శ్రమ వలన కలిగే ఐదు మేలులు

శ్రమ వలన కలిగే ఐదు మేలులు

షేర్ చెయ్యండి:

“శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను”. (కీర్తనలు 119:67)

దేవుడు తన వాక్యమును నేర్చుకోడానికి సహాయపడేలా  శ్రమను పంపిస్తాడని ఈ వాక్యం చెప్తుంది. ఇది ఎలా సాధ్యం? శ్రమ వలన ఎలా దేవుని వాక్యమును నేర్చుకోగలం? ఎలా విధేయత చూపగలం?

మన జీవితంలో ఈ దేవుని దయ గురించి ఎలాగైతే లెక్కలేనన్ని అనుభవాలున్నాయో అలాగే ఈ ప్రశ్నకి లెక్కలేనన్ని జవాబులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడైతే శ్రమ వలన కలిగే ఐదు మేలులను గూర్చి ఇక్కడ చూద్దాం:

1) శ్రమ  జీవితంలోని నిర్లక్ష్య వైఖరిని దూరం చేస్తుంది. మనల్ని మరింత స్వస్థబుద్ధి గల వారిగా చేస్తుంది, తద్వారా మన మనస్తత్వం దేవుని వాక్యపు తీవ్రతకు అనుగుణంగా ఉంటుంది. ఒక ప్రాముఖ్యమైన విషయం: దేవుని పుస్తకంలో నిర్లక్ష్యవైఖరి కలిగిన ఒక్క పేజీ కూడా లేదు.

2) శ్రమ మనలో ఉన్న లోకానుసారమైన ఆసరాలను తట్టిలేపి, వాటిపై కాకుండా దేవునిపై ఎక్కువగా ఆధారపడేలా మనల్ని బలవంతం చేస్తుంది. ఇది మనల్ని వాక్యం యొక్క లక్ష్యానికి మరింత అనుగుణంగా జీవించేలా చేస్తుంది. ఎందుకంటే మనం దేవునిపై నిరీక్షించడం మరియు ఆయనను విశ్వసించడమే వాక్యం యొక్క లక్ష్యం. “ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.” (రోమా 15:4).”యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ” (యోహాను 20:31).

3) సాధారణంగా మన జీవితాలలో లేఖనాలను నామమాత్రంగా భావించే ప్రమాదం ఉంది. కానీ శ్రమ మన జీవితములో ఏదైనా సహాయం కోసం ఎక్కువ ఆశతో పరిశోధించేలా చేస్తుంది. “మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు ” (యిర్మీయా 29:13).

4) శ్రమ మనలను క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులను చేస్తుంది. కావున క్రీస్తుతో అన్యోన్య సహవాసం చేస్తూ, లోకమును యేసు క్రీస్తు కళ్లతో మరింత సులభంగా చూడగలుగుతాం. పౌలుకున్న బలమైన కోరిక ఫిలిప్పీ 3:10-11లో ఇలా చెబుతాడు “ ఆయన [క్రీస్తు] మరణ విషయములో సమాన అనుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుటయే”.

5) శ్రమ, మోసపూరితమైన మరియు త్రోవ తప్పేలా చేసే శారీరక కోరికలను చంపి, తద్వారా మనల్ని ఆధ్యాత్మికంగా మరింతగా స్థాపించి, దేవుని వాక్యాన్ని స్వీకరించేలా చేస్తుంది. “క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాషలు అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును” (1 పేతురు4:1-2). శ్రమ తెచ్చే గొప్ప ప్రతిఫలం పాపాన్ని చంపడం. మనము ఎంత ఎక్కువగా పవిత్రంగా ఉంటామో అంత  స్పస్టంగా దేవుణ్ణి చూడగలుగుతాం. (మత్తయి 5:8).

దేవుడు శ్రమ ద్వారా నేర్పించే  శిక్షణలో అసంతృప్తి చెందకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను ప్రసాదించుగాక.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...