“జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు… కీడునుండి తొలగి మేలుచేయవలెను”. (1 పేతురు 3:10–11)
మనం యేసు ఆజ్ఞలకు అవిధేయత చూపడానికి ఒకే ఒక ప్రాథమిక కారణం: అవిధేయత కంటే విధేయత చూపడం వలన ఎక్కువ ఆశీర్వాదం వస్తుందని మనకి హృదయంలో విశ్వాసం లేదు కాబట్టి. ఇది మనం దేవుని వాగ్దానాలలో పూర్తిగా నిరీక్షణ కలిగిలేమని సూచిస్తుంది.
ఆయన ఏమి వాగ్దానం చేశాడు? యేసు చేసిన బోధలనే పేతురు మనకు ఈ విధంగా అందిస్తున్నాడు:
ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు… కీడునుండి తొలగి మేలుచేయవలెను (1 పేతురు 3:9–11).
యేసును అనుసరిస్తూ, గొప్ప ఆనందాన్ని దృష్టిలో ఉంచుకొని కఠినమైన ఆజ్ఞలకు ఉదాహరణకు “కీడుకు ప్రతికీడైనను చేయక” అనే ఆజ్ఞలకు సైతం విధేయత చూపడానికి తనను తాను ప్రోత్సాహపరుచుకొనే విషయమై పేతురు సిగ్గుపడని వాడుగా ఉన్నాడు. “ఆశీర్వాదమునకు వారసులవుటకు…! దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.” మీరు నిత్యజీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా? కీడునుండి తొలగండి! శాశ్వత ఆనందం మీ కోసం వేచి ఉంది! ఇప్పుడు ప్రతీకారేచ్ఛ నుండి తొలగిపోవడానికి ఆ బహుమానం సరిపోదా?
యేసుకు అవిధేయత చూపడం కంటే ఆయనకు ఎల్లప్పుడూ విధేయత చూపడం ఉత్తమం, మీ జీవితంలో గొప్ప వెలచెల్లించాల్సి వచ్చినప్పటికి మీరు ఆయనకి విధేయత చూపడమే ఉత్తమం. యేసు ఇలా చెప్పాడు,
నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు. . . ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (మార్కు 10:29–30)
ఆయన చిత్తానికి విధేయత చూపి మన జీవితాన్ని పోగొట్టుకుంటే, దానిని మళ్లీ కనుగొనడమే కాదు; గొప్ప బహుమతిని కూడా పొందుకుంటాం అనే విశ్వాసంతో బలమైన నిరీక్షణతో నింపబడాలి. అప్పుడే మనం ప్రేమతో కూడిన ఖరీదైన మార్గంలో క్రీస్తును అనుసరించే శక్తిని కలిగి ఉండగలం.