలా చేసుంటే, ఎన్నుకోబడిన కొంతమంది బుద్ధిహీనుల సమూహం కంటే ఎక్కువగా త్వరగా ప్రపంచానికి సువార్త విస్తరించేది కదా?  అని ప్రశ్నించాడు

కాబట్టి, యూక్లిడ్ ప్రారంభించిన చోటనే ముగిద్దాం, ఎందుకంటే ఆ పేరా ఈ ప్రశ్నకు రెండు స్పష్టమైన సమాధానాలను ఇస్తుంది, “దేవుడు ఎందుకు అలా చేయడు?” అతను చెప్పేది ఇక్కడ ఉంది:

సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.. (1 కొరింథీయులు 1:26–28)

ఇక్కడ అతని మొదటి సమాధానం: “ఏ మనుష్యుడును దేవుని ఎదుట అతిశయించకుండునట్లు” (1 కొరింథీయులు 1:27). ఆ తర్వాత ” అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.  31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను‘‘ అని వ్రాయబడియున్నది (1 కొరింథీ. 1:30–31).

కాబట్టి, తెలివైన, శక్తివంతమైన, ఉన్నతకుటుంబంలో జన్మించిన ప్రజల ద్వారా సువార్తను ఎందుకు వేగంగా మరియు ఎక్కువ ప్రభావంతో అన్యజనులలో వ్యాప్తి చేయకూడదు? రెండు సమాధానములు:

1. దేవుని సన్నిధిలో ఏ మానవుడు అతిశయించకుండునట్లు

2. కాబట్టి అతిశయించువారు ప్రభువునందు మాత్రమే అతిశయించడానికి

సువార్త సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో, దేవుని లక్ష్యం మానవ గర్వాన్ని నిలిపివేసి, యేసును మాత్రమే ఘనతకు కేంద్రంగా చేయడం. ఆయన పద్ధతులు మన పద్ధతులకు భిన్నమైనవి. మనము దీనిని అంగీకరించాలి. క్రీస్తు సిలువ మరణమే ప్రతిదానిని నిర్వచించే కారకమై యున్నది.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *