మీ అవసరత ఆయనకు తెలుసు

మీ అవసరత ఆయనకు తెలుసు

షేర్ చెయ్యండి:

కాబట్టి – ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును”. (మత్తయి 6:31-32)

తనను వెంబడించువారు చింతించుట నుండి విడుదల పొందాలని యేసు కోరుతున్నాడు. మనకున్న ఆందోళనను తీసివేయడానికి రూపొందించిన కనీసం ఏడు వాదనలను మత్తయి 6:25-34 వచనాలలో ఆయన అందిస్తున్నాడు. వాటిలో తినడం, తాగడం, బట్టలు ధరించుకోవడం అనేవి ఉన్నాయి, అందుకే ఆయన, “ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలుసు” అని (మత్తయి 6:32లో) చెప్తున్నాడు.

దేవునికి తెలుసు అనే మాటకు, మన అవసరతలను తీర్చడానికి దేవుడు ఆశ కలిగియున్నాడని యేసు అర్థం చెప్తున్నాడు. మనం తండ్రిని కలిగి ఉన్నామని ఆయన నొక్కి చెప్తున్నాడు. భౌతికంగా ఈ లోకంలో ఉండే తండ్రులకంటే ఈ తండ్రి ఎంతో ఉత్తమమైన తండ్రి.

నాకు ఐదుగురు పిల్లలున్నారు. వారి అవసరతలు తీర్చడమంటే నాకు చాలా ఇష్టం. అయితే, పిల్లల గురించి దేవునికి తెలిసినదానికంటే ఇక్కడ వారి తండ్రిగా నాకు తెలిసింది చాలా తక్కువేనని కనీసం మూడు విధాలుగా గమనించవచ్చు.

మొదటిది, ఈ క్షణాన నా పిల్లలు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. వారెక్కడున్నారో ఊహించగలనంతే. వారు వాళ్ళ ఇళ్ళల్లో ఉండొచ్చు, లేక వారి ఉద్యోగ స్థలాల్లోనో లేక స్కూళ్ళలోనో ఉండొచ్చు, వారు ఆరోగ్యంగాను, సురక్షితంగాను ఉండొచ్చు. వారు గుండెపోటు వచ్చి రోడ్డు మీద పడిపోయి కూడా ఉండవచ్చు.

రెండవదిగా, వారి హృదయంలో ఏ క్షణాన ఏముంటుందో నాకు తెలియదు. నేను కేవలం ఊహించగలను. వారు భయం, బాధ, కోపం, లోభం, ఆనందం, నిరీక్షణ అనే భావోద్వేగాలతో ఉండి ఉండొచ్చు. నేను వారి హృదయాలను చూడలేను. వారు కూడా తమ హృదయాలను పరిపూర్ణంగా చూసుకోలేరు.

మూడవదిగా, వారి భవిష్యత్తు నాకు తెలియదు. ప్రస్తుతానికి వారు బాగున్నట్లుగా, స్థిరపడినట్లుగా ఉండొచ్చు గాని రేపటి రోజున వారికి భరించలేని దుఃఖం కూడా ఎదురవ్వొచ్చు.

అంటే, చింతించకుండా ఉండటానికి నేను వారికి చాలా బలమైన కారణముగా ఉండలేనని దీనర్థము. నాకు తెలియకుండా, వారిప్పుడు ఎన్నో పరిస్థితుల గుండా వెళ్తుండవచ్చు, లేక రేపటి రోజున కూడా అనేక పరిస్థితుల గుండా వెళ్ళవచ్చు. అయితే, పరలోకమందున్న వారి తండ్రి విషయంలో ఇవన్నీ విభిన్నంగా ఉంటాయి. పరలోకంలో మనకు తండ్రి ఉన్నాడు! మనం ఇప్పుడు ఎక్కడున్నామో, రేపు ఎక్కడ ఉంటామో, మనలోపల ఏముందో, మనం బయట ఎలా ఉన్నామో వీటన్నటి గురించిన సమస్త విషయాలు ఆయనకు తెలుసు. ఆయన ప్రతి అవసరతను చూస్తున్నాడు.

అంతేగాకుండా, మన అవసరాలను తీర్చాలని ఆయన ఎంతో ఎక్కువ ఆతృత కలిగియున్నాడు. “నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా” (మత్తయి 6:30) అనే వచనంలో “మరి నిశ్చయముగా” అనే మాటను గుర్తు పెట్టుకోండి.

అంతేగాకుండా, ఆయన ఆతృతతో చేయాలనుకున్నదానిని చేయడానికి ఆయన సంపూర్ణ సామర్థ్యాన్ని కూడా  కలిగియున్నాడు (ప్రపంచవ్యాప్తంగా ఆయన ఒక గంటకి కోట్లాది పక్షులను పోషిస్తున్నాడు – మత్తయి 6:26).

అందుచేత, మన అవసరాలు తీర్చబడతాయని యేసు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మడంలో నాతో ఏకీభవించండి. “ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును” అని యేసు చెప్పినప్పుడు మనమందరం ఏకీభావించాలని ఆయన మనకు పిలుపునిస్తున్నాడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...