“మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.” (మత్తయి 5:44)
మీ శత్రువుల కోసం ప్రార్థన చేయడం అనేది ప్రేమ యొక్క లోతైన రూపాలలో ఒకటి, ఎందుకంటే వారికి ఏదైనా మంచి జరగాలని మీరు నిజంగా కోరుకుంటున్నారని అర్థం.
మంచి జరగాలనే నిజమైన కోరిక లేకుండా కూడా మీ శత్రువుల పట్ల మంచి చేయవచ్చు. కానీ వారి కోసం ప్రార్థన చేయడం అంటే మీ హృదయ అంతరంగములను ఎరిగిన దేవుని సన్నిధిలో వారి తరపున దేవునికి విజ్ఞాపన చేయడం.
వారి మార్పు కోసం కావచ్చు. వారి పశ్చాత్తాపం కోసం కావచ్చు. వారి హృదయాలలో ఉన్న శత్రుత్వము విషయంలో వారిని మేల్కొలుపుటకు కావచ్చు. రోగాలు లేదా విపత్తులు ద్వారా అయినాసరే, వారు పాపములో కూరుకుపోకుండా ఆపటం కొరకు కావచ్చు. అయితే ఇక్కడ ప్రార్థన ఎల్లప్పుడూ వారి మేలు కోసమే అని యేసయ్య ఉద్ధేశ్యం.
యేసును సిలువపై వేలాడదీసినప్పుడు ఈ విధంగానే ప్రార్థన చేశాడు:
తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. (లూకా 23:34)
రాళ్లతో కొట్టబడినప్పుడు స్తెఫను ఈ విధంగానే ప్రార్థన చేసాడు:
అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. (అ.కా 7:60)
మన శత్రువులకు కేవలంమంచి చేయడానికే కాదు, వారిని పలకరించడం మరియు వారి అవసరాలను తీర్చడంలో సహాయం చేయడానికి యేసు మనల్ని పిలుస్తున్నాడు (మత్తయి 5:47); శత్రువు మన దగ్గరలో లేనప్పటికీ, వారికి ఏది ఉత్తమమో అది జరగాలని కోరుకోవడం మరియు ప్రార్థనలలో ఆ కోరికలను వ్యక్తపరచాలని కూడా యేసు మనలను పిలుస్తున్నాడు.
మన హృదయాలు వారి రక్షణను కోరుకోవాలి. మనతో పాటు పరలోకంలో వారు ఉండాలని కోరుకోవాలి. వారి శాశ్వతమైన ఆనందాన్ని కోరుకోవాలి. ఎవరైతే తన జీవితాన్ని కష్టతరం చేశారో, ఆ యూదుల కొరకు ప్రార్థించిన అపొస్తలుడైన పౌలు వలె దేవుడు మనకు కృపను ప్రసాదించుగాక:ఇశ్రాయేలీయులు రక్షణపొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై యున్నవి. (రోమ 10:1)



