“ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి”…. (1 పేతురు 2:11).
వ్యభిచారంలో ఉంటున్న ఒక వ్యక్తిని నేను ఎదుర్కున్నప్పుడు, నేను అతని పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను, మరియు అతను ఎలాగైనా తన భార్య వద్దకు తిరిగి రావాలని నేను అతని విషయంలో ఎంతగానో ప్రయత్నించాను. అప్పుడు నేను, “మీకు తెలుసా, ఈ పాపంతో మీరు మీ కంటినైనా పెరికివేసేంత తీవ్ర స్థాయిలో పోరాడకపోతే, మీరు నరకానికి వెళ్లి అక్కడ శాశ్వతంగా బాధపడతారని యేసు చెప్తున్నాడు” అని చెప్పాను.
ఒక క్రైస్తవుడిగా, అతను తన జీవితంలో ఇలాంటి మాట ఎప్పుడూ విననట్లుగా, పూర్తిగా నమ్మనట్లుగా నన్ను చూసి, “ఒక వ్యక్తి తన రక్షణను కోల్పోతాడని మీరు అనుకుంటున్నారా?” అని అడిగాడు.
అందుచేత, క్రైస్తవులుగా పిలువబడుతున్నవారిలో అనేకులు రక్షణ అనే అంశాన్ని తమ నిజ జీవిత౦ ను౦డి విడదీసి, బైబిలు హెచ్చరికలను నిర్వీర్యం చేసి, బైబిల్ హెచ్చరికలకు అతీతంగా క్రైస్తవుడని చెప్పుకుంటూ పాపం చేస్తూ రక్షణను మరొక దృష్టిలో చూసేటువంటి వారున్నారని మొట్టమొదటిసారిగా నేను పొందిన అనుభవము నుండి పదేపదే నేర్చుకున్నాను. క్రైస్తవ జీవిత౦ గురి౦చిన ఈ దృష్టికోణం నాశనానికి నడిపించే విశాల మార్గంలో ఉన్న వేలాదిమ౦దికి ఎంతో అనుకూలంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను (మత్తయి 7:13).
మీరు శరీరాశలతో (మోహంతో) పోరాడకపోతే, మీరు పరలోకానికి వెళ్ళరని యేసు చెప్పాడు. “నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా” (మత్తయి 5:29). ఈ మాటకి అర్థం, నిజమైన క్రైస్తవులందరు ఎల్లప్పుడూ ప్రతి పోరాటంలో విజయం సాధిస్తారని కాదు. సమస్య ఏమిటంటే, మనం పోరాడాలని నిశ్చయించుకుంటాం, లోపరహితమైన విజయం సాధిస్తామని కాదు గాని మనం పాపంతో రాజీపడకుండ, దానితో ఎల్లప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాం.
వెయ్యి సుదూర శ్రేణి క్షిపణులతో ప్రపంచం పేలిపోతుందా లేదా, ఉగ్రవాదులు మీ నగరంపై బాంబులు వేస్తారా లేదా, గ్లోబల్ వార్మింగ్ మంచుకొండలను కరిగిస్తుందా లేదా, ఎయిడ్స్ వ్యాధి దేశాలను గడగడలాడిస్తుందా లేదా అనే వాటికంటే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విపత్తులన్నీ శరీరాన్ని మాత్రమే చంపగలవు గాని శరీరాశలతో పోరాడకపోతే మన ఆత్మలను శాశ్వతంగా కోల్పోతాం.
మన ఆత్మలకు విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జించాలని పేతురు చెబుతున్నాడు (1 పేతురు 2:11). ప్రపంచ యుద్ధంలో జరిగే నష్టాలకంటేను, ఉగ్రవాదం ద్వారా జరిగే ప్రమాదాలకంటేను ఈ పోరాటంలో జరిగే ప్రమాదాలే చాలా ఎక్కువగా ఉంటాయి. “కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును” అని (కొలొస్స 3:5-6) అపొస్తలుడైన పౌలు పట్టిక చేసి చెప్తున్నాడు. ప్రపంచంలోని అన్ని జనాంగముల ఉగ్రతకంటే దేవుని ఉగ్రత లెక్కలేనంత భయంకరమైనది.
మన ఆత్మలను, ఇతరుల ఆత్మలను గంభీరంగా పరిగణించి, పోరాటాన్ని కొనసాగించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించును గాక.